28 లక్షల ఖరీదైన కుర్చీని చూస్తారా?

11 Jan, 2023 23:10 IST|Sakshi

రత్నఖచిత సింహాసనాలు కొత్తకాదు. బంగారం లేదా వెండితో తయారు చేసిన సింహాసనాలకు రకరకాల రత్నాలను పొదిగి తీర్చిదిద్దడమూ కొత్తకాదు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఏకరత్న సింహాసనం. భారీ పరిమాణంలోని అమెథిస్ట్‌ రత్నంతో దీనిని తయారు చేశారు. ఇందులో కుర్చుంటే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందట! ఎందుకంటే, ఈ కుర్చీని జ్యోతిశ్శాస్త్ర నిపుణుల ప్రకారం, శని దోషాలను నివారించే అమెథిస్ట్‌ రత్నంతో తయారు చేశారు.

‘ఒక చిన్న రాయిని తెచ్చుకొని ఇంట్లోనో లేక ఆభరణాల్లో పొదిగించుకుని పెట్టుకునే కంటే, ఆ రాతి మీదే కూర్చుంటే ఇంకెంత లాభం వస్తుంది!’ అని చెప్పారు. జపాన్‌కు చెందిన ఫ్యాక్టరీ–ఎమ్‌ అధినేత కొయిచి హసెగావా ఇంగ్లిష్‌ అక్షరం ‘ఎల్‌’ ఆకారంలో ఉండే పెద్ద అమెథిస్ట్‌ రాతిని లోహంతో బిగించి ఈ కుర్చీని తయారు చేశారు. కుర్చీ మొత్తం బరువు 99 కేజీలు ఉంటే, దీనిలో పొదిగిన రాయి బరువే 88 కేజీలు. దీని ధర కూడా అంతే భారీగా ఉంటుంది.

రూ. 28 లక్షలు పెట్టి కొన్నప్పటికీ.. ఈ కుర్చీలో కనీసం పది నిమిషాలు కూడా కూర్చోలేము. ఈ రాతిని అరకొరగా మాత్రమే సానపెట్టారు. అందువల్ల దీని ఉపరితలం గరుకుగా, ఎగుడుదిగుడుగా ఉంటుంది. కాబట్టి, దీనిపై కూర్చోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మీరు కూడా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటున్నారా? అలాగైతే, ఇలాంటి కుర్చీని మీరు కూడా తయారు చేయించుకోండి.

మరిన్ని వార్తలు