సారీ.. నేనేం జర్నలిస్ట్‌ను కాను చెప్పడానికి

6 Sep, 2020 08:28 IST|Sakshi

‘కరోనా మహమ్మారి ఎప్పటికి తగ్గుముఖం పట్టొచ్చు డాక్టర్‌?’ 
‘సారీ..  నేనేం జర్నలిస్ట్‌ను కాను చెప్పడానికి’  అంటాడు ఆ డాక్టర్‌. 
ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన జోక్‌. 
జర్నలిస్టుల తీరుపై  సోషల్‌ మీడియా పార్టిసిపెంట్స్‌ విసిరిన వ్యంగ్యాస్త్రం. 

‘ఒరేయ్‌.. ఆక్సిజన్‌ సిలెండర్లు అయిపోయాట. ఇందాక నర్సులు మాట్లాడుకుంటుంటే విన్నాను. భయమేస్తోంది. ఏ రాత్రో ఆయాసపడితే ఎలాగా? గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌ సిట్యుయేషన్‌ ఎట్లా ఉందో వాట్సప్‌లో చూశా. నేనిక్కడ ఉండను. రాత్రి వగరుస్తే కష్టం. చచ్చిపోవడమే. నన్ను ప్రైౖ వేట్‌ హాస్పిటల్‌కు మార్చండి’ ఓ  కోవిడ్‌ పేషంట్‌ ఆక్రందన.

‘మేం దాహమేసినా కషాయాలే తాగుతున్నాం. కషాయాలతో కరోనా పని పట్టొచ్చని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది కదా’

‘కరోనా వచ్చిన వాళ్లను ఊరవతల పెట్టాలి.. అదేదో ఊళ్లో అలాగే చేశారు .. ఏదో వెబ్‌సైట్‌లో చదివాను. న్యూస్‌లో కూడా చూశాను.’
కరోనా నేపథ్యంలోనే  జనాల మీదున్న సోషల్‌ మీడియా ప్రభావం అది.

మీడియా అత్యుత్సాహం, సెన్సేషన్‌ దాహానికీ చిరుగుల గుర్తులెన్నో  కనిపిస్తాయి చరిత్రలో. ప్రిన్సెన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ డయానా, ఆమె స్నేహితుడు దోడీ ఫయేద్, వాళ్ల డ్రైవర్‌ల మరణం ఓ ఉదాహరణ. ప్రసిద్ధ నటి శ్రీదేవి చనిపోయాక మీడియా చేసిన నిర్వాకం ఇంకా మరచిపోనే లేదు. అయితే ఇలాంటి సందర్భాల్లో మీడియా పరిధిని గుర్తు చేస్తూ వస్తోంది సమాజమే. కొన్ని  సందర్భాల్లో సుప్రీంకోర్టూ స్పందించింది. బాబ్రీ మసీదుకి సంబంధించిన తీర్పును వెలువరించే ముందు  మీడియాను సూచించింది, హెచ్చరించింది సంయమనంతో వ్యవహరించమని. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా కూడా మీడియాను హద్దుల్లో పెట్టే బాధ్యతను చేపట్టింది. మీడియాలో ఏ చిన్న తప్పు దొర్లినా వాట్సప్, ఫేస్‌బుక్, ట్విటర్‌లలో మీమ్స్, సెటైర్స్, కామెంట్స్‌గా హైలైట్‌ చేస్తూ!
ప్యారలెల్‌గా...

గ్లోబలైజేషన్‌ తర్వాత పెట్టుబడిదారులు పెట్టిన పరుగుపందెంలో పిక్కబలం చూపించుకునే ప్రయత్నంలో ఉన్న యువతకు అసలు గమ్యం చూపించింది సోషల్‌ మీడియానే. రోబోలా మారిన మెదడుకు ప్రశ్నించడం నేర్పింది. జాస్మిన్‌ విప్లవాన్ని పూయించింది. తెలంగాణ ఉద్యమానికి ఊపుతెచ్చింది.  ‘మీ టూ’కి జన్మనిచ్చింది. చేంజ్‌ డాట్‌ ఓఆర్‌జీని చూపించింది. మానవ తప్పిదాల మీదా ఎక్కుపెట్టింది. ప్రకృతి వైపరీత్యాలప్పుడు అవసరాలకు, సాయానికి మధ్య వారధిగా మారింది. మొన్నటికి మొన్న ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’కీ గళమైంది. జాత్యహంకారాన్ని వణికించింది. మన దగ్గరా కుల, మత వివక్షను ప్రశ్నిస్తోంది. ప్రజాహితంగా లేని ప్రభుత్వాలనూ నిర్భయంగా విమర్శిస్తోంది. మొత్తంగా ఆల్టర్‌నేటివ్‌ మీడియాగా, ఇంకా చెప్పాలంటే ప్యారలెల్‌ జర్నలిజంగా ఎస్టాబ్లిష్‌ అయింది సోషల్‌ మీడియా. 

అదే సోషల్‌ మీడియా ఇదే కరోనా కాలంలో సొంత వ్యాఖ్యా కథనాలనూ కళ్లకు కడుతోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ వరకు ఓకే. కాని క్రెడిబులిటే మ్యాటర్స్‌. వైద్య సలహాలు, సూచనలు, అనుభవాల వేదికగా తయారైంది ఇది. జీవన శైలి మార్గదర్శిగా అవతారమెత్తింది. అది పంచుతున్న  జ్ఞానంతో దాదాపు చాలా ఇళ్లూ రెమెడీ హోమ్స్‌ అయిపోయాయి. ఈ క్రమంలో వీడియోలూ ఫార్వర్డ్‌ అవుతున్నాయి. అవగాహన దిశగా కన్నా భయభ్రాంతులకు లోనుచేసివిగా  ఉంటున్నాయి. పైన చెప్పిన భిన్న సంఘటనలే సాక్ష్యం. ఈ కథనం కోసం పేర్చిన కల్పనలు కావవి. సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ షేర్‌ చేస్తున్న సంగతులు.

మైల్డ్‌ కరోనా లక్షణాలను కూడా సోషల్‌ మీడియా బోధతో మైక్రోస్కోప్‌లో చూడ్డం నేర్చుకున్నారు. ఆందోళనతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మీడియా దృష్టికి వస్తున్న ఇలాంటి కేసులెన్నో! కరోనా కన్నా దాని గురించిన పరస్పర విరుద్ధ సమాచార సేకరణే పేషంట్‌ కండిషన్‌ను క్రిటికల్‌ చేస్తోంది. పాజిటివ్‌ను హైబత్‌ (భయాందోళన)గా మార్చి శ్వాసను భారం చేస్తోంది. 
గూగుల్‌ డాక్టర్‌కు.. పేషంట్‌ నాడి పట్టుకుని చూసే ప్రాక్టీసింగ్‌ డాక్టర్‌కు చాలా తేడా ఉంటుంది. 

వదంతి .. వార్త కాదు. ఊహ .. సత్యం కాదు.. కనీసం అంచనా కూడా కాదు. ఈ వ్యత్యాసాలను స్పష్టంగా తెలిపేది  మీడియానే. క్రెడిబులిటీ దానికి ఆక్సిజన్‌. అది తగ్గితే సమాజం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కనిపెట్టే ఆక్సీమీటర్‌ పాఠక సమాజమే. అంబుడ్స్‌మన్‌ పాత్ర వాళ్లది. సహజమైన కుతూహలంతో సంచలనాల కోసం ఆరాటపడ్డా రీడర్‌షిప్‌ నిక్కచ్చిగానే తీర్పునిస్తుంది. అదే మీడియా బాధ్యతను గాడిలో పెడుతుంది. 
ఇలాంటి వ్యవస్థ సోషల్‌ మీడియాకేది? స్వీయ నియంత్రణే తప్ప.

అసలేదో.. ఫేక్‌ ఏదో గ్రహించే హంస నైజాన్ని అలవర్చుకోవాల్సి ఉంది. ఫార్వడింగ్‌ యాజ్‌ రిసీవ్డ్‌ మెథడ్‌కు బ్రేక్‌ వేయాల్సి ఉంది. 
ఫాల్స్, రూమర్స్‌.. మొత్తం సమాజాన్నే వ్యాధిగ్రస్తం చేస్తే కష్టం. ఇవి కరోనాను మించిన పాండమిక్స్‌. వీటికి వ్యాక్సిన్‌ మీడియానే. పాఠకుల విశ్వాసమే ఔషధం. కరోనా విషయంలో కూడా మీడియా ఆ గౌరవాన్ని కోల్పోలేదు. ‘తప్పుడు సమాచారం విస్తృతంగా ప్రచారం అవుతున్న టైమ్‌లో శాస్త్రీయ దృక్ఫథంతో  అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది మీడియానే. జర్నలిస్టులూ వారియర్సే.’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు యూఎన్‌ఓ.
ప్యారలెల్‌  జర్నలిజం అవసరమే.. వినోదం దాంట్లో భాగంగా ఉండొచ్చు. అవే నిజాలుగా ప్రచారమైతే ప్రాణాలతో చెలగాటమాడుతాయి.
-శరాది

మరిన్ని వార్తలు