పిల్లల కథ: ఎవరు ఎక్కువ ప్రమాదం?

25 Apr, 2022 19:04 IST|Sakshi

- డా.గంగిశెట్టి శివకుమార్‌

ఒక అడవిలో జింకపిల్ల ఒకటి వుండేది. చాలా తెలివైనది. దాని తెలివికి ముచ్చటపడిన ఆ అడవి జంతువులన్నీ ‘నీలాంటి తెలివిగలవారు రాజుగారి కొలువులో వుంటే మన జంతువులకు మేలు జరగొచ్చు. అదీగాక నీ తెలివికి గుర్తింపూ దొరుకుతుంది’ అని సలహానిచ్చాయి. దాంతో ఆ జింకపిల్ల.. సింహరాజు దగ్గర కొలువు కోసం బయలుదేరింది. అది వెళ్లేముందు జింకపిల్ల తల్లి దాన్ని హెచ్చరించింది ‘మంత్రి నక్కతో మాత్రం జాగ్రత్త’ అంటూ.   

సింహరాజుని కలిసి కొలువు అడిగింది జింకపిల్ల సింహం కొన్ని ప్రశ్నలు అడిగింది. జింకపిల్ల సమాధానాలు ఇచ్చింది. దాని తెలివి తేటలకు అబ్బరపడ్డ సింహం దానికి తన కొలువులో ప్రధాన సలహా దారుగా ఉద్యోగమిచ్చింది. మంత్రి నక్క.. జింకకు అభినందనలు తెలిపింది ‘నీలాంటి తెలివైనవారు వుండటం వల్ల నాకూ పని భారం తగ్గుతుంది’ అంటూ. ‘ ఇంత మంచి నక్క గురించి అమ్మ ఏంటీ అలా హెచ్చరింది?’ అనుకుంది జింక. నిజానికి జింకపిల్ల కొలువులోకి రావడం నక్కకి యిష్టంలేదు తన ప్రాబల్యం తగ్గితుందని. అయితే బయటపడకుండా సమయం కోసం ఎదురు చూడసాగింది. (పిల్లల కథ: జానకమ్మ తెలివి)

ఒకరోజు సింహం.. జింకపిల్ల తెలివితేటల్ని నక్క ముందు ప్రశంసించింది. ‘ఏంటో నాకైతే ఆ జింకపిల్ల అది పక్క రాజ్యం వారు పంపిన గూఢచారేమోనని అనుమానం. త్వరలో సాక్ష్యాలతో రుజువు చేస్తా’ అన్నది. ఒకరోజు ఎలుగు, తోడేలుకు ఏదో ఆశ చూపి సాక్షులుగా తీసుకొచ్చి జింకపిల్ల గూఢచారి అని రుజువు చేయబోయింది. అప్పుడు ఆ కొలువులోనే ఉన్న ఏనుగు  ‘ప్రభూ! జింకపిల్ల తెలివైనదని, అది కొలువులో వుంటే బావుంటుందని మేమే దాన్ని మీ దగ్గరకు పంపాం. అది గూఢచారి  కాదు’ అని వాదించింది. ఆ వాదనకు భయపడ్డ ఎలుగుబంటి, తోడేలు నిజం చేప్పేశాయి. సింహం కోపంతో నక్కకు చురకలు అంటించింది.

తల్లిని కలవడానికి జింకపిల్ల ఇల్లు చేరింది. జరిగింది చెప్పి ‘అమ్మా.. క్రూరజంతువైన సింహం కొలువులో చేరతానంటే ఒప్పుకున్నావు కానీ నక్క లాంటి జంతువుతో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించావు ఎందుకు?’ అని అడిగింది. ‘చెడ్డవారని ముందుగానే  తెలిస్తే జాగ్రత్తగా వుంటాం కానీ మంచివారుగా కనిపిస్తూ గోతులు తవ్వేవారినే కనిపెట్టలేం. వారే చాలా ప్రమాదం. సింహం క్రూరజంతువు అని తెలుసు గనక జాగ్రత్తగా వుంటాం. కానీ నక్కలాంటివారు మంచిగా నటిస్తూ కీడు చేయ చూస్తారు. అందుకే అలాంటివారితో జాగ్రత్తా అని చెప్పాను. నీకూ అదే ఎదురైంది గనక ముందు ముందు అలాంటివారితో మరింత జాగ్రత్తగా వుండు’ అంది తల్లి. జింకపిల్ల తన తల్లి సలహా పాటిస్తూ జీవితాన్ని హాయిగా గడిపింది.

మరిన్ని వార్తలు