పిల్లల కథ: మంచి పని.. ఈ కిరీటం నీకే!

13 Aug, 2022 19:09 IST|Sakshi

డి.కె. చదువులబాబు

విజయపురి రాజు వద్ద రకరకాల కిరీటాలు ఉండేవి. ఒకసారి అడవిలో గుర్రం మీద లేడిని వెంబడిస్తూ వేటాడసాగాడు. ఆ  సమయంలో కిరీటం జారి కిందపడింది. రాజు ఆ విషయాన్ని పట్టించుకోకుండా లేడిని తరుముతూ ముందుకెళ్ళిపోయాడు. నక్క, తోడేలు కలసి వస్తూ కిరీటాన్ని చూశాయి.

‘నేను ముందు చూశాను. ఇది నాకు చెందాలి’ అంది నక్క. ‘కాదు.. నేను ముందు చూశాను. నాకే చెందాలి‘ అంది తోడేలు. అలా వాదులాడుకుంటూ న్యాయం కోసం సింహం దగ్గరకు వెళ్లాయి. వాటి సమస్య విన్న సింహం.. జంతువులన్నింటిని సమావేశపరచింది. విషయాన్ని వివరించింది.

‘కిరీటం అడవిలో దొరికింది కాబట్టి.. ఈ అడవికి రాజునైన నాకే చెందుతుంది. ఈ అడవిలోని  జంతువులన్నిటికీ ఏడాది సమయం ఇస్తున్నాను. ఈ ఏడాదిలో ఎవరైతే మంచి పనులు చేస్తారో వారికి ఈ కిరీటాన్నిచ్చి గౌరవిస్తాను. అంతవరకూ ఇది నాదగ్గరే ఉంటుంది’ అని చెప్పింది సింహం. సమావేశం ముగిశాక జంతువులన్నీ వెళ్లిపోయాయి. వేట ముగించుకుని రాజు తిరిగి వస్తూ కిరీటం కోసం చూశాడు. ఎక్కడా కనిపించక పోవడంతో నిరాశతోనే రాజ్యానికి వెళ్లిపోయాడు.

సంవత్సర కాలం పూర్తయింది. సింహం జంతువులన్నీటినీ సమావేశపరచింది.
‘మహారాజా! నేను కోతిచేష్టలు, ఆకతాయి పనులు మానుకున్నాను. మంచిగా ఉంటున్నాను’ అంది కోతి.

‘మాంసాహారం మానుకుని చిన్నజంతువులను దయతో చూస్తున్నాను’ అంది తోడేలు. నక్క మరికొన్ని జంతువులు కూడా తోడేలు చెప్పిన మాటనే చెప్పాయి. ‘బురదగుంటలో చిక్కుకున్న గాడిదను కాపాడాను’ అంది ఏనుగు.  ‘నేను నాట్యంతో ఆనందాన్ని పంచాను’ అంది గుర్రం. ‘నేను కొన్నింటికి చెట్లెక్కడం నేర్పాను’ అంది చిరుత. 

‘పిల్లజంతువులను నా వీపు మీద ఎక్కించుకుని అడవంతా తిప్పుతూ ఆనందాన్ని పంచాను’ అంది పెద్దపులి. ఉలుకు.. పలుకూ లేకుండా ఉన్న ఎలుగుబంటిని చూసి సింహం ‘నువ్వేం చేశావో చెప్పు?’ అని అడిగింది. ‘మన అడవి గుండా విజయపురి వైపు వెళ్తున్న ఒక మునితో విజయపురి రాజు వేటకు వచ్చి మమ్మల్ని చంపుతున్నాడు. ఆ క్రమంలోనే ఆయన కిరీటం జారి ఈ అడవిలో పడిపోయింది. కాబట్టి ఇక్కడకు వేటకు రావడం ఆ రాజుకు అరిష్టమని చెప్పి భయపెట్టి.. మా వైపు రానివ్వకుండా చేయండి అని కోరాను. దానికి ఆ ముని.. ఈ అడవికే కాదు ఏ అడవికీ వేటకు వెళ్లకుండా చేస్తానని మాటిచ్చాడు. ఆ ముని వెళ్లి రాజుకు ఏంచెప్పాడో కానీ ఆరోజు నుంచి విజయపురి రాజు వేట మానుకున్నాడు. మన అడవిలో చెట్లు తక్కువగా ఉన్నాయి. నిండుగా చెట్లుంటే అనేక లాభాలు. అందుకే వందలసంఖ్యలో పండ్లమొక్కలను నాటి పెంచుతున్నాను’ అని చెప్పింది  ఎలుగుబంటి.

‘ఇతరుల మేలు కోరడం, మొక్కలను పెంచడాన్ని మించిన మంచి పనులేమున్నాయి! ఈ కిరీటం నీకే’ అని ప్రశంసించింది సింహం. ‘మృగరాజా.. బహుమతి కోసం నేను ఈ పనులు మొదలుపెట్టలేదు. చాలా కాలం నుంచే చేస్తున్నాను. మీ ప్రశంసలు అందుకున్నాను. అది చాలు నాకు’ అంటూ వినయంగా కిరీటాన్ని తిరస్కరించింది ఎలుగుబంటి. ఆ రోజు నుంచి ఆ అడవిలోని జంతువులన్నీ ఎలుగుబంటిలా పదిమందికి ఉపయోగపడే పనులు చేయసాగాయి. (క్లిక్‌: పిల్లల కథ.. ఆనందమాత)

మరిన్ని వార్తలు