పిల్లల కథ: గర్వభంగం

26 Apr, 2022 19:29 IST|Sakshi

- కౌలూరి ప్రసాదరావు

దండకారణ్యపు లోతట్టు ప్రాంతంలో ఒక మంచినీటి కోనేరు ఉండేది. ఆ పరిసర ప్రాంతాల్లోని జీవులకు అదే నీటి వనరు. రాజైన సింహం కూడా అక్కడే దాహం తీర్చుకునేది. మడుగు సమీపంలోనే ఒక పుట్టలో ముసలి ఆడ తాచు, తన బిడ్డతో జీవిస్తుండేది. యువ పాము దుందుడుకు స్వభావం కలది. క్రమశిక్షణ లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ అందరినీ ఆట పట్టించేది. ఎవరైనా మందలిస్తే కాటు వేస్తానని బెదిరించేది. ఒకసారి మృగరాజు దప్పిక తీర్చుకోవటానికి కోనేటికి వచ్చింది. అయితే చుట్ట చుట్టుకుని దారికి అడ్డంగా పడుకుని గురకలు పెట్టసాగింది యువ పాము. ‘పక్కకి తొలుగు!’ అని సింహం ఆజ్ఞాపించింది. నిద్రమత్తులో ఉన్న ఆ పాముకి వినబడలేదు. ‘రాత్రి తిన్న ఎలుకో, కప్పో అరగలేదనుకుంటా. నిద్రకు ఆటంకం కలిగించటమెందుకు? పోన్లే పాపమ’ని సింహం పెద్ద మనసు చేసుకుని పక్కనుండి పోయి, నీళ్ళు తాగి తిరిగి ఎడంగా వెళ్ళిపోయింది. కాసేపటికి నిద్ర లేచిన యువ పాముని బాట పక్కనున్న చెట్టు మీది తీతువు పిట్ట పలకరించి జరిగిన సంఘటనని చోద్యంగా చెప్పింది. అది విన్న  పాము సంతోషంతో పడగ విప్పి, అంతెత్తున ఉప్పొంగింది. 

రాజైన సింహమే తనను గౌరవించిందనే అహంకారం దాని తలకెక్కింది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు తీతువు మాటలు దాన్ని తారస్థాయికి తీసుకువెళ్ళాయి. ‘మీది సామాన్యమైన జాతి కాదు మిత్రమా! పురాణ పురుషుడైన కాళీయుడి వారసులు మీరు. అందుకే మీ తలలపై శ్రీకృష్ణుడి పాద ముద్రలు ఉంటాయి. కాబట్టే మృగరాజు నీ పట్ల సహనం చూపించాడు. మీ సర్పాల్లో ఎన్నో శాఖలున్నా పడగ విప్పగల సామర్థ్యం కేవలం మీ తాచు పాములకే ఉంది’ అంటూ ఆకాశానికెత్తేసింది. ఆ మాటలకు  యువనాగు మరింత పెడసరంగా ప్రవర్తించసాగింది. తల్లి ఎన్నిమార్లు హితబోధ చేసినా దాని వైఖరి మారలేదు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లి పాము ఆందోళన చెందేది. (చదవండి👉 ఎవరు ఎక్కువ ప్రమాదం?)

ఒకనాడు దాని ఆగడాలకు చరమగీతం పాడే పరిస్థితి వచ్చింది, ఆ దారిన ఒక ముంగిస రావటం తటస్థించింది. మార్గమధ్యంలో తిష్టవేసిన పాముని చూడగానే దానికి కోపం వచ్చింది. ‘దారిలోంచి తప్పుకో. నేను మంచినీరు తాగటానికి పోవాలి’ అంది అసహనంగా. యువసర్పం ఓసారి కళ్ళు విప్పి ముంగిసని చూసి, నాలుకలు చప్పరించి మళ్ళీ పడుకుంది. ఆ నిర్లక్ష్యానికి ముంగిస కోపం నెత్తికెక్కింది. ‘చెపితే వినపడటం లేదా? మర్యాదగా మార్గంలోంచి లే!’ అంటూ హుంకరించింది. యువపాము దానినసలు పట్టించుకోలేదు. అయితే ప్రమాదాన్ని గ్రహించిన తీతువు పిట్ట పాము దగ్గరకి వచ్చి, ‘పక్కకి జరుగు. లేకపోతే కొంపలంటుకుంటాయి’ అంది. యువపాము గీరగా చూస్తూ ‘చుంచెలుకకి నేను భయపడాలా? నా సంగతి దానికి తెలీదనుకుంటా. కాస్త మన ఘనతని వర్ణించి చెప్పు’ అంది తీతువుతో. 


‘ఏంటీ? నేను ఎలుకనా? అసలు నేనెవరో తెలిస్తే పై ప్రాణాలు పైనే పోతాయి నీకు’ అంది ముంగిస ఆగ్రహంగా. ‘మరీ అంతగా గప్పాలు కొట్టుకోకు. నువ్వు ఎలుకవే కదా? మామూలు ఎలుకలైతే మూడు తింటాను. నువ్వు కాస్త పెద్దగా ఉన్నావు కాబట్టి నిన్నొక్కదాన్ని తింటే చాలు. మళ్ళీ వారం వరకూ వేట ప్రయాస ఉండదు’ అంటూ ఆవులించి మళ్ళీ పడుకోబోయింది.  ముంగిసకి అహం దెబ్బతింది. ఈ పొగరుబోతు పాము పిల్లకి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది. (చదవండి👉 జానకమ్మ తెలివి)

‘ఇదిగో ఆఖరుసారిగా హెచ్చరిస్తున్నాను. పక్కకి తప్పుకుని, దారి ఇస్తావా? లేక నా తడాఖా చూపించమంటావా?’ అంది. దాంతో యువనాగుకీ తిక్కరేగింది. సర్రున పైకి లేచి పడగ విప్పి, బుస కొట్టి ‘నాకు భుక్తాయాసంగా ఉండటం వల్ల ఇంతసేపు మాట్లాడనిచ్చాను. ఆకలితో ఉంటే ఈపాటికి నిన్ను గుటుక్కున మింగేసేదాన్ని’ అంటూ బలంగా కాటు వేసింది. ముంగిస లాఘవంగా తప్పించుకుని ‘ఓహో నీకు ఎలుకలా కనిపిస్తున్నానా? అయితే నేనెవరో నీకు తప్పక తెలియాల్సిందే, తగిన బుద్ధి చెప్పాల్సిందే’ అంటూ పోరాటానికి దిగింది. ముంగిసకీ, మూషికానికీ తేడా తెలియక యువపాము పీకలమీదకి తెచ్చుకుంటున్నదని తీతువు పిట్ట ఆవేదన చెందింది. దుడుకుతనంతో పాము పిల్ల వేస్తున్న కాట్ల నుండి తప్పించుకుంటూ, దాని చుట్టూ గుండ్రంగా తిరుగుతూ బాగా కవ్వించింది ముంగిస. దాని వ్యూహంలో చిక్కుకున్న యువపాము పదే పదే కాటు వేయటంతో దాని దగ్గరున్న విషం నిల్వ అయిపోయింది. తిరిగి ఉత్పత్తి కావటానికి కొంత సమయం పడుతుంది. 

అత్యుత్సాహంతో పోరాడటం వల్ల తొందరగా అలసి పోయింది. దాడి చేస్తే లొంగిపోయి, ప్రాణ రక్షణకై ఆర్తనాదం చేసే ఎలుకకీ, కాటు వేస్తున్నా తప్పించుకుని, ఎదురు దాడి చేస్తున్న ముంగిసకీ మధ్య భేదం మొదటిసారిగా అవగతమై యువపాము కళ్ళు తెరుచుకున్నాయి. కానీ అప్పటికే ఆలస్యమై పోయింది. ఒళ్లంతా గాయలతో నెత్తురోడుతోంది. బలహీన పడిన యువపాముపై ముంగిస అమాంతం దూకి మెడ పట్టుకుని కొరకబోయింది. ఈలోపు తీతువు పిట్ట హుటాహుటిన పోయి, దాని తల్లిని తీసుకు వచ్చింది. బిడ్డ చావబోతుండటం చూసి, తల్లడిల్లిన తల్లిపాము ముంగిసని శరణు కోరింది. ముసలి పాముని చూసి జాలి పడిన ముంగిస యువ పాముని వదిలేసి మరెప్పుడూ పొగరుగా ప్రవర్తించ వద్దని హెచ్చరించింది. ఆ పాఠం తర్వాత యువపాము బుద్ధిగా మసలుకోసాగింది.

మరిన్ని వార్తలు