పిల్లల కథ: ప్రతిభకు పట్టం

24 Aug, 2022 18:59 IST|Sakshi

కళ్లేపల్లి తిరుమలరావు

దేవరకొండ రాజ్యానికి రాజు శివవర్మ. తన తెలివితేటలతో, శక్తితో రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు. ప్రజల సుఖశాంతుల కోసం పాలనలో ఎన్నో సంస్కరణలు చేశాడు. తను వృద్ధుడు అవుతున్నాడు. తన తర్వాత రాజ్యానికి రాజు ఎవరు అనే ఆలోచన ఆయన్ని ఎప్పుడూ తొలుస్తూ ఉండేది. రాజు కొడుకుని రాజు తర్వాత రాజుగా పట్టాభిషేకం చేయటం అనే సంప్రదాయానికి శివవర్మ పూర్తిగా వ్యతిరేకం. సమర్థుడు, తెలివైనవాడు, ప్రజల మనసు తెలిసినవాడు దేవరకొండ రాజ్యానికి రాజు కావాలనేది శివవర్మ కోరిక. 

తన తర్వాత రాజ్యానికి రాజును ఎంపిక చేసేందుకు తను ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నానని, ఆ పరీక్షలో తన ఇద్దరు కుమారులతో పాటు రాజ్యంలోని పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చని ప్రకటించాడు శివవర్మ. ఆ పరీక్షకు రాజు పెద్దకొడుకుతో పాటు అనేక మంది హాజరయ్యారు. రాజు చిన్నకొడుకు హాజరుకాలేదు. అత్యంత క్లిష్టమైన రాత పరీక్ష, శరీర సామర్థ్య పరీక్షలలో రాజు పెద్దకొడుకు విఫలమయ్యాడు. పరీక్షలలో విజయం సాధించింది కేవలం ముగ్గురు. వారు అనంతుడు, వీరాచారి, కేశవుడు. ఆ ముగ్గురిని శివవర్మ తన మందిరానికి పిలిపించాడు. ‘నా తర్వాత రాజ్య బాధ్యతలు చేపట్టడానికి ముందుకు వచ్చి, రెండు పరీక్షలలో ఉత్తీర్ణులైన మీ ముగ్గురికీ ముందుగా నా శుభాకాంక్షలు. చివరిగా నేను పెట్టబోయే పరీక్ష చాలా చిన్నది. కేవలం నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాడు. ఎవరైతే నాకు సంతృప్తికరమైన సమాధానం ఇస్తారో వారే నా తర్వాత ఈ రాజ్యానికి రాజు ’ అంటూ ముగ్గురికీ స్వాగతం పలికాడు శివవర్మ. ‘ఈ భూమి మీద అనేక మంది ప్రజలు ఉన్నారు. వారందరిలోకి గొప్పవాడు ఎవరు?’ అడిగాడు రాజు.  ‘అందరి కంటే గొప్పవాడు దేవుడు.. ప్రభూ’ చెప్పాడు అనంతుడు.

‘మనుషుల్లో గొప్పవారు ఎవరు అనేది నా ప్రశ్న’ తెలియజేశాడు రాజు. ‘ప్రభూ... మీ మాట ఎవరూ కాదనరు. మీ కంటే గొప్పవారు ఇంకెవరుంటారు’ చెప్పాడు వీరాచారి. ‘రాజు కంటే గొప్పవాడు ఎవరు?’ మళ్లీ అడిగాడు రాజు. ‘గొప్పవాడు ఉన్నాడు మహారాజా.. అయితే నేను మీకు అతన్ని నేరుగా చూపిస్తాను’ అన్నాడు కేశవుడు. అనంతుడు, రంగాచారి, కేశవుడు, రాజుగారు మారువేషాల్లో నగరంలోకి ప్రవేశించారు. ఊరి బయట రహదారి పక్కన కొన్ని విత్తులు నాటుతూ, కొన్ని మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించాడు ఒక వృద్ధుడు. తర్వాత మరో ఊరికి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి శుభాశుభ కార్యక్రమాలు జరిగే ఇళ్ళల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పోగుచేసి నిరుపేదలకు పంచుతున్నాడు. ఇంకొక ఊరిలో ఒక వ్యక్తి అనాథ శవాలు, జంతు కళేబరాలకు అంతిమ సంస్కారం చేస్తున్నాడు. 

‘ప్రభూ, తను పెంచుతున్న ఆ మొక్కలు వృక్షాలై ఫలాలను ఇచ్చేదాకా ఆ వృద్ధుడు జీవించి ఉండలేడు. అలాగే ఆహార పదార్థాలు వ్యర్థం కాకుండా నిరుపేదలకు పంచే.., అనాథ శవాలు, మృత కళేబరాలకు అంతిమ సంస్కారం చేసే వ్యక్తులు కూడా. ఈ ముగ్గురూ తమ కోసం కాక ఇతరుల కోసం పడే ప్రయాసను చూడండి. ఇతరులకు సేవ చేయడం కోసం జీవించేవాడి కంటే గొప్పవాడు ఎవరు ఉంటారు ప్రభూ? ’ అన్నాడు కేశవుడు. 

కేశవుడి సమాధానంతో రాజు శివవర్మ సంతృప్తి చెందాడు. సంతోషంతో కేశవుని ఆలింగనం చేసుకున్నాడు. కేశవుడిని తన తరువాత రాజుగా ప్రకటించాడు. వెంటనే కేశవుడు తననెవరూ గుర్తించలేని విధంగా ఉన్న తన మారువేషాన్ని తొలగించి అసలు రూపంతో కనిపించాడు. అతన్ని చూసిన రాజు, అనంతుడు, వీరాచారి ఆశ్చర్యపోయారు. అతను రాజు  రెండవ కొడుకు కేశవవర్మ. ‘నువ్వు పోటీలో మారువేషంలో పాల్గొనడానికి కారణం ఏమిటి?’ అని కొడుకును ప్రశ్నించాడు శివశర్మ. (పిల్లల కథ: ఆనందమాత)

‘ప్రభూ.. రాజుగారి కొడుకు హోదాలో ఈ పోటీలో పాల్గొనటం నాకు ఇష్టంలేదు. రాజుగారి కొడుకుగా పోటీలో పాల్గొంటే నాతో పాటు పాల్గొనే సాధారణ పౌరులు నన్ను చూసి భయపడటం లేదా వెనకడుగు వేయటం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా మారువేషంలో పాల్గొన్నాను. క్షమించండి ప్రభూ’ చెప్పాడు కేశవవర్మ. ‘కుమారా.. నీ ఆలోచనా విధానం బాగుంది. నువ్వు ప్రజల మన్ననలను పొందే పాలకుడివి కాగలవు’ అంటూ కొడుకును ఆశీర్వదించాడు రాజు శివవర్మ. వీరాచారి, అనంతులకు తన ఆస్థానంలో తగిన ఉద్యోగాలు ఇచ్చాడు. (క్లిక్‌: మంచి పని.. ఈ కిరీటం నీకే!)

మరిన్ని వార్తలు