Book Review: తేనెటీగ కాదది విషపు తేలు

14 May, 2021 20:00 IST|Sakshi

‘తేనెటీగ కాదది విషపుతేలు’ పుస్తక సంపాదకులు ఈదర గోపీచంద్‌ అంకిత భావం గల గాంధేయవాది. 1988 అక్టోబర్‌లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో మల్లాది వెంకటకష్ణమూర్తి మందారమకరందాన్ని మించిన సెక్సైటింగ్‌ నవల ప్రచారంతో ‘తేనెటీగ’ను సీరియల్‌గా ప్రచురించడం ప్రారంభించాడు. అందులో బూతుజోకులు, అసభ్యరేఖాచిత్రాలు పాఠకులపై విషం చిలకరిస్తున్న డర్టీ సీరియల్‌ను గోపీచంద్‌ చదివి అశ్లీల ప్రతిఘటనా వేదిక ద్వారా సీరియల్‌ ప్రచురణ ఆపించేందుకు మూడేళ్లపాటు (1989–91) అవిరళపోరాటం చేశాడు.

ఒక సామాన్యకార్యకర్తగా ఆయన మొదలుపెట్టిన ఉద్యమం ప్రముఖ రచయితలు, 16 అభ్యుదయసంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు, స్వాతంత్య్రసమరయోధులు, మహిళలు, విద్యార్థినులను భాగస్వాములుగా చేసి మహోన్నత సాంఘికపోరాటంగా మలచి విజయం సాధించాడు. ఈ నవలను తర్వాత సినిమా తీసేటప్పుడు అశ్లీల ప్రతిఘటనా వేదిక తీవ్రంగా ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. రచయిత మల్లాది ఆంధ్ర భూమి దినపత్రికలో తన వాదాన్ని, సమర్ధించుకుంటూ ‘రచయితలకు స్వేచ్ఛ లేదా? అనే వ్యాసాన్ని రాశాడు. 

ప్రముఖ పాత్రికేయులు, అప్పటి ఆంధ్రభూమి సంపాదకులు డా. ఎ.బి.కె. ప్రసాదు ‘అక్షరం’ శీర్షికలో చర్చావేదిక ప్రారంభించారు. ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ మల్లాది వాదాన్ని ఖండిస్తూ సుదీర్ఘమైన వ్యాసం రాశారు. నిఖిలేశ్వర్, పాపినేని శివశంకర్, విరసం కృష్ణాబాయి, కొత్తపల్లి రవిబాబు, బీరం సుందరరావు, రావి రంగారావు వంటి రచయితలు మల్లాదిపై ఎదురు దాడి చేసి రచయిత స్వేచ్ఛకు హద్దులుండాలనీ, బాధ్యతలుండాలనీ సూచించారు. ప్రజాసాహితి, అరుణతార వంటి పత్రికలు ఈ చర్చను కొనసాగించాయి. ఎందరో రచయితలు తమ అభిప్రాయాలను వ్యాసాలుగా రాశారు. 

ఈ పోరాట ఫలితంగా గోపీచంద్‌ విజయం సాధించినట్టే సంపాదకుడు ఈ పుస్తకాన్ని 11 అధ్యాయాలుగా వర్గీకరించి విశ్లేషణాత్మకంగా సమగ్ర సమాచారంతో రూపొందించాడు. ప్రతి అధ్యాయం ఆరంభంలో ప్రధానమతాల నుంచీ లేదా మహా పురుషుల రచనల నుంచి నైతిక విలువలను బోధించే సూత్రాలతో ప్రచురించడం ఔచిత్యంగావుంది. మొదట అధ్యాయం నాందిలో ఈ ఉద్యమానికి ప్రేరకులు న్యాయవాది కాంతారావు గారి సహకారాన్ని వివరించారు. తక్కిన అధ్యాయాల్లో ఆంధ్రభూమి ‘అక్షరం’ శీర్షికలో వచ్చిన ప్రముఖ రచయితల వ్యాసాలు, పాఠకుల, ప్రేక్షకుల స్పందనలను చేర్చారు. అనుబంధంతో కేంద్రమంత్రి ఉపేంద్రగారితో ఉత్తర ప్రత్యుత్తరాలను తేనెటీగ కన్నడ అనువాదం ‘భ్రమరం’ ఆపాలన్న డిమాండ్‌ వంటివి చేర్చారు.

గోపీచంద్‌ పోరాట ఫలితంగా మూడు దశాబ్దాలకు (2020) రచయిత మల్లాది పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ గోపీచంద్‌ నిజాయితీని ప్రశంసించారు. చెత్త నవలలను పునర్‌ ముద్రించనని ప్రతిజ్ఞ చేశాడు. అశ్లీల ప్రతిఘటనా ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరాడు. సామాజిక పోరాటస్పూర్తితో, పాత్రికేయ అనుభవంతో సంపాదకులు ఈ గ్రంధాన్ని సముచితంగా కూర్పు చేశారు. పాత్రికేయ, సాహితీ, నైతిక, సామాజిక, అభ్యుదయ ప్రగతి భావుకులు విధిగా చదవదగిన గ్రంధం ‘తేనె టీగ కాదది విషపు తేలు’.
– డా. పి.వి. సుబ్బారావు    

తేనె టీగ కాదది విషపు తేలు
వెల 120/రూ.; పేజీలు 196. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యం. 
వివరాలకు: ఈదర గోపీచంద్‌ 9440345494

మరిన్ని వార్తలు