నా వైఫ్‌ ప్రాబ్లం అదేనా?

26 Jul, 2020 07:24 IST|Sakshi

ఇష్టం లేని పెళ్లి, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సరిగా ప్రేరణ లేకపోవడం, డిప్రెషన్, ఇంట్లో ఎక్కువ పని వల్ల అలసట, రక్త హీనత, హర్మోన్లు సరిగా లేకపోవటం లాంటి ఎన్నో కారణాల వల్ల కలయికపై ఆసక్తి చూపరు. ఆ సమయంలో బిగుసుకుపోయినట్లు అవుతారు. ఇందులో నుంచి బయటపడటానికి చాలా వరకు భర్త పాత్ర, నడవడిక చాలా ముఖ్యం.

మా పెళ్లయి యేడాది అవుతోంది. సెక్స్‌ పట్ల నా వైఫ్‌ చాలా అనాసక్తంగా ఉంటోంది. నేను అంటే ఇష్టం లేక కాదు. మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది. చాలా కోపరేటివ్‌. కాని ఈ ఒక్క విషయంలోనే. నెట్‌లో చదివాను.. అలా సెక్స్‌ పట్ల ఇంట్రెస్ట్‌ లేకపోవడాన్ని ఫ్రిజిడిటీ అంటారని. నా వైఫ్‌ ప్రాబ్లం అదేనా? సొల్యుషన్‌ చెప్పగలరు.  – ప్రదీప్‌ ఆనంద్, నాందేండ్‌

ఆడవారిలో కాని మగవారిలో కాని ఎన్నో మానసిక శారీరక కారణాల వల్ల కలయికపై సరిగా ఆసక్తి చూపకపోవడాన్ని సెక్సువల్‌ ఫ్రిజిడిటీ అంటారు. కొందరిలో కలయికపైన అనేక అపోహలు ఉండటం, నొప్పి ఎక్కువగా ఉంటుందనే భయం, ప్రెగ్నెన్సీ వస్తుందనే భయం, ఇంతకు ముందు లైంగిక వేధింపులకు గురై ఉండటం, స్నేహితుల చెడ్డ అనుభవాలు విని, అందరికి అలానే ఉంటుందనే నిర్ణయంలో ఉండటం, ఇన్ఫెక్షన్స్‌ వస్తాయనే భయం, భార్య భర్తకి మధ్యలో సరైన అవగాహన లేకపోవడం, ఇష్టం లేని పెళ్లి, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సరిగా ప్రేరణ లేకపోవడం, డిప్రెషన్, ఇంట్లో ఎక్కువ పని వల్ల అలసట, రక్త హీనత, హర్మోన్లు సరిగా లేకపోవటం లాంటి ఎన్నో కారణాల వల్ల కలయికపై ఆసక్తి చూపరు. ఆ సమయంలో బిగుసుకుపోయినట్లు అవుతారు.

ఇందులో నుంచి బయటపడటానికి చాలా వరకు భర్త పాత్ర, నడవడిక చాలా ముఖ్యం. భర్త, భార్యతో ఒక స్నేహితుడిలాగా మెలుగుతూ, ఆమె పనులలో చేదోడు వాదోడుగా ఉండటం, నెగిటివ్‌గా మాట్లాడకుండా కొద్దిగా పొగడటం, ప్రేమగా ఉండటం, మనసు విప్పి మాట్లాడటం, కలిసి సినిమాలు చూడటంలాంటి చిన్న చిన్నవి చేయడం వల్ల వారిలో చాలా మార్పులు వస్తాయి. తర్వాత మెల్లగా శారీరకంగా దగ్గరవడం వల్ల వారిలో చాలా వరకు ఫ్రిజిడిటీ నుంచి దూరంగా ఉంచవచ్చు. వారిని ప్రేమతో ప్రేరేపించడం వల్ల వారిలో ఆసక్తి కలుగుతుంది. ఇలా చేసినా ఉపయోగం లేనప్పుడు, డాక్టర్‌ దగ్గర కౌన్సెలింగ్‌ ఇప్పించడం మంచింది. డాక్టర్‌ కౌన్సెలింగ్‌లో వారి మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే శారీరకంగా కూడా ఏమైనా సమస్యలు ఉంటే, వాటికి దగ్గ పరిష్కారంతో పాటు, వారి సందేహాలను నివృత్తి చేసి, భయాలను పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే  పౌష్టిక ఆహారం, కొద్దిగా వ్యాయామాలు చేయడం, శారీరక అలసట ఎక్కువగా లేకుండా చూసుకోవడంలాంటివి కూడా కొద్దిగా దోహదపడతాయి.

మా అమ్మాయికిప్పుడు ఇరవై ఏళ్లు. ఆటిజం చైల్డ్‌. ఒక పెళ్లి సంబంధం వచ్చింది. చేయొచ్చా? ఒకవేళ పెళ్లి చేస్తే తనకూ అలాంటి సమస్యలున్న పిల్లలు పుట్టే ప్రమాదం ఉందా? – కృష్ణకుమారి, నిర్మల్‌

ఆటిజం అనేది మానసిక వ్యాధి, పుట్టుకతోనే వస్తుంది. ఇందులో పిల్లలు చూడటాని మామూలుగానే ఉంటారు. కానీ వీరి మానసిక పెరుగుదల సరిగా ఉండదు. వినికిడి లోపాలు, మాట్లాడే విధానంలో లోపాలు, ఏకాగ్రత లేకపోవడంలాంటి అనేక సమస్యలు ఉండవచ్చు. కొందరిలో కొద్దిగా ఉంటాయి, కొందరిలో ఎక్కువగా ఉండొచ్చు. 
చాలా మందిలో జన్యుపరమైన కారణాల వల్ల, కొందరిలో కాన్పులో ఇబ్బందుల వల్ల, తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్, పౌష్టికాహారా లోపం, రక్త ప్రసరణలో లోపాల వల్ల ఆటిజమ్‌ సమస్య రావచ్చు. మీ అమ్మాయికి ఆటిజమ్‌ ఏ కారణాల వల్ల  వచ్చింది అనేదానిపైన అంచనా వెయ్యవచ్చు. ఒక వేళ జన్యుపరమైన కారణాల వల్ల వచ్చి ఉంటే, పుట్టబోయే బిడ్డలో కూడా ఆటిజమ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తప్పనిసరిగా రావాలని ఏమీలేదు. ఒకసారి మీ అమ్మాయికి జెనిటిక్‌ కౌన్సిలింగ్‌ చేయించండి. వీరికి పెళ్లి చేయకూడదు అని ఏమీలేదు. పెళ్లి తర్వాత ఎక్కువ సమస్యలు రాకుండా ఉండాలంటే, చేసుకునేవారికి, వారి కుటుంబ సభ్యులకు ఆటిజమ్‌ ఉన్న విషయం దాచిపెట్టకుండా చెప్పాలి. వారు దానిని అర్థం చేసుకుని, ఓపికతో మీ అమ్మాయితో మెలగవలసి ఉంటుంది.  డా.వేనాటి శోభ, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు