నూరేళ్ల జన చైనా జైత్రయాత్ర

2 Jul, 2021 01:08 IST|Sakshi

చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ వంద సంవ త్సరాల ఉజ్వల చరిత్రకు సాక్షిగా ఈనాటి జనచైనా అరుణకాంతు లతో వెలుగులీనుతోంది. ఒక నిరు పేద స్థితి నుంచి రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా పురోగమించిన మహ త్తర విప్లవ నిర్మాణానికి చిహ్నంగా వారి ఎర్రజెండా ఎగురుతోంది. 140 కోట్ల ప్రజల కలలకు, ఉజ్వల భవిష్యత్తుకు బాసటగా నాయకత్వం వహిస్తూ వారి మన్న నలు పొందుతోంది. ఇదంతా తేలికగా సాధ్యమయ్యింది కాదు. అకుంఠిత దీక్షతో ఒక్క మాటగా, కలసికట్టుగా చేసిన జైత్రయాత్ర. అనేక కుట్రలను, శత్రుప్రేరిత చర్యలను తిప్పి కొడుతూ తనను తాను నిరూపించుకుంటూ సాగిన మహా ప్రయాణం. అయితే, అభూత కల్పనలను, అంతర్‌ విద్వేషా లను రెచ్చగొట్టాలని చేసిన ప్రయత్నాలను తిప్పికొడుతూ సాగిన ఒక చారిత్రక ఘట్టమే తియనన్మెన్‌ స్క్వేర్‌.

1989 జూన్‌ 4 నాడు తియనన్మెన్‌ స్క్వేర్‌లో పదివేల మంది విద్యార్థులను సైన్యం కాల్చి చంపిందని అమెరికా, పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులు ఒక విష ప్రచారం చేశారు, చేస్తున్నారు. నిజంగా ఏం జరుగుతున్నది అని పరి శీలించకుండా, ఒకరి కథనాల ఆధారంగా మరొకరు వార్త లను వండి వడ్డించారు. చైనా విద్యార్థుల్లో కూడా కొందరు అందులో భాగమయ్యారు. ఆనాడు 500 బిలియన్‌ డాల ర్లున్న చైనా జీడీపీ నేడు 14,000 బిలియన్లకు చేరుకున్నది. చైనా ప్రజలు నేడు సంపన్నులై, గర్వంతో తలఎత్తుకొని వున్నారు. డెంగ్‌ చూపెట్టిన, ఆ తర్వాత నాయకులంతా అనుసరించిన మార్గంలో వారు ఈ స్థాయికి చేరారు. 1989 తర్వాత నేటివరకూ అక్కడి యువతరం, విద్యార్థులు ఎన్నడూ నిరసన తెలిపే అవసరం రాలేదు. ఇప్పటి చైనా మార్గం స్థానంలో ప్రజాస్వామ్యం పేరిట మరో వ్యవస్థని కోరుకుంటారేమోనన్న సూచనలేవీ మెజారిటీ ప్రజల్లో కన్పించటం లేదు. 

దేశంలో అమలు చేయవలసిన సంస్కరణల గురించి పార్టీ నాయకత్వంలో చర్చలు కొనసాగుతున్న కాలం. డెంగ్‌ అనుయాయే అయినా, కళ్ళెంలేని లిబరలైజేషన్‌ వైపు మొగ్గిన నేత హుయావొ. అది తప్పేనన్న ఆత్మవిమర్శతో ప్రధాన కార్యదర్శిగా రాజీనామా (16–1–1987) చేసి, పొలిట్‌బ్యూరోలో వుండగా 15–04–89న మరణించారు. నాటి సంతాప వాతావరణాన్ని, విభేదాలను వాడుకొని విద్యార్థులని ఎగదోశాయి పార్టీలోని కొన్ని శక్తులు, లాబీలు. దానికి ఆజ్యం పోశాయి విదేశాలు, విదేశీ మీడీయా. అలా ఏప్రిల్‌ 18–22న సంతాపం పేరిట వేలాదిమంది తరలి వచ్చారు. అదే ముదిరి 50 రోజులు కొనసాగింది. పాశ్చాత్య పెట్టుబడిదారీ విధానపు బూర్జువా ప్రజాస్వామ్యం బండారం తెలియని కొందరు విద్యార్థులు, అమెరికాలోని ‘స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ’ విగ్రహ నమూనాని తలకెత్తుకున్న కొందరు విద్యార్థులు కూడా అందులో వున్నారు. అమె రికాతో ప్రభుత్వపరంగా సంబంధాలు ఏర్పడి, ఇరుదేశాలూ హలో హలో అని పలకరించుకుంటున్న వాతావరణం. అప్పటి విద్యార్థి తరంలో పాశ్చాత్యదేశాల స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వాల గురించి పైపై అవగాహనే వుంది.

అభివృద్ధి, సంపద, సౌకర్యాలు, టెక్నాలజీ... ఇవన్నీ కలిసి ‘రెడ్‌ జీన్‌’ని పలుచన చేస్తాయేమోనని కొంత ఆందోళన వున్న కాలం అది. డెంగ్‌ లిబరల్‌ ఆర్థిక సంస్క రణలు మొదలై పదేళ్ళు దొర్లినాయి. విదేశీ, దేశీ పెట్టుబడి దారులను అనుమతిస్తూనే స్వతంత్ర ‘నవచైనా నిర్మాణ స్వప్నం’ మొదలైంది. ‘చైనా తరహా సోషలిజం’ పేరిట అనుసరించిన వ్యూహం–ఎత్తుగడల ఫలితాలు ఈనాడు ప్రపంచమంతా చూస్తున్నది. సిద్ధాంత సంక్షోభం తలెత్త నీయకుండా ఆ ప్రమాదాన్ని పసిగట్టే ‘బూర్జువా లిబర లైజేషన్‌’కి వ్యతిరేకంగా చైనా పార్టీ ఆనాడే (1987) ఒక ఉద్యమాన్ని నిర్వహించింది. ఎన్ని సంస్కరణలు వచ్చినా నాలుగు మౌలికసూత్రాల చట్రానికి లోబడి మాత్రమే వుండాలని చైనాపార్టీ, ప్రభుత్వమూ ఆదేశిక సూత్రాలను ప్రకటించాయి(పార్టీ 13వ మహాసభలో, 1987 అక్టోబరు). సంస్కరణల క్రమంలో పెచ్చరిల్లిన బూర్జువా లిబరలైజే షన్‌ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడి వుండాల్సిన ఆ సూత్రాలను పునరుద్ఘాటించారు. అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంతృత్వం, మార్క్సిస్టు లెనినిస్టు మావో సిద్ధాంత నేతృత్వం, అన్నిటికన్నా కీలకమైన పార్టీ నాయకత్వం. ఈ సూత్రాలను కాదనేవారు కొందరు పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలపై దాడులను ఆర్గనైజు చేశారు. ప్రజా చైనా, పార్టీల భవితవ్యాన్ని దెబ్బ తీయటానికి, సామ్రాజ్య వాదుల ప్రోత్సాహంతో జరిగిన తిరుగుబాటు కుట్ర స్వభావాన్ని అర్థం చేసుకోకుండా, దాన్ని బలపరిచి, కొద్దిమంది తీవ్రమైన తప్పు చేశారు. 

‘మొత్తం’ ఎంతమంది చనిపోయారు? చైనా లెక్క 300 (సైనికులతో సహా). జూన్‌ 3 రాత్రి గురించి నేటికీ వ్యాప్తిలోవున్న పుకారు: పదివేలమంది. అమెరికా గూఢచారి సంస్థ లెక్క– 500 మందిదాకా. యామ్నెస్టీ లెక్క 1000 దాకా. స్క్వేర్‌లో విద్యార్థుల మరణాలే లేవని, ఇతరచోట్ల అల్లర్లలో చనిపోయారని చైనా ప్రకటించింది. ‘అక్కడ’ రక్తపాతం జరగలేదని 2011లో అమెరికా రాయబార కార్యా లయం పంపిన రహస్య కేబుల్స్‌ చెప్పాయి. పాశ్చాత్య కపటాన్ని (నేటి భాషలో పోస్ట్‌ ట్రూత్‌) చైనా నిర్దిష్టంగా బట్టబయలుచేసింది. ఆ తరువాత నడిచిన చరిత్ర చైనా వారి సూత్రీకరణలు ఎంత సరైనవో నిరూపించింది. తూర్పు యూరప్‌లో, రష్యాలో లాగే చైనా ప్రభుత్వమూ, పార్టీ పతన మవుతాయని సామ్రాజ్యవాదులు కన్న కలలు వమ్మయేట్టు చైనా కమ్యూనిస్టు పార్టీ తన ప్రస్థానం కొనసాగిస్తున్నది.

‘పాశ్చాత్యీకరించబడిన’ ఆసియా అగ్రరాజ్యంగా చైనా వుండబోదు. సోషలిస్టు మార్కెట్‌ విధానాలతో, ప్రపంచీ కరణ సమయంలో ఏర్పడ్డ సౌలభ్యాలని తమ జాతీయ అభి వృద్ధికి మార్గంగా చేసుకుని జన చైనా మహాప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకత్వంలో చైనా లక్ష ణాలతో సృజనాత్మకంగా అభివృద్ధి చేసుకున్న సోషలిస్ట్‌ రాజ్యంగా మునుముందుకు దూసుకు వెళుతున్నది. ఇది సహించలేని సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ భయకంపిత చిహ్నాలే చైనాకు వ్యతిరేకంగా కూటములు కట్టడం, అడు గడుగునా చైనా వ్యతిరేక ప్రచారం కొనసాగించటం. వారి సంస్కృతిని, సాంకేతిక నైపుణ్యాన్ని కించపరచటం, అసలు ఈ ప్రపంచానికి పెద్ద ప్రమాదం చైనా అనే బూటకపువాదం యుద్ధభేరీలా మోగించటం. అయితే ప్రపంచ ప్రజల అభి ప్రాయం భిన్నంగా ఉంది. సామ్రాజ్యవాద, ఆధిపత్య శక్తుల దోపిడీ ప్రయోజనాలను, పీడక స్వభావాణ్ని ప్రపంచ ప్రజలు అవగతం చేసుకుంటూ జన చైనా వెనుక నిలుస్తు న్నారు, జేజేలు చెబుతున్నారు.


వ్యాసకర్త భారత–చైనా మిత్ర మండలి ఉపాధ్యక్షులు
మొబైల్‌ : 98498 06281 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు