జీవ వైవిధ్యం రక్షణ లక్ష్యాలు నెరవేరేనా?

10 Jan, 2023 13:11 IST|Sakshi

కెనాడా నగరం మాంట్రియల్‌లో 2022 డిసెంబర్‌లో జరిగిన 15వ జీవవైవిధ్య సదస్సులో కుదిరిన ఒప్పందంలో పేర్కొన్న లక్ష్యాలను ఆహ్వానించవలసిందే. అయితే వాస్తవ పరిస్థితులను చూస్తే లక్ష్యాలు నెరవేరతాయా అనిపిస్తోంది. భారత్‌ సహా 190 దేశాల ప్రతినిధులు పాల్గొని చర్చించి ఒక ఒప్పందం చేసుకున్నారు. 2030 నాటికి ఈ ధరిత్రిపై 30 శాతం జీవవైవిధ్యం కాపా డాలన్నది ఒప్పందంలో ప్రధాన అంశం. ఈ విశ్వంలోగల జీవరాశులన్నిటినీ కలిపి జీవావరణం అంటున్నాం. జీవరాశులన్నీ సురక్షితంగా ఉంటేనే జీవవైవిధ్యం చక్కగా ఉంటుంది. అయితే ఇప్పటికే జీవవైవిధ్యం గణనీయంగా ధ్వంసమైపోయింది. ఇందుకు ప్రధానకారణం మానవ కార్యకలాపాలే. 

1972లో స్టాక్‌హోమ్‌లో జరిగిన ధరిత్రి పరిరక్షణ సదస్సు తర్వాత ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో ఇంతవరకు 27 కాప్‌  సదస్సులు జరిగాయి. మొత్తం సదస్సుల్లో క్యోటో ఒప్పందం, గతంలో జరిగిన మాంట్రి యల్‌ ఒప్పందం, పారిస్‌ సదస్సు, 2021లో జరిగిన గ్లాస్గో, 2022లో ఈజిప్టు షర్మెల్‌ షేక్‌ నగరంలో జరిగిన సదస్సుల్లో జరిగిన ఒప్పందాలను ఇప్పటివరకు అమలు చేయలేదు. చేసినా అరకొర నిర్ణయాలే తీసుకొని అమలు చేశారు. 

గ్లాస్గో ఒప్పందంలోనే 2030 నాటికి సాధించవలసిన లక్ష్యా లను నిర్ణయించారు. వీటిలో చాలా తక్కువగానే సాధించారనీ, రానున్న ఐదేళ్ల కాలంలో సైతం సాధించే అవకాశం కనిపించడంలేదనీ, ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్‌ ఆయా ప్రభుత్వాలు సమర్పించిన ఐదేళ్ల ప్రణాళికలను బట్టి గ్లాస్గో సదస్సుకు ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన జీవ వైవిధ్య సదస్సు చేసిన నిర్ణయాలను, లక్ష్యాలను సాధించడం సాధ్యమేనా? 

ఇప్పటికే 14 లక్షల జీవజాతులు అంతరించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధకుల అంచనా మేరకు గడచిన నాలుగు వందల కోట్ల సంవత్సరాల జీవపరిణామ క్రమంలో జీవవైవిధ్యం ఏర్పడింది. దీని పరిరక్షణకు ముందు వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకురావలసి ఉంది. ఇందులో భాగంగా కృత్రిమ ఎరువులు, పురుగు మందులను నిలిపి వేసి సంప్రదాయ సేద్యాన్ని చేపట్టాలి. ఇది చాలా నెమ్మదిగా, దీర్ఘకాలం అమలు చేయవలసిన ప్రక్రియ. 2030 నాటికి ఈ మార్పును సాధించగలమా?

జీవ వైవిధ్య రక్షణ ఒప్పందం అమలు చేయాలంటే ధనిక దేశాలు... పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు సమకూర్చాలనీ, లేకపోతే ఒప్పందం నుండి వైదొలగుతామనీ కాంగో చివరిలో హెచ్చరించింది. అనేక దేశాలు ఈ బాటను ఎంచుకొనే అవకాశం ఉంది. వ్యవ సాయానికిచ్చే సబ్సిడీలను కొనసాగించాలని భారత్, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు డిమాండ్‌ చేశాయి. అమెరికా తదితర కొన్నిదేశాలు 60 శాతానికి పైగా సబ్సిడీలు ఇస్తున్నాయి. సబ్సిడీల విషయాన్ని తుది ఒప్పందం పత్రంలో చేర్చారా లేదా అన్న సందేహాలు వ్యక్తమ య్యాయి. సబ్సిడీలు లేకపోతే వ్యవసాయం సంక్షోభంలో పడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అయితే ఆర్థిక రంగానికి హాని కలిగించే సబ్సిడీలను తగ్గించాలని ఒప్పందంలో చేరుస్తామని ఒప్పందం రూపొందించిన దేశాలు చెప్పాయి.

ఈ లక్ష్యాలను 2030 నాటికి సాధించాలంటే కేవలం ఆసియా – పసిఫిక్‌ ప్రాంత దేశాలకే 300 బిలియన్‌ డాలర్లు అవసరం అవుతాయని ఆ ప్రాంత ఐరాస ఆర్థిక, సామాజిక కమిషన్‌ (యుఎన్‌ఈపీ) అంచనా వేసింది. 2025 నాటికి 20 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఆర్థిక సహాయం చేస్తామని సంపన్న దేశాలు అంగీకరించాయి. మరి లక్ష్యాలు సాధిం చడం సాధ్యమవుతుందా? 

వాతావరణ విపత్తులు.. పర్యావరణ కాలుష్యం, భూతాపం పెరుగుదల మూలంగా అధికమయ్యాయి. 200 ఏళ్లకు పైగా పారిశ్రామికీకరణ, పెట్రో ఉత్పత్తులు, వ్యవసాయానికి వినియోగిస్తున్న రసాయన ఎరువులు, పురుగుమందులు, విచ్చలవిడిగా అడవుల నరికివేత పెరిగాయి. మన దేశంలో 75 జిల్లాల్లో వాతావరణ వైపరీత్యాలు సంభవిస్తున్నాయని వివిధ అధ్యయనాలతో పాటూ, వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి జాతీయ బ్యాంకు ప్రకటించింది. ఇక అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతుందనేది వాస్తవం. ఇందుకు తాజా ఉదాహరణలు లక్ష దీవులు, నికోబార్‌ దీవుల్లో జరుగుతున్న విధ్వంసం. ఈ ప్రాంతాల్లో వందలు, వేల ఎకరాల భూభాగంలో పచ్చదనం నాశనం అవుతోంది. ఫలితంగా వేలాదిమంది ఆదివాసీ తెగల జన జీవనం మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బ తింటోంది. వందలాది పక్షులు, జంతువుల రకాలు, ఇతర లెక్కలేనన్ని జీవరాసులు అంతరించిపోతాయి. సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతాల్లో నెలకొని ఉన్న జీవ వైవిధ్యం మళ్లీ కనిపించదు. 

ప్రపంచ వ్యాప్తంగా అడవుల్లో నివసించే జంతువులు, పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు తదితర అనేక రకాల జీవులలో 1970 నుంచి ఇప్పటి వరకు 69 శాతం నశించాయని లివింగ్‌ ప్లానెట్‌ రిపోర్టు (ఎల్‌పీఆర్‌)– 2022 నివేదిక తెలిపింది. ప్రపంచ జంతుజాల నిధి సంస్థ పరిధిలో ఎల్‌పీఆర్‌ పనిచేస్తోంది. భారత ప్రభుత్వం వాతావరణంపై 2023లో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. గతేడాది పారిస్‌ ఒప్పందంలో భాగంగా జాతీయ నిర్ణయ కార్యాచరణలు (ఎన్‌డీసీలు) రూపొందించింది. తక్కువ కాలుష్యం వెలు వరించే దీర్ఘకాలిక కార్యాచరణను మన ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 2070 నాటికి కాలుష్య రహిత వాతావరణం సాధిస్తామని పారిస్‌ సదస్సులో ప్రకటించింది. మరి ఈ లక్ష్యాలను సాధించి మన దేశమన్నా మాట నిలుపుకొంటుందేమో చూడాలి. (క్లిక్ చేయండి: లోహియా లోకదర్శన సులోచనాలు!)

– టీవీ సుబ్బయ్య, సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు