అప్పు చుట్టూ ఇంత రాజకీయమా?

21 Apr, 2021 01:34 IST|Sakshi

విశ్లేషణ

చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి వంద కోట్ల రూపాయల నిధి మాత్రమే ఉందని కూడా ఒక పత్రిక వార్త ఇచ్చింది. అయినా జగన్‌ ప్రభుత్వం నానా తంటాలు పడి వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఆయన పాలనకు ఏడాది కాకముందే కరోనా సంక్షోభం కుదిపేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్రమైన కష్టాలలో పడ్డాయి. అందులో ఏపీ మరింత క్లిష్ట పరిస్థితికి గురైంది. అప్పులు చేసుకోండని కేంద్రమే రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించింది. అంతేకాక ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో రకరకాల రుణాలు ఇవ్వడం, అప్పుల పరిమితి పెంచడం వంటివి చేశారు. వాటి గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించకుండా అప్పుల్లో నెంబర్‌ వన్‌ అంటూ ఏపీ ప్రభుత్వం 79వేల కోట్లకు పైగా అప్పు చేసిందని వార్త ఇచ్చారు. రాష్ట్ర ప్రజలను గాలికి వదలి ఒక్క స్కీమ్‌ కూడా అమలు చేయకపోతే, వారంతా ఆర్థికంగా అల్లాడుతుంటే వీరంతా సంతోషించేవారని అనుకోవాలి.

ఈ మధ్య ఒక ప్రముఖ పత్రిక అప్పుల్లో నెంబర్‌ వన్‌ అంటూ ఏపీ ఆర్థిక సమస్యలపై ఒక భారీ కథనాన్ని ఇచ్చింది. తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియా ప్రతి నెలలో ఒకటికి రెండుసార్లు ఇలాంటి కథనాలు ఇస్తున్నాయి. అప్పులు భారీగా చేయడం ప్రమాదమే. ఆ విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్తగానే ఉండాలి. అంతవరకు తప్పు లేదు. కాని ఆ వార్త రాసిన తీరు. ఏ పరిస్థితిలో అప్పులు చేయవలసి వచ్చింది, దానికి కేంద్రం అనుమతి ఉందా? లేదా, నిర్దిష్ట ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ చట్ట పరిధిలో ఉందా? లేదా అన్న అంశాల జోలికి వెళ్లకుండా కేవలం బురద చల్లే లక్ష్యంతో ఆ మీడియా వార్తలు ఇవ్వడమే బాధాకరం. పోనీ ఇదే మీడియా గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షన్నర కోట్ల అప్పు తెచ్చినప్పుడు రెగ్యులర్‌గా ఇలాంటి కథనాలు వచ్చి ఉంటే, అప్పుడు ఇచ్చారు.. ఇప్పుడూ ఇచ్చారులే అని సరిపెట్టుకోవచ్చు. కాని అప్పుడు రుణం తేవడం సమర్థతగా, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖం చూసి అప్పులు ఇచ్చేవారు ఎగబడుతున్నట్లు కథనాలు రాశారు. ఉదాహరణకు రాజధాని అమరావతి పేరుతో రెండువేల కోట్ల రూపాయల విలువైన బాండ్లను విడుదల చేస్తే అవి నిమిషాలలో అమ్ముడు పోయాయని, విపరీతమైన స్పందన వచ్చిందని అప్పట్లో ఈ పత్రికలు స్టోరీలు ఇచ్చాయి.

అంతేకాదు. ఎన్నికలు ఒకటి, రెండు నెలల్లో జరుగుతాయనగా చంద్రబాబు ప్రభుత్వం పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో వేల కోట్ల రూపాయలను పందారం చేసింది. అదంతా చంద్రబాబు గొప్పతనంగాను, ఆ స్కీములతో ఆడవాళ్లు, రైతులు అంతా ఎగబడి టీడీపీకి ఓట్లు వేయబోతున్నట్లు గాను ప్రచారం చేశాయి. కాని ప్రజలు ఆ స్కీములు ఎందుకు, ఎప్పుడు వచ్చాయో అర్థం చేసుకుని ప్రభుత్వానికి, తెలుగుదేశం మీడియాకు వాత పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి వంద కోట్ల రూపాయల నిధి మాత్రమే ఉందని కూడా ఒక పత్రిక వార్త ఇచ్చింది.

అయినా జగన్‌ ప్రభుత్వం నానా తంటాలు పడి వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఆయన పాలనకు ఏడాది కాకముందే కరోనా సంక్షోభం కుదిపేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్రమైన కష్టాలలో పడ్డాయి. అందులో ఏపీ మరింత క్లిష్ట పరిస్థితికి గురైంది. అప్పులు చేసుకోండని కేంద్రమే రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించింది. అంతేకాక ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో రకరకాల రుణాలు ఇవ్వడం, అప్పుల పరిమితి పెంచడం వంటివి చేశారు. వాటి గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించకుండా అప్పుల్లో నెంబర్‌ వన్‌ అంటూ ఏపీ ప్రభుత్వం 79 వేల కోట్లకు పైగా అప్పు చేసిందని వార్త ఇచ్చారు. రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలతో పోల్చి కథనాన్ని ఇచ్చారు. ఏపీ అప్పటి బడ్జెట్లో రూ.48,295 కోట్ల అప్పు చేయవలసి ఉంటుందని అంచనా వేస్తే, రూ.79 వేల కోట్లకు పైగా అప్పు చేయవలసి వచ్చింది. అంటే ఇది ఊహించిన దానికన్నా డబుల్‌ కాదు. రాజస్తాన్‌ బడ్జెట్‌లో రూ.10,482 కోట్ల అప్పులు అవసరం అవుతాయని అనుకుంటే రూ.51,304 కోట్లు అప్పు చేసింది. అంటే ఐదు రెట్లు అధికంగా అప్పు చేయవలసి వచ్చిందన్నమాట. తెలంగాణ రూ.33,191 కోట్ల అప్పు అంచనాతో ఉంటే, రూ.46,700 కోట్లు అప్పు చేసింది. ఆయా రాష్ట్రాలు ఇలా అప్పులు చేశాయి.

కానీ ఈ అప్పులు ఎందుకు తెచ్చారు? కరోనా సమయంలో ప్రజల ఆదాయం పడిపోయి, సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో నవరత్నాల స్కీమ్‌ లోని వివిధ కార్యక్రమాల కింద అమ్మ ఒడి కావచ్చు, చిన్న పరిశ్రమలకు సాయం కావచ్చు, చేయూత కావచ్చు.. టైలర్లు, రజకులు, చేనేత కార్మికులు కావచ్చు.. ఇలా సమాజంలోని అణగారిన వర్గాలను ఈ డబ్బుతో ఆదుకున్నారు. ఈ విషయాలు కూడా ప్రస్తావించి ఉంటే ఆ కథనంలో తప్పు లేదని అనుకోవచ్చు. ఇవేవి రాయక పోవడంతో వారు ద్వేష భావంతో ఆ కథనం వండారని అర్థం అయిపోతుంది. వెంటనే టీటీపీ నేతలు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వంటివారు కానీ, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కానీ ఈ అప్పులపై విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. మరి యనమల ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు లక్షన్నర కోట్ల అప్పు తెచ్చారు. దానిని ఏ విధంగా ఖర్చు చేసింది చెప్పి ఉంటే, ఇప్పుడు ఈ ఖర్చు గురించి కూడా అడగవచ్చు.

విశేషం ఏమిటంటే జగన్‌ అధికారంలోకి వచ్చిన కొత్తలో యనమల తదితరులు ఒక వ్యాఖ్య చేసేవారు. జగన్‌ ముఖం చూసి ఎవరూ రుణం ఇవ్వడం లేదని విమర్శించేవారు. ఇప్పుడు అదే పెద్దమనుషులు జగన్‌ అంత అప్పు చేశారు.. ఇంత అప్పు చేశారు.. అని గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర ప్రజలను గాలికి వదలి ఒక్క స్కీమ్‌ కూడా అమలు చేయకపోతే, వారంతా ఆర్థికంగా అల్లాడుతుంటే వీరంతా సంతోషించేవారని అనుకోవాలి. అప్పుడు ఆ విమర్శలు చేసేవారు. ప్రతిపక్షానికి రెండువైపులా మాట్లాడే అవకాశం ఉంటుందని ఊరికే అనరు. అప్పు తేలేదనుకోండి..వీళ్లకు అప్పులు ఇచ్చేవారు కూడా లేరు.. జనాన్ని ఆదుకోలేదని విమర్శించేవారు. ఇప్పుడు అప్పులు తేగలిగారు కనుక అమ్మో అప్పులు తెచ్చేశారు.. ఇంతగా పెరిగిపోయాయి అని విమర్శిస్తున్నారు.

మరో వైపు కేంద్రం అప్పులు కూడా భారీగానే పెరిగాయన్న విషయాన్ని విస్మరించరాదు. కోటి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఇప్పుడు కేంద్రం మెడపై ఉంది. వాటి గురించి మాట్లాడే ధైర్యం తెలుగుదేశం నేతలకు లేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే కరోనా సంక్షోభ సమయంలో కూడా జగన్‌ తన హామీలు నెరవేర్చుతున్నారే అన్న దుగ్ధ తప్ప మరొకటి కాదని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఈ స్కీములను వారు నేరుగా విమర్శించకుండా అప్పులు, అప్పులు అని ప్రచారం చేస్తుంటారు. మరి గతంలో చంద్రబాబు రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలు మొత్తం లక్ష కోట్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చి చతికిలపడ్డారు. రైతు రుణాలే 87 వేల కోట్లు ఉంటే పాతికవేల కోట్లకు కుదించి అందులో 15 వేల కోట్లు మాత్రమే చెల్లించారు. మరి అదంతా ఉత్పాదక వ్యయమేనా అంటే అవునని వారు చెప్పగలరా? రాజధాని అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు వ్యయం చేయాలని పూనుకున్నారు. అదేమంటే లక్ష కోట్ల ఆదాయం వస్తుందని ప్రచారం చేశారు. నిజంగా అంత ఆదాయం వచ్చేటట్లయితే ప్రభుత్వధనం లక్ష కోట్లు ఎందుకు పెట్టాలన్నదానికి సమాధానం ఇవ్వలేరు. ఇలా అసంబద్ధమైన వాదనలతో చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారీతిలో అప్పులు చేసి దుబారాగా వ్యయం చేసింది.

జగన్‌ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలకోసం ఈ వ్యయం చేసింది. నిజమే. కొందరికి ఈ స్కీములు మంచివి కావేమో అన్న భావన ఉండవచ్చు. కాని ప్రజలు వాటిని అమలు చేయడానికి తీర్పు ఇచ్చారు. వాటిని అమలు  చేయకపోతే ఈపాటికి జగన్‌ ప్రభుత్వం అన్‌ పాపులర్‌ అయి ఉండేది. చంద్రబాబు ఊరు, వాడ ఏకం చేసి మరీ విమర్శలు చేసేవారు. ఏది ఏమైనా ఒక్క విషయం చెప్పాలి. కరోనా సంక్షోభ సమయంలో అప్పులు తేవడాన్ని ఎవరూ తప్పుపట్టనవసరం లేదు. క్రమేపి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నందున దానికి తగ్గట్లుగా ఏపీ ప్రభుత్వం ప్లాన్‌ చేసుకోవాలి. మరీ ఎక్కువ అప్పులు తెస్తుందేమో అన్న అనుమానం మధ్య, ఎగువ మధ్య తరగతి ప్రజలకు కలగకుండా చూసుకుంటే చాలు.


కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు