‘గర్వించదగిన క్షణాలు’ ఎలా ఉండాలి?! 

1 Jun, 2021 00:38 IST|Sakshi

రెండో మాట 

తన ఏడేళ్ల పాలనలో గర్వించదగిన క్షణాలెన్నో ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ మనసులో మాటగా దేశప్రజల ముందు గర్వంగా ప్రకటించారు. కానీ గత ఏడేళ్ల కేంద్ర ప్రభుత్వ పాలన తీరుతెన్నులు నిరాశ కలిగిస్తున్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఆశించిన ఆ గర్వించదగిన క్షణాల ఉషోదయం కోసం దేశ ప్రజలు ఎదురుతెన్నులు చూసి, చూసి హతాశులయ్యారు. భారత రాజ్యాంగం దేశ పౌరుల చేతికి అందించిన సకల హక్కులను గత 78 ఏళ్ల స్వాతంత్య్రంలో పాలకులు ప్రజల చేతుల నుంచి గుంజేశారు. మనస్సును నిర్భయంగా ఉంచుకుని, మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగాలన్న రవీంద్రుడి కాలాతీత సందేశమే మనం గర్వించదగిన క్షణాలుగా ఉండాలి. కానీ ప్రస్తుత పాలనలో అలాంటి గర్వించే క్షణాలు కనిపిస్తున్నాయా?

‘‘ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగగలడో/ ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగల్గుతుందో/ ఎక్కడ ప్రపంచం మురికి గోడలమధ్య మ్రగ్గిపోదో/ ఎక్కడ మాటలు అగాథ మైన సత్యం నుంచి బయటపడతాయో/ ఎక్కడ అవిరామమైన అన్వే షణ పరిపూర్ణతవైపు చేతులు చాస్తుందో/ ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని నిర్జీవమైన అంధవిశ్వాసపు ఎడారిలో ఇంకిపోదో/ ఎక్కడ ఆలోచనలో, పనిలో, నిత్య విశాల మార్గాలవైపు మనస్సు పయనిస్తుందో/ అదిగో– ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి తండ్రీ/ నా దేశాన్ని మేల్కొల్పేటట్టు అను గ్రహించు’’

అవీ.. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ దృష్టిలో మానవులైన పౌరులు గర్వించదగ్గ క్షణాలు అంటే! కానీ బీజేపీకి చెందిన ప్రధాన మంత్రిగా 2014 నుంచీ, 2021 మే 30వ తేదీవరకు సాగిన తన ఏడేళ్ల పాలనలోనూ ‘గర్వించదగిన క్షణాలెన్నో, ఎన్నెన్నో’ అని తన ‘మన సులో మాట’గా దేశ ప్రజలముందు నరేంద్ర మోదీ ఎంతో గర్వంగా ప్రకటించారు. అది ఆయన మనసులో మాట. కానీ మన మనసులో మాటగా చెప్పుకోవాలంటే.. గత ఏడేళ్ల బీజేపీ–ఎన్డీఏ–ఆరెస్సెస్‌ కూటమి పరిపాలన తీరుతెన్నులు మాత్రం.. నిరాశ కలిగిస్తున్నాయి. ఎంతగా అవసరంకొద్దీ పాలకులు శాంతినికేతన్‌కు పోయి విశ్వకవికి నివాళులు అర్పించి వచ్చినా– ఠాగూర్‌ ‘నిర్భయంగా పౌరుడి మనస్సు ఉండాల’నీ, విజ్ఞానం సగర్వంగా ఆంక్షలు లేని వాతావరణంలో మానవుడు తిరగగల్గాలనీ, ఆ రోజున మాత్రమే, ఆ స్వేచ్ఛా స్వర్గం లోకి దేశ పౌరులూ, దేశమూ మేల్కొంటుందని, అప్పుడు మాత్రమే పరిశుద్ధమైన జ్ఞానం వైపు పౌరుల మనస్సు ఉరకలు పెడుతుందనీ ప్రకటించాడో– ఆ గర్వించదగిన క్షణాల ఉషోదయం కోసం దేశ ప్రజలు ఎదురుతెన్నులు చూసి, చూసి హతాశులయ్యారు. ప్రజలు సహజంగా ఆశించే సుపరిపాలన అంటే అర్థం.. భారత రాజ్యాంగం దేశ పౌరుల చేతికి అనుభవించమని ఆశించి/ వారి చేతికే అందించిన రాజ్యాంగం తాళాలు అనిమాత్రమే. కానీ గత 78 ఏళ్ల స్వాతం త్య్రంలో– ఆ తాళాలను కాస్తా కాంగ్రెస్, బీజేపీ పాలకులు ప్రజల చేతుల నుంచి గుంజేశారు. 

‘ఈ దేశ ప్రజలమైన మేము మాకు మేముగా ఈ గౌరవ పత్రాన్ని అంకితం చేసుకున్నామని ‘ఉయ్‌ ది పీపుల్‌’ అని రాజ్యాంగంలో సగర్వంగా ప్రకటించారు. రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశపెట్టిన అనుల్లం ఘనీయమైన పౌర హక్కుల రక్షణకు, బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు సంబంధించి రాజ్యాంగంలోని 19, 21 నిబంధ నలను చేర్చారు. కాగా వీటిని అమలు జరపడానికి బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాల రక్షణకు సంబంధించి పొందుపర్చిన 35 నుంచి 39 రాజ్యాంగ నిబంధనలను ఆచరణలో అమలులోకి రాకుండా చేసి అడ్డుపుల్లలాగా ఆదేశ సూత్రాల అధ్యాయాన్ని చొప్పించారు. ఈ క్షణం దాకా రాజ్యాంగం ఆదేశించిన ఈ సూత్రాలు కేవలం కళ్లతుడుపు అధ్యాయంగానే మిగిలిపోయి దేశంలోని పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాల ప్రధాన ప్రతినిధులుగా కాంగ్రెస్‌–బీజేపీ పాలక వర్గాలు ఆచ రణలో వ్యవహరిస్తున్నాయి. పైగా, కనీసం గత 30–40 సంవత్సరాల వ్యవధిలో మన ప్రజా ప్రతినిధులలో (అటు పార్లమెంట్, ఇటు శాసన సభలలో) పెక్కుమందిపై రకరకాల అవినీతి ఆరోపణలు చోటుచేసు కోవడంపై.. పరిశోధనా రంగంలో పేరుప్రతిష్టలు పొందిన సాధికార సంస్కరణల సంఘాల నివేదికలు ఎండగట్టడం జరిగింది. 

మన ‘ప్రజాస్వామ్యం’, పాలక వర్గాల వల్ల ఏ స్థితికి వచ్చిందంటే –1960లలో ‘నా చేతిలో 70 మంది పార్లమెంటు సభ్యులున్నారని’ భారత కోటీశ్వరులలో ఒకరైన బిర్లా బాహాటంగానే ప్రకటించి ప్రజల్ని ఆశ్చర్యచకితుల్ని చేశారు. కానీ ఎంపీలు లేదా రాష్ట్రాల శాసనసభ్యు లలో రానురానూ ఈ ‘కొనుగోళ్ల’ సంఖ్య పెరిగిపోతోంది. తాజా నివేదికల ప్రకారం 500 మంది పార్లమెంటు సభ్యులలో ఈ బాపతు అవినీతి పరుల సంఖ్య 200 మంది పైచిలుకేనని ‘ఏడీఆర్‌’ నివేదికలు తెల్పు తున్నాయి. సరిగ్గా ఈ దశలో వాజ్‌పేయి ప్రధాన మంత్రిత్వ కాలం ముగిసిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా మోదీ పాలనాకాలంలో కూడా ఏడీఆర్‌ నివేదికలలో మార్పు లేదు. 

దానికితోడు మోదీ గత ఏడేళ్లలో ‘సంస్కరణల’ పేరిట అమలు లోకి తెచ్చిన విధానాలలో హెచ్చు భాగం ధర్మబద్ధమైన ప్రజాందోళన లను, పౌర హక్కులను, ఫెడరల్‌ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా తొక్కిపెట్టాయి. పైగా, పన్నుల పేరిట, నోట్ల రద్దు పేరిట అణచి వేయడానికి పెక్కు చట్టాలు ఈ ఏడేళ్ల ‘గర్వించదగ్గ పాలన’లోనే ముమ్మరించాయని మరచిపోరాదు. పాలకుల ఈ ప్రజా వ్యతిరేక, న్యాయవిరుద్ధమైన చర్యలను వ్యతిరేకిస్తూ.. పెక్కుమంది రాష్ట్రాల ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తులు, రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు, మాజీ ప్రధాన న్యాయమూర్తులూ అనేక రాష్ట్రాలలో సుప్రీంకోర్టు సహా అనేక రాష్ట్ర న్యాయస్థానాలలోనూ పౌరులు, న్యాయవాదులు ఈ ఏడు సంవత్సరాలుగానూ ‘రిట్లు’ వేస్తూనే ఉండటాన్ని పాలనలో ‘గర్వించదగిన క్షణాలు’గా భావించలేము. 

అంతేగాదు, ఈ ఏడేళ్ల వ్యవధిలోనే జమ్మూ–కశ్మీర్‌ ప్రతిపత్తికి సంబంధించి పాలకులు ఏకపక్షంగా తీసుకున్న నిరంకుశ నిర్ణయం గానీ, నూతన పౌరహక్కుల చట్టాన్ని నేషనల్‌ రిజిస్ట్రేషన్‌ చట్టాన్ని అమలు జరపడం ద్వారా దేశవ్యాప్తంగా వచ్చిన ఆందోళన, వ్యతిరేకత పాలకులు‘గర్వించదగిన క్షణాలు’గా భావించకూడదు. అధికారానికి రాగానే స్విస్‌బ్యాంకులో మూలుగుతున్న, భారత సంపన్నవర్గాలు మేట వేసుకున్న 24 లక్షల కోట్ల అక్రమ నిల్వల్ని తీసుకొచ్చి భారత దేశంలోని ప్రజలకు కుటుంబం ఒక్కింటికి రూ. 15 లక్షల చొప్పున పంచిబెట్టబోతున్నానని చెప్పిన ప్రధానమంత్రి వాగ్దానం నెరవేరకుం డానే పారుపోవడం  ‘గర్వించదగిన క్షణాలు’ కావు. అన్నింటికీ మించి – ‘రాఫెల్‌’ విమానాల కొనుగోళ్ల రహస్యం దేశంలో ఊరూవాడా ఏకమై గుసగుసలకు దారితీసిన పరిణామం ప్రధాని ‘గర్వించదగిన క్షణాలు’గా చెప్పుకోగలమా? అలాగే దేశవ్యాపితంగా పౌరహక్కుల నాయకులపై జరిగిన దాడులను, హత్యలను ప్రసిద్ధ సుప్రీం మాజీ న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులూ ఖండించడం గడిచిన ‘ఏడేళ్ల పాలనలో గర్వించదగిన క్షణాలు’గా చెప్పుకొనగలమా? 

అంతకన్నా మించి గత ఏడేళ్లలోనే పాలకవర్గ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా పెక్కుమంది భారత ప్రభుత్వ పురస్కారాలు పొందిన ప్రసిద్ధ రచయితలు, కవులు, కళాకారులు, చిత్ర నిర్మాతలు, దర్శకులు తమ బిరుద బీరాలను ప్రభుత్వానికి వాపసు చేసిన పరి ణామం నేడు ‘గర్వించదగిన క్షణాలా’ రైతాంగం దృష్టిలో ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ప్రైవేట్‌రంగ ప్రవేశానికి అనుకూలంగా వ్యవ సాయ చట్టాన్ని సవరిస్తూ మోదీ ప్రభుత్వం ఆకస్మికంగా ప్రవేశపెట్టిన మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని నెలల తరబడి రైతాంగం చేస్తున్న ఆందోళన అణచివేతల సందర్భంగా 300 మంది రైతు సత్యాగ్రహాలు ప్రాణాలు కోల్పోవడం నేడు ‘గర్వించ దగిన క్షణాలు’గా భావించగలమా? అంతకన్నా అవమానకరమైన పరిణామం ‘కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం మోదీ చేతుల్లో లేదు, ఆయన అంబానీ, అదానీల ఒత్తిడికి గురవుతున్నం దువల్ల ఆ చట్టాలను రద్దు చేయడం ఆయన చేతుల్లో లేద’ని ఎవరో కాదు, స్వయానా బీజేపీ అనుబంధ యూనియన్‌ (భారతీయ కిసాన్‌ యూనియన్‌: ఏక్తా ఉగ్రహాన్‌) అధ్యక్షుడు జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌ (మార్చి 12) ప్రకటించడం ‘గర్వించదగిన క్షణాలు’ గానే భావించ గలమా? భావించలేమని చెప్పడమే విశ్వకవి రవీంద్రుడు మనస్సును నిర్భయంగా ఉంచుకుని, మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగా లన్న కాలాతీత సందేశం. అవీ– ‘గర్వించదగిన క్షణాలు’ అంటే!!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు