అబద్ధాల నోళ్లకి నాలుకలెన్ని?!

4 Aug, 2020 01:07 IST|Sakshi

రెండోమాట

‘గుడ్లగూబ పగలు చూడ లేదు. కాకి రాత్రివేళల్లో చూడ లేదు. మూర్ఖుడు (అజ్ఞాని) రేయింబవళ్లు చూడలేడు’

ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు మాటలు విన్నప్పుడల్లా ఈ ప్రాచీన సూక్తి గుర్తుకు రాక తప్పదు. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులను (శాసన వేదికగా అమరావతిని, కార్యనిర్వాహక (పాలనా) కేంద్రంగా విశాఖపట్టణాన్ని, న్యాయ పాలనా కేంద్రంగా కర్నూలును) రాష్ట్ర అసెంబ్లీ సుదీర్ఘ చర్చల అనంతరం నికరం చేసిన తరువాత రాష్ట్ర గవర్నర్‌ తుది ఆమోదముద్ర వేశారు. అది చట్టమవుతోంది. దాంతో, రాజ్యాంగపరంగా, శాస నాధికారపరంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు అయి దేళ్ల అనంతరం ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సారథ్యంలో పాలనా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధికి ఒక బలమైన, సరైన ముసాయిదా రూపకల్పన జరిగినట్టయింది. అన్ని హామీల మాదిరే, రాష్ట్ర పరిపాలనా నిర్వహణకు ఒక తాత్విక పునాదికి అనువైన అధికార వికేంద్రీకరణకు పునాదులను పటిష్టం చేసుకోవలసిన ఈ తరుణంలో–ఎన్నికల రంగంలో దారుణాతిదారుణంగా విలువ కోల్పోయి చతికిలపడవలసి వచ్చిన టీడీపీ, అన్నివిధాలా అభాసుపాలైన దాని నాయకుడు చంద్రబాబు మరొకసారి మోకాలడ్డటానికి ఉద్యుక్తుడయ్యారు. ఇప్పుడాయన మన దేశంతోసహా మొత్తం ప్రపం చంలోనే ఏ దేశంలోనూ రెండు, మూడు రాజధా నులు లేవని బుకాయించడానికి సిద్ధమై ప్రచారం చేస్తున్నారు. అందుకే ఆయన విషయంలో పైన పేర్కొన్న ప్రాచీన సూక్తిని ఉదహరించవలసి వచ్చింది.

తన ‘కేంద్రీకరణ’ విధానాల ద్వారా గతంలో బాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని వెలగబెట్టడంలో ఏం జరిగిందో 2002–03 నాటికే ప్రపంచబ్యాంకుకు అనుబంధ సంస్థగా భారతదేశంలో ఫండింగ్‌ ఏజెన్సీగా రాష్ట్రా లకు రుణాలు సమకూర్చిపెడుతూ వచ్చిన డీఎఫ్‌ ఐడీ ఏజెన్సీకి స్పష్టంగా బోధపడింది. ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు పనితీరును, క్యాబినెట్‌తో గానీ, శాసనసభతోగానీ నిమిత్తం లేకుండా ఏక పక్షంగా తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేస్తున్న తీరునూ అది ఒక నివేదికలో పూసగుచ్చి నట్టు వివరించింది. బాబు పనితీరును, నర్మ గర్భంగా బ్యాంకింగ్‌ రుణాలు వినియోగమవుతున్న తీరు తెన్నుల్ని పరిశీలించి నివేదికను సమర్పించ మని ప్రపంచబ్యాంకు అనుబంధ సంస్థ (డీఎఫ్‌ ఐడీ)ని ఇంగ్లండ్‌లోని ససెక్స్‌ యూనివర్సిటీ ఆర్థిక రంగ నిపుణుడు ప్రొఫెసర్‌ జేమ్స్‌ మానర్‌ ద్వారా క్షేత్రస్థాయి విచారణ జరిపించింది. అది సమర్పిం చిన నివేదికలోని ఈ క్రింది కొన్ని అంశాలను ఉదహరిస్తే చంద్రబాబు ధన దుర్వినియోగాన్ని, నిధుల మళ్లింపు కార్యక్రమాల తీరునూ అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఆ ఫండింగ్‌ ఏజెన్సీ నివేదిక చంద్రబాబు పనితీరు గురించి ఇలా పేర్కొంది:

‘‘భారతదేశంలోని రాష్ట్రాలకు రుణాలు సమకూర్చే రుణదాతలు ఆయా రాష్ట్ర ప్రభుత్వా లతో సంప్రదించాల్సి వస్తే ప్రధానంగా సంస్థల స్థాయిలో మాత్రమే ఫండింగ్‌ ఏజెన్సీలు చర్చిం చాల్సి వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి వేరు– ఇక్కడ కేవలం ఒకే ఒక్క వ్యక్తితో, కేవలం ఒక్క చంద్రబాబుతో మాత్రమే ఫండింగ్‌ సంస్థ చర్చించాల్సి ఉంది. ఆయన హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు జరగాల్సిన ప్రభుత్వ ప్రాజెక్టుల ఖర్చుల తాలూకు లెక్కల్ని వాస్తవాలకు అందకుండా అధికారులు పెంచేసి చూపడం జరుగుతోంది. ఆ దొంగ లెక్కలపై అదు పాజ్ఞలు లేవు, ఒకవేళ అలాంటి అధికారుల్ని మంద లించడమూ లేదు. ఇదంతా ఒకే ఒక్క వ్యక్తి (చంద్ర బాబు) చేతిలో అదుపూ ఆజ్ఞా లేకుండా, అధికారం కేంద్రీకృతమై ఉన్నందున సంభవిస్తోంది. ల్యాండ్‌ రికార్డులు కూడా చట్టవిరుద్ధంగా తారుమారు చేయడం జరిగింది. ప్రభుత్వ కాంట్రాక్టులు మంజూరు చేయడంలో భారీ మొత్తాలలో డబ్బు చేతులు మారాయి. ఇలా రూ. 10 లక్షలకు మించిన కాంట్రాక్టులలో వందలాది సందర్భాలలో ఈ అవి నీతి పారింది. మధ్యస్థాయిలో ధారాళంగా డబ్బులు గుంజుకోవడాన్ని అనుమతించారు. ఇదిగాక, కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల పేరిట కేటాయించిన నిధు లలో మూడింట ఒక వంతు నిధుల్ని పక్కకు మళ్లిం చడానికి పార్టీ శాసనకర్తలకు అనుమతినిచ్చారు. ఈ దోపిడీలో చివరికి క్రిమినల్‌ ముఠాలతో కూడా కుమ్మక్కయ్యారు. కాకపోతే ఈ విషయంలో ఉత్తర ప్రదేశ్‌కన్నా ఆంధ్రప్రదేశ్‌ కొంత తక్కువ స్థాయిలో ఉంది. కానీ, ఈ దోపిడీలో మిగతా పెక్కు రాష్ట్రాల కన్నా బాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ సగటు శాతంలో మించిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వం భారతదేశంలోనే అత్యంత కేంద్రీకృతమైన ప్రభు త్వం. రాష్ట్రంలో ఉన్నది ఒక్క వ్యక్తి చేతిలో కేంద్రీ కృతమై ఉన్న పాలనా వ్యవస్థే గాదు, వ్యక్తి నిష్టమైన కేంద్రీకృత పెత్తనం... ఆయనకి జరిగిన పనికన్నా చిత్రగుప్తుని స్థాయిలో చూసే లెక్కలంటే ఇష్టం. ఈ అవినీతి డాక్యుమెంటరీ సాక్ష్యం దాదాపు దొర క్కుండా కనుమరుగు చేశారు. అయితే మా ఇంట ర్వ్యూలలో జరుగుతున్న అవినీతికి విశ్వసనీయమైన సాక్ష్యాలు, బలమైన సాక్ష్యాలు చాలా లభించాయి. ఇక న్యాయవ్యవస్థను ప్రభావితం చేయడం అంటారా, అదో నైపుణ్యంగల విద్య. ఈ నైపుణ్యం నేర్చిన సీఎం (బాబు) న్యాయమూర్తులను లోబర్చుకోవడానికీ ప్రయత్నించగలడు.

ఈ నైపుణ్యం తోనే ఆయన తన విశ్వసనీయమైన అడ్వొకేట్‌ జన రల్‌ ద్వారా తెలివిగా హైకోర్టును హ్యాండిల్‌ చేయగలిగారు. దాంతో కోర్టుతో వ్యవస్థాగతమైన సంబంధాలు ఏర్పడ్డాయి. అలా కోర్టును తగినంత ప్రభావితం చేయగలిగారు. చివరికి ఈ ప్రభావం ఏ స్థాయికి చేరుకుందంటే తనకు సన్నిహితులైన ఇద్దరు వందిమాగధులైన న్యాయవాదులకు హైకో ర్టులో స్థానం కల్పించగలిగారు. ఈ పద్ధతి న్యాయ వ్యవస్థ సంస్కరణకు దోహదపడదు గానీ దాన్ని నిపుణ రాజకీయంగా చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి పద్ధతులు, సత్వర న్యాయం సాధించడానికి పేద వర్గాలకు లీగల్‌ న్యాయం ఒనగూర్చడానికి ఎంత మాత్రం తోడ్పడవుగాక తోడ్పడవు’’. ఇదీ చంద్ర బాబు పాలనపైన ప్రపంచబ్యాంక్‌ నివేదిక సారాంశం. ఈ అనుభవం దృష్ట్యా, బాబు వల్ల ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడిన దుర్గతిని అంచనా వేసుకుని, విభక్త ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణ యజ్ఞంలో అడ్డుపుల్లలు పేర్చాలని చూస్తున్న ఆయన దుష్టచింతనను తుత్తునియలు చేయవలసిన అవసరం ఉందని మరిచిపోరాదు. ప్రపంచంలో ఏ దేశానికీ రెండు, మూడు రాజధా నులు లేవన్న బాబు అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేసే సమాచారం ఇక్కడ చూడవచ్చు. బొలీవి యాలో లా పాజ్,  నుక్రీలలో రెండు రాజధానులు.  దక్షిణాఫ్రికాలో కేప్‌టౌన్, ప్రిటోరియా, బ్లోమ్‌ ఫాంటైన్‌;  చీలీలో శాంటియాగో, లాల్పరాయిసో (శాసన రాజధాని); చక్‌రిపబ్లిక్‌లో ప్రేగ్, బర్నో;  మలేసియాలో కౌలాలంపూర్, పుత్రజయ;  నెదర్లాండ్స్‌లో ఆమ్‌స్టర్‌డామ్, హేగ్‌; శ్రీలంకలో కొలంబో, పొట్టే.. ఇలా దాదాపు పది దేశాలలో రెండు లేక మూడు  రాజధానులు ఉన్నాయి. ఇక భారత్‌లో కనీసం ఆరు రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్న సంగతిని పట్టికలో చూడవచ్చు.

అందువల్ల ఇప్పటికైనా బాబు వందిమాగ ధులు తప్పుడు ప్రచారాన్ని మానుకోవడం శ్రేయ స్కరం. రేపో మాపో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ లాగా, పరిమిత సంఖ్యలో ఉన్న మిగతా టీడీపీ చోటామోటా నాయకులు కూడా బీజేపీ ‘తీర్థంకరులు’గా ‘కాషాయం’లో మునకవేసే అవకాశం లేకపోలేదు. అబద్ధాలతో అసత్య ప్రమా ణాలతో కాలం వెళ్లబుచ్చుకునే రోజులు కావవి. అబద్ధాల నోళ్లలో వీశెల కొద్దీ సున్నంకొట్టే రోజులివి అని తెలుసుకోవడం మంచిది.

భారత దేశంలో రెండేసి రాజధానులు ఉన్న  రాష్ట్రాలు
ఛత్తీస్‌గఢ్‌    రాజధాని : రాయ్‌పూర్, హైకోర్టు : బిలాస్‌పూర్‌
కేరళ    రాజధాని : తిరువనంతపురం, హైకోర్టు : కొచ్చిన్‌
రాజస్తాన్‌    రాజధాని: జైపూర్, హైకోర్టు : బోథ్‌పూర్‌
ఉత్తరాఖండ్‌    శీతాకాల రాజధాని : డెహ్రాడూన్, వేసవి రాజధాని : గైర్‌సన్‌
మహారాష్ట్ర    ముంబై/ నాగపూర్‌
ఉత్తరప్రదేశ్‌    రాజధాని : లక్నో, హైకోర్టు : అలహాబాద్‌ 

abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

మరిన్ని వార్తలు