యువత రక్షణే తక్షణ బాధ్యత!

27 Apr, 2021 00:28 IST|Sakshi

రెండో మాట

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తివల్ల కలిగే ఉపద్రవంకన్నా కంగారు పర్చే వార్తలను నిత్యం ప్రచారంలో పెట్టడం ప్రజలలో తీవ్ర ఆందోళనలకు కారణ మవుతోంది. ఈ భయాందోళనలు ఏ స్థాయికి చేరాయంటే నిజమైన రోగులు మరణించిన వార్త విన్న వెంటనే కుప్పకూలి అక్కడికక్కడ చనిపోయిన ఉదంతాలు కోకొల్లలు. పైగా కోవిడ్‌–19 రెండవసారి ఉధృతితో వైరస్‌కి యువకులు ఎక్కువగా గురవుతున్నారు. నేడు ఆసుపత్రుల్లో ఊపిరి కోసం వెంటి లేటర్స్‌పై ఉన్నవాళ్లలో 30 శాతం యువకులే, వీరు 30–45 ఏళ్లవాళ్లే. ఆరోగ్య సమస్యల కారణంగా తలెత్తిన ప్రాణవాయువు పుష్కలంగా అందించలేని దుస్థితికి దేశం చేరిందంటే– నిస్సందేహంగా పాలకుల అలసత్వమే కారణం, ఈ దశలో జాతి కుసుమాలుగా ఉన్న యువత రక్షణ మన తక్షణ బాధ్యత!

‘‘నేడు ఆసుపత్రుల్లో ఊపిరి కోసం వెంటి లేటర్స్‌పై ఉన్నవాళ్లలో 30 శాతం యువకులే, వీరు 30–45 ఏళ్లవాళ్లే. కోవిడ్‌–19 రెండవసారి ఉధృతితో విషక్రిమి (వైరస్‌)కి యువకులు ఎక్కువగా గురవుతున్నారు. మూడు వారాల్లో వైరస్‌ తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నాం’’.
– డాక్టర్‌ రాజారావు, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ 

‘‘కోవిడ్‌–19 నీరెండలాంటి సాత్వికమైన రోగం. దానికి ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. ఈ కంగారులో ఇంజెక్షన్లను, మందుల్ని, ఆక్సిజన్‌ సిలిండర్‌లను ఇళ్లలో దాచేసుకుంటున్నారు. ఇది అనవసర భయం. ఎందుకంటే కోవిడ్‌ అనేది సాధారణ రోగం. ఇది తాకితే లేదా స్పర్శ తగిలితే వచ్చేది కాదు. ఇది సాధారణ రోగం. ఇది వచ్చిన వారిలో 85–90 శాతానికి జ్వరం, జలుబు, ఒంటినొప్పులు, దగ్గు, తలనొప్పి ఉండటం సహజం. సాధారణ మందుల తోనే మీరు యోగా తదితర శారీరక ఎక్సర్‌సైజెస్‌ ద్వారా వారం పదిరోజుల్లోనే మామూలు స్వస్థతకు చేరుకుంటారు. ఈ మాత్రానికే మీరు ఇళ్లలో రెమిడెసివిర్‌లు, ఆక్సిజన్‌ సిలెండర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు’’.
– డాక్టర్‌ రణదీప్‌ గులేరియా, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ప్రకటన

ప్రజా బాహుళ్యాన్ని సర్వత్రా కంగారుపరిచే విధంగా రకరకాల ప్రచా రాలతో ప్రసార మాధ్యమాలు సహా రకరకాల వార్తలను ఒక మేరకు అదుపు తప్పి మరీ ప్రచారంలో పెట్టడంవల్ల కూడా దేశంలో వ్యాధి వ్యాప్తివల్ల కలిగే ఉపద్రవంకన్నా ప్రజలలో తీవ్ర భయాందోళనలకు కారణమవుతోంది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వపరంగా కనీసం ప్రాణ రక్షణకు అవసరమైన కనీస ఆక్సిజన్‌ సిలిండర్ల ఉత్పత్తి పంపిణీలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోనందువల్ల కోవిడ్‌–19కి సంబంధించి ప్రజల్లో భయాందోళనలు మరింతగా పెచ్చరిల్లుతున్నాయి. ఇవి ఏ స్థాయికి చేరాయంటే నిజమైన రోగులైన తమవాళ్లు మరణించిన వార్త విన్న మరుక్షణంలోనే కుప్పకూలి అక్కడికక్కడనే చనిపోయిన ఉదం తాలు, కరోనాని అంటురోగంగా భావించినందున కుటుంబంలోని ఎవరైనా సాధారణంగా మరణించినా వారి దగ్గరకు వెళ్లలేక భీతావ హులైపోయి రోగగ్రస్థులవుతున్న దశలో ఇప్పుడు మనం ఉన్నాం. వైద్య నిపుణులు, రోగ నిరోధక శాస్త్ర నిపుణులు, క్రిమి శాస్త్ర ఆచా ర్యులు తదితర ఉద్దండులు భరోసా ఇస్తూ పాటించవలసిన జాగ్రత్త లను పదే పదే సూచించి చైతన్యవంతుల్ని చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నా– మన రాజకీయ నాయకులు కోవిడ్‌పై శాస్త్రీయ పద్ధతుల్లో సరైన అవగాహన కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు. 

ఈ ప్రస్తుత దుస్థితిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, యువ నాయ కుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్‌ పలుసార్లు వివరించారు. ప్రజా బాహుళ్యాన్ని చైత న్యవంతం చేయడంలో కోవిడ్‌ రోగాన్ని ‘వస్తుంది, పోతుంది’ మన జాగ్రత్తతో మనం ఉండటమే పరిష్కారంగా వర్ణించి భయాందోళ నలు తొలగించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. కాగా, దేశంలో రాజ కీయ పాలకుల, నాయకుల పనితీరు, ప్రవర్తన గురించి తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల ఇలా ఎండగట్టవలసి వచ్చింది: ‘‘గతంలో రాజ కీయ నాయకులు అంటే సమాజంలో గొప్ప గౌరవ భావముండేది, విలువలు, విశ్వాసం ఉండేవి. కానీ రాన్రానూ నాయకుల మీద, రాజ కీయ నాయకులమీద ఎలాంటి భావన వస్తూందో చెప్పాల్సిన అవసరం లేదు’! ఈ భావన జనంలో పెరగడానికి తాజా ఉదాహరణ. ఇనుము, ఉక్కు పరిశ్రమలకు, సంబంధిత ఖనిజ సంపదకు ప్రపం చంలోనే శతాబ్దాల నాడే కీర్తి ప్రతిష్టలు పొందిన భారతదేశానికి నేడు దేశ ప్రజలకు ఆరోగ్య సమస్యల కారణంగా తలెత్తిన ప్రాణ వాయువు పుష్కలంగా అందించ లేని దుస్థితికి చేరిందంటే– నిస్సందేహంగా పాలకుల అలసత్వం, విధాన నిర్ణయాలలో దేశ పాలనా నిర్వహణలో ప్రజాబాహుళ్య ప్రయోజనాలపట్ల పాటించి తీరాల్సిన ప్రాధాన్యతల క్రమానికి అంతరాయం ఏర్పడటమే కారణం. 

దేశ రాజ్యాంగ లక్ష్యాలతో, ప్రకటిత ప్రాధాన్యతలతో నిమిత్తం లేకుండా, పేద, దళిత, మధ్యతరగతి ప్రజా బాహుళ్యం బాగోగులకే ప్రాధాన్యం ఇవ్వాలన్న రాజ్యాంగ ఆదేశిక సూత్రాల విస్పష్ట ప్రకట నను విరుద్ధంగా నేటి బీజేపీ పాలనా వ్యవస్థ ముందుకు సాగుతోంది. దాని ఫలితమే వరుసగా రాజ్యాంగ లక్ష్యాలకు పరమ విరుద్ధంగా, బాహాటంగా– దేశంలోని ప్రభుత్వరంగ పరిశ్రమలను, బ్యాంకులను ఒక్కొటొక్కటిగా ‘రద్దుల పద్దు’లోకి నెట్టేశారు పాలకులు. ఈ స్థితిలో ప్రజారోగ్య రక్షణకు కనీస అవసరమైన ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసుకోగల అవకాశాలు దేశంలో పుష్కలంగా ఉన్నా ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ లాగా పాలనా వ్యవస్థ వ్యవహరిస్తోంది. ఫలితంగానే నేడు దేశ దేశాలవద్ద స్వతంత్ర భారతం అస్వతంత్ర శిశువుగా అంగలార్చవలసి వస్తోంది. ఇప్పుడుగాదు, నేటికి అయిదు మాసాలనాడే పార్లమెంటరీ ఉపసంఘం కోవిడ్‌ ఉధృతి దృష్ట్యా దేశ ఆక్సిజన్‌ అవసరాల గురించి ప్రస్తావించి, తక్షణ ఆక్సిజన్‌ ఉత్పత్తికి యూనిట్లను నిర్మించాలని కేంద్ర పాలకులకు సూచించింది. కానీ ఆ ప్రతిపాదనను విస్మరించిన కేంద్రం నేడు విదేశాలవైపు అంగలార్చవలసి వస్తోంది. ఈ దుస్థితి చివరికి ఏ స్థాయికి చేరిందంటే ఇంజెక్షన్‌ల ఉత్పత్తికి అవసరమైన ఫార్మా కంపె నీల ముడిసరుకు కోసం కూడా విదేశాలపై ఆధారపడి రావలసి రావడం. ఈ ముడి సరుకును భారత్‌–చైనాల మధ్య సరిహద్దు వివా దాల వల్ల అంతకుముందు ఇరుగుపొరుగు చైనా నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. అదీ ఆగిపోయింది. 

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒకప్పుడు ఫ్రాన్స్‌లో నెపోలియన్‌ అనుసరించిన ప్రత్యేక ప్రజా వ్యతిరేక, వినాశకర నిబంధనావళి (నెపోలియన్‌ కోడ్‌) గుర్తుకు వస్తోంది: ఫ్రాన్స్‌లోని పేద రైతాంగ, సన్నకారు, చిన్నవ్యాపారుల అధీనంలో సువిశాలమైన సుక్షేత్రాలుగా ఉన్న భూములన్నిటినీ గుంజేసి, ఫ్రాన్స్‌లోని మోతుబరులైన భూస్వా ములకు, సంపన్న పారిశ్రామికవేత్తలకు వాటిని ధారాదత్తం చేశాడు. ఇలాంటి పరిణామాన్నే భారత జాతీయోద్యమ తొలితరం విశిష్ట నాయకుడైన దాదాభాయి నౌరోజీ భారత సంపదను బ్రిటిష్‌ వలస పాలకులు ఎలా దోచుకుపోతూ దేశీయ రైతు, వ్యవసాయ కార్మికుల్ని బికారులుగా చేస్తున్నారని గొంతెత్తి నిరసించాడు. అలాగే, ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం తర్వాత టెక్నాలజీ పేరిట పరిశ్రమలకు హంగులు ఏర్పరిచే పేరిట భారీ ఎత్తున నిరుద్యోగ పర్వానికి తెరతీసిన పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ మహాకవి షెల్లీ చిక్కుబడిపోయిన శ్రామిక వర్గాన్ని ఉద్బోధిస్తూ ‘ఇంగ్లండ్‌ ప్రజలకు’ (టు ది మెన్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌) ఒక పాటను సందేశంగా విడుదల చేశాడు. అది విశ్వవ్యాపిత కావ్యంగా ప్రఖ్యాతిగాంచింది. చదవండి! ‘విత్తనం నాటింది నువ్వు, దోచుకుపోయేది మరొకడు సంపద సృష్టి నీవంతు, దాన్ని అనుభవించేది మరొకడు బట్టలు నేయడం నీవంతు, తేరగా అనుభవించేది ఇంకొకడు ఆయుధాల తయారీ నీవంతు, వాటిని ఉపయోగించేది మరొకడు కానీ.. ఒక్క మాట సుమా! విత్తనం నీవే నాటు–ఏ నిరంకుశుడికీ దాన్ని దక్కనివ్వకు సంపద సృష్టించు–కానీ మరొకడికి పంట దక్కనివ్వొద్దు బట్టలు నేస్తూనే ఉండు–కానీ సోమరిపోతులకు అందనివ్వకు ఆయుధాలు తయారుచేస్తూ – వాటిని నీ రక్షణకు మాత్రమే ఉపయోగించు’! ఇంతకూ ‘కోవిడ్‌’ చాటున రకరకాల ‘వ్యాక్సిన్‌’ల పేరిట బడా ఫార్మా కంపెనీలు ఎన్ని రూ. లక్షల కోట్లకు మోసులెత్తి ఉంటారో సామాన్యుల ఊహకి అందని అంచనా. ఈ దశలో కంగారులో ఉన్న మన జాతి కుసుమాలుగా ఉన్న యువత రక్షణ మన తక్షణ బాధ్యత!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు