కరోనా పేరుతో కుబేర వర్గాల ఆట

23 Mar, 2021 00:28 IST|Sakshi

రెండో మాట

ఏడాది కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనేవుంది. నాటకంలోని పాత్రధారుడిలా రోజుకో కొత్త రూపును తీసుకుంటూ శాస్త్రవేత్తలకు సవాల్‌ విసురుతూనే ఉంది. అయితే ఈ అంటువ్యాధి మూలాలను అనుమానాలు తీరేలా ఇంతవరకు ఎవరూ నిర్ధారించలేకపోయారు. కానీ సామ్రాజ్యవాద దేశాలు సాగిస్తున్న యుద్ధాల బీభత్సంలోంచే సూక్షా్మవతారాలు పుట్టుకొస్తున్నాయని మేధావులు హెచ్చరిస్తున్నారు. దీనికంటే బీభత్సం ఈ ఉధృతిలోనే ప్రపంచ కుబేరులు తమ సంపదను కొండల్లాగా పెంచుకుంటూపోవడం; ప్రపంచంలోని పేద వర్గాల ప్రజలను అన్నిరకాలుగానూ తమ గుప్పిట్లోకి తీసుకోవడం.

కోవిడ్‌ ఇకమీదట ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజాల మాదిరిగానే సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశాలు కానవస్తున్నాయి. శ్వాసకోశ వ్యాధులన్నీ ఆయా రుతువులను బట్టి, గాలిలో నాణ్యతను బట్టి వస్తాయి. సమశీతోష్ణస్థితి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఇలాంటి వ్యాధులు విజృంభి స్తుంటాయి. కరోనా, ఫ్లూ ఇంచుమించుగా ఒకేరకం వ్యాధులు కావడంతో ప్రస్తుత పరిస్థితి కొన్నేళ్లు కొనసాగితే కరోనా కూడా సీజనల్‌ వ్యాధిగా మారుతుంది.

కరోనా వ్యాప్తి గురించి ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ కేంద్రం ఏర్పాటు చేసిన 16 మంది ప్రసిద్ధుల అధ్యయన బృందం వెల్లడించిన తాజా నివేదిక(జెనీవా: 18 మార్చి 2021).ఈ బృందానికి ప్రసిద్ధ శాస్త్రవేత్త జెయిట్‌ చిక్‌ నేతృత్వం వహించారు.సరిగ్గా సంవత్సరంగా కోవిడ్‌–19 వ్యాధి సరికొత్త  ‘సూక్ష్మావతారం’గా లక్షల సంఖ్యలో ప్రాణాలు తోడుకుంటూ ఉంది. ఈ అంటువ్యాధి అసలు మూలాలను ఇప్పటికీ శాస్త్రవేత్తలు  అనుమానాలకు తావులేకుండా నిర్ధారించలేక పోతున్నారు. అయినా  నాటకంలో కొందరు పాత్రధారులు రూపాలు మార్చుకొని ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేసిన విధంగా, వైరస్‌ తన రూపాలను మార్చుకుంటోంది. కొత్త లక్షణాలతో 5,000 రూపాలు బయట పడుతూండటాన్ని వైద్య శాస్త్రవేత్తలు, క్రిమిశాస్త్ర పరిశోధకులు శ్రద్ధగా గమనిస్తున్నారు.

అదే సమయంలో అంతమాత్రాన ఎవరూ అజాగ్రత్తగా ఉండరాదనీ, ఎక్కడికి వెళ్లినా మూతికి ఆచ్ఛాదన (మాస్క్‌) విధిగా ఉండి తీరాలనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరికలు చేస్తోంది. ప్రకృతి రీత్యా వాతావరణంలో వచ్చే మార్పులకు తోడు, ప్రపంచ దేశాల సంపదపైన, అస్వతంత్ర, నూతన స్వతంత్ర దేశాలపైన తమ పీడనా దోపిళ్లను కొనసాగించడానికి ప్రపంచ పాత, కొత్త వలస సామ్రాజ్యవాద రాజ్యాలైన బ్రిటన్, అమెరికా, యూరోపియన్‌ యూని యన్లు దఫదఫాలుగా కొనసాగిస్తున్న యుద్ధాలు కూడా ఎబోలా, సార్స్‌ లాంటి క్రిములు ప్రకోపించడానికి కారణం అవుతున్నాయి. 

వర్ధమాన దేశాల సమస్యల పైన సుప్రసిద్ధ పరిశోధకుడైన ప్రొఫెసర్‌ మైఖేల్‌ చోసుడొవస్కీ తాజాగా వెల్లడించిన పలు అంశాలు మనకు కనువిప్పు కల్గించేలా ఉన్నాయి. ‘ఏకధ్రువ ప్రపంచం’ పేరిట, దేశాల ఆర్థిక వ్యవస్థల ప్రపంచీకరణ పేరిట ఐక్యరాజ్యసంస్థను ఆసరాగా చేసుకొని ప్రపంచ కుబేర వర్గాల తరపున పాత, కొత్త సామ్రాజ్యవాద ప్రభుత్వాలు మరి పదేళ్లలో (2030) ఏం చేయబోతున్నాయో చోసుడొవస్కీ ఇలా  వివరించారు: ‘2030 సంవత్సరానికల్లా ప్రపంచ కుబేర వర్గాలు ప్రపంచవ్యాపిత సర్దుబాటు (గ్లోబల్‌ ఎడ్జెస్ట్‌మెంట్‌) పేరిట ప్రపంచ సంపదను తమ గుప్పెట్లోకి గుంజుకోబోతున్నారు. ఆ క్రమంలోనే ఈ కుబేరులు ప్రపంచంలో పెక్కు రంగాలకు చెందిన ప్రజలను దోచేసుకుని శంకరగిరి మాన్యాలు పట్టించనున్నారు!’ అదే సమయంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటిరెస్‌ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారిని ఆరోగ్య సంక్షోభానికి మించిన సంక్షోభంగా ప్రకటించారు.

కానీ ఈ సంక్షోభానికి అసలు కారణాల్ని విశ్లేషించి, అర్థవంతమైన వివరణను సమితి ప్రజలకు అందించలేకపోయింది. ఇందుకు ఈనాటి ఐక్యరాజ్యసమితి ఉదాసీన వైఖరే ప్రధాన కారణమని చోసుడొవస్కీ కుండబద్దలు కొట్టి చెప్పారు. అయినా 2020 సెప్టెంబర్‌లో సమితి ప్రపంచ దేశాలకు అందజేసిన నివేదికలోని అంశాలు మన కళ్లు తెరిపించగలగాలి. ‘ఇప్పటికే లక్షలాది మంది ప్రపంచ ప్రజలు తమ జీవితాలను కోల్పోయారు. మరికొన్ని లక్షల కోట్లమంది ప్రజల జీవితాలు కకావికలమైపోయాయి. ఆరోగ్య సమస్యకు తోడు అసంఖ్యాక దేశాలలో, ప్రజల మధ్య విస్తారంగా ఉన్న అసమానతలు పదింతలు పెరిగిపోయాయి. ఫలితంగా వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘజీవులుగా, సమాజాలుగా ఎక్కడికక్కడే జీవనం చెల్లాచెదురై పోయింది. ఇది సమాజంలోని ప్రతీ మనిషిని, చివరికి ఇంకా పుట్టని బిడ్డలపైన కూడా తీవ్ర ప్రభావం కల్గిస్తుంది. దేశాల మధ్య, జాతుల మధ్య ఆ మాటకొస్తే వ్యవస్థల మధ్య ఉన్న బలహీనతల్ని ఇది మరింత ప్రకోపింపజేస్తుంది.

పొంచివున్న ఈ సమష్టి ప్రమాదాలకు సమన్వయ పూర్వకమైన ప్రపంచ వ్యాపిత స్పందన అవసరాన్ని ఈ సంక్షోభం కలిగించింది. అయితే, ప్రపంచవ్యాపితంగా, సామాజికంగా ఆర్థికంగా సాగుతున్న వినాశనానికి దారితీసిన ఈ పరిణామాలపైన సమితి భద్రతా సంఘం ఇంతవరకూ చర్చించకుండా మూగనోము పట్టింది. దీనికి కారణం అందులోని అయిదు శాశ్వత సభ్యదేశాలే! కానీ అదే సమయంలో ప్రపంచ కుబేర వర్గాల ప్రయోజనాలను కాపాడే ‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌’ ప్రతిపాదించిన ప్రపంచవ్యాపిత ‘ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్య వ్యవస్థ సలహాకు మాత్రం ఐక్యరాజ్యసమితి అప్పనంగా ‘తాతాచార్యుల ముద్ర’ వేసి కూర్చుందని మరచిపోరాదు.

అందుకే ప్రొఫెసర్‌ చోసుడోవస్కీతో పాటు, ప్రొఫెసర్‌ చామ్‌స్కీ (ప్రసిద్ధ అమెరికన్‌ భాషా శాస్త్రవేత్త) కరోనా వైరస్‌ సామ్రాజ్యవాద పాలకులు సృష్టించిన యుద్ధాల కారణంగా వాతావరణం కలుషితమై పుట్టుకొచ్చిందని అభిప్రాయపడుతున్నారు. జింక్, సి విటమిన్, డి–3, బీటాగ్లుకాన్, ఎన్‌.ఎ.సి. లాంటి తక్షణ ప్రత్యామ్నాయాల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యభాగ్యం కల్గించవచ్చునని డాక్టర్‌ పాల్‌ క్రెగ్‌ రాబర్ట్స్, మన దేశంలోని సీసీఎంబీ లాంటి పరిశోధనా సంస్థల పలువురు విశ్లేషకులు సూచించారు. అయినా ఈ వైరస్‌ని ప్రతిఘటించే పేరిట ఔషధ గుత్త కంపెనీలు ‘ఆలసించిన లాభాలకు ఆశాభంగం’ అని భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యరంగంలో సాగుతున్న పోరాటం – ధనికవర్గ వ్యవస్థలో పాతుకుపోయిన కొన్ని ఫార్మా కంపెనీలకూ, జనాభాలో ఎక్కువ శాతం ఉన్న అసంఖ్యాక పేద, మధ్యతరగతి ప్రజా బాహుళ్య ప్రయోజనాలకూ మధ్యనేనని గుర్తించాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ‘పునర్‌వ్యవస్థీకరణ’ అన్నా, ‘ఏకధృవ ప్రపంచం’ అన్నా, క్వాడ్‌ అన్నా, ఆసియా పసిఫిక్, యూరోపియన్‌ యూనియన్‌ కూటమి అన్నా ఒకే తానులోని ముక్కలు.

సామ్రాజ్యవాదం మానవ ముఖం తగిలించుకుంటే తప్ప బతికే రోజులు ముగుస్తున్నాయి. సరైన వ్యాక్సిన్‌ రావడానికి అయిదు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుందని క్రిమిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మూడు దశల పరీక్షలు పూర్తిగా నెగ్గితే గానీ వ్యాక్సిన్‌ ప్రయోగించరాదని నిపుణులు మొత్తు్తకుంటున్నారు. అయినా ఒక వైపు నుంచి బడా ఫార్మా కంపెనీలు, మరోవైపు నుంచి పాలకవర్గాలు పరస్పర ధన ప్రయోజనాలతో కరోనా కట్టడి పేర బేరసారాలు ప్రారంభించాయి. ఉదాహరణకు కరోనా నంజుడు మొదలైన తర్వాత, సెకండ్‌ వేవ్‌ కరోనా ముట్టడించక ముందే 2020  మార్చి 18 నుంచి 2020 అక్టోబర్‌ 8 మధ్య ఒక అమెరికన్‌ మహా కోటీశ్వరుడు తన సంపదను 850 బిలియన్‌ డాలర్లకు పెంచేసుకున్నారని అంచనా. అక్కడే కాదు, మన దేశంలోనూ కోవిడ్‌ పైనే సమయాన్ని చాటు చేసుకుని సుమారు 40 మంది కోటీశ్వరులు తమ సంపదను కొండలుగా పెంచేశారు. గత పదేళ్లలో పెరిగిన వీరి సంపదకన్నా ఒక్క 2020 కోవిడ్‌ ఉధృతిలోనే 83 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈలోగా మరో వైపు నుంచి దొంగ సన్యాసులు కూడా రోగుల్ని మోసగిస్తుంటారని పానుగంటివారి సాక్ష్యం. ఎలా? భగవత్‌ కటాక్షం ఉంటే రోగికి వైద్యుని అవసరం లేదు. భగవత్‌ కటాక్షం లేకపోతే వైద్యుని అవసరం లేదు. కాబట్టి అసలు  వైద్యుడే అవసరం లేనట్లు కన్పిస్తోందని ఓ ‘విట్టు’గా ఒక సందర్భంలో చమత్కరించారు! 

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు