ఇప్పుడు గుర్తొచ్చిన జాతీయ ప్రయోజనం!

23 Nov, 2021 00:46 IST|Sakshi

రెండో మాట

వ్యవసాయ సంస్కరణ చట్టాల రద్దుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనతో భారత రైతాంగం చరిత్రాత్మక విజయం నమోదు చేసింది. పంజాబ్, హరియాణాతో పాటు అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కూడా త్వరలో ఎన్నికలు జరుగబోతున్నందున రైతు ఉద్యమం కొనసాగితే అసలు ఉనికి కే ప్రమాదం అని కేంద్రం గ్రహించింది. దాని ఫలితమే– కొత్త సాగు చట్టాల రద్దు నిర్ణయం. కానీ వచ్చే పార్లమెంటు సమావేశంలో చట్టాల ఉపసంహరణ బిల్లు అనంతరం తమ నిర్ణయం అమలులోకి వస్తుందని మోదీ పేర్కొన్నారు. దీంతో ఆందోళనల రద్దుకు రైతులు ససేమిరా అన్నారు. ఎన్నికలకూ, సమస్యలకూ ముడిపెట్టడం అలవాటైపోయిన దేశం కాబట్టి రైతుల అప్రమత్తతే వారికి శ్రీరామరక్ష.

త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ ఎన్నికలను  దృష్టిలో పెట్టుకుని పాలక పార్టీ నాయకులిద్దరి మధ్య జరిగిన సంభాషణను ప్రసిద్ధ వ్యంగ్య చిత్ర కారుడు మంజుల్‌ ఎలా నమోదు చేశాడో చూడండి: ‘జాతీయ ప్రయో జనాల దృష్ట్యా మనం చట్టాల్ని రూపొందించాం కదా! అదే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆ చట్టాల్ని తిరిగి మనమే రద్దు చేద్దాం! ఏమంటావ్‌?’ అని!

ఇంక అనేదేముంది– అది ‘నాలుక గాదు, తాటిమట్ట’ అంటారు! ఎందుకంటే మడతపడిన నాలుకను సరిచేయడం అంత తేలిక కాదు. కాబట్టే సంవత్సరం పైగా ఒక్క పంజాబ్, హరియాణా రైతులే కాకుండా యావద్భారత రైతాంగ ప్రతినిధులు... బీజేపీ పాలకులు తలపెట్టిన రైతాంగ వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని « జరుపుతున్న ధర్నాలు జయప్రదమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవడానికి పాలకులు రైతుల నెత్తిన మోపిన ప్రమాదకర షరతు ఒకటుంది. వచ్చే పార్లమెంటు సమావేశంలో చట్టాల ఉపసంహరణ బిల్లు అనంతరం తమ నిర్ణయం అమలులోకి వస్తుందని! మధ్యలో ఈ ఆ షరతు ఎందుకు? అంటే పంజాబ్, హరియాణాతో పాటు తమ ఉనికిని ప్రాణం పోస్తున్న ఉత్తరప్రదేశ్‌లో కూడా త్వరలో ఎన్నికలు జరుగ బోతున్నాయి. 

ఈ తరుణంలో 2019 ఎన్నికల తరువాత ఎన్నడూ లేనంత ఫికరు బీజేపీ పాలకులను అతలాకుతలం చేస్తోంది! దానికితోడు బీజేపీలోనే తమ భవిష్యత్తుపై అలుముకుంటున్న చీకట్లను తొలగించుకోవడానికి ఒక వర్గం పార్టీ ఉనికికోసం ఎత్తుగడలు మార్చుకొనే యత్నంలో ఉంటోంది. మరొకవర్గం మొండిగా రైతాంగ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోడానికి ఇప్పటికీ ససేమిరా అంటోంది.

ఈ వైరుధ్యాల మధ్య నుంచే ప్రధాని నరేంద్రమోదీ చట్టాల ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించారు. పైగా ఇంతవరకూ రైతాంగాన్ని తాను మనోవేదనకు గురిచేసినందుకు ‘క్షమాపణ’ వేడుకుంటున్నానని చెప్పడం హర్షించదగిన పరిణామం. అయితే పాలకుల మొండి వైఖరి ఫలితంగా ప్రాణాలు కోల్పోయిన సుమారు 700 మంది రైతు ఆందోళనకారుల్ని గురించి మాత్రం ప్రధానమంత్రి ప్రకటనలో కనీస విచారం కూడా వ్యక్తం కాకపోవడం ఆశ్చర్యకరం. అందుకనే చట్టాల ఉపసంహరణ ప్రకటనను తమ విజయంగా ఆహ్వానించిన రైతాంగ ప్రజలు పోరాట బాట వీడేది లేదని తేల్చిచెప్పారు.

తమ పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ ప్రత్యేక చట్టాన్ని పాలకులు ప్రకటించేదాకా, ఇతర రైతాంగ సమస్యల పరిష్కారం గురించి సంతృప్తికరమైన వివరణను పార్లమెంటులో ప్రకటించేదాకా తాము విశ్రమించేది లేదనేశారు. ‘మనల్ని  పాలిస్తున్న పాలకులేమీ రుషి తుల్యులు ఏమీ కారు. వారెప్పుడూ తమ రాజకీయలబ్ధిని లాభనష్టాల కోణం నుంచే ఆలోచిస్తూంటార’ని వీరు వ్యాఖ్యానించారు. 

ఈ లాభనష్టాల నాణానికి విరుద్ధంగా వారి ఆలోచనా పంధా కొనసాగి ఉంటే 700 మంది రైతుల ప్రాణాలు కోల్పోయేదాకా పాలకులు గుడ్లప్పగించి చూస్తుండేవారు కాదు. అందుకే ప్రధాని తాజా ప్రకటనను మంచివైపుగా పడిన ఒక అడుగు అనిమాత్రమే పరిగణించాలని రైతు ఉద్యమ ప్రతినిధుల్లో ఒకరైన ధర్మేంద్ర మాలిక్‌ చెప్పారు. కాగా బీజేపీ పాలనకు సైద్ధాంతిక నాయకత్వం వహిస్తున్న ఆరెస్సెస్‌కు అనుబంధంగా ఉన్న ‘భారతీయ కిసాన్‌ సంఘ్‌’ వ్యవ సాయ చట్టాలను ఉపసంహరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం గమనార్హం.

రైతాంగ ప్రయోజ నాలకు దీర్ఘకాలంలో నేటి ప్రభుత్వ నిర్ణయం (చట్టాల ఉపసంహరణ) నష్టం కలిగిస్తుందని ఆరెస్సెస్‌ వాదించింది. అందువల్ల పాలక వ్యవస్థకు పట్టుకున్న ప్రధా నమైన చీడ అంతా వేరే ఉందని రైతాంగ ఉద్యమకారులు భావించ డమే కాదు... పార్లమెంటులో పాలకుల తుది నిర్ణయం వెలువడేదాకా తాము సమ్మెను మాత్రం ఉపసంహరించబోమని స్పష్టం చేశారు. 

ఎందుకంటే, దీపం పేరు చెప్పి, కొవ్వొత్తుల ‘మహిమ’ చూపి ప్రజల్ని మోసగించే రోజులు పోయాయి. ‘తీతువుపిట్ట’ల్లాంటి మధ్య వర్తుల రాయబారాలకూ, మోసాలకూ లోనయ్యేకాలమూ అంతరి స్తోంది. దీపం పేరు చెబితే చీకటి పోదు! అయిదు దశాబ్దాలుగా రైతన్నల వెతల్ని దగ్గరగా గమనిస్తున్నానని’ ప్రధాని మోదీ చెబుతూనే ఇంకోవైపునుంచి ‘అన్నదాతల సాధికారత కోసమే సాగు చట్టాలు తీసుకొచ్చామ’ని సమర్థించుకున్నారు.

కాబట్టి, పార్లమెంటులో సాగు చట్టాలను ఉపసంహరించే దాకా రైతాంగం విశ్రమించబోదని అర్థ మవుతోంది! అర్ధంతరంగా వ్యవసాయం, రైతాంగం నడ్డి విరిచే మూడు చట్టాలను రద్దు చేస్తూనే మరోవైపునుంచి అదే ప్రకటనలో మోదీ ‘వాస్తవానికి ఎన్నెన్నో రైతుసంఘాలు, వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పురోగమన భావాలుగల రైతులు కొత్తసాగు చట్టాలకు అండగా నిలిచారన్నారు. ఒక వర్గం రైతులు మాత్రమే వ్యతి రేకిస్తూ వచ్చారనీ, కాని వారు కూడా మనవాళ్లే కాబట్టి ఒప్పించేందుకు పదే పదే ప్రయత్నించామనీ, చట్టాలను రెండేళ్లపాటు నిలిపివేస్తామనీ చెప్పారేగాని, వాటి పూర్తి ఉపసంహరణకు సిద్ధమని మాత్రం చెప్ప లేదు! అందుకనే పాలకుల పరస్పర విరుద్ధ ప్రకటనల దృష్ట్యా రైతాంగ ప్రజలు తిరుగులేని హామీని పాలకులు ప్రకటించి ఆచరణలో అమలుపరిచేంతవరకూ విశ్రమించబోరని రైతాంగ సంయుక్త కిసాన్‌ మెర్చా ప్రకటించాల్సివచ్చింది. 

ఆ మాట కొస్తే నిజానికి దేశ రాజ్యాంగ చట్టం ఆదేశిక సూత్రాల విభాగంలో అధికరణలు 38 నుంచి 45వరకూ పౌర హక్కులలో అంతర్భాగమైన రైతాంగ సాగు ప్రయోజనాల రక్షణకు ఉద్దేశించినవే నని మరచిపోరాదు! అంతేగాదు, రాజ్యాంగంలోని ‘పౌరబాధ్యత’ల అధ్యాయంలో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోమని, మూఢవిశ్వా సాలకు హారతి పట్టవద్దనీ చెప్పిందేగాని మరోలా ప్రవర్తించమనీ చెప్పలేదు! మరొకమాటలో చెప్పాలంటే 2014లో బీజేపీ అధికార పీఠాలు అలంకరించినప్పటి నుంచీ ఈ రోజుదాకా తీసుకున్న చర్య లలో హెచ్చుభాగం దేశ మౌలిక ప్రయోజనాలకు, రాజ్యాంగ ఆదేశా లకూ విరుద్ధమైనవిగానే భావించాలి.

ఒక వైపున యూపీలో బీజేపీ పాలనా ప్రయోజనాల కోసం పెద్దకరెన్సీ నోట్లను ఆకస్మికంగా రద్దు చేసి కరెన్సీ సంక్షోభానికి తెరలేపారు. దీంతో గ్రామీణస్థాయిలోని, పట్టణాలలోని బ్యాంకులవద్ద దేశ పౌరులు గంటలు, రోజుల తరబడి పడిగాపులు పడి వృద్ధులు కూడా సాయంత్రం దాకా క్యూలలో నిల బడి సొమ్మసిల్లిపడిపోయిన ఫలితంగా దాదాపు 200 మంది దాకా ప్రాణాలు విడిచిన దారుణ పరిస్థితుల్నీ చూశాం! ఈ సంక్షోభం ఫలి తాల్ని  నేటికీ దేశం అనుభవిస్తూనే ఉంది. ఇజ్రాయెల్‌ని నమ్మి పెగసస్‌ గూఢచర్యంతో వియ్యమంది దేశప్రజల ముందు చులకనైపోయారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికే చిక్కిపోయారు!

ఈ లోగా దేశ ఆర్థిక పరిస్థితులు అదుపు తప్పిపోయాయి. విదేశీ బ్యాంకులలో దాచుకున్న భారత మోతుబరుల దొంగఖాతాలను దేశానికి రప్పించడం ద్వారా కోట్లాది రూపాయలను కుటుంబానికి రూ. 15 లక్షల చొప్పున పంచి దారిద్య్ర భారాన్ని రూపుమాపేస్తానని బీరాలు పలికిన బీజేపీ పాల కులు తీరా ఆచరణలో నోరెళ్లబెట్టుకోవలసి వచ్చింది! చివరికి దేశ పాలనా వ్యవస్థ ఒకనాటి వెర్రిబాగుల సంస్థానంగా మారిన ‘పుంగ నూరు’ సంస్థానంగా తయారైంది. కొన్ని దేశాలలోని ప్రభుత్వాలకు ఒక్కోదానికి ఒక్కో అవివేకపు ఖ్యాతి ఉంటుంది! ‘సంచి లాభాన్ని కాస్తా చిల్లి కూడదీసినట్టుగా పాలకుడు ఎంత గొప్పవాడనుకున్నా పాలన దిబ్బ రాజ్యంగా మారకూడదు! కవి సినారె అన్నట్టు ‘ఏది పలి కినా శాసనమైతే ఎందుకు వేరే జనవాక్యం? ఏది ముట్టినా బంగారమే అయితే ఏది శ్రమశక్తికి మూల్యం?’’!


ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు