‘భారత ప్రజలమైన మేము..’ ఎక్కడ?

1 Dec, 2020 00:59 IST|Sakshi

రెండో మాట

భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే సమయానికి రాజ్యాంగ ఉపోద్ఘాతంలో పొందుపరిచి హామీ పడిన ప్రజల ప్రాథమిక హక్కులపై అత్యంత దారుణమైన దాడి జరుగుతోంది. రాజ్యాంగాన్ని విధిగా ఆచరణలో అమలు పరచడానికి అవసరమైన అత్యంత కీలకమైన 32వ అధికరణను కాస్తా పాలకులు జావగార్చు తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. రాజ్యాంగంలో 12 నుంచి 35 వరకు ఉన్న అధికరణలు ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కుల అమలుకు హామీపడిన కీలకమైన క్లాజులు. వీటినే తొలగించే ప్రయత్నం చేస్తే ఇక ప్రజలకు రక్షణ ఎక్కడ? దేశ రాజధానిలో రైతుల నిరసన ఘటనను పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌ రైతాంగం కన్నీటితో ఒలకబోసుకుంటున్న అనంతబాధల పాటల పల్లవిగానే మనం బాధిత హృదయంతో భావించాలి.

ప్రతి ఏటా మనం నవంబర్‌ 26న సంవిధాన (రాజ్యాంగ) దినోత్సవం జరుపు కుంటున్నాం. 1949లో ఆ రోజున భారత రాజ్యాంగ నిర్ణయ సభ దేశ రాజ్యాంగాన్ని ఆమోదించింది. అలాంటి సంవిధాన పత్రాన్ని ఆమోదించడమంటే, దాన్ని ఆచరణలో తు.చ. తప్పకుండా అమలు జరుపుతామన్న భరోసాను ప్రజలకు హామీ పడడమని అర్ధం. కాని ఈ ఏటి ఈ సంవిధాన దినోత్సవం సమయానికి, రాజ్యాంగాన్ని విధిగా ఆచరణలో అమలు పరచడానికి అవసరమైన అత్యంత కీలకమైన 32వ అధికరణను కాస్తా పాలకులు జావగార్చుతుండటంపై సర్వత్రా ఆందో ళన వ్యక్తం అవుతోంది. అంటే ప్రజలు తమకు తాముగా (వియ్‌ ది పీపుల్‌) రూపొందించుకొని తమకు అంకితం చేసుకున్న రాజ్యాంగ  ఉపోద్ఘాతానికి, అందులో పొందుపరిచి హామీ పడిన ప్రజల ప్రాథమిక హక్కులపై నేడు అత్యంత దారుణమైన దాడి జరుగుతోంది. ఇందుకు నరేంద్ర మోదీ పాలన తీరు తెన్నులతోపాటు సుప్రీంకోర్టు వ్యవహ రిస్తున్న తీరూ నిరాశ నిస్పృహలకు కారణమవుతోంది. కంచే చేనును కాస్తా మేసేస్తే పంటకు రక్షణ ఎక్కడ? 2020 సంవిధాన దినోత్సవం రోజున ప్రజలను ఎదుర్కొంటున్న పెద్ద ప్రశ్నలు.
–ఏ. వెంకటేశన్‌, సుప్రసిద్ధ లీగల్‌ వ్యవహారాల పాత్రికేయ ప్రముఖుడు, ‘వైర్‌’ లీగల్‌ ఎడిటర్

ఈ ఏడాది విషాద ఘడియగా ముగిసిన రాజ్యాంగ దినోత్సవం దేశంలో పెక్కు బాధాకరమైన పరిణామాలకు సాక్షీభూతంగా నిలి చింది. రాజ్యాంగంలో 12 నుంచి 35 వరకు ఉన్న అధికరణలు ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కుల అమలుకు హామీపడిన కీలకమైన క్లాజులు. వీటిలో 32వ అధికరణ.. ప్రజలు తమ ప్రాథమిక హక్కుల్ని ఆచరణలో అమలు జరిపించుకోడానికి సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కును గ్యారంటీ చేసింది. అందుకే భారత రాజ్యాంగ రూపకర్తలలో ప్రముఖుడైన డాక్టర్‌ అంబేద్కర్‌ ఈప్రత్యేక అధికరణను (ఆర్టికల్‌ 32) మొత్తం రాజ్యాంగానికే ఆత్మగా పేర్కొన్నాడు. అలాగే ఈ అధికరణ దృష్ట్యానే లీగల్‌ వ్యవహారాలపై పండితుడైన రోహిత్‌ డే సుప్రీం కోర్టును ‘ప్రజా న్యాయస్థానమని’ భావించవలసి వచ్చింది. అయితే రానురాను పాలకుల ప్రవర్తన మాదిరే సుప్రీం ఆచరణ కూడా మారిపోయిందనే భావన దేశంలో ప్రబలంగా ఉంది. 

ఈ దశలో ‘రాజ్యాంగంలోని అధికరణ 32ను అమలు జరిపించుకోవడానికి సామాన్య పౌరుడు చొరవ చేయడాన్ని ‘నిరుత్సాహపరచవలసి వస్తుం దన్న’ అభిప్రాయానికి రావడానికి న్యాయమూర్తులు నిర్ణయించు కుంటే, రాజ్యాంగానికీ ఆత్మగా భావిస్తున్న 32వ అధికరణను నిర్వీర్య పరిచే రాజ్యాంగచట్టం ఆత్మనే చంపేసినట్టవుతుందని న్యాయశాస్త్ర నిపుణులు భావిస్తున్నారని మరువరాదు. దేశ పౌరసత్వ సవరణ చట్టం పేరుతో దేశంలో ‘విదేశీయుల’ ముద్రపేరిట అన్యమతస్తుల్ని వెలివేసి వేధించే చట్టాలను రూపొందించడం ఈ కోవకు చెందిన పాలక చేష్టలే. అయినా సరే, బీజేపీ నాయకులు అంబేడ్కర్‌ వారసత్వానికి తామే సిసలైన వారసులమని నిస్సిగ్గుగా ప్రకటించుకోవటం ఆశ్చర్యకరం. 

‘భీమాకోరెగావ్‌ కేసు’ పేరిట వివిధ రాష్ట్రాలలో పౌర ఉద్యమ కార్య కర్తల్ని, నాయకులను అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి, మహారాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పుబట్టి వ్యతిరేకించినా బీజేపీ నాయకులకు చలనం లేకపోయింది. ఇప్పటికీ గత రెండేళ్లుగా పౌరహక్కుల నాయకులు కోరెగావ్‌ ప్రాంత దళిత ఉద్య మకారులూ, జర్నలిస్టులు అనేక రకాల వేధింపులకు గురవుతున్నారు. పౌరుల భిన్నాభిప్రాయ ప్రకటన హక్కు రాజ్యాంగానికి జీవనాడి అని జస్టిస్‌ గుప్తా ప్రకటించినా.. కేంద్ర పాలకులకు ‘చీమకుట్టదు’. పాల కుల ఈ రాజ్యాంగ వ్యతిరేక వైఖరే క్రమంగా భారతదేశ ఫెడరల్‌ వ్యవస్థ స్వరూప స్వభావానికే చేటు కల్గిస్తుంది.

‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ (జమిలి ఎన్నికలు) దేశానికి అవ సరమని, తరచూ దేశంలో ఎన్నికలు జరగడం అభివృద్ధికి ఆటంక మని, ప్రధాని మోదీ అఖిల భారత సభాపతుల (స్పీకర్స్‌) మహా సభలో (26–11–20) ప్రకటన చేయడానికి మూడు రోజుల ముందు చేసిన మరో ప్రకటనతో కలిపి విశ్లేషించుకుంటే ఒక సత్యం బయట పడుతోంది. ‘2014–2029 మధ్య కాలం భారతదేశానికి చాలా ముఖ్యమైన సమయం. ఇండియాలాంటి యువ భారత ప్రజాస్వా మ్యానికి 16వ–18వ లోక్‌సభ మధ్యకాలం (అంటే 15 ఏళ్లు) కీలక మైనది. ఈ దృష్ట్యా చూస్తే ఇప్పటికి గడిచిన ఆరేళ్లు (అంటే బీజేపీ పాలన తొలి ఆరేళ్లు) దేశాభివృద్ధిలో చరిత్రాత్మకం. 

కాబట్టి ఇకమీదట మిగతా రాబోయే నాలుగేళ్లు (2024) కాలం కలిసొస్తే ఆపైన మరి అయిదేళ్లపాటు (2029) భారతదేశానికి చాలా ముఖ్యమైన కాలంగా భావించాలి. ఈ కాలంలో మనం చేయాల్సింది చాలా ఉంది అని మోదీ ప్రకటించారంటే ఆయన బీజేపీ అధికార ‘ఉట్టికి పెద్ద నిచ్చెనే’ వేశారని అర్థమవుతోంది. బయటికి ఆ ప్రకటనలోని మర్మాన్ని చెప్ప కుండానే చెప్పినట్లు అయింది. సుమారు గత ఆరేళ్లపాలనలోనూ దేశా భివృద్ధిని ఎక్కడిదాకా దిగజార్చుతూ వచ్చారో చూశాం. ప్రస్తుతం గత ఆరేడు మాసాలుగా దేశ జన జీవితాన్ని, ఆర్థిక వ్యవస్థను అతలా కుతలం చేస్తూన్న ‘కరోనా’ (కోవిడ్‌–19) దశను మినహాయిస్తే అంత కుముందు ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయక జాతీయోత్పత్తి, ఉద్యోగ రంగాలన్నిటా విస్తృతస్థాయిలో ప్రభుత్వరంగ శాఖలు పెక్కింటిని ప్రైవేట్‌ రంగానికి ధారాదత్తం చేసే చర్యలకే పాలకులు పెద్దపీట వేస్తూ వచ్చారు. ఆర్థిక వ్యవస్థ ప్రగతికి చోదకులుగా పాలకులున్నారో, లేక వారి స్థానాన్ని రిజర్వుబ్యాంకు ఆక్రమించిందో తెలియని దశలో దేశ ప్రజలున్నారు. 

సంప్రదాయ వ్యవసాయ రంగంలో రైతులు దశాబ్దాల తరబడి ఆశిస్తున్న సంస్కరణలను పంటలకు కనీస మద్దతు ధరను, తమ పంటకు తగిన మార్కెటింగ్‌ సౌకర్యాలను పాలకులు కల్పించనందున రైతాంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే మూడు రకాల కార్పొరేట్‌ వ్యవసాయ చట్టాలను ప్రస్తుత పాలకులు రైతాంగం నెత్తిన రుద్దారు. ఫలితంగా పంజాబ్, హరియాణా, రాజస్తాన్, రైతాంగం కనీవినీ ఎరుగని స్థాయిలో ఉద్యమించి బీజేపీ పాలకులకు కంపరం కల్పిస్తోంది. 

తమ ఉద్యమం రాజకీయ పార్టీలకు అతీతంగా సాగుతోందని ప్రక టించి, తమ ఉద్యమం పరిష్కారమయ్యేదాకా ఢిల్లీలోనే మకాంవేసి ఆరునెలల పాటయినా సాగించడానికి సరిపడా తిండీ తిప్పలకు సరిపడా సంభా రాలన్నీ సమకూర్చుకున్నామని రైతాంగ ఉద్యమకారులు ప్రకటించా రంటే వ్యవసాయ రంగ దుస్థితి భారతదేశంలో ఏ స్థాయికి చేరుకుందో అర్థమవుతోంది. విద్యుత్‌ పంపిణీ, బ్యాంకులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్మిక ఉద్యో గుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా.. బడా పారిశ్రామిక వర్గాల కోసం విదేశీ బ్యాంకర్లకు, విదేశీ గుత్త సంస్థలకు అనుకూలంగా ప్రైవేటీకరణకు భారీస్థాయిలో నిర్ణయాలు, చట్టాలు పాలకులు చేశారు. చివరికి, కరోనా చాటున జూన్‌లో (2020) అత్యవసర సరుకుల నియంత్రణ బిల్లుకు ఆర్డినెన్స్‌గా తీసుకొచ్చారు. ‘మంచిసమయం మించిపోతుందన్న’ ప్రాచీన వ్యంగ్యోక్తికి బీజేపీ పాలకుల హడావుడి చర్యలే ప్రత్యక్ష నిదర్శనం.

ఢిల్లీ సరిహద్దుల్లో భారీస్థాయిలో వేలాదిగా మోహరించిన రైతాంగంలో 70 ఏళ్ల వృద్ధ రైతు గాద్గదిక స్వరంలో మోదీని ఉద్దేశించి చేసిన హెచ్చరిక నిన్న, ఈనాటి, రేపటి పాలకులందరికీ  కనువిప్పు కాగలదని ఆశిద్దాం. ‘ప్రధానమంత్రిగారికి చెప్పండి ఆయన తినే రొట్టె పెరిగేది మా పొలా ల్లోనని మరచిపోవద్దని, ఆమాటకొస్తే రైతులంతా మేం మా పొలాల్లో పండించే గోధుమలనే యావత్తు దేశానికి అంది స్తున్నాం. రైతాంగానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీనీ మేము  సహించం. మంచిరోజులు చూపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఆ మంచి ఎప్పుడు చూపిస్తాడట. పండించిన పంటను మేము మండీ లలో అమ్ముకునేవాళ్లం. కానీ కనీస ధర పండిన పంటకు రాకపోవడం వల్ల ఆ మండీల నిర్వాహకుల, ప్రైవేటు వ్యాపారుల దోపిడీకి బలి అవుతున్నాం’ అని ఆ రైతాంగం మొత్తుకోవటం. 

అటు కాంగ్రెస్‌ పాలనలోనూ, ఇటు బీజేపీ పరిపాలనలోనూ ఇదే పద్ధతి. 1995లో దేశం మొత్తంమీద 2,98,438 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. ఈ మొత్తం దేశంలో జరిగే అన్నిరకాల ఆత్మ హత్యలలో 11.2 శాతం అని అంచనా. ఈ హత్యలన్నీ మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు విస్తరించి ఉన్నాయి. తాజా పరిణామాన్ని పంజాబ్, హరి యాణా, రాజస్తాన్‌ రైతాంగం కన్నీటితో ఒలకబోసుకుంటున్న అనంత బాధల పాటల పల్లవిగానే మనం బాధిత హృదయంతో భావించాలి. అయినా పాలకుల కన్నుమాత్రం సంవిధానం పాతర మీదనుంచి 2024 నుంచి 2029 దాకా పక్కకు తొలగదు. తలలు బోడులైన తల పులు బోడులా?
వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా