పత్రికా స్వేచ్ఛకే... ‘అమర్నాథ్‌’ యాత్ర

14 Sep, 2021 00:09 IST|Sakshi

రెండో మాట

‘‘పత్రికల మొట్టమొదటి కర్తవ్యం పాఠకులకు పెందలాడే వార్తలందివ్వడమే కాదు, సమ కాలీన ఘటనలను ముందుగానే పసిగట్టి పాఠకలోకానికి ఆగ మేఘాలపై చేర్చడమే కాదు. వాటిని జాతి(దేశం) ఉమ్మడి ఆస్తిగా దఖలు పరచడం కూడా పత్రికల కర్తవ్యమే, పాలకులు సమాచా రాన్ని రహస్యంగా సంపాదించుకుని, ఆ సమాచారాన్ని ప్రజా ఉద్యమాలను, నిరసనలను అణచివేసేందుకు ఆయు ధంగా వాడుకుంటాడు. ప్రజా వ్యతిరేక పాలకుల ఈ ధోర ణిని ఎదుర్కోవాలంటే ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి పత్రికలు ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థగా వ్యవహరిం చక తప్పదు. తమకు అందే సమాచారాన్ని యావత్తూ ప్రజల పరం చేయడమే పత్రికల లక్ష్యం. ఈ కర్తవ్యంలో పాత్రికే యుడి బాధ్యత.... ఒక ఆర్థికవేత్త, ఒక న్యాయవాది బాధ్య తకు దీటైన కర్తవ్యమని మరువరాదు. జర్నలిస్టుల బాధ్యత వాస్తవాల పరిశోధనలో ఒక చరిత్రకారుడికి దీటైన కర్తవ్యం.’’
– లండన్‌ టైమ్స్‌ పత్రికకు 23 ఏళ్ల ప్రాయంలో ఎడిటర్‌ జాన్‌ డిలేన్‌ విస్పష్ట ప్రకటన (1852 ఫిబ్రవరి 6–7)

పాత్రికేయ రంగంలో పనిచేసే ‘కర్మ’కారులందరికీ వృత్తి ధర్మం పాటించడంలోనూ, కలసికట్టుగా వారందరి యోగ క్షేమాలను కాపాడవలసిన జర్నలిస్టుల యూనియన్‌ పరువు ప్రతిష్టలను రక్షించడంలోనూ రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయి యూనియన్‌ నిర్వహణలోనూ అంకితం చేస్తూ వచ్చిన కె. అమర్నాథ్‌ జన్మదినోత్సవం (సెప్టెంబర్‌ 15) సందర్భంగా కొన్ని మధురస్మృతులు. ‘దక్కన్‌ క్రానికల్‌’ దినపత్రిక ఎడిటోరియల్‌ విభాగంతో ప్రారంభమైన ఆయన 40 ఏళ్ళ పాత్రికేయ జీవితం, జర్నలిస్టులకు జాతీయ స్థాయిలో వృత్తిధర్మ రక్షణ కోసం యూనియన్‌ స్థాపించి, దాని ఆధారంగా ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఎదిగి నిరంతరం పాత్రికేయుల సమస్యలకోసం పోరాడుతూ ఇటీ వలనే కన్నుమూసిన నేత అమర్నాథ్‌. ఆయన జర్నలిజమే పవిత్రమైన ప్రజాసేవగా భావించిన ‘కర్మ’ వీరులందరి కోసం జాతీయస్థాయిలో ‘స్క్రెబ్స్‌ న్యూస్‌’ మకుటంతో ప్రారంభించి నడుపుతూ వచ్చిన పత్రికకు ప్రారంభ సంపా దకుడు. ఈ పత్రికకు సంపాదక సలహాదారులుగా ఉన్న వారు ఎస్‌.ఎన్‌. సిన్హా, కె. శ్రీనివాసరెడి,్డ దేవేందర్‌ చింతన్, ఎల్‌.ఎస్‌. హెర్డీనియా. ఈ ప్రత్యేక సంచికను జర్నలిస్టు యూనియన్‌ నాయకులు సంతోష్‌ కుమార్, కోసూరి అమర్నాథ్‌లకు అంకితమిచ్చారు. 

ప్రస్తుతం విశాలాంధ్ర సంపాదకుడైన ఆర్‌.వి. రామా రావు అన్నట్టుగా ‘తక్కెటలో పెట్టి తూచినట్టుగా ఏది వార్తో, ఏది కాదో అనే విచక్షణతో నిర్ణయించడం జర్నలి స్టులలో ఉండాల్సిన ప్రత్యేక లక్షణం. ఈ విచక్షణ అమ ర్నాథ్‌లో అపారం. కనుకనే ఆయన తన సొంత ఇబ్బం దులు, సాధకబాధకాలు ఎన్ని ఉన్నా రెండు పర్యాయాలు ఇండియన్‌ ప్రెస్‌ కౌన్సిల్‌కు సేవలందించారు. దేశ వ్యాప్తంగా ఉన్న భారత జర్నలిస్టులు తమ వృత్తి ధర్మ నిర్వహణలో ఎదుర్కొనే సమస్యల సందర్భంగా వారి రక్షణకోసం ఒక జాతీయస్థాయి ఉపసంఘాన్ని ఆరుగురు సభ్యులతో నియమించాలని 2011లోనే ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. ఆ ఉపసంఘానికి మన అమ ర్నాథ్‌ కన్వీనర్‌. ఆ ఉపసంఘం 11 రాష్ట్రాలు పర్యటిం చింది. ఆయా రాష్ట్రాల్లో జర్నలిస్టులపై సాగుతున్న దాడుల పట్ల ఉప సంఘం ఆందోళన వెలిబుచ్చుతూ వారి రక్షణ కోసం దేశంలో ప్రత్యేక చట్టం అవసరాన్ని నొక్కి చెప్పింది. 

1990ల నుంచీ దేశంలో హత్యలకు గురైన జర్నలిస్టుల జాబితాను ప్రెస్‌ కౌన్సిల్‌ ఉపసంఘానికి సమర్పించింది. అమర్నాథ్‌ కన్వీనర్‌గా నిర్వహించిన ఈ బృహత్‌ కార్య క్రమానికి, జర్నలిస్టుల సంక్షేమ పథకానికి 2013లో కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వశాఖ 2013లో ప్రత్యేక కార్యాచరణ సూత్రాలను రూపొందించిందని మనం మరువరాదు. జర్నలిస్టులు తమ వృత్తిధర్మ నిర్వ హణలో ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెస్తూ 1950లనుంచీ ఆందోళన చేస్తూ వచ్చారు. దాని ఫలితంగా జస్టిస్‌ రాజ్యాధ్యక్ష అధ్యక్షునిగా తొలి ప్రధానమంత్రి జవ హర్‌లాల్‌ నెహ్రూ హయాంలోనే 1952లో మొట్టమొదటి ప్రెస్‌ కమిషన్‌ ఏర్పడింది. జస్టిస్‌ రాజ్యాధ్యక్ష కమిషన్‌  వర్కింగ్‌ జర్నలిస్టుల పాలిట కల్పతరువుగా, హక్కుల పత్రంగా జర్నలిస్టులంతా భావించే ఓ బృహత్‌ నివేదికను సమర్పించింది. జర్నలిస్టుల సర్వీస్‌ పరిస్థితులు, వారి కనీస వేతనాలు నిర్ణయించడానికి పార్లమెంటు, శాసన సభలు తక్షణం జోక్యం చేసుకుని దేశంలో ఆరోగ్యకరమైన నిర్ణయాలు చేయాలని కమిషన్‌ నివేదికను సమర్పించింది.

1978 నాటి ప్రెస్‌ కౌన్సిల్‌ చట్టంలోని 15(2) క్లాజు ప్రకారం వార్తల సేకరణలో లభించిన ఆధారాలను జర్నలిస్టులు లేదా పత్రికలు బహిర్గతం చేయనక్కరలేదు. నిజా నికి ఈ సూత్రాన్ని మహాభారత రచన మొదట్లోనే నన్నయ ఎవరికి తోచిన అర్థాన్ని వారు తీసుకోవచ్చునని నిర్వచించి పోయాడన్న వాస్తవం... పత్రికల పీక నొక్కడానికి సిద్ధ మయ్యే భారత పాలకులకు అందరికీ శిరోధార్యం కాగల దని ఆశిద్దాం. అమర్నాథ్‌ లాంటి ‘కర్మ’చారుల నిరంతర కృషి వల్లనే జర్నలిస్టుల వేతనాల నిర్ణయానికి, సర్వీసు పరి స్థితులను మెరుగుపర్చడానికి వేజ్‌ బోర్డులు ఏర్పడక తప్ప లేదు. అయితే సక్రమంగా వాటిని అమలు జరిపే ప్రభుత్వ యంత్రాంగమే ఇప్పటికీ జర్నలిస్టుల పాలిట ‘ఎండమా వులు’గా ఆచరణలో క్రియా శూన్యంగా మిగిలిపోవడమే ఆశ్చర్యకరం. 30 ఏళ్ల క్రితమే ఏర్పడిన రెండు ప్రెస్‌ కమి షన్‌లూ చేసిన క్రియాశీలమైన నిర్ణయాలను కూడా ప్రభు త్వాలు బుట్టదాఖలు చేస్తూ వచ్చాయి. అనితరసాధ్యమైన పాత్రికేయ సేవలకుగానూ తగిన స్థానం లేకపోయినా పాత్రికేయ సేవల్లోనే చివరిదాకా మిగిలిపోయిన చిరంజీవి మన అమర్నాథ్‌. కనుకనే మరోసారి కారల్‌మార్క్స్‌ గుర్తుకురాక తప్పడం లేదు. ‘పత్రికా స్వేచ్ఛ అనేది పత్రిక వ్యాపార స్వేచ్ఛలో మునిగిపోయినందున రాదు. పత్రికలు ఒక వ్యాపారంగా సాగనప్పుడు పత్రికలకు మిగిలేదే తొలి స్వేచ్ఛ’ అని మరవరాదు. 


ఏబీకే ప్రసాద్‌
abkprasad2006@yahoo.co.in
సీనియర్‌ సంపాదకులు 

మరిన్ని వార్తలు