ఉప్పెన మింగేసిన ‘ఆంధ్రనగరి’!

20 Oct, 2020 02:16 IST|Sakshi

రెండో మాట 

హైదరాబాద్‌ను ముంచెత్తి గత 117 సంవత్సరాల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో అక్టోబర్‌ 13న దండెత్తిన కుంభవృష్టి ప్రజల్ని అతలాకుతలం చేసింది. 15 నుంచి 35 సెంటీమీటర్ల దాకా వర్షం ముమ్మరించి జన జీవితాన్ని అతలాకుతలం చేసింది. పెద్ద నగరాల్లో సహజంగా పారవలసిన నాలాల స్థానంలో కాంట్రాక్టర్లు, సంపన్నులు.. భవంతులు, వ్యాపార కేంద్రాలను నిర్మించుకోవడానికి నేతలకు లేదా అధికారులకు లంచాలు మేపి ‘పనులు’ తమకు సానుకూలపర్చుకోవడం ఫలితంగా.. పన్నులు చెల్లిస్తున్న ప్రజలు ‘డబ్బూ పోయి శని పట్టిన’ చందంగా ఉభయభ్రష్టత్వానికి గురవుతున్నారు. ప్రకృతిని, దాని సహజ పరిసరాలను సంపదపై ఆబ కొద్దీ కొందరు సంపన్నులు దోచుకోవడమే ఈ ఉత్పాతానికి ప్రధాన కారణమని గుర్తించాలి.

అది 1870 నాటి పారిశ్రామిక విప్లవ కాలం. దానికి నేటి కాలానికి మధ్య ప్రపంచ ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్‌ పెరిగింది. ఇంధనం, సహజ వాయువు, శిలలు ద్రవించి అవశేషాలుగా మిగిలిపోయిన శిలాజాల (ఫాసిల్స్‌)ను మోతాదుకు మించి వాడేస్తున్న ఫలితంగా బొగ్గుపులుసు వాయువు వాతావరణంలో అపరిమితంగా పెరిగిపోయి భూమి వాతా వరణం వేడెక్కిపోతోంది. ఈ పరిణామం ఫలితంగా హిమానీనదాలు కాస్తా కరిగిపోతూ, సముద్రమట్టాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా, ఉత్తరాఖండ్‌లో ఘడ్వాల్‌ హిమానీనదాలు 2035 నాటికి దాదాపు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
– ‘నేషనల్‌ జాగ్రఫిక్‌’ ప్రసిద్ధ తాజా పరిశోధన
కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలలోని పెక్కు ప్రాంతాల్లో, అనేక పట్టణాలలో పల్లెల్లో అనూహ్యంగా విరుచుకుపడ్డ పెను వర్షంవల్ల ప్రజాజీవనం భారీ స్థాయిలో కకావికలై ఆకస్మిక మరణాలకు కారణ మయింది.
– (19–10–2020 నాటి వార్తలు)

విచిత్రమేమిటంటే, 1870 పారిశ్రామిక విప్లవానికి సరిగ్గా 31 సంవ త్సరాలకు ముందే, 1839లో ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి ప్రాంతానికి చెందిన కోరంగి అనే ఓ చిన్న రేవు పట్టణం ఉండేది. ఆ కోరంగే ఆనాటికి 3 లక్షల 20 వేల జనాభాగల ప్రసిద్ధ ఆంధ్రనగరిగా చరిత్రలో పేరొందింది. కానీ విషాదమేమిటంటే, 181 సంవత్సరాల క్రితం భారతదేశంలో భారీ ఉప్పెనలు వచ్చి నాటికి కనీవినీ ఎరుగనంత జననష్టాలకు, ఆస్తి నష్టాలకు కారణమైనాయి. సరిగ్గా ఆ భారీ ఉప్పె నలలో భాగంగానే తొలి ఆంధ్రనగరి కోరంగి పూర్తిగా నేలమట్టమయి పోయింది. ఆ కాలంలోనే ఆంధ్రనగరి (కోరంగి)తోపాటు హైదరా బాద్, మద్రాసు, మైసూరు, బొంబాయి పెనుతుపానులకు తోడు పెను కరువుల ఫలితంగా మూడుకోట్లమంది పైచిలుకు ప్రజలు మృత్యు వాత పడ్డారు. అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక విజయాలు అనేకం ముమ్మరించి, మానవాళికి పలురంగాల్లో అభ్యున్నతిని శరవేగంగా సాధిస్తున్నప్పటికీ ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవాళిని గట్టెక్కిం చలేక పోతున్నాయంటే, ప్రకృతిని, దాని సహజ పరిసరాలను స్వార్థ ప్రయోజనాలతో సంపదపై ఆబకొద్దీ కొందరు సంపన్నులు దోచు కోవడమే ప్రధాన కారణమని గుర్తించాలి. సహజమైన ప్రకృతి వైపరీ త్యాలకు తోడుగా మానవ వైపరీత్యం కూడా తోడై తేరుకోలేని ఉపద్ర వాలకు, వినాశనానికి కారణమవుతోంది.

జనజీవితాన్ని ఛిద్రం చేసిన జలఖడ్గం
హైదరాబాద్‌ను ముంచెత్తి గత 117 సంవత్సరాల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో అక్టోబర్‌ 13న దండెత్తిన కుంభవృష్టి ప్రజల్ని అతలాకుతలం చేసింది. ఒక చోట కాదు, అనేక కాలనీల్లో గ్రామ, పట్టణ ప్రాంతాల్లో నష్టాలకు కారణమయ్యాయి. 15 నుంచి 35 సెంటీమీటర్ల దాకా వర్షం ముమ్మరించి జన జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. పలు పట్టణాలు, గ్రామాలు నదులుగానో, చెరువులుగానో మారాయి. హైదరాబాద్‌ లాంటి పెద్ద నగరాల్లో సహజంగా పారవలసిన నాలాల స్థానంలో కాంట్రాక్టర్లు, సంపన్నులు కృత్రిమంగా ఆక్రమించుకొని, భవంతులు, వ్యాపార కేంద్రాలను రాజకీయనేతలకు లేదా అధికారులకు లంచాలు మేపి ‘పనులు’ తమకు సానుకూల పర్చుకోవడం ఫలితంగా పన్నులు చెల్లిస్తున్న ప్రజలు ‘డబ్బూ పోయి శని పట్టిన’ చందంగా ఉభయభ్రష్ట త్వానికి గురవుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే ప్రధానమైన నాలాలు 390 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా అవి మధ్యలో ఆటంకం లేకుండా ప్రవహించడానికి వీలైన ‘నాలాలు’ నిడివి మాత్రం కేవలం 23 కిలోమీటర్లని అంచనా. కాగా, నాలాలకు ఆటంకం కలిగిస్తూ వాటి స్థానాన్ని దురాక్రమించి స్వేచ్ఛగా పారడానికి అడ్డుతగులుతున్న కట్టడాలు/నిర్మాణాలు 28,000 అనీ, నీటి వాలుకు ఆటంకంగా మారిన ప్రాంతాలు 47 అనీ, మళ్లీ వీటిల్లో నగరంలో మరీ అడ్డంకిగా ఉన్నచోట్ల మరో 17 ఉన్నాయనీ అంచనా (19.10.2020). నగరానికీ, గ్రేటర్‌ హైదరాబాద్‌కు, ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధుల్లో ఉన్న ప్రాంతాలకు రోజుకి 48 కోట్ల గ్యాలన్లు అవసరం అవుతాయని అంచనా. ఇప్పుడు బాగా చెరువులు దెబ్బతిన్నందువల్ల నగరంలో మున్ముందు నీటి సమస్య ఏర్పడే అవకాశం కూడా ఉంది. 

ప్రభుత్వాల అశ్రద్ధతోనే రెట్టింపు నష్టం
ఎంతసేపూ ఎద్దడి ఎదురైనప్పుడు ‘అడ్డడ్డా’ అని అప్పుడు నటించడం తప్ప–శాశ్వత ప్రాతిపదికపైన ప్రజారోగ్య రక్షణకు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు పాలకవర్గాల, అధికారుల స్థాయిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మృగ్యం. ఫలితంగా విద్యుత్, ప్రజారోగ్య అవసరాలను తక్షణం ఆదుకునే వ్యవస్థను రూపొందించుకునే అలవాటు మన ధనిక వర్గ వ్యవస్థలో ఆశించలేం. ఫలితంగా భారీవర్షంతో పాచిపోయిన నీటి వాడకంవల్ల, లేదా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న 3–5 రోజులకన్నా నిల్వ ఉండిపోయిన నీటిని సేవించడంవల్ల వచ్చే ప్రమాదాల గురించి ఇలాంటి పరిస్థితుల్లో అనుక్షణం హెచ్చరించే పకడ్బందీ ఆరోగ్య వ్యవస్థపట్ల పాలకులకు శ్రద్ధ లేదు. అందుకు తగి నట్టుగానే వాటిపై ఆధారపడవలసి వచ్చే అధికారులకూ అంత శ్రద్ధ కన్పించదు. పైగా నీరందించాల్సిన పైప్‌లైన్ల కింద నేల కొన్ని మీటర్ల లెక్కన కోసుకు పోయినా పట్టించుకోని చోట్లున్నాయని స్థానిక ప్రజల ఫిర్యాదు. ఇన్ని ఈతిబాధల మధ్య నగర, గ్రామీణ ప్రజలు చిన్నారులు పెక్కుచోట్ల పడుతున్న ఇబ్బందులు అనుభవించిన వాళ్లకుతప్ప ఒడ్డున కూర్చున్న వాళ్లకు అర్థంకాని దురవస్థ మరొకవైపు. ఉప్పెనలో కనీవినీ ఎరుగని స్థాయిలో నీట మునిగి ఉన్న కుటుంబాల పునరావాసం ఆగమేఘాల మీద లభించేదాకా వారికి కాళ్లూచేతులూ ఆడని పరిస్థితి, వారు వరదనీరు తీసేంతవరకు తమ ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి. మరోవైపు వారికి తక్షణం నీడ దొరకడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చకచకా జరిగేవరకు ప్రజా ప్రతినిధులూ, అధికారులూ ఏమరుపాటుగా ఉండరాదు. 

పొంచివున్న కారుమేఘాలు
వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం అటు అరేబియా సము ద్రమూ, ఇటు బంగాళాఖాత జలరాశి ఇంకా సద్దుమణగకుండా అల్లకల్లోలంగా ఉన్నందున, దీనికితోడు మధ్యలో అమాంతంగా చోటు చేసుకునే ఆకస్మిక మేఘరాశి సాంద్రత (క్యుములోనింబస్‌) సరికొత్త ప్రకృతి దృశ్యంగా స్థిరపడుతున్నందున– మరిన్ని జాగ్రత్తలు అవసరం. వందలాది వీధులు ఉండటమేగాక, అనేక పట్టణాలలో వందలాది వీధులు అంధకారంలో మగ్గుతున్నందున, శివారు ప్రాంతాల్లో సుమారు 70 చెరువులు ప్రజల ఉనికిని ‘బెదిరిస్తు’న్నందున మరికొన్ని రోజులు అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ‘ఫేమ్‌ యూనివర్సిటీ’ పుణేకి చెందిన ప్రసిద్ధ నవలాకారుడు ఆదిత్య సుద ర్శన్‌ కేవలం ధనదాహం వల్ల రాజకీయులు, వారి అధికార గణాలు ‘సంపాదన కోసం సంపాదన’ అనే సూత్రాన్ని జీవితలక్ష్యంగా మరిగి, అమెరికా పెట్టుబడివర్గాల మాదిరిగా ధన సంపాదనే ఏకైక లక్ష్యంగా సాగుతున్నారని చెబుతూ హెచ్చరించాడు. ‘‘స్వేచ్ఛా మార్కెట్టు, సొంత లాభాల మేట’ లక్ష్యంగా సాగుతున్నంతకాలం కోరికలన్నీ పశ్చిమ రాజ్యాల పెట్టుబడిదారుల స్థాయిలోనే సంపదను పోగేసు కోవాలన్న ‘దురద’ భారత పెట్టుబడిదారుల్లో తగ్గబోదని’’ చెప్పాడు. 
కానీ సుదర్శన్‌ కన్నా ముందు కొన్ని శతాబ్దాల క్రితమే మన తెలుగు వేమన ఏమన్నాడో ఒకసారి చూద్దాం... 

‘‘భూమి నాదనియన్న భూమి పక్కున నవ్వు.. దాన హీను జూసి ధనము నవ్వు.. కదనభీతు జూసి కాలుడు నవ్వురా.. విశ్వదాభిరామ వినుర వేమ’’
 బహుశా అందుకే రవీంద్ర కవీంద్రుడు కష్టాల మధ్య కాపురాలు నిర్వహిస్తున్న ప్రజాబాహుళ్యంలో గుండె నిబ్బరం నిలుపుతూ ఇలా ప్రబోధించాడు:
‘‘నన్ను ప్రార్థించనీ
ప్రమాదాలనుంచీ రక్షించమనికాదు సుమా,
ధైర్యసాహసాలతో ఎదుర్కొనే
శక్తిని కలిగించమని ప్రార్థించనీ!
నన్ను కోరుకోనీ
నాకు సంభవించే నా బాధలను పోగొట్టమని కాదు,
కష్టనష్టాలకు అతి తేలికగా భరించగల శక్తిని కోరుకోనీ’’!



ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 

abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు