పౌరస్వేచ్ఛ భద్రతలో న్యాయమూర్తులు

21 Sep, 2021 00:24 IST|Sakshi

రెండో మాట

కాలం చెల్లిపోయిన వలస పాలనా వ్యవస్థలో రూపొందించిన చట్టాలు భారతదేశ ప్రజాస్వామ్య రక్షణకు, పౌర హక్కుల రక్షణకు పనికిరావని, నవభారత నిర్వహణకు కూడా అవి ఉపయోగపడవని, ఇందుకోసం న్యాయవ్యవస్థ చట్రంలోనే మౌలికమైన మార్పులు అనివార్యమని, పౌరుల భద్రతకు ఇవి తప్పనిసరని సుప్రీంకోర్టు ధర్మాసనం గత కొద్ది రోజులుగా విస్పష్టంగా ప్రకటనలు జారీచేయడం ప్రశంసనీయమైన పరిణామం. ముఖ్యంగా మన దేశ పాలకుల ఆశీస్సులు పొందిన విదేశీ కూపీ సంస్థ ‘పెగసస్‌’ కారణంగా దేశ పౌరహక్కులకు ఎదురైన పెనుముప్పు సందర్భంగా, న్యాయమూర్తుల తాజా ప్రకటనల ప్రతిపత్తికి మరింత విలువ పెరిగింది.

జాతీయ భద్రత అంటే ఏమిటో, దాన్ని పిడుక్కీ బియ్యానికీ వాడుకుని అన్ని రకాల ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఏయే చిట్కాలను ఆశ్రయిం చాలో ప్రధాని నరేంద్రమోదీకే తెలుసునని సుప్రసిద్ధ ‘ది హిందు’ దిన పత్రిక  కార్టూనిస్టు సాత్విక్‌ అత్యంత వ్యంగ్య వైభవంతో వివరించారు. (16–09–2021). అందులో దేశ భద్రతా లక్ష్యం కింద ఏయే కేసుల్ని నమోదు చేయవచ్చునో కార్టూనిస్టు సాత్విక్‌ పేర్కొన్నారు. దేశద్రోహం కేసులు, ఆరోగ్య సమస్యలతో తీసుకుంటున్న సీనియర్‌ పౌరులను జైల్లో నిర్బంధించడం, ఇంకో వైపునుంచి జాతీయ పౌర చట్ట సవరణ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నవారి ఆచూకీ తెలిపే పెగ సస్‌ ‘సాక్ష్యం’, నిరసనకారులపై నిర్బంధ చర్యలు... వెరసి ఇవన్నీ జాతీయ భద్రత కోసమే సుమా! ఇదీ ఆ వ్యంగ్య చిత్రం వరుస.

ఇజ్రాయెల్‌ కేంద్రంగా వివిధ దేశాల్లో ఆయా ప్రభుత్వాల తరఫున పౌరులపై రహస్యంగా గూఢచర్యం జరపడానికి ఇజ్రాయెల్‌ అనుమతి స్తోంది.  ఇతర దేశాల పాలకవర్గ ప్రయోజనాల కోసం ఆయా దేశా ల్లోని ప్రభుత్వాల అనుమతితోనే, ప్రజాసమస్యలపై ఆందోళన జరిపే స్థానిక పౌరులపైన కూడా గూఢ చర్యం పెగసస్‌ జరుపుతోంది. కానీ ఈ క్రమంలో జర్మనీ చేతికి చిక్కిన పెగసస్‌ జుట్టు మన పాలకుల చేతికి ఎందుకు చిక్కలేదు? భారతదేశంలో కూడా పెగసస్‌ గూఢ చర్యం గుట్టు కాస్తా రట్టయింది కదా. ప్రభుత్వం భావించే ఫలానా ఆందోళనకారులపైనేగాక, జన జీవితంలో హృదయమున్న ఉన్నతాధి కారులపైన, మేధావులపైన, మాజీ  విదేశాంగ మంత్రుల పైన, మాజీ పోలీసు అధికారులపైన సహితం పాలకవర్గం నిగూఢంగా కన్నేసి నిఘా పెట్టడానికి కారణం... ఈ పెగసస్‌ గూఢచర్యమే. ఈ బాగోతం కాస్తా పాలకుల మెడకు  చుట్టుకున్నాక, అలాంటిదేమీ లేదని, అది ప్రతిపక్షాల ఆరోపణ మాత్రమేనని బీజేపీబుకాయిస్తూ వస్తోంది. 

చివరకు ప్రతిపక్షాలు, దేశంలోని సుప్రసిద్ధ హిందూ సీనియర్‌ జర్నలిస్టు ఎన్‌. రామ్, ఇండియన్‌ ఎడిటర్స్‌ గిల్డ్‌... పెగసస్‌ గూఢచారి సంస్థ సాయంతో బీజేపీ పాలకులు దేశీయ పౌర సమాజంపైనే ఎక్కుపెట్టిన పెను రహస్య గూఢచర్య కార్యకలాపాలను బహిర్గతం చేసి, నిరసన తెలిపి నిలదీశారు. ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కదిలించివేసింది. కోర్టు రంగంలోకి ప్రత్యక్షంగా దిగి, మొత్తం పెగసస్‌ గూఢచర్యంపై వివరమైన సాక్ష్యాధారాలతో ప్రకట నను ప్రభుత్వం సమర్పించాల్సిందేనని ఆదేశించింది. అప్పుడు అసలు రహస్యం కోర్టుకే కాదు. యావత్తు దేశానికే వెల్లడవక తప్ప లేదు. ప్రభుత్వంపై ఎక్కుపెట్టిన ఆరోపణలు తీవ్రమైనవి కాబట్టి అసలు నిజానిజాలు విధిగా ప్రభుత్వం బయట పెట్టాల్సిందేనని కోర్టు హెచ్చరించింది. ఆరోపణలు ఎక్కుపెట్టిన ఎన్‌. రామ్‌ ప్రభృతులు, తమ పిటిషన్ల కాపీలను ప్రభుత్వానికి కూడా అందజేయాలని ఆశించ డంతో పాలకులకు గొంతులో వెలక్కాయ పడినట్టు భావించి ఇక తప్పించుకోలేమన్న భయంతో తమ రూటు మార్చారు. 

ఈ కేసు మొదలై రెండేళ్ళయింది. ‘పెగసస్‌’ భారతప్రభుత్వం అనుమతితోనే ఇండియాలో ‘హల్‌చల్‌’ చేస్తోందని అందరూ భావించిన దరిమిలా 2019లోనే ఈ భాగోతం బయటపడిందని కూడా నాటి సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచ్‌ దేశానికి వెల్లడించింది. పైగా పెగసస్‌ గూఢచారి స్పైవేర్‌ను... మోదీ దేశప్రజలపైన ప్రయోగిస్తున్నారనే ఆరో పణలను కోర్టు కూడా విశ్వసించింది, ప్రభుత్వ సంస్థలు ప్రత్యర్థులపై నిఘా పెట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌ పాలక సంస్థ సాయంతో దేశంలోని ప్రత్యర్థులపై కూపీలు లాగడానికే ఈ విదేశీ స్పైవేర్‌ను ప్రయోగిస్తోందన్న మీడియా వార్తలు నమ్మశక్యం కానివని తామూ భావించడంలేదని కూడా సుప్రీం బెంచ్‌ భావించింది. ఇది వ్యక్తుల గోప్యత, గౌరవాలపై దాడిచేసినట్టే అవు తుందని ధర్మాసనం చెప్పింది. ఇక పాలకులు ఠలాయించలేమనే పరి స్థితుల్లో పడి, గొంతు మార్చి దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు, పెగసస్‌తో ఒప్పందం జరిగిందని ఒప్పుకునే పక్షంలో జాతీయ భద్రతను కాపాడటంలో ప్రభుత్వం రాజీపడినట్టు అవుతుందని కోర్టు ముందు పేర్కొన్నారు. దీంతో ‘పెగసస్‌’తో కుదుర్చుకున్న ఒప్పం దాన్ని పాలకులు ఒప్పుకున్నట్టయింది. 

పైగా, పెగసస్‌ బాగోతం గురించి జర్మన్‌ ప్రభుత్వం వెల్లడించిన అసలు వాస్తవాలు విస్మయం కలిగిస్తున్నాయి. జర్మనీలోని 50,000 మంది స్థానిక పౌరులపైన ఈ పెగసస్‌ గూఢచర్యానికి ఎలా దిగిందీ, మాజీ సీనియర్‌ దౌత్యవేత్తలపైన ‘పెగసస్‌’ రహస్య గూఢచర్యానికి ఎలా పాల్పడిందీ, స్థానిక ప్రైవసీ చట్టాలు అనుమతించిన పరిమితు లను కూడా మించి ఎలా జర్మనీ ప్రయోజనాలకు, స్వతంత్ర విధానా లకూ, హానికరంగా ‘పెగసస్‌’ తయారయిందీ కూడా జర్మన్‌ లాయర్లు ప్రకటించాల్సి వచ్చింది. మన పాలకుల్లాగానే జర్మనీ పాలకులు కూడా స్థానిక ప్రజల పౌర అవసరాలను తీర్చడంలో విఫలమై, ఆందోళన లను తట్టుకోలేక వాటిని అణచివేయడం కోసం పెగసస్‌ అనే ప్రపంచ రాక్షస కూపీ సంస్థను అరువు తెచ్చుకుని చేతులు కాల్చుకున్నారు. ఈ సంగతి తెలిసొచ్చిన తరువాతనే జర్మన్‌ పాలకులు పెగసస్‌ వల్ల దేశ సార్వభౌమాధికారానికి వచ్చిన పెనుప్రమాదాన్ని గుర్తించి ‘లెంపలు’ వాయించుకుని దారికి రావలసి వచ్చింది. దాంతో స్వతంత్రదేశాలు జాగ్రత్త పడవలసి వచ్చిందన్నది ఆలస్యంగానైనా వచ్చిన గుర్తింపు. 

కానీ మన పాలకులకు మాత్రం ఆ గ్రహింపు ఇప్పటికీ లేదు. మన సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సంధించిన ప్రశ్నల పరంపరను తప్పిం చుకునే క్రమంలో మన పాలకులు మరికొంత లోతుగా దిగబడి పోయారు. అత్యున్నత న్యాయస్థానంలో ప్రభుత్వం కోర్టు కోరినట్టుగా తన వాంగ్మూలాన్ని దాఖలు చేయడమంటే అది బహిరంగమైపోయి జాతీయ భద్రతకు వ్యతిరేకంగా రాజీపడటమే అవుతుందని అసలు విచారణ నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. కమిటీల మీద కమి టీల పేరిట కాలయాపన చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. అంతే తప్ప దేశసార్వభౌమాధికారానికి, దేశ ప్రజల పౌర హక్కులకు, ప్రజా స్వామ్య హక్కులకోసం ఆందోళన చెందుతున్న జర్నలిస్టులు, పలు వురు మేధావులు, చివరికి వందలాదిమంది మాజీ న్యాయమూర్తులు, కేంద్ర మాజీ అధికారులు, మాజీ పోలీసు అధికారులు తదితర ప్రజా తంత్ర శక్తులపై కూపీ కోసం పెగసస్‌తో రహస్య ఒప్పందం చేసుకున్న పాలకులు మాత్రం జర్మనీ పాలకుల బాట పట్టలేకపోయారు. 

కనీసం నెల రోజుల క్రితమే సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి  డి.వై. చంద్రచూడ్‌ ఇలా స్పష్టం చేశారు. ‘దేశంలో ప్రజాస్వామ్యమూ, సత్యమూ చెట్టపట్టాలు కట్టుకుని ముందుగా సాగాల్సిన అవసరం ఉంది. పాలకులకు నిజాన్ని బల్లగుద్దినట్టు చెప్పితీరాలి. దేశంలో అధి కారంలో ఉన్నవాళ్లు ఎవరన్నా కానివ్వండి... చివరికి అది రాచరిక మైనా లేదా సర్వశక్తిమంతమైన ప్రభుత్వమైనా సరే ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే సత్యమన్నదీ, వాస్తవమన్నదీ బహిరంగం కావా ల్సిందే. సత్య ప్రకటన అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థ చేతిలో బలమైన కత్తీ, రక్షణాయుధమూ. అందుకే ప్రజాస్వామ్య జీవనం మన హక్కు. సత్యం పలకడమంటే అధికార శక్తిని నిలువరించడమే. నియంతృత్వ పోకడలను తలెత్తనివ్వకుండా ముందస్తుగానే జాగ్రత్తపడడం. కొన్ని ప్రభుత్వాలు నిరంతరం అబద్ధాల మీదనే బతకడానికి కారణం– ప్రజ లపైన తన పెత్తనాన్ని కొనసాగించుకోవడానికే సుమా!’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. దేశంలో ‘పెగసస్‌’ ప్రమాదకర గూఢచర్యం... అందునా పాలకుల రహస్య ఒప్పందంతో కొనసాగుతున్న తరు ణంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రకటన వెలువడడం వల్ల అది సమకాలీన వాస్తవ పరిస్థితులకు పట్టిన నిలువుటద్దం! క్రమంగా ఒక దేశం, ఒకే ఎన్నిక నినాదం క్రమంగా ఒక దేశం, శాశ్వతంగా ఒక ప్రధానమంత్రి ఉండాలన్న ఆలోచన వైపునకు ఆచరణాత్మకం కాకూడదన్న హెచ్చరి కకు సుప్రీం సీనియర్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ తాజా ప్రకటనే నిదర్శనం. అందుకే నిజాన్ని పాతిపెట్టి అబద్ధమాడితే, ఆ నోటికి అరవీసెడు సున్నం పెట్టమన్న సామెత పుట్టుకొచ్చిందా?


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు