గిడుగు బాటలో విశిష్ట పదకోశం

20 Jul, 2021 02:44 IST|Sakshi

రెండో మాట

మన తెలుగునాట కూడా వైద్య భాషకు ప్రాచీన చరిత్ర ఉందని తెలుగువచనానికి నిండైన, మెండైన కండను, గుండెను దండిగా అందించిన మహా కథకులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి నిరూపించారు. తెలుగులో వైద్య నిఘంటువులు చాలా తక్కువ. చాలాకాలంగా వినియోగంలోకి వచ్చి, అలవాటై స్థిరపడిన వైద్య భాషా పదాలను యథాతథంగా వాడుకుంటూనే, తెలుగులో నూతన పద సృష్టికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాంటి విశిష్ట ప్రయత్నానికి పూనుకున్న ఈ సరికొత్త వైద్య నిఘంటువు కర్త మరెవరో కాదు, సాక్షాత్తు తెలుగువారి తొలిభాషా శాస్త్రవేత్త, వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడైన గిడుగు పిడుగు’ (గిడుగు వేంకట రామమూర్తి) వారి మనుమడైన రామమూర్తి.

అర్థం కాని చదువు వ్యర్థం కాబట్టి అర్థ వివరణతో కూడిన శబ్దం లేదా పదమే ఏ పుస్తకాని కయినా వన్నె తెస్తుంది. వాసికెక్కిస్తుంది. అగణిత సంఖ్యలో మానవజాతి విజ్ఞానానికి, వికాసానికి ఆరోగ్య భాగ్యానికి దోహదం చేస్తున్న సకల శాస్త్రాలను వాటిలో క్షణానికొక తీరుగా అనుక్షణం ముమ్మరిస్తున్న శబ్దజాలానికి అర్థ గౌరవం కల్గించే నిఘంటువులు ఎన్నో శరవేగాన వెలువడుతున్న రోజులివి. ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క నిఘంటువు మాత్రమేకాదు, ఒక్కొక్క శాస్త్రంలో పలు విభా గాలకు సహితం ప్రత్యేక నిఘంటువులు వస్తున్నాయి. అందులోనూ ఈ వింగడింపు శాస్త్ర, సాంకేతిక విషయాలకు మరింత అవసరమవు తోంది. అలాంటి వాటిలో వైద్య, విజ్ఞాన, శాస్త్ర నిఘంటువు ఒకటి, కణ విభజనలా పెరిగిపోతున్న ఒకే శాస్త్రంలోని పలు విభాగాలలో నిత్యనూతనంగా దూసుకువస్తున్న పద సంపదకు అర్థ గౌరవం కల్పిం చాల్సి ఉంది. ఆయా శాస్త్రాలలోని సాంకేతిక పరమైన పదాలకు అవసరాలు గ్రీకు, లాటిన్‌ సంస్కృత భాషలలో ఉండగా, క్రమంగా వాటిని ఆంగ్ల భాషా శాస్త్ర నిపుణుల సాయంతో ఇంగ్లిష్‌ వైద్య నిఘంటువులను ఆంగ్లేయులు రూపొందించుకోగా ఈ మూడు భాషల పద సంపద ఆధారంగా ప్రపంచంలోని ఇతర వైద్య విజ్ఞాన నిఘంటువులూ వెలిశాయి. భాషావేత్త, కవి మోలియర్‌ అంటూండే వాడట. ‘ప్రతీ అంశం మీద ఎంతో కొంత జ్ఞానకాంతి ప్రసరిస్తుండా లని. ఆ పనిని నిఘంటువులు, ప్రత్యేక శాస్త్ర నిఘంటువులూ చేస్తూం టాయి. అందులోనూ ఒక భాషా నిఘంటువులోని పదజాలాన్ని మరో భాషలోకి బట్వాడా చేయడం క్లిష్టతరమైన పని. ఒక్కో పదానికే కాదు, ఒక్కొక్క వర్ణానికి (అక్షరానికి) సహితం భిన్న వర్ణాలు ఉంటాయి. ఇలాంటి బృహత్కార్యాన్ని ప్రపంచంలో తొలి ప్రయత్నంగా భుజాల కెత్తుకున్న వాడు క్రీ.శ. ఒకటవ శతాబ్దినాటి చైనీస్‌ నైఘంటికుడు హ్యూషెన్‌. దాని విశేషమేమంటే, ఆ చైనీస్‌ నిఘంటువు రూపుదిద్దు కున్న ఆనాటి నుంచి ఈ క్షణం దాకా చెక్కు చెదరకుండా ప్రాచుర్యం లోనూ, వినియోగంలోనూ ఉండడం! తొలి ద్విభాషా నిఘంటువు క్రీ.పూ. 2000 ఏళ్లనాటి సమేరియన్‌ అక్కాడియన్‌ ప్రతి, తొలి త్రిభాషా నిఘంటువు సుమేరియన్‌– బాబిలోనియన్‌– హిట్టయిట్‌ భాషల్లో వెలువడింది. స్థానిక మాండలికాలలో ప్రపంచంలో తొలి సారిగా క్రీ.పూ. 15వ సంవత్సరంలో తొలి ప్రతి వెలువడిందట! ఔషధీ నిఘంటువు (ఫార్మకోపియా) మొదటిసారిగా మెసపటోమి యన్‌ మట్టి పలకలపై అవతరించిందంటారు!

మానవాళి విజ్ఞానం వికాస దశలలో కాలిడిన తరువాత శబ్ద, రూప నిర్ణయంతో అకారాది క్రమంలో నిఘంటువులు వెలువడుతూ వచ్చాయి. మన తెలుగునాట కూడా వైద్య భాషకు ప్రాచీన చరిత్ర ఉందని తెలుగువచనానికి నిండైన, మెండైన కండను, గుండెను దండిగా అందించిన మహా కథకులు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి నిరూ పించారు. తెలుగులో వైద్య నిఘంటువులు చాలా తక్కువ. ఆ తక్కువ లోనే వెలువడిన మిక్కిలిగా ఎన్నదగినవి ఒకటి రెండు కన్నా ఎక్కువ లేవనే చెప్పాలి. తెలుగు అకాడమీ వారు ఒక చిన్న పొత్తంగా వైద్య నిఘంటువు వెలువరించగా, డాక్టర్‌. పి.హెచ్‌.బి.ఎస్‌. శర్మ ‘మెడికల్‌ డిక్షనరీ’ మకుటంతో ఒక ఇంగ్లిష్‌– తెలుగు వైద్య నిఘంటువును వైద్య విద్యార్థులకోసమని ‘స్టూడెంట్‌ ఎడిషన్‌’ గా సంకలనం చేసారు. కాగా, విద్యార్థులకు పండితులకు, సాహితీవేత్తలకు వినియోగపడే విధంగా శ్రీపాదవారు తెలుగులో ఒక వైద్య నిఘంటువును 1948లో తొలి ముద్రణగా తీసుకొచ్చారు. పదాన్ని, విషయాన్ని శీఘ్రంగా అర్థం చేసుకోలేని సమయాల్లో ‘పండితులకున్నూ ఈ నిఘంటువు ఆవశ్యకం ఏర్పడుతుంద’ని తెలుపుతూ ఆయన ‘ఇది సమగ్రం కావు, ఇందులో చేరవలసినవే ఎక్కువ. అవి సేకరిస్తూనే ఉండాలి అని చెప్పడం. నిఘంటు నిర్మాణం ‘ఇదే ఆఖరిది, ఇదే ప్రమాణం, ఇదే పరసీమ’ అని మనం చెప్పలేమని చెప్పక చెప్పడమే! చాలాకాలంగా వినియోగంలోకి వచ్చి, అలవాటై స్థిరపడిన వైద్య భాషా పదాలను యథాత«థంగా వాడుకుంటూనే, తెలుగులో నూతన పద సృష్టికి నిరంతరం ప్రయత్ని స్తూనే ఉండాలి. అలాంటి విశిష్ట ప్రయత్నంలోనికి ఇటీవల పూనుకున్న ఈ సరికొత్త వైద్య నిఘంటువు కర్త మరెవరో కాదు, సాక్షాత్తు తెలు గువారి తొలిభాషా శాస్త్రవేత్త, వ్యావహారిక భాషా ఉద్యమ పితామహు డైన గిడుగు పిడుగు’ (గిడుగు వేంకట రామమూర్తి) వారి మనుమడైన రామమూర్తి. తాతపేరే మనవడి పేరు అయితే ఈ మనవడి తండ్రి సుప్రసిద్ధ సాహితీవేత్త డా. గిడుగు సీతాపతి కావడం మరో విశేషం. తాత, తండ్రులనుంచి  సాహిత్యస్ఫూర్తిని పుణికి పుచ్చుకున్న చిన్న రామ్మూర్తి చిన్నప్పటి నుండి కడుపులో పుండుతో ఏళ్లతరబడి బాధ పడుతూ రావడం వల్ల వైద్య విజ్ఞానంపై ఆసక్తి కలిగి, చివరికి ఈ వైద్య నిఘంటు నిర్మాణానికి పూనిక వహించడం విశేషం! సులభ గ్రాహ్యంగా చిన రామమూర్తి ఈ వైద్య నిఘంటువును కమ్మని తెలుగు లోకి (ఇంగ్లిష్‌–తెలుగు) తీసుకొచ్చినందుకు బహుధా ప్రశంసనీ యులు. వేల ఏళ్లుగా, తరాల తరబడి దేశవాళీ వైద్యులూ, ఆధునిక వైద్యులూ పెంచి పోషించుతూ వచ్చిన వైద్య విజ్ఞానం మీద ఆధా రపడిన పదసంపద ఎంతో రామమూర్తి– నిఘంటువులో ఉంది. అందరికీ అర్థమయ్యే పదాలూ, వివరణలూ ఈ అనువాద రచనలో ఉన్నాయి. ఒక్కొక్క వ్యాధికి చెందిన ఎన్నో రకాల పద సంపద ఉంది.

ప్రపంచ ప్రసిద్ధికెక్కిన దేశాలలో ఈజిప్టు, భారత, చైనా దేశాలు ప్రాచీన వైద్య విధానాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. ‘ఎడ్మిన్‌స్మిత్‌ పాపిరస్‌’ గ్రంథం ప్రకారం మన ఆయుర్వేదం ఎంత ప్రాచీన వైద్య విధానమో క్రీ.పూ. 3000 ఏళ్ళనాడే వెల్లడైంది. ఆయుర్వేద వైద్యం, వనమూలికల ప్రాశస్త్యం తెలిసిన తొలి భారతీయ రచన ‘అధర్వ వేదం’ (ఇనుప రాతియుగం). క్రీస్తుపూర్వం తొలి వైదికానం తర కాలంలో ఈ వైద్యం ప్రజారోగ్యంలోకి దూసుకువచ్చింది. ఆనాటి వైద్య శిఖామణులు పెక్కుమంది భౌతికవాదులుగా ఉన్నందుననే మనిషి ఆరోగ్యం, అనారోగ్యం ‘విధి నిర్ణయం’ కాదనీ ముందే రాసి పెట్టిన తంతు కాదనీ చెబుతూ ‘మానవ ప్రయత్నం ద్వారా సంకల్పం ద్వారా జీవితాన్ని పొడిగించడం సాధ్యమని’ చరకుడు తన వైద్య సంపుణం ‘చరక సంహిత’లో స్పష్టం చేశాడు. అలాగే శుశ్రుతుడు కూడా తన ‘శుశ్రుత సంహిత’ లో వైద్యం లక్ష్యమే ‘రోగుల రోగ లక్ష ణాల్ని’ కనిపెట్టి నయం చేయటం. అనారోగ్యవంతుల్ని కనిపెట్టి నయం చేయటం ఆరోగ్యవంతుల్ని కాపాడటం, జీవితాన్ని పొడిగించ డమని చెప్పాడు. ఆయుర్వేద గ్రంథాలు ప్రస్తావించిన ఏడు రకాల వైద్య చికిత్సలూ ఈనాటికీ అమలులో ఉన్నాయి. వీటిలోని పద జాలానికి శ్రీపాదవారు అర్థవివరణ ఇచ్చారు. ఆయుర్వేద వైద్య శాస్త్రం లోని ఎనిమిది శాఖలూ ఆధునిక వైద్యంలో కూడా ఉన్నాయి. 

‘ఆధునిక వైద్యశాస్త్ర పితామహుడు’గా పేర్కొంటున్న గ్రీక్‌ వైద్య శిఖామణి హిప్పోక్రటెస్‌ క్రీ.పూ. 4–3 శతాబ్దులనాటివాడు. ఈయన వైద్యులకు ప్రవచించి, నిర్దేశించిన నైతిక సూత్రాలనూ, బాధ్యతలనూ, ‘హిప్పోక్రాటిక్‌ వోత్‌’ అంటారు. ఇవి ఈ రోజుకీ వైద్యులకు శిరో ధార్యాలే. నిజానికి ఈ ఆదేశాలను పాటించే వైద్యులు నిజమైన ప్రజా సేవకులుగా మారి ప్రజల గౌరవాభినందనలు పొందగలుగుతారు. అలాగే ఒక రోగం భవిష్యత్‌ స్వరూపాన్ని నిర్ధారించగలదాన్ని ‘ప్రొగ్నా సిస్‌’ అంటారు. అందానికి సంబంధించిన తన గ్రంథానికి హిప్పో క్రటిస్‌ అదే పేరు పెట్టుకున్నాడు. ఆధునిక కాలంలో జన్యు లక్షణాలను వంశపారపర్యంగా ‘జల్లెడ’ పట్టినట్టు వివరించే ‘డీఎన్‌ఏ’ నిర్మాణ రహస్యం కాస్తా బద్దలయిన తర్వాత జీవశాస్త్రాన్ని జాంబవంతుడి అంగలపైన వేగవంతం చేసే మోలిక్యూలర్‌ (పరమాణువుల సము దాయం) బయోలజీకి తలుపులు తెరచుకున్నాయి! లూయీపాశ్చర్, రాబర్డ్‌ కో, కాడి బెర్నార్డ్‌ వైద్య శాస్త్రంలో నవీన శాస్త్రీయ పద్ధతులకు అంకురార్పణ చేశారు. ఇలా వైద్యవృత్తికి చెందిన విభిన్న శాఖలు, ఉప శాఖల నుంచి నిరంతరం నవీన ప్రయోగాల ద్వారా కుప్పలు తెప్ప లుగా ఊడిపడే వైద్యశాస్త్ర, సాంకేతిక పదాలకు అకారాదిగానూ, ఆరో పాల పరంగానూ అర్థాలు, అర్థవివరణలూ ముంచుకొస్తున్న తరు ణంలో చిన గిడుగు రామమూర్తి సిద్ధపరిచిన ఈ అభినవ వైద్య నిఘం టువు చాలా విలువైనదిగా భావించాలి. అనేక వైద్య పదాలకు ఇంతకు ముందు వైద్య నిఘంటువులలో లేని సరళ సుబోధకమైన వివరణలు ఎన్నో ఉన్నాయి. బహుశా తెలుగు ప్రతికి సంబంధించినంత వరకు రామమూర్తి నిఘంటువు ఔషధ పరిశ్రమకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ మెర్క్‌ కంపెనీ ఆధ్వర్యంలో వెలువడిన ‘ది మెర్క్‌ మాన్యువల్‌ ఆఫ్‌ మెడికల్‌ ఇన్ఫర్మేషన్‌ గ్రంథానికి (2003 ప్రచురణ), ఆక్స్‌ఫర్డ్‌– హెచ్‌.బి. సంస్థ సంయుక్త ప్రచురణగా వెలువడిన ‘న్యూ మెడికల్‌ డిక్షనరీ’కి (2010 ప్రచురణ)గానీ తీసిపోదని అనిపిస్తోంది. మెర్క్‌ మాన్యువల్‌ 163 సంవత్సరాలుగా ప్రచారంలో ఉంది. చివరగా, నిఘంటు నిర్మాణం కత్తిమీద సాములాంటిది. ఇది వైద్యశాస్త్ర, సాంకే తిక పద నిఘంటువే అయితే దాని నిర్మాణం మరింత అసిధారా వ్రతమే. అందుకే 19వ శతాబ్దపు ఫ్రెంచి మేధావులలో ఒకరు. ఫ్రెంచి భాషా పద వ్యుత్పత్తి శాస్త్ర నిఘంటువును రూపొందించి ‘నా నిఘం టువును ఎలా నిర్మించాను’ అన్న ఉత్తమ గ్రం«థాన్ని రచించిన ఎమిలీ లిత్రే అన్న మాటల్ని ఒకసారి ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం.

‘‘నిఘంటు రచన మతి చెడిన వాడి వృత్తి కాదు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా, నిఘంటు నిర్మాణం జరగాలి. ఇందుకు నైఘంటికుడి మనస్సు నిర్మలంగా ఉండాలి. సందేహ నివృత్తి చేయగల స్పష్టత ఉండాలి. కాని ఒకటి మాత్రం నిజం, అప్పుడ ప్పుడూ ఈ వృత్తి నిఘంటుకారుడి బుర్ర తినేస్తుంది. నిద్రాహారాలకు నోచుకోని పని రాక్షసుడిగా మారుస్తుంది. (a profession which drives one mad)


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు