ఈ ఒప్పందం ఆదర్శం, అనుసరణీయం

16 Nov, 2021 01:26 IST|Sakshi

రెండో మాట

దేశాల మధ్య, ఒకే దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య జలవిద్యుత్‌ పంపిణీ సమస్యలకు ‘సంప్రదింపుల’తో ఇచ్చిపుచ్చుకునే ప్రవృత్తి చాలా అవసరం. ‘నిర్బంధ మధ్యవర్తిత్వం కన్నా పరస్పర సహకారం, సౌభ్రాతృత్వం ద్వారానే’ తగాదాలు పరిష్కారం కావాలనీ, అవుతాయనీ ఆంధ్ర, ఒడిశా ముఖ్యమంత్రులు ఇటీవలే మార్గం చూపారు. రెండు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలపై వీరిరువురు చరిత్రాత్మక సంధి కుదుర్చుకున్నారు. ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా జలవనరులు, సరిహద్దు విద్యుత్‌ తదితర అంశాలను పరిష్కరించుకోవడంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవగాహనకు వచ్చారు. ఈ ఒప్పందాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ‘ఒజ్జబంతి’గా భావించాలి.

ఏపీ, ఒడిశాల మధ్య దశాబ్దాలుగా పరి ష్కారానికి నోచుకోకుండా కొన్ని కీలక సమ స్యలు వాయిదాపడి ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి సంబం ధించి, ఉభయ రాష్ట్రాలు నిర్ణయాత్మకమైన చరిత్రాత్మక సంధి కుదుర్చు కోవడానికి తొలిసారిగా ఇటీవలే అంకురార్పణ జరిగింది. రెండు రాష్ట్రాల ప్రజల ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా జలవనరులు, సరి హద్దు విద్యుత్‌ తదితర అంశాలను పరిష్కరించుకోవడంపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. మొదటిసారిగా ఫలవంతమైన చర్చలు జరిగినందుకు సంతోషం ప్రకటిస్తూ, ఇవి త్వరలోనే సత్ఫలితా లనివ్వ గలవని ఏపీ, ఒడిశా సీఎంలు వైఎస్‌ జగన్, నవీన్‌ పట్నాయక్‌లు ప్రకటించారు.                            – (పత్రికా వార్తలు 9–11–21)

ఫెడరల్‌ వ్యవస్థ, రాజ్యాంగ విలువలు బతికిబట్టకట్టాలంటే అంతర్‌ రాష్ట్ర ప్రజలకూ, విద్యుత్‌ పంపిణీకి సంబంధించిన వివాదాల పరి ష్కారం కీలకమవుతుంది. అలాగే రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల మధ్య, ఒకే ప్రాంతంలోని పలు గ్రామాల మధ్య జల వివాదాల పరి ష్కారం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో, ఆంధ్ర– ఒడిశాల మధ్య 60 ఏళ్ల తర్వాత చరిత్రాత్మక ఒడంబడిక కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ‘ఒజ్జబంతి’గా భావించాలి. వలస పాలనలోనూ, దేశ స్వాతంత్య్రానంతరమూ అనేక న్యాయస్థానాలు ప్రాంతాల మధ్య జలవిద్యుత్‌ పంపిణీ వ్యవస్థను ఎలా పరిష్కరించు కోవచ్చునో పెక్కు సందర్భాలలో సూచనలు చేస్తూ వచ్చాయి. దాదాపుగా 60 ఏళ్లపాటు నిద్రమత్తులో ఉన్న పాలకుల చండితనాన్ని వదిలించడానికి ఏ వ్యవస్థ కూడా ప్రయత్నించలేదు. ఈ పరిస్థితుల్లో దేశాలమధ్యనే కాకుండా, ఒకే దేశంలోని ప్రాంతాల మధ్య నెలకొన్న జల, విద్యుత్‌ పంపిణీ వ్యవస్థల తీరు తెన్నుల్ని, వాటిపై వివాదాలను కూడా సవరించడానికి ప్రపంచ స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. 1966లో హెల్సెంకీ అంతర్జాతీయ మహాసభ ఈ విషయ మైన కొన్ని శాశ్వత నిర్ణయాలు ప్రకటించి, యావత్‌ ప్రపంచానికీ ఆదేశించి ఉందని మరచిపోరాదు.

అలాగే చరిత్రను మనం మరచిపోకపోతే... వలస పాలనలో బ్రిటిష్‌ ప్రభుత్వ నిర్ణయాలను కూడా ధిక్కరించి గోదావరి, మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలకు చెందిన ప్రజాబాహుళ్యం మౌలిక సమస్యను గుర్తించి పరిష్కరించిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ మనకు గుర్తుకు రాక మానడు. ఈ రెండు ప్రాంతాల రైతాంగం కరువు భూములకు సేద్య ధారలు అందించిన వ్యక్తిని మనం ఎన్నటికీ మరచిపోలేం. మను షులు తోటి మనుషుల్ని కుక్కల్లా పీక్కుతినేలా చేసిన ‘ధాత’ కరువు నుంచి ప్రజా బాహుళ్యాన్ని రక్షించడానికి 19వ శతాబ్దంలోనే గోదావరి ఆనకట్ట నిర్మాణాన్ని తలపెట్టిన మహనీ యుడు కాటన్‌. ఈ కారణం చేతనే ఆనాటినుంచి ఈనాటిదాకా గోదావరి మండలంలో ప్రజలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సందర్భంగా వల్లించే స్తోత్రాలలో ‘కాట నాయ నమః’ అని తలచుకుంటూనే ఉండటం మరో విశేషం!

అలాగే కొండల్ని పిండిచేసి, మహానదుల గమనాల్నే ప్రజాసేవకు మళ్లించగల మహనీయులుగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోక్ష గుండం విశ్వేశ్వరయ్య, శొంఠి రామమూర్తి, డాక్టర్‌ కె.ఎల్‌. రావు లాంటి వారు వెలుగొందారు. వీరు దేశంలోని జల, విద్యుత్‌ ప్రాజె క్టుల నిర్మాణ రంగంలో మహోద్దండ పిండాలు! బ్రహ్మపుత్రా నదీ జలాలను భారతదేశంలోకి పారించి ఏడాది పొడవునా అన్ని ప్రాంతా లకు, ఆరుగాలమూ అందేటట్టు భారతదేశం నడిబొడ్డులో మహా సాగర నిర్మాణానికి ఏతమెత్తినవాడు కాటన్‌. ఎందుకంటే, నీటికి రాజ కీయం తెలియదు. విద్యుత్‌ ప్రవాహం భౌతికశాస్త్ర సూత్రాలపై తప్ప కేవలం రాజకీయ ఆదేశాలపై సాగదని విశ్వసించినవాళ్లు మన ఇంజ నీర్లూ, ప్రాజెక్టుల నిర్మాణ నిపుణులూ! 1966 నాటి హెల్సెంకీ అంత ర్జాతీయ సంధిపత్రం, నిర్ణయాలు, నిబంధనలు కూడా ఇదే సత్యాన్ని చాటి చెప్పాయి. దేశాల మధ్య, ఒకే దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య జలవిద్యుత్‌ పంపిణీ సమస్యలకు ‘సంప్రదింపుల’తో ఇచ్చి పుచ్చుకునే ప్రవృత్తి చాలా అవసరం. ఈ ఇచ్చి పుచ్చుకునేతత్వం వల్లే సమస్యలకు పరిష్కారం సాధ్యమనీ, ‘నిర్బంధ మధ్యవర్తిత్వంకన్నా పరస్పర సహ కారం, సౌభ్రాతృత్వం ద్వారానే’ తగాదాలు పరిష్కారం కావాలనీ హెల్సెంకీ ప్రపంచ మహాసభ అప్పట్లోనే సూత్రీకరించింది.

అంతేకాదు, అంతర్జాతీయ జల, విద్యుత్‌ పంపిణీకి సంబంధిం చిన తగాదాలు న్యాయస్థానాల తీర్పులతోనే సంతృప్తికరంగా పరి ష్కారం కాజాలవు. ప్రపంచదేశాల జల తగాదాలను, సరిహద్దు వివా దాలను నిశితంగా అధ్యయనం చేసిన నిపుణుడు బార్బర్‌ (1959) ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాడు. రివర్‌బోర్డులు ఉండి కూడా తగా దాలు తీరడం లేదు. కనుకనే ‘నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు’ అన్న సామెత పుట్టుకొచ్చి ఉంటుంది. ఇప్పుడు ‘ఎత్తిపోతల పథకాల’ ద్వారా పల్లంలోని నీరుసైతం ఎత్తులకు ఎగబాకి పోగలుగుతోంది! కనుకనే డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి తన హయాంలో దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ తలపెట్టలేని విధంగా డజన్ల కొద్దీ ప్రాజెక్టులను ప్రాంతాల వారీగా ఆచరణసాధ్యం చేయడానికి ప్రయత్నించారు. ఈ ప్రాజెక్టులను తన హయాంలోనే నిర్మించి ఆచరణలో ప్రజల అనుభ వంలోకి రావడానికి ఉద్యమించిన మేటి నాయకుడు వైఎస్సార్‌. ప్రాజె క్టుల నిర్మాణంలో ఆయన రాజకీయాలకు, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా వ్యవహరించగలిగారు. కాబట్టే కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య పేరిట వెలిగొండ ప్రాజెక్టును ఆయన ఆనాడు ఆవిష్కరించారు 

అదే స్ఫూర్తిని ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ తనయుడు వైఎస్‌ జగన్‌ ‘నవరత్నాల సాక్ష్యంగా కొనసాగిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం, పేదల అభ్యున్నతి కోసం, అనేక సంక్షేమ పథకా లను ప్రకటించి అమలు చేస్తున్నారు. ఈ పథకాల అమలు ద్వారా రాష్ట్రవ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే ఉద్దండ పిండంగా గుర్తింపు పొంది, తన వ్యక్తిత్వ ప్రతిభతో ఆదర్శ జీవిగా వైఎస్‌ జగన్‌ నిలబడ గల్గుతున్నారు. ఆ స్ఫూర్తితోనే మన పొరుగునే ఉన్న ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అయిన ఏపీ సీఎం... రెండు రాష్ట్రాల మధ్య ఆరు దశాబ్దాలుగా పేరుకుపోయిన ప్రతిష్టంభనను ఛేదించగలిగారు! ఈ విశాలదృష్టి లేనందునే బచావత్, బ్రిజేష్‌ ట్రిబ్యునళ్ల చుట్టూ ఇన్నా ళ్లుగా కాళ్ళకు బలపం కట్టుకొని తిరగవలసి వచ్చింది. 

అమెరికాలో మసాచూసెట్స్‌ రాష్ట్రానికీ దాని దిగువన ఉన్న కనెక్టికట్‌ రాష్ట్రానికి మధ్య జల, విద్యుత్‌ కేటాయింపుల విషయంలో సంవత్సరాల తరబడీ తలెత్తిన తగాదాల సందర్భంగా ఆ రెండు రాష్ట్రాల పాలకులకు జస్టిస్‌ బట్లర్‌ తన చరిత్రాత్మక తీర్పుతో హితబోధ చేశాడు. ‘ఉభయత్రా స్థానిక పరిస్థితులను బట్టి స్వార్థాలు బలిసి ఉంటాయి. కాబట్టి పరీవాహక ప్రాంత రాష్ట్రాల హక్కులకు సంబం ధించిన చట్టాలు తగాదాల పరిష్కారానికి తోడ్పడవు, హక్కుల సమా నతా సూత్రం ప్రాతిపదికపైన మాత్రమే నీటి తగాదాలు పరిష్కారం కావాలి. అంతేగాదు, నీ రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య జల వివాదాల పంపిణీపై తగాదా వస్తే నీవు ఏం చేస్తావో ఆలోచించుకొని, ఆ సూత్రాన్నే రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే జల వివాదానికి కూడా వర్తింపచేసుకోమన్నారు, జస్టిస్‌ బట్లర్‌! 

ఆ ఇంగిత జ్ఞానంతోటే, ప్రజాప్రయోజనాల దృష్టితోటే వైఎస్‌ జగన్‌–నవీన్‌ పట్నాయక్‌లు... దశాబ్దాలుగా నానుతున్న ఆంధ్ర– ఒడిశాల తగాదాలకు భరతవాక్యం చెబుతూ చారిత్రక  ఒడంబడికకు శ్రీకారం చుట్టగలిగారు! కాబట్టి, ఇకపై పరస్పరం నిందలు మోపుకొనే నీలి మాటలకు, గాలి మాటలకు విలువుండదు! చిత్రకారుడి సజీవ చిత్రానికి ఎంత విలువ ఉంటుందో, ఆంధ్ర–ఒడిశాల చారిత్రక ఒప్పం దానికి ఆచరణలో అంత విలువ రాగలదని, రావాలని ఆశిద్దాం!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు