‘నడమంత్రపు’ ఎన్నికలకు సన్నాహాలా!

26 Jul, 2022 00:10 IST|Sakshi

రెండో మాట

‘ఒక దేశం, ఒక ఎన్నిక, ఒక ప్రధాని’ అని కేంద్రంలోని అధికార బీజేపీ గత కొంతకాలంగా నినదిస్తూనే ఉంది. వీలు చిక్కినప్పుడల్లా లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయమై లా కమిషన్‌ను గిల్లుతూనే ఉంది. తరచూ ఎన్నికల వల్ల పడే ఖాజానా భారాన్ని తప్పించడానికీ, జన జీవితానికి విఘాతం కలగకుండా చూడటానికీ జమిలి ఎన్నికలే తరుణోపాయం అని చెబుతోంది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలనా పరిస్థితులు అస్తుబిస్తుగా ఉండటం కూడా దీనికి ఒక ప్రధాన కారణం. ఈ తరహా ఎన్నికల నిర్వహణ ద్వారా ఏకపక్ష పాలనకూ, ఏక వ్యక్తి నియంతృత్వ పోకడలకూ ప్రయత్నిస్తోందనే అనుమానాలు బలంగానే ఉన్నాయి.

నిర్ణీత తేదీ రాకముందే 2024లో జరగాల్సిన ఎన్నికలు జరుగుతాయా? ఈ ‘నడమంత్రపు’ ఎన్నికల కోసం బీజేపీ–ఆరెస్సెస్‌ పాలకులు తహతహలాడటం ఇవాళ అర్ధంతరంగా పుట్టిన ‘పుండు’ కాదు. 2014లో ప్రధానమంత్రి పదవిని నరేంద్ర మోదీ చేపట్టిన రోజు నుంచీ ‘ఒక దేశం, ఒక ఎన్నిక, ఒక ప్రధాని’ నినాదం కొనసాగుతూనే ఉంది. గత ఎనిమిదేళ్లుగా తనకు వీలు చిక్కినప్పుడల్లా లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయమై కేంద్ర ‘లా కమిషన్‌’ను పదేపదే గిల్లుతూ వచ్చారు మోదీ. అదే విషయాన్ని బీజేపీ న్యాయ శాఖామంత్రి కిరెన్‌ రిజిజూ (22 జూలై 2022) లోక్‌సభలో ప్రకటిస్తూ, జమిలి ఎన్నికలు జరిపే అంశాన్ని పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఇందుకు ‘కారణాల’ను పేర్కొంటూ, తరచూ ఎన్నికల వల్ల సాధారణ జన జీవితానికి విఘాతం కలుగుతోందనీ, ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించి పోతున్నాయనీ అన్నారు. వీటికితోడు ఖజానాపై భారం పడుతోంది కాబట్టి, జమిలి ఎన్నికలు నిర్వహించడం అవసరమని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి చెప్పారు. 

జారిపోతున్న విలువలు
అయితే దీనికి ప్రతిపక్షాలు స్పందిస్తూ, ‘ధరల పెరుగుదలపైనా, జీఎస్టీ రూపంలో రాష్ట్రాలపై పడుతున్న దుర్భర భారం పైనా’ ముందు చర్చ జరగాలని కోరాయి. బీజేపీ పాలకుల కోర్కె పైనే 21వ లా కమిషన్‌ తన ముసాయిదా నివేదికలో ‘ఉప్పు’ అందిస్తూ, ఈ ‘చిట్కా’తో దేశం ‘తరచూ ఎన్నికల బెడద’ నుంచి విముక్తి అవు తుందని వత్తాసు పలికింది. ఇందుకు అనుగుణంగానే 22వ లా కమిషన్‌ను ‘ఏర్పాటు’ చేసిన పాలకులు – కమిషన్‌ను అధ్యక్షుడు, ఇతర సభ్యులు లేకుండానే వదిలేసింది. ఫలితంగా కమిషన్‌ పదవీ కాలం మూడేళ్లూ గడిచిపోనుండటం పాలకుల దురుద్దేశానికి నిదర్శనం. 

‘జమిలి’ ఎన్నికల ఎత్తుగడ వెనక బీజేపీ పాలనలో ఒక్కొక్కటిగా జారిపోతున్న ప్రజాస్వామిక విలువలు ఉన్నాయని మరచిపోరాదు. విచిత్రమేమంటే, మోదీ కేంద్ర మంత్రివర్గంలోని మంత్రులలో కనీసం 42 శాతం మంది తమపైన క్రిమినల్‌ కేసులున్నాయని బాహాటంగా ప్రకటించుకున్నారు. అయినా కొలది రోజులనాడు జరిగిన నూతన రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా క్రిమినల్‌ కేసులతో మసకబారి పోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వేసే ఓట్లు చెల్లనేరవని ప్రకటించే అధికారం తనకు ఉన్నా కూడా ఉన్నత న్యాయస్థానం గొంతు విప్పలేకపోయింది. 

ఏక పక్ష పాలనకేనా?
500 పైచిలుకు పార్లమెంట్‌ సభ్యులలో 250 మందికి పైగా అవినీతి పరులు ఉన్నారని, సాధికారికంగా రుజువులతో లెక్కదీసి దేశ ప్రజల ముందుంచిన అత్యున్నత విచారణ సంస్థల నివేదికలను ఇంతవరకూ కాదనగల ధైర్యం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకత్వానికి లేదు. ఇలాంటి సర్వవ్యాపిత పతన దశల్లో ఉన్న రాజ్యాంగ వ్యవస్థల నీడలో 2014లో ఢిల్లీ పీఠం ఎక్కిన మోదీ ప్రభుత్వం వచ్చీరావడంతోనే ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం’ (ఆర్‌పీఏ)లో, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎలాంటి నేరానికి పాల్పడ్డా, చార్జిషీట్‌ అతనిపై నమోదై ఉన్నా ఏడేళ్లకు తక్కువ గాకుండా ఖైదు శిక్ష విధించాలన్న బిల్లును పక్కకు పెట్టేసింది. బీజేపీ ‘జమిలి’ ఎన్నికలకు అనుసరించబోతున్న వ్యూహానికి ఇది పక్కా నిదర్శనం.

నేరస్థులైన రాజకీయవేత్తలు తమపై ఆరోపణలు రుజువయ్యే దాకా లేదా విడుదలయ్యేదాకా ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హులు కారని తొలి చట్టం నిర్దేశించింది. ఈ చట్ట నిబంధనలున్న ముసాయిదా బిల్లును కాస్తా మోదీ ప్రభుత్వం పక్కకు నెట్టేయడం రానున్న ‘జమిలి’ ఎన్నికల ద్వారా ఏకపక్ష పాలనకు, ఏక వ్యక్తి నియంతృత్వ పోకడలకు ‘తాతాచార్యుల ముద్ర’ వేయడంగానే భావించాలి. అంతకుముందు, స్వాతంత్య్రం తర్వాత తొలి పాతిక ముప్పయ్యేళ్ల దాకా ‘పళ్ల బిగువుతో’ కాపాడుకుంటూ వచ్చిన రాజ్యాంగ నిర్దేశాలు, ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనలు క్రమంగా ‘డుల్లి’పోతూ వచ్చాయి.  అయినా బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో బీజేపీ ఎమ్మెల్యేలపై నమోదైన అనేక కేసులను స్వచ్ఛంద సంస్థ – ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌) పదేపదే దేశ ప్రజల దృష్టికి తెస్తూనే ఉంది. ‘మసకబారి’ ఎన్నికైన సభ్యుల సంఖ్య 2007 నుంచీ మరీ రెట్టింపు అవుతోందని 2014 నుంచీ సుప్రీంకోర్టు కూడా మొత్తుకుంటూనే ఉంది. 

రబ్బరు స్టాంపు కాకూడదు
గిరిజనుల నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్మూ కూడా ఈ విషయాలన్నీ గమనించాలి. పాలకులకు ‘రబ్బరు స్టాంపు’గా మారకూడదు. దేశ జనాభాలో 2011 జనగణన ప్రకారం, 10 కోట్ల 40 లక్షలమంది ఆదివాసీ  ప్రజలు (8.6 శాతం మంది) ఉన్నారని మరచిపోరాదు. అంతేగాదు, ఏడు రాష్ట్రాలలోని షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల వారు 2020లో కూడా వేధింపులకు గురి కావలసి వచ్చిందని జాతీయ స్థాయిలో నేరాలు నమోదు చేసిన తాజా నివేదిక వెల్లడించింది. అందుకే ‘సమత’ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, గనులు, ఖనిజాలు, ప్రజారక్షణ సంస్థ అధ్యక్షుడు రవి రెబ్బాప్రగడ... రాష్ట్ర పతిగా ద్రౌపదీ ముర్మూ షెడ్యూల్డ్‌ తెగల ప్రయోజనాలను మరింతగా కాపాడాల్సిన అవసరాన్ని మరీమరీ గుర్తు చేస్తున్నారు. దళిత వర్గం నుంచి వచ్చిన రామ్‌నాథ్‌ కోవింద్‌ను కూడా ఆ పదవిలోకి వచ్చేట్టు చేయగలిగింది భారతీయ జనతా పార్టీయే. అయినా దళితుల బతు కులు ఇసుమంత కూడా మెరుగు పడకపోగా, బీజేపీ ఎన్నికల ప్రయోజనాల కోసమే ‘పావు చెక్క’గా వినియోగపడక తప్పలేదు.

గతంలో దేశంలో విధించిన మద్య నిషేధం కాస్తా ఉన్నట్టుండి మధ్యలో మటుమాయమైనప్పుడు శ్రీశ్రీ వ్యంగ్య ధోరణిలో కాంగ్రెస్‌ ‘పొడి’ రాష్ట్రాలన్నీ ‘తడి’ చేస్తోందని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఆ దశ కూడా దాటిపోయింది. ‘తురా’ పట్టణంలోని తన ‘ఫామ్‌ హౌస్‌’ను ‘వేశ్యా గృహం’గా మార్చాడన్న ఆరోపణపైన మేఘాలయ బీజేపీ నాయకుడు బెర్నార్డ్‌ మరాక్‌ కోసం ఆ రాష్ట్ర పోలీసులు గాలింపును ఉధృతం చేశారని పత్రికల్లో కథనాలు వచ్చాయి. 

‘జమిలి’ ఎన్నికల ప్రతిపాదనపై కొంతకాలంగా బీజేపీ పట్టు పట్టడానికి – మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కర్ణాటక సహా పలు బీజేపీ రాష్ట్రాలలో పాలనా పరిస్థితులు అస్తుబిస్తుగా ఉండటం కూడా ఒక ప్రధాన కారణం. ఈ సందర్భంగా భారతదేశ ప్రసిద్ధ జాతీయ పక్షపత్రిక ‘ఫ్రంట్‌ లైన్‌’ తాజా సంచిక ‘మహా సర్కస్‌’ మకుటంతో మహారాష్ట్ర పరిణామాలపై గొప్ప వ్యంగ్య చిత్రం ప్రచురించింది. మహారాష్ట్ర తర్వాత ప్రభుత్వాల్ని పడగొట్టే బీజేపీ తర్వాత పడగొట్టే రాష్ట్రమేది? అని ఆ చిత్రం ప్రశ్నించింది. ఈ సర్కస్‌ నడుపుతున్న వారిలో మోదీతో పాటు హోంమంత్రి అమిత్‌ షా మరోవైపు నుంచి ‘కమ్చీ’ ఝళిపిస్తూ ఇకమీదట ఉండేది ‘ఒకే భారత్, అదే బీజేపీ భారత్‌’ అని ముక్తాయింపు విసురుతాడు. అదే ‘నడమంత్రపు ఎన్నికల’కు వచ్చే ‘జమిలి భారత్‌’! 2024 వరకూ ప్రస్తుత పాలన కొనసాగకపోవచ్చు. ఈ అనుమానాల్ని రేకెత్తిస్తున్నది మరెవరో కాదు – తన ఉనికి అనుమానంలో పడిన రాజకీయ పార్టీయే, దాని పాలకులే! ‘గొంతెమ్మ కోర్కెలన్నీ ఎండమావుల నీళ్లే’నన్న సామెత రాజకీయ పాలకుల విషయంలో అక్షరసత్యం!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు