కాలం చెల్లిన చట్టాలు మీకు చుట్టాలా? 

23 Feb, 2021 00:24 IST|Sakshi

రెండో మాట

కాలం చెల్లిన పురాతన చట్టాలను రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అవును పురాతన, కాలం చెల్లిన చట్టాలను కాలగర్భంలో కలపవలసిందే. కానీ అవే కాలం చెల్లిన చట్టాలను రైతుల మీద, వయోజనుల మీద, విద్యార్థుల మీద, రాజకీయ కార్యకర్తల మీద, ప్రశ్నను ఆయుధంగా మలుచుకున్నవారి మీద ప్రయోగించడాన్ని ఏమనాలి? ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న వారిని ఎప్పటిదో బ్రిటిష్‌ కాలంనాటి దేశద్రోహ చట్టంతో నోళ్లు మూయించడానికి ప్రయత్నించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దానికి జవాబు స్పష్టంగా అర్థం అవుతోంది. వర్గదోపిడీ ప్రయోజనాల రక్షణ కోసమే కొత్త చట్టాలు తేవాలి. ఆ ప్రయోజనాల రక్షణకు పనికొస్తాయంటే పాత చట్టాలైనా సరే వాటిని పట్టుకుని వేలాడాలి.

‘కాలం చెల్లిన పురాతన చట్టాలను రద్దు చేయక తప్పదు. తద్వారా దేశంలో వర్తక, వ్యాపార, వాణిజ్యాలను మరింత సులభతరం చేయాలి.’ –ప్రధాని మోదీ (నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకటన: 20 ఫిబ్రవరి 21)
‘మీ పాలకుడెవరో చెప్పాలి. ఆ దేశ చట్టాలు ఎలా ఉండబోతాయో చెప్తా.’ – సెయింట్‌ అగస్తీన్‌

ఇంతకూ  ఆ ‘కాలం చెల్లిన చట్టాలు’ ఏమిటో ప్రధానమంత్రి వివరించలేకపోయారు. భారత పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అణచివేస్తూ వలస సామ్రాజ్య పాలకులైన బ్రిటిష్‌ వారు 200 ఏళ్లకు పైగా అమలు చేసిన, ఈ నాటికీ స్వతంత్ర భారతంలో ‘దేశద్రోహం’ పేరిట పౌరులపై పాలకులు కొనసాగిస్తున్న ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ లాంటి చట్టాలకు కూడా ప్రధాని ప్రకటించిన పురాతన చట్టాల ‘రద్దు పద్దు’ వర్తిస్తుందా లేదా అన్నది తెలియదు. పురాతన చట్టాలకు ‘కాలం చెల్లినప్పుడు’ 1860 నాటి పీనల్‌ కోడ్, అందులోని ‘దేశద్రోహం’ అభియోగాన్ని ప్రభుత్వ ›ప్రజా వ్యతిరేక విధానాలను, చర్యలను ప్రశ్నించే భారత పౌర సమాజంపైన, ఆందోళన చేసే వయో జనుల పైన, విద్యార్థులపైన, రాజకీయ కార్యకర్తలపైన నోళ్లు నొక్కడానికి వినియోగించే వలస చట్టంలోని ‘124–ఎ’ సెక్షన్, ఆ తర్వాత క్రమంగా దేశవాళీ పాలకులు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో చొప్పించిన ‘153–ఎ సెక్షన్‌లకు కూడా ‘కాలం చెల్లిన పురాతన చట్టాల రద్దు’ వర్తిస్తుందా లేదా? రైతు వ్యవసాయక ప్రయోజనాలకు వ్యతిరేకంగా రూపొం దించిన మూడు చట్టాలను రద్దుచేయాలని రైతులు, వ్యవసాయ కార్మికులు సాగిస్తున్న మహోద్యమాన్ని అణచడానికి ఉద్దేశించిన చట్టాలు కూడా ‘కాలం చెల్లిన చట్టాల’ కిందికి వస్తాయా, రావా?

బ్రిటిష్‌ వాడి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ వచ్చింది 1860లో. భారత స్వాతంత్య్రం కోసం ప్రారంభమైన ప్రజల తొలి తిరుగుబాటు వచ్చిన మూడేళ్లకు. 1870లో పెనాల్టీలు విధించి, ప్రజల నోళ్లు మూయిం చడానికి 124–ఎ సెక్షన్‌ను ప్రభుత్వంపై తిరుగుబాటు అనే క్లాజు కింద ‘దేశద్రోహ’ నేరాన్ని పీనల్‌ కోడ్‌లోని 6వ అధ్యాయంలో దూర్చారు. ‘కామన్‌ లా’ చరిత్రలో ‘దేశద్రోహం’ అనే నేరారోపణను మొదటి సారిగా ఇరికించడం అదే ప్రారంభం. అయితే 1947లో మన దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత దేశ  రాజ్యాంగ నిర్ణయ సభ పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసే ‘దేశద్రోహ’ అభియోగంపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. స్వాతంత్య్ర పోరాట యోధులకు వ్యతిరేకంగా వారి భావ ప్రకటనా స్వేచ్ఛను అణచడానికి ఉద్దేశించిన బ్రిటిష్‌ పాలకుల చట్టం సెడిషన్‌ అని రాజ్యాంగ నిర్ణయ సభ ప్రకటిం చాల్సి వచ్చింది. జవహర్‌లాల్‌ నెహ్రూ సహితం వాచా ఈ దుర్మార్గపు సెక్షన్‌ (124–ఎ)ను వ్యతిరేకించినవాడే.

అయినా బ్రిటిష్‌ వాడు ప్రవేశపెట్టిన ఈ విద్రోహ చట్టం అటు కాంగ్రెస్‌ హయాంలోనూ, తర్వాత బీజేపీ–ఎన్‌డీఏ పాలనలోనూ ఈ రోజుకీ కొనసాగుతూనే వస్తోంది. ఫలితంగా పాలకుల ప్రజా వ్యతిరేక చర్యలను ప్రతిఘటించే వ్యక్తులపైన బ్రిటిష్‌ వాడి ‘సెక్షన్‌ 124–ఎ’ కొనసాగుతున్న పాత అణచివేత చట్టాలలో ఒకటి. ప్రధాని మోదీ రద్దు కావాలని ప్రకటిం చిన కాలం చెల్లిన చట్టాలలోకి ఇది కూడా వస్తుందా, రాదా? పండిం చిన పంటకు కనీస గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయాలన్న మహో ద్యమ సమయంలో ఇటీవల 180 మంది రైతులు హతులయ్యారని మరచిపోరాదు. పార్లమెంటు స్థాయీ సంఘాలకు, విచారణ కమిటీలకు, ఆమోదించిన బిల్లులను పరిశీలించడానికి నివేదించే చట్టబద్ధ ధర్మాన్ని కూడా తోసిరాజంటున్న పాలకుల దృష్టిలో ‘కాలం చెల్లిన చట్టాల రద్దుపద్దు’ కిందికి మరే చట్టాలు వస్తాయి? 

ఆ విషయాన్ని కూడా మోదీ కుండబద్దలు కొట్టి చెప్పడంతో పాలక విధానాల స్వరూప, స్వభావాలు కాస్తా బయట పడిపో యాయి. ఆయన రద్దుచేయమని కోరుతున్న ‘ఆ కాలం చెల్లిన చట్టాలు’ ప్రపంచ బ్యాంకు ‘సంస్కరణల’ పేరిట ప్రవేశపెట్టిన, బడా పెట్టుబడి దారీ వర్తక వాణిజ్య ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించేందుకు వీలుగా రద్దుచేయాలని మాత్రమే. అందుకే కేంద్రం తెచ్చిన మూడు చట్టాలు (పంటలకు కనీస మద్దతు ధరను చట్టంగా రూపొందిం చడానికి నిరాకరిస్తూ) కార్పొరేట్‌ వ్యవసాయ క్షేత్రాల ప్రయోజనాల రక్షణకు ఉద్దేశించినవని మరచిపోరాదు. కనుకనే రాష్ట్రాలలోని రైతాంగ వ్యవసాయ ప్రయోజనాల రక్షణ కోసం రాజ్యాంగం 7వ షెడ్యూల్‌లోని రెండవ జాబితాలో 14వ ఎంట్రీని చేర్చవలసివచ్చిందని 78 మంది విశ్రాంత ఐఏఎస్, ఏపీఎస్‌ ఉన్నతాధికారులు ఒక ప్రకట నలో గుర్తుచేయాల్సి వచ్చింది. ఈ జాబితా కింద వ్యవసాయ సంబం ధిత నిబంధనలు పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశాలని నిర్దేశించినా, వాటిలో బీజేపీ పాలకులు తల దూర్చడానికి కారణం వలస చట్టాలేనని గుర్తించడం అవసరం.

ఈ పాత వలస చట్టాలకు కాలం చెల్లినా మన పాలకులు అనుసరించడానికి కారణం– వర్గదోపిడీ ప్రయోజనాల రక్షణ కోసమే. దేశ పౌరుల కుల, మత, వర్గ విభజనలో భాగంగా సరికొత్త ‘పౌరసత్వ సవరణ’ చట్టాన్ని,‘నేషనల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌’ చట్టాన్ని కేంద్రం ప్రవేశపెట్టడాన్ని సుప్రీంకోర్టు, పెక్కుమంది న్యాయవాదులు నిరసించి ఆందోళన చేస్తున్నా ‘కాలం చెల్లిన పాత చట్టాలే’ మన చుట్టాలుగా అమలులో ఉంటున్నాయి. పాలకుల ప్రజావ్యతిరేక చర్యలకు నిరసనగా గత కొన్నేళ్లుగా కేంద్ర పురస్కారాలు పొందిన వివిధ రంగాలకు చెందిన పలువురు దేశ భక్తులు తమ బిరుద బీరాలను తిరిగి కేంద్ర ప్రభుత్వానికి వాపసు చేసి మరీ నిరసన తెలిపిన సంగతిని మరువరాదు. పౌర సమాజ హితాన్ని కోరి ఉద్యమించిన గోవింద్‌ పన్సారే, ప్రొఫెసర్‌ కల్బుర్గి, నరేంద్ర దబోల్కర్, గౌరీ లంకేష్‌ లాంటి హేతువాద ఉద్యమ ఉద్దండ మేధావులు బీజేపీ పాలనలోనే నర్మగర్భ హత్యలకు గురైనా ‘కాలం చెల్లిన చట్టాలు’ మాత్రం రద్దు కావడం లేదు.

అనేక సామాజిక దురన్యాయాలపై ధ్వజమెత్తి  ప్రజల పక్షాన నిలబడిన సుప్రీంకోర్టు విశిష్ట మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పి.బి.సవంత్, ఆయన సన్నిహిత సహచరుడు, బొంబాయి హైకోర్టు జడ్జి పి.జి.కోల్స్‌ పాటిల్‌ సంయుక్తంగా ఎల్గార్‌ పరిషత్‌ దళిత సభలు నిర్వహించారు. బ్రిటిష్‌ కాలం నాటి దళిత వ్యతిరేక పాలకుల దాష్టీ కాలకు నిరసనగా ఏటా జరిపే సభలను అణచడానికి కేంద్ర ప్రభుత్వం ‘దేశద్రోహ’ నేర చట్టాన్ని దుమ్ముదులిపి ఆ సభలపై ప్రయోగించింది. దానికి పైన పేర్కొన్న ఇద్దరు ప్రముఖ న్యాయ మూర్తులు హాజరైన సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఉరుమురిమి మంగళం మీద పడిన’ చందంగా సభకు హాజరుకాని పౌర ఉద్యమ కార్యకర్తలపైనా, రచయితలపైనా ‘దేశద్రోహ’ నేరంపై నిర్బంధ విధానం అమలు జరిపి ప్రభుత్వం అభాసుపాలైంది. 

గౌరవ సుప్రీం జస్టిస్‌ ధనంజయ చంద్రచూడ్, ‘నేటి పరిస్థితుల్లో ‘ఒక వ్యంగ్య చిత్రకారుడ్ని (కార్టూనిస్టు) దేశద్రోహ నేరం కింద జైలుకి పంపించడమంటే దేశ రాజ్యాంగ చట్టం విఫలమైనట్టే’ నని ప్రకటిం చడం నేడు దేశ పాలనా రంగం ఏ స్థితిలో కూరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ‘దేశద్రోహ’ నేరం కింద బ్రిటిష్‌ ఇండియాలో జరిగిన తొలి అరెస్టు బాలగంగాధర తిలక్‌ది కాగా, తర్వాత అరెస్టులన్నీ గాంధీ, సుభాష్‌ చంద్రబోస్, ఆజాద్, నెహ్రూలవి. ఇవే చట్టాల ఆధారంగా ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. క్రమంగా పాలకవర్గాలు తమ విధానాల రక్షణార్థం న్యాయస్థానాల మీద ఆధార పడాల్సి రావడం, అలాగే న్యాయ మూర్తులు కొందరు తమ ప్రయో జనాల రక్షణార్థం పాలక శక్తులపై ఆధారపడవలసి రావడం వల్ల దేశంలో ప్రజాస్వామ్యానికి రానున్న ప్రమాదాన్ని గ్రహించి  తన ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన న్యాయమూర్తుల పత్రికా గోష్ఠిలో (12 జనవరి 2018) జస్టిస్‌ చలమేశ్వర్‌ హెచ్చరించారని మరువరాదు. abkprasad2006@yahoo.co.in    

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

>
మరిన్ని వార్తలు