కాకో, కీకీ, టూకీ = ‘పెగసస్‌’

27 Jul, 2021 00:38 IST|Sakshi

రెండో మాట

ఇజ్రాయెల్‌ సైనికావసరాలకు ఉద్దేశించిన ‘పెగసస్‌’ నిఘా సాఫ్ట్‌వేర్‌ని ఆ దేశ సైబర్‌ నిఘా సంస్థ ‘ఎన్‌.ఎస్‌.ఓ.’ గ్రూప్‌ ఇండియా లాంటి వర్ధమాన దేశాల ప్రభుత్వాలకు, పాలకవర్గాలకు అమ్మి సొమ్ము చేసుకుంటోంది. అలా పెగసస్‌ రహస్యంగా ఆయాదేశాల్లోని మొబైల్‌ ఫోన్స్‌లోకి సరికొత్త సాంకేతిక మార్గాల ద్వారా చొరబడుతోంది. సాగుభూముల రక్షణ కోసం సత్యాగ్రహంలో ఉన్న రైతులలో 300 మంది చనిపోతే కనీస సానుభూతి కూడా చూపని పాషాణ ప్రభువర్గం ఉన్న చోట ‘పెగసస్‌’ నిఘా సాఫ్ట్‌వేర్‌దే పెత్తనమవుతున్న రోజులివి! మొత్తంమీద చూస్తే ఇజ్రాయెల్‌ సైబర్‌ నిఘా సంస్థ (ఎన్‌.ఎస్‌.ఓ.) నడుస్తున్నది ప్రపంచ ప్రజా ప్రయోజనాల భక్షణకే గానీ రక్షణకు మాత్రం కాదు.

ఈ హెడ్‌లైన్‌కి ప్రేరణ ప్రసిద్ధ కార్టూనిస్టు, అంతర్జాతీయ పురస్కారాలు పొందిన సాక్షి వ్యంగ్య చిత్రకారుడు శంకర్‌ కుంచెపోటు! ప్రపంచంలో నేడు ప్రభు త్వాల స్థాయిలోనూ, పాలకవర్గాల స్థాయిలోనూ తమ ఉనికికోసం, తమ నీడ చూసుకుని అనుక్షణం పీడకలల్లో జీవిస్తున్న రాజకీయులు ఆధారపడేది కూపీ లేదా నిఘా సంస్థల మీదనే. ఇప్పుడు ప్రపంచ స్థాయిలోనే ఇజ్రాయెల్‌ కేంద్రంగా ప్రభుత్వ ఆశీర్వాదాలతో వ్యవస్థాపిత మైన ఎన్‌.ఎస్‌.ఓ అనే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పడి పనిచేస్తున్న సరికొత్త నిఘా సాఫ్ట్‌వేర్‌ ‘పెగసస్‌’. ఇది అంతర్జాతీయ గూఢచారి చేతికి అంది వచ్చిన ప్రమాదకరమైన వినూత్న సాంకేతిక పరికరం. ఇతర దేశాలపై అమెరికా తలపెట్టిన అనేక దుర్మార్గపు చర్యలను ఎంతమాత్రం సహిం చలేని అమెరికా సైనికాధికారులలో ఒకరైన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ తెగించి ప్రపంచదేశాలకు, ప్రజలకు హెచ్చరికగా ప్రస్తుత ఇజ్రాయెల్‌ నిఘా సాఫ్ట్‌వేర్‌ గురించి కూడా ఈ కింది సందేశం అందించారు. ‘‘ఈ దుర్మార్గపు ఇజ్రాయెల్‌ కూపీ(నిఘా) స్పైవేర్‌ సాంకేతిక వ్యవస్థ క్రయ విక్రయాలను తక్షణమే ఆపించివేయడానికి మనం ప్రయత్నించకపోతే అది 50,000 మంది జీవితాల్ని కాదు, కోట్లాది పౌరుల జీవితాలకే ఎసరు పెడుతుంది. రహస్యంగా ఎక్కడికక్కడ ప్రపంచంలోని బలహీన మైన స్థానిక ప్రభుత్వాల, అధికారుల అండతో ప్రజలపై సాగించే ఈ నిఘా వ్యాపారంపైన ప్రపంచవ్యాపితంగానే మారటోరియం ప్రకటిం చడం అనివార్యం’’
– అఖిల యూరప్‌ మండలి ఫ్రాన్స్‌లో నిర్వహించిన సమావేశానికి స్నోడెన్‌ పంపిన వీడియో సందేశం

ఇజ్రాయెల్‌ సైనికావసరాలకు ప్రత్యేకించి ఉద్దేశించిన ‘పెగసస్‌’ నిఘా సాఫ్ట్‌వేర్‌ని ‘ఎన్‌.ఎస్‌.ఓ.’ అనే సైబర్‌ నిఘా సంస్థ.. ఇండియా లాంటి వర్ధమాన దేశాల ప్రభుత్వాలకు, పాలక వర్గాలకు అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటుంది. అలా పెగసస్‌ రహస్యంగా ఆయా దేశాల్లోని మొబైల్‌ ఫోన్స్‌లోకి సరికొత్త సాంకేతిక మార్గాల ద్వారా చొరబడుతోంది. ఫోన్స్‌లోకే కాదు, ఈ–మెయిల్స్‌లోకి.. వివిధ ప్రాంతాల్లోని స్థానిక సమాచార కేంద్రాల్లోకి రహస్య సాంకేతిక మార్గాల ద్వారా వీడియోలలోకి మైక్రోఫోన్స్‌ చివరికి కెమెరాల్లోకి కూడా దూరి వాటిని వాడే వాడకందార్ల సంభాషణల్ని రహస్యంగా రికార్డు చేస్తుంది. ఇక పెగసస్‌ కూపీ వ్యవస్థను వాటంగా వాడుకునే వారిలో ప్రజల, ఆందోళనకారుల నోరు నొక్కేసే ప్రభుత్వాలున్నాయి. అందుకే పెగసస్‌ అత్యాధునిక నిఘా సాఫ్ట్‌వేర్‌ గురించి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల పరిరక్షణా సంస్థ అధిపతి ప్రస్తావిస్తూ ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థల్లో జర్నలిస్టులు, మానవహక్కుల పరిరక్షకులు మన సమాజాల్లో అనుపమానమైన సేవలందిస్తున్నారు. అలాంటి వారిని గొంతెత్తకుండా అణచివేయడంవల్ల మనందరం బాధలకు గురవుతా’’మని హెచ్చరించారు.

ఈ సందర్భంగా, 2017లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన పూర్వరంగాన్ని గుర్తు చేసేవిధంగా మహారాష్ట్ర బీజేపీ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ విడుదల చేసిన ఒక ప్రకటన ఆశ్చర్యం గొల్పేదిగా ఉంది. ‘‘2019 నవంబర్‌లో మహారాష్ట్ర ప్రభుత్వ సమాచార, ప్రచార సంబంధాల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఆధ్వర్యంలో అయిదుగురు సభ్యు లతో కూడిన బృందం ఇజ్రాయెల్‌ వెళ్లింది. ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ప్రజాసంబంధాలలో కొత్త పోకడలను గురించి, సోషల్‌ మీడియాను ఉపయోగించుకునే నూతన పద్ధతులను అధ్య యనం చేయడం ఈ పర్యటన లక్ష్యం అని ఉంది. అయితే ఈ పర్యటన మహారాష్ట్రలో రాజ కీయ దుమారానికి తెర లేపింది’’. ఎందుకని అన్న ప్రశ్నకు ఫడ్నవీస్‌ ప్రకటనలో సమాధానం లేదు. కానీ సుప్రసిద్ధ పత్రిక ‘ది హిందూ’ ఆ రహస్యాన్ని బయటపెట్టింది. ఇజ్రాయెల్‌లోకి ప్రయాణం కట్టిన ఆ మహారాష్ట్ర ప్రభుత్వ బృందంలో ఉన్న ఐదుగురు అధికారుల పేర్లు బయటపెడుతూ, వీరిలో ఒక అధికారి... ఈ బృందం ఇజ్రాయెల్‌ పర్యటనకు కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాక కేంద్ర ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అనుమతి ఇచ్చిందని, ఇజ్రాయెల్‌ ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చిన ఆహ్వానంపైనే తమ బృందం ఇజ్రాయెల్‌కి వెళుతోందని వెల్లడించారని ‘ది హిందూ’ పేర్కొంది.
ప్రస్తుతం రిటైర్‌ అయిపోయిన అజయ్‌ అంబేడ్కర్‌ 2019 నవం బర్‌ 17 నుంచి 22వ తేదీవరకు ఈ బృందం జరిపిన ఇజ్రాయెల్‌ సందర్శన గురించిన నివేదిక సమర్పించారని తెలిపారు. అంతేకాదు, ఈ బృందం ఇజ్రాయెల్‌  పర్యటన లక్ష్యం ‘ఇజ్రాయెల్‌లో వ్యవసాయ సమస్యలను అధ్యయనం చేయడానికి ఉద్దేశించిందని ముందు ప్రక టించారు గానీ పర్యటన ఎజెండాలో అసలు వ్యవసాయం బాగోగుల గురించి తెలుసుకునే విషయమై ఎలాంటి ప్రస్తావనే లేదని, ఇజ్రాయెల్‌లో ప్రచార పద్ధతులు, అక్కడి ప్రభుత్వ ప్రజా సంబంధాల శాఖలు ఎలా పని చేస్తున్నాయి, ప్రచార వ్యూహాల్ని ఎలా అభివృద్ధి చేసు కోవాలన్న సమస్యల్ని అవగాహన చేసుకోవడం ఈ పర్యటన ఉద్దేశ మనీ అజయ్‌ అంబేడ్కర్‌ తెలిపారని ‘హిందూ’ వెల్లడించింది. అసలు ఇంతకీ ఈ బృందం ఇజ్రాయెల్‌ పర్యటనను ఎవరు ఆర్గనైజ్‌ చేశారన్న విషయం ఇంతవరకూ ఎవరికీ తెలియదని ‘హిందూ’ విలేకరి అలోక్‌ దేశ్‌ పాండే కథనం!

కొన్ని రోజుల క్రితం ఆవు పేడ కోవిడ్‌ వ్యాధికి నివారణోపాయం కాదని ప్రకటించిన ఓ పాత్రికేయుడ్ని మణిపూర్‌ జైలులో రెండు నెలల పాటు ప్రభుత్వం నిర్బంధించింది. ఇలా ఎన్నో రకాలుగా వందలు వేలాదిమంది పౌరుల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోంది. ‘పెగసస్‌’ నిఘా సాఫ్ట్‌వేర్‌ సహాయంతో సీబీఐ అధిపతి అలోక్‌ వర్మను 2018లో ఆ పదవి నుంచి ఉద్వాసన చెప్పించారు. ఆయననే కాదు, మరో ఇద్దరు సీబీఐ అధికారులు రాకేష్‌ ఆస్థాన, ఎ.కె. శర్మలనూ పదవుల నుంచి తప్పించేశారు. అలాగే 2017– 2019 మధ్యనే జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో సీనియర్‌ రీసెర్చర్‌ అయిన కన్హయ్యకుమార్‌ సహా అంబేడ్కర్‌ అనుయాయులైన ఖలీద్, అనిర్భన్‌ భట్టాచార్య, వాణిజ్యోత్స్న లహరి, కార్మిక హక్కుల సంఘ నాయకులు శివ గోపాల్‌ మిశ్రా, అంజనీకుమార్, ప్రొఫెసర్‌ సరోజ్‌గిరి, శాంతి ఉద్యమ నాయ కుడు సుబ్రాంశు చౌదరి, మాజీ బీబీసీ జర్నలిస్ట్‌ సందీప్‌ కుమార్‌ రాయ్‌ శౌజీ వగైరాలను, మొన్న పౌర హక్కుల నాయకులు అనేక మందిని నిష్కారణ అభియోగాలు మోపి జైళ్ల పాల్జేశారు. చివరికి ప్రొఫెసర్‌ కల్బుర్గి, గోవింద పన్సారే, గౌరీలంకేష్‌ హత్యలకు కారకు లైన వారి ఆచూకీని మభ్యపెట్టారు. నిన్నగాక మొన్ననే ఆదివాసీల సేవలో తల నెరసిన ఫాదరీ స్టెయిన్‌ స్వామిని జైళ్లకు, కోర్టులకూ తిప్పి తిప్పి పరమ దురవస్థలో దివంగతుడు కావలసి వచ్చినందుకు ఏ పాలకుడ్ని నమ్మాలి, ఏ న్యాయ వ్యవస్థను విశ్వసించాలి? సాగు భూముల రక్షణ కోసం సత్యాగ్రహంలో ఉన్న రైతులలో 300 మంది చనిపోతే కనీస సానుభూతి కూడా చూపని పాషాణ ప్రభువర్గం ఉన్న చోట ‘పెగసస్‌’ నిఘా సాఫ్ట్‌వేర్‌దే పెత్తనమవుతున్న రోజులివి! ఈ పరి స్థితుల్లోనే చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) పేరిట 2015–2019 మధ్య అరెస్టు చేసిన వారి సంఖ్య 72 శాతం పెరిగినా పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. విచారణా లేదు! ఏతావాతా ఇజ్రాయెల్‌ సైబర్‌ నిఘా సంస్థ ఎన్‌.ఎస్‌.ఓ. నడుస్తున్నది ప్రపంచ ప్రజాప్రయోజనాల భక్షణకేగానీ రక్షణకు మాత్రం కాదు. అదే సమ యంలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌ ఒక ప్రకటనలో రైతాంగ సమస్యల పరిష్కారం ప్రధాని మోదీ చేతిలో లేదని, అదానీ, అంబానీ చేతుల్లో ఉందని స్వయంగా వ్యవ సాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రకటించారని చెప్పడం– మన స్థితిగతులకు ఒక అద్దం! 



ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు