పేదల చెమటచుక్కల ‘రహస్యం’

24 Nov, 2020 00:28 IST|Sakshi

రెండో మాట

కష్టజీవులైన పేదసాదల గురించి. వారి రెక్కల కష్టం గురించి ఇంతగా పలవరించి, కలవరించిన పాలకుడు, నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు తప్ప మరొకరు లేరు. తన విశిష్ట కావ్యం ‘ఆముక్తమాల్యద’లో సమాజంలోని శూద్రజాతులైన అట్టడుగు పేదసాదల శ్రమజీవనానికి స్వయంగా రాయలు మనసారా నివాళులర్పిం చాడు..రాజుల, పాలకుల పాదాలలోని ‘భాగ్యచక్రాల సుడికి’ భుజాలపై కాయలుకాసేట్టు కాడి, మేడి పట్టి పొలాలు దున్ని కోటానుకోట్లుగా పంటల్ని పండించే సుజనులే పూజించదగిన సిసలైన ‘శూద్రజాతి’ అన్నాడు రాయలు. అలాంటి రాయల చరిత్రకు మరొక విశిష్ట కోణంగా మనముందున్న సమీక్షా గ్రంథం హంపీ విజయనగర శ్రీకృష్ణదేవరాయ చరిత్ర ‘రాయ’. విభిన్న జాతుల, భాషల మధ్య స్నేహపూర్వకమైన సాంస్కృతిక సంసర్గత ఎలా ‘పుచ్చపువ్వుల్లా’ రాయలకాలంలో విరియబూచిందో ‘రాయ’ గ్రంథకర్త శ్రీనివాసరెడ్డి అత్యద్భుతంగా ఈ రచనలో కళ్లముందు కట్టి చూపించాడు.

    ‘నృపుల పదహల రేఖల కెల్ల మాభు
     జాగ్రహల రేఖలే మూలమనుచు కోటి
     కొండలుగ ధాన్యరాసులు పండువీట 
     సుజన భజనైక విఖ్యాతి శూద్రజాతి’

కష్టజీవులైన పేదసాదల గురించి, వారి రెక్కల కష్టం గురించి ఇంతగా పలవరించి, కలవరించిన పాలకుడు, నాయకుడు ఎవరై ఉంటారు? అంతేగాదు, ఒక మహాసామ్రాజ్య విస్తరణకు పథకం వేసుకునే పాలకుడి లక్ష్యం సంపదను సమకూర్చుకోవడమే తప్ప మరొక లక్ష్యం వైపు మనసు మళ్లదు. కానీ ఆ మహాసామ్రాజ్య నిర్మాణం ఎంత గొప్ప దైనా, మరింత పెద్దదైనా సామ్రాజ్య ప్రజల బాగోగులు పట్టించుకోని రాజ్య మెందుకు, ఆ పాలకుడెందుకు? సామ్రాజ్యపు ఒడ్డుపొడుగులు కాదు చూడవలసింది, ఆ రాజ్యంలోని సంపద సృష్టికర్తలైన రైతన్నల పేదసాదల సౌకర్యార్థం పాలకుడు ఎన్ని చెరువులు కట్టించాడు, మరెన్ని పంటకాల్వలు తవ్వించాడన్నదే ముఖ్యం. అలాగే రైతాంగ ప్రజలపైన వారు పండించే పంటలపైన విధించే పన్నుల భారాన్ని పాలకుడు తగ్గించి, ఫలసాయాన్ని పెంచేందుకు తోడ్పడాలి. కనుకనే అతడు పదునుగా వ్యవహరించే ధర్మార్థాలు రెండూ వృద్ధి చెందు తాయని పాలకుడి ‘పాలసీ’గా సుమారు 400 ఏళ్లనాడు (16వ శతాబ్దం) ప్రవచించి ఎలుగెత్తి చాటిన ఆ పాలకుడెవరు?

ఇంకెవరు, తెలుగు–కన్నడ రాజ్యాధినేతగా దక్షిణభారతం లోనే గాక యావ ద్భారతంలోనే మహోన్నత ప్రజారహిత పాలకునిగా కీర్తి ప్రతిష్టలందుకున్న హంపీ (బళ్ళారి) విజయనగర పాలక చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు. తన విశిష్ట కావ్యం ‘ఆముక్త మాల్యద’లో సమా జంలోని శూద్రజాతులైన అట్టడుగు పేదసాదల శ్రమజీవనానికి స్వయంగా రాయలు మనసారా నివాళులర్పించాడు. అంటే ఈరోజుకీ తగిన గుర్తింపునకు నోచుకోని శూద్రజాతి శ్రమ విలువను, పాలకుల భోగభాగ్యాలకు ఆదరవుగానే ఉన్న ఆ దళిత జీవుల చెమటచుక్కల విలువను కీర్తించినవాడు రాయలు. రాజుల, పాలకుల పాదాలలోని ‘భాగ్యచక్రాల సుడికి’ భుజాలపై కాయలు కాసేట్టు కాడి, మేడి పట్టి పొలాలు దున్ని కోటానుకోట్లుగా పంటల్ని పండించే సుజనులే పూజిం చదగిన సిసలైన ‘శూద్రజాతి’ అన్నాడు రాయలు.

ఈ శూద్రజాతి వెనుక కులపిచ్చితో మనువు తన ధర్మశాస్త్రంలో చాలా కథ అల్లి ముఖం నుంచి, చేతులనుంచి, బాహువులనుంచి, చివరికి పాదాలనుంచి ఒకరిని పుట్టించి, నాలుగు వర్ణాలలో పాదా లనుంచి పుట్టిన వారికి ‘శూద్రులు’ అని పేరుపెట్టి న్యూనపరిచాడు. కులపిచ్చికొద్దీ అయిదవ కులం ఇకలేనట్టే నని (నాస్తితు పంచమ) శాసించేశాడు. ఈ తప్పుడు వర్ణ విభజనను ఈసడించుకున్న రాయలు కష్టజీవులైన దళిత శూద్రులనే సమాజశ్రేయస్సుకు మూలకందాలుగా కీర్తించాల్సిన సుజనులగా దండోరా వేశాడు. అలాంటి ప్రజల మని షిగా ఎదిగి సుమారు తన 30 ఏళ్ల రాజ్య పాలనలో భారతదేశంలోని కొందరు మహాచక్రవర్తులలోనే గాక ప్రపం చంలోని నలుగురే నలు గురు అత్యున్నత స్థాయి పాలకులు జూలియస్‌ సీజర్, అలెగ్జాండర్, నెపోలియన్‌ల సరసన శ్రీకృష్ణదేవ రాయలను అధిష్టించారు. 

అలాంటి రాయల చరిత్రకు మరొక విశిష్ట కోణంగా మనముం దున్న సమీక్షా గ్రంథం హంపీ విజయనగర శ్రీకృష్ణదేవరాయ చరిత్ర ‘రాయ’. ఈ గ్రంథకర్త శ్రీనివాసరెడ్డి. రాయల ఆముక్తమాల్యదనే గాక, కాళిదాసు ‘మేఘదూతం’ ‘మాళవికాగ్ని మిత్రం’ కావ్యరాజాలను కూడా ఆంగ్లంలోకి అనువదించిన పండితుడు, ప్రసిద్ధ అనువాదకుడు, సంగీత కళాకారుడూ బెర్కిలీ యూనివర్సిటీలో దక్షిణాసియా భాష లలోనూ, ప్రాచీన సాహిత్యాలనూ పుక్కిట పట్టిన ఉద్దండుడు. ప్రస్తుతం ఈయన బ్రౌన్‌ విశ్వవిద్యాలయంలో ఐఐటీ గాంధీనగర్‌లో అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. తన తాజా విశిష్ట రచన ‘రాయ’ బయటికి వెలువడే దాకా ఈ గ్రంథ రచయిత శ్రీనివాసరెడ్డి  దాదాపుగా ఒక అజ్ఞాత విశిష్ట రచయితగానే ఉండిపోయారన్న ప్రసిద్ధ రచయిత, విశ్లేషకుడైన రాజమోహన్‌ గాంధీ అంచనా అత్యుక్తి కాదు. 

అటు తన సామ్రాజ్య రక్షణలోనూ, సమకాలీన శత్రురాజులు కవ్విస్తే తప్ప యుద్ధాలకు దిగని పాలనా దక్షునిగా సాహితీ సమ రాంగణ చక్రవర్తిగా ‘దేశభాషలందు తెలుగు భాష’గా నిలిపి ప్రోత్స హించిన భాషా తాత్విక సమన్వయకర్తగా తన ఇరవయ్యే ళ్లపైబడిన పాలనాదక్షతతో పాలించి కీర్తిశిఖరాలకు చేరినవాడు రాయలు. ఆయన కాలం నాటి దక్కను పీఠభూమి ఉత్తర, దక్షిణ భారతాలకు చెందిన పలురకాల మతాల వారికి, అనేక భాషలకు, హిందూ–ముస్లింలకు, పోర్చుగీస్, పర్షియన్‌ దేశీయులకు కేంద్ర స్థానంగా వర్ధిల్లిన దశ. ఈ పరస్పర వైవిధ్యపూరితమైన విభిన్న జాతుల, భాషల మధ్య స్నేహ పూర్వకమైన సాంస్కృతిక సంసర్గత ఎలా ‘పుచ్చపువ్వుల్లా’ రాయల కాలంలో విరియబూచిందో ‘రాయ’ గ్రంథకర్త అత్యద్భుతంగా ఈ రచ నలో కళ్లముందు కట్టి చూపించాడు. 

గ్రంథకర్త కేవలం పోర్చుగీస్, పర్షియన్, చారిత్రక, సాహిత్య ఆధారాల పరిశీలనతోనే సరిపెట్టుకోకుండా ఇంతవరకూ పెక్కుమంది చరిత్రకారుల పురాతత్వవేత్తల దృష్టికి రాని పలు తెలుగు సాహిత్య ఆధారాలను కూడా తవ్వి పరిశోధించి, పరిశీలించిన దాని ఫలితమే ఈ తాజాగ్రం«థ రచన. ఈ తవ్వకంలో ఈ గ్రంథకర్త, ఎస్‌. కృష్ణస్వామి అయ్యంగార్, కె.ఎ.నీలకంఠశాస్త్రి, నేలటూరి వెంకట రమ ణయ్య లాంటి పురాతత్వవేత్తలు, ప్రసిద్ధ చరిత్రకారులు తవ్వి తీయగా, ప్రసిద్ధ చారిత్రక సాహిత్య గ్రంథాలకు తిరిగి ప్రాణంపోస్తున్న ఎమెస్కో ప్రచురణకర్తలు సంకలనకర్తలయిన విజయకుమార్, డి.చంద్రశేఖర్‌లు అభినందనీయులైనారు. ఒక్క ఊపుతో అపురూపంగా ఇటీవలనే వెలు వడిన (ఆలస్యంగానైనా) ఇంతకాలం ఆసక్తిగల చదువరులకు అలవి కాని ‘విజయనగర చరిత్ర– ఆధారాలు’ అనే చరిత్రకు సంబంధించిన మరిన్ని  ఆధారాల పేరిట రెండు విశిష్ట గ్రంథాలను పునర్నిర్మించడం ప్రశంసనీయం. సుమారు 5 శతాబ్దాల దాకా విస్తరించిన 20 మంది విజయనగర వంశీకుల చరిత్రకు అనుపమానమైన నివాళిగా శ్రీనివాస రెడ్డి సరికొత్త రచన ‘రాయ’ను పేర్కొనడం అతిశయోక్తి కాబోదు.

ఈ గ్రంథం విశిష్టత అంతా ఒక్క మాటలో– ‘ఉండంతలోనే కొండంత’గా చూపడంలోనే ఉంది. రాజ్య విస్తరణలో ఉన్న పాల కులకు ఎదుటివారిని జయించాలన్న తహతహ ఒక విజిగీష. కానీ రాయలు సమకాలీన యుద్ధాలలో అనివార్యంగా పాల్గొనవలసి వచ్చినా ఎదుటివారి కవ్వింపులకు ముగింపు తేవడానికే గాని పర రాజుల భూభాగాలను ఆక్రమించడానికి కాదు. ఇందుకు పక్కా ఉదా హరణలు హిందూరాజైన ఒరిస్సా పాలకుడు ప్రతాపరుద్ర గజపతిని, ముస్లింరాజైన బహమనీ ఆదిల్‌షాలను యుద్ధంలో ఓడించి, స్వాధీనం చేసుకున్న వారివారి భూభాగాలను తిరిగి వారికే వాపసు చేసి యుద్ధా లలో పట్టుబడిన వారి సంతానానికో, బంధుగణానికో విద్యాబుద్ధులు గరిపించిన ఘనత ఒక్క రాయలదేనని గుర్తించాలి. 

శ్రీశ్రీ అన్నట్టు వ్యక్తి పూజను మానగలం గాని, వీరపూజను మానలేం. కటకం, బస్తర్, నాగపూర్, గోల్కొండ, తెలంగాణ (నిజాం పాలనలో), చెన్నపురి, చంగల్పట్టు, తంజావూరు, బెంగళూరు, దేవర కోట, పురుక్కోట, కటకం (ఒరిస్సా) ఒక్కమాటలో దక్షిణ భారతంలో రాయలు సాధించిన విజయాలకు సామాన్యుడైన ఒక రజకుడి నోట ‘కాదని వాదుకు వస్తే కటకందాకా మనదేరా’ అన్న పాట నాటినుంచి నేటిదాకా ఖ్యాతిలోనే ఉండిపోయింది. 


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా