అమెరికా అడకత్తెరలో భారత్‌

10 Nov, 2020 00:37 IST|Sakshi

‘‘నేను యునైటెడ్‌ స్టేట్స్‌ (అమెరికా సంయుక్త రాష్ట్రాల)కు అధ్యక్షున్ని. నాకు ఓటే సిన వారికోసమే కాదు, వేయనివారి కోసం కూడా పని చేస్తా. ప్రపంచానికే అమెరికా ఒక ఆదర్శంగా నిలవాలి. విద్వేషాన్ని విభజనను కోరుకోని. ఐక్యతను కాంక్షించే అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నా, రిపబ్లికన్‌ పార్టీ ఆధి క్యతలో ఉన్న రాష్ట్రాలను ‘రెడ్‌ స్టేట్స్‌’గానూ, డెమొక్రాటిక్‌ పార్టీ మెజారిటీలో ఉన్న రాష్ట్రా లను ‘బ్లూ స్టేట్స్‌’గానూ వివక్షతో విభజించి చూసే నేతగా కాకుండా యావత్తు అమెరికాను సమైక్య దేశంగా పరిగణించే యునైటెడ్‌ స్టేట్స్‌కు మాత్రమే అధ్యక్షునిగా ఉంటాను’’ – డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా దేశ అధ్యక్ష స్థానానికి ఎన్నికైన 77 ఏళ్ల మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ ప్రకటన (8–11–2020)

‘‘రవి అస్తమించని సామ్రాజ్యం’’గా భావించిన బ్రిటిష్‌ సామ్రాజ్య దురాక్రమణ శక్తి దేశదేశాల ప్రజానీకం, అణగారిన ప్రజల తిరుగు బాట్ల ముందు నేలకు ఒరిగిపోయినట్టే, తరువాత దాని స్థానంలో అవతరించిన నూతన సామ్రాజ్య శక్తి అమెరికా క్రమంగా ఆఖరి గడియలలో శ్వాసకోసం ఇబ్బంది పడుతున్న సమయంలో అధ్యక్షుడైన వాడు రిపబ్లికన్ల ‘పిలక తిరుగుడుపువ్వు’ డొనాల్డ్‌ ట్రంప్‌! అయితే ఇంతకూ రిపబ్లికన్‌లు, డెమొక్రాట్‌లలో ఎవరు అమెరికాకు గానీ, ప్రపంచ దేశాలకు ముఖ్యంగా వర్తమాన దేశాలకు గానీ ఎక్కువ ప్రయోజనాన్ని, మంచిని.. యుద్ధాలు, దురాక్రమణ యుద్ధాలు లేని మహోన్నత సమాజాన్ని, శాంతిని ప్రసాదించగల వారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు! ఎందుకంటే మన అభిప్రాయం కాదు.

అమెరికాలోని అసంఖ్యాక పేద, మధ్య తరగతి ప్రజలు ముఖ్యంగా దేశ జనాభాలో శ్వేత (తెల్ల) జాతీయుల సంఖ్యకు కొంచెం తక్కువ సంఖ్యలో ఉన్న నల్లజాతులు, లాటినో ప్రజాబాహుళ్యం, వీరందరితో కూడిన కోట్లాది ఉద్యోగ, కార్మిక వర్గ ప్రజల దృష్టిలో రిపబ్లికన్లకు, డెమొక్రాట్స్‌కు ఆ పార్టీలకు మధ్య ఆచరణలో చెప్పుకోదగినంత గణ నీయమైన తేడా లేదు. అందుకనే వారు ఈ రెండు పార్టీలను ధనికవర్గ రాజకీయ పక్షాలుగానే ‘దొందు దొందు’గానే పరిగణించి రెంటికీ కలిసి ఒకే బిరుదు’ను ‘డెమో–పబ్లికన్స్‌’(డెమొక్రాట్స్‌ రిపబ్లికన్స్‌) అని ప్రసా దించారు!

పైగా రిపబ్లికన్స్‌ అనగానే బానిసల విమోచన ప్రదాత అబ్రహం లింకన్‌ నాయకత్వం వహించిన నాటి  రిపబ్లికన్స్‌ పార్టీ అని భ్రమించే ప్రమాదం ఉంది. లింకన్‌ నాటి అమెరికా దశాగతి దిశాగతి 360 డిగ్రీలు దాటిపోయి ఆ తరువాత రంగంలోకి పేరుకు ఉనికిలోనికి వచ్చిన డెమొక్రాట్‌లకు, రిపబ్లికన్లకు మధ్య తేడాపాడాలు క్రమంగా మసకబారిపోయి పోయాయి. ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా వలస లుగా ఉన్న ప్రపంచదేశాలకు, ఆ తరువాత అశేష త్యాగాల ద్వారా అవ తరించిన వర్ధమాన దేశాలకు, వాటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు పెను ప్రమాదకర పాలనా శక్తులుగా ఆ రెండు పార్టీలలో ఎవరు అధికా రంలో ఉన్నా తయారయ్యాయి. 

లేటుగా మేల్కొన్న అమెరికన్లు
ఈ దశ ఐసన్‌హోవర్, రేగన్, కెన్నడీ, నిక్సన్, ఒబామా, క్లింటన్, హిల్లరీ క్లింటన్, జార్జిబుష్‌ (సీనియర్‌), జూనియర్‌ బుష్, నిన్నటి ఉన్మాది డొనాల్డ్‌ ట్రంప్‌ దాకా కూడా తప్పలేదు! పైగా ట్రంప్‌ కుటుంబ పెద్దలలోని జ్ఞాతి సోదరి మేరియల్‌ ట్రంప్‌ ‘మా వాడు ట్రంప్, కుటుంబానికే కాదు, మొత్తం ప్రపంచానికే ప్రమాదకారి’ అని హెచ్చరించిన తరువాత గానీ, తాజా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి దాకా ప్రజలు గుర్తించలేదు. ఇండియా లాంటి దేశాల పాలకులు గాఢ నిద్రలోనే ఉన్నారు! ‘కుక్కతోక పుచ్చుకుని గోదావరి ఈదుకు’ వచ్చే ప్రయత్నమంటే ఇదే మరి!

అమెరికా ప్రతినిధుల సభకు ఎంపిక కావ లసిన అభ్యర్థులను ప్రత్యక్షంగా ఎన్నుకొనడానికి వీలులేని, ప్రచ్ఛన్న ఎన్నికల వ్యవస్థను అక్కడి పాలకులు అప్పనంగా సాకుతున్నారు. దీనికితోడు వివిధ ఖండాలలోని స్వతంత్ర, అస్వతంత్ర పేద, వర్ధ మాన దేశాలను ఆర్థికంగా, కొత్త వలసలుగా వాటి అపారమైన వన రులను దోచుకోవడానికి అనువైన సైనిక–పారిశ్రామిక జమిలి వ్యవస్థను ‘పెంటగన్‌’ మిలటరీ వ్యూహ రచనా కేంద్రం ద్వారా ఎలాంటి తేడా లేకుండా రిపబ్లికన్‌ పార్టీ, డెమోక్రాట్స్‌ పార్టీ పాలకులు సాకుతూ వస్తున్నారని మరచిపోరాదు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ఖండ దేశాలు తమ అపారమైన సహజ వనరులను పూర్తిగా అనుభవించనివ్వకుండా ఆర్థిక సహాయం ముసుగులో జోక్యందారీ విధానాన్ని అమెరికన్‌ ‘డెమోపబ్లికన్లు’ యథేచ్ఛగా ఈ క్షణందాకా అమలు జరుపుతూనే ఉన్నారు.

విదేశీ సైనిక సాయానికి ఇంతగా అర్రులు చాచాలా?
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా పతనమవుతున్న అమెరికా సామ్రాజ్య దురాక్రమణ వ్యవ స్థను కాపాడటానికి డెమోపబ్లికన్స్‌ పాలకులే కాదు, తమ దేశాల జాతీయోద్యమాలలో అసంఖ్యాక ప్రజల అకుంఠిత త్యాగాలను వమ్ముచేస్తూ వారు పెట్టిన స్వాతంత్య్ర భిక్షమీద బతుకుతూ పాలకులైన వర్ధమాన దేశాలలోని కొందరు రాజకీయ నాయకులు కూడా అమెరికన్‌ మిలటరీ పారిశ్రామిక వ్యవస్థ బతక డానికి కారకులవుతున్నారు.

దీనికితోడు అనేక ప్రజా త్యాగాల ద్వారా సాధించుకున్న స్వాతంత్య్రానంతరం రాజకీయ, ఆర్థిక, వైజ్ఞానిక, విద్యా, పరిశోధనా కేంద్రాలను తామరతంపరగా వర్ధిల్లజేసుకుని సొంతకాళ్లపై నిలబడాలన్న తాపత్రయంగానీ, అందుకోసం ప్రణాళి కాబద్ధమైన పకడ్బందీ వ్యూహ రచనగానీ మన ఇటీవలి పాలకులకు లేకపోవడం దేశ దౌర్భాగ్య దశగా చెప్పక తప్పదు. ఈ ముందుచూపు మన దేశ అనంతర రాజకీయ పాలకులకు కొరవడినందుననే 74 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా విదేశీ సైనిక సహాయాల కోసం దేశం అర్రులు చాచవలసి వస్తోంది. తొలితరం శాస్త్రవేత్తలలో సర్‌ సీవీ రామన్, జగదీశ్‌ చంద్రబోస్‌ లాంటి హేమాహేమీలు నూతన ఆవిష్కరణ కోసం అదనపు పరిజ్ఞానం కోసం విదేశాలకు వెళ్లినా, అధ్యయనం పూర్తి కాగానే తిరిగి స్వదేశానికి వచ్చి తమ శాస్త్ర పరిశోధనలు ఇక్కడా కొనసాగించి దేశాభ్యుదయానికి దోహదం చేశారు.

విదేశీ విద్యార్థుల పోటీపై ‘వెన్నుపోటు’
కానీ దేశీయంగా ఆ అనంతర పరిజ్ఞానాన్ని యువతరానికి అందిం చడానికి మనస్కరించని దేశీయ పాలకుల విధానాలవల్ల విదే శాలకు జ్ఞానార్థులైన యువ శాస్త్రవేత్తలు, విద్యార్థులు పొట్ట చేతపట్టు కుని ఆధునిక పరిశోధనలకు, పరిజ్ఞానాన్ని నూతన కోణాలలో కాపాడు కునేందుకు పరుగులుపెట్టి నానా ఇబ్బందులు పడుతున్నారు. వార క్కడ ఇమడలేని స్థితి, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలో ఇమడ లేని స్థితి, వీసాలపై ఆంక్షల బెడదవల్ల, అక్కడి స్థానికంగా పెరిగి పోతున్న నిరుద్యోగులకు మన విద్యార్థుల పోటీని తమ ఉపాధికి ‘వెన్ను పోటు’గా భావించి దుర్భరమైన ఆంక్షలకు గురి కావాల్సి వస్తోంది.

మన పిల్లల్ని అక్కడ స్థిరపడిన భారతీయ కుటుంబాల ఉనికికి ఎంత లేదనుకున్నా, ఆందోళనతో మానసిక స్థిమితం లేకుండా పోతోంది. ఇందుకు వర్ధమాన దేశాలు అమెరికా, బ్రిటన్‌ దేశాలపట్ల నిరసన తెలుపకూడదు. నిరసనలను, మూతి విరుపులను, ఆందోళనోద్యమా లను అణచివేయడానికే ఇండియా లాంటి ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల చుట్టూ దాదాపు 90 దేశాలలో లేదా వాటి తీరాలలో అమెరికా సైనిక స్థావరాలను పహారాలో ఉంచిందని మరిచి పోరాదు! 

ఎవరు పీఠమెక్కినా మన పాలకులు పావు చెక్కలే!
ఆ మాటకొస్తే ముదిమి దశలో అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్‌ సైతం అమెరికా గతంలో భారత పాలకులతో కుదుర్చుకున్న అసమ అణ్వస్త్ర సహకార ఒప్పందానికి ఆమోదం తెలిపిన డెమొక్రాట్‌ అని మరచి పోరాదు! బహుశా, అందుకే దౌత్య వ్యవహారాలపై ప్రసిద్ధ వ్యాఖ్యత సుహాసినీ హైదర్‌.. ‘ట్రంప్‌ ఇండో–పసిఫిక్‌ ప్రాంత రక్షణ (అదే ‘భక్షణం) విధాన రూపకర్త అయితే, దానికి పునాది వేసినది ఒబామా– బైడెన్‌ల జంటేననీ, 2015లో ఇండియా పర్యటన సందర్భంలో ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కొనేందుకు ఇండియాతో సమష్టి వ్యూహం పన్నాలని ఇందుకు ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంపై కేంద్రీకరిం చాలని ప్రతిపాదించారు.

ఇందుకుగానూ బైడెన్‌ ఇండియాతో సైనిక వ్యూహానికి తగిన పునాదిగా మౌలిక ఒప్పందాలను సిద్ధం చేయాలని, సైనిక సహకారాన్ని అందించాలని, అమెరికా సైనిక సంబంధమైన అధునాతన యంత్రాల అమ్మకాల్ని ప్రోత్సహించాలని ఒబామా– బైడెన్‌ గత ప్రభుత్వం ప్రతిపాదించనే ప్రతిపాదించింది’ (7–11–20). ఇందుకుగానూ భారత ఐ.టి నిపుణుల అవసరాన్ని గుర్తించిన బైడెన్‌ ప్రస్తుతం ఇండియన్‌ అమెరికన్‌ సంతతి మహిళ కమలాహ్యారిస్‌ను ఉపాధ్యక్ష పదవిలోకి తీసుకురావడంలో మతలబు ఇది! ‘తలలు బోడు లైన తలపులు బోడులా’ అన్న వేమన మాటకు తిరుగుంటుందా ఏమన్నా?! అమెరికాలో ఎవరు పీఠం ఎక్కినా అడకత్తెరలో మన పాల కులు ‘పావు చెక్కలే’ అవుతారు!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 

abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు