పేదల అసైన్డ్‌ భూములకే ‘ఎసరు’!

15 Sep, 2020 09:52 IST|Sakshi

రెండో మాట

అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలంలో పేదలైన ఎస్సీ, బీసీలకు అంతకు ముందు బదలాయించి ఉన్న (అసైన్డ్‌) భూము లను రాజధాని కోసం తీసుకుంటే వాటికి పరి హారం రాదని నమ్మించి కొందరు టీడీపీ నేతలు తప్పుదోవ పట్టించారని, అలాంటి అసైన్డ్‌ భూములకు పరిహారం చెల్లించదని, ఉచితంగా రాజధాని కోసం తీసుకుంటుందని కొందరు తప్పుదోవ పట్టించి తక్కువ ధరకు ఆ భూముల్ని కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అలా భూములు తమ అధీనంలోకి రాగానే నాటి ప్రభుత్వం (టీడీపీ)లో చక్రం తిప్పి నవారు ఈ పేదల అసైన్డ్‌ భూములకు కూడా రాజధాని ప్యాకేజీలు పొందారు. ఇందుకు తుళ్లూరు తహసీల్దారు సహకరించారన్న అభియో గాలపై కేసు నమోదైంది. ఇలా కేసు నమోదైన వెంటనే నిందితులు హైకోర్టుకు వెళ్లారు.

వెంటనే రాష్ట్ర హైకోర్టు కేసు దర్యాప్తును నిలిపి వేసింది, అలా దర్యాప్తును నిలిపేస్తూ స్టే ఇవ్వడంపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫలితంగా సంబంధిత భూ బదలాయింపుల వ్యవహారంలో జరిగిన అక్రమాలను బయటకు తీయడంలో తోడ్పడే కీలకమైన రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును హైకోర్టు నిలిపివేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘ఇది ఏ ఒక్కరి ఆరోపణలతోనో ముడిపడి లేదు. ఇందులో భారీ కుంభకోణం కూడా ఉండవచ్చు కదా. అందులో ఏముందో తెలియదు. అందువల్ల దర్యాప్తు కొనసాగేందుకు అనుమతించాలి. తద్వారా కేసును త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాం’ అని సూచించింది.
– (12–09–2020 పత్రికా వార్తలు)

ఇలా పేదలకు దఖలు పడినవారి హక్కు భుక్తంలోకి వచ్చిన అసైన్డ్‌ భూములను మోసంతో రాజధాని పేరిట గుంజేయజూసిన గత చంద్రబాబు ప్రభుత్వ ‘కూట’ రాజకీయం ఇప్పుడు మరో రూపంలో బయ టపడింది. ఈ సందర్భంగా బయటపడిన మరో చిత్రమైన రహస్యం ఏమిటంటే.. బాబు హయాంలో అమరావతి భూములకు చెందిన వేలాది ఎకరాల కుంభకోణాన్ని కప్పెట్టడానికి, అసలు తుళ్లూరు రాజ ధాని పరిధిలోనే లేదని ఆ సుప్రీంకోర్టులో బాబు తరపున వాదించ బోయిన న్యాయవాదిని.. సుప్రీంకోర్టు ధర్మాసనం తుళ్లూరు అమరా వతి పరిధిలోనిదే కదా అని ఎదురు ప్రశ్నించాల్సి రావడమే. 

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ దరఖాస్తును విచారించిన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ హేమలత గుప్తా, జస్టిస్‌ రవీంద్ర భట్‌ ధర్మా సనం ఇందులో భారీ కుంభకోణాలు కూడా ఉండవచ్చు కదా అని భావించి దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతించాలని హైకోర్టును ఆదేశించింది. అంతేగాదు, ప్రతివాదుల తరపున ఎఫ్‌.ఐ.ఆర్‌ను ఇంగ్లి ష్‌లోకి తర్జుమా చేసినప్పుడు తప్పులు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆ తప్పుల్ని సరిచేయకుండా మా అభిప్రాయం చెప్పకుండా ప్రభుత్వ దరఖాస్తుపై ముందుకు వెళ్లరాదని కోరడం! దానిపై సుప్రీంకోర్టు ఈ నెల లోపు ప్రభుత్వ పిటిషన్‌పై సమాధానం కావాలని ప్రతివాదుల్ని కోరింది. ఆ తర్వాతనే అసైన్డ్‌ భూముల కుంభకోణంపై తుది ఉత్త ర్వులు జారీ చేస్తామని సుప్రీం పేర్కొన్నది. అసలు ఈ భూముల భారీ కుంభకోణం కేవలం ఒక్కవ్యక్తికి సంబంధించిన కేసు కాదని సుప్రీం భావించవలసి రావడంలోనే  ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు ఎంత సమంజ సమైనదో, ఎన్నిలోతైన ఆధారాలతో కూడినదో అర్థమవు తుంది.

ఇప్పటిదాకా విచారణకు రాకుండా ఉన్న మాజీ జడ్జీల ఫిర్యాదులు: అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టమే చంద్రబాబు కేంద్ర ం లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కుమ్మక్కైన ఫలితం. కాగా, విభజన చట్టంతోపాటు దానిని అమలు చేయడానికి ఆ చట్టం ప్రకారం విడగొట్టిన తెలుగుజాతిలో ఒక భాగమైన ఆంధ్రప్రదేశ్‌ అన్న టైటిల్‌తో మిగిలిన రాష్ట్రానికి రాజధానిని నిర్ణయించాల్సిన బాధ్యతను కేంద్రం తలెత్తుకుంది. అందుకు ఉద్దండులతో కూడిన నిపుణుల సంఘాన్ని శివరామకృష్ణన్‌ (అత్యున్నత విశ్రాంత అధికారి) అధ్యక్షతన నియమిం చింది. అది రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ పర్యటించి మూడు, నాలుగు పంటలు పండే సుక్షేత్ర వ్యవసాయ పంట భూము లకు నష్టం లేకుండా, స్థిరపడిన ప్రజాబాహుళ్యంతో కూడిన ప్రాంతాల రీసెటిల్మెం టుకు ఇబ్బందిలేని పద్ధతిలో ప్రభుత్వం కొత్త రాజధాని నిర్మాణం జరపాలని సూచించింది.

తరచుగా తుఫానులకు, వరదలకు, భూకం పాలు వగైరా ప్రకృతి వైపరీత్యాలకు గురికాకుండా ఉండే ప్రాంతంలోనే సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో కూడిన రాజధాని భవన నిర్మాణా లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ కమిటీ సూచించింది.  కానీ ఆ కమిటీ ఈ పనిలో ఉండగానే చడీ చప్పుడు లేకుండా మంత్రిగా ఉన్న  విద్యా సంస్థల వ్యాపారి నారాయణ  ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఒడిలో పెడుదునా, దడిలో పెడుదునా అన్న తొందరలో ఒక నివే దికను తయారు చేయించినవాడు చంద్రబాబు. 

చివరకు శివరామకృష్ణన్‌ విశిష్ట నివేదికను అసెంబ్లీ ఛాయలకు కూడా రానివ్వకుండా తొక్కిపెట్టిన బాబు, నారాయణ మంత్రివర్గంలో అతనిలాంటి కోటికి పడగలెత్తిన వ్యాపారుల లాంటి వారి ప్రయోజ నాలకోసం పేదలు చట్టబద్ధంగా అనుభవిస్తున్న అసైన్డ్‌ భూములపై కన్నేసి భ్రమలు గొలిపి, ఆ భూముల్ని బలవంతంగా స్వాధీనం చేసు కుని నామమాత్రంగా నాలుక గీసుకోడానికి సరిపడా బుజ్జగింపుగా చేతులు తడిపి వదిలారు. ఈ తంతు కోసమే నూజివీడు, గన్న వరంతోపాటు, విజయవాడ–గుంటూరు–తెనాలి, మంగళగిరి జోన్‌ (వీజీటీఎం) అంటూ.. ఇంతకూ రాజధాని ఎక్కడ స్థిరపడాలో చెప్ప కుండా ప్రజల్ని భ్రమల్లో పడేసి అనుయాయుల భూములకు రేపు కోట్లు దండుకునే పద్ధతిలో బాబు వర్గం అమరావతి పేరిట భారీ జూదం ఆడారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం నిర్దేశిస్తున్న మేరకైనా కేంద్రంనుంచి ఎలాంటి అనుమతి పొందకుండానే వీజీటీఎం జోన్‌ విస్తరించి ఉన్న 7,068 చదరపు కిలోమీటర్ల పర్యంతం కొత్త రాజధాని వైశాల్యాన్ని ఏకపక్షంగా నిర్ణయించారు.  

పునర్విభజన చట్టానికి పునాదులు ఎత్తిన బాబే ఆ చట్టం నిర్దేశి స్తున్న అందులోని 6వ సెక్షన్‌ ప్రకారం కొత్త రాజధానికి కేంద్రం నుంచి అనుమతి పొందలేదు. ఈ విషయాలన్నింటినీ ప్రశ్నిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత సాధికార చట్టం 2014 (సీఆర్‌డీఏ యాక్ట్‌).. ఆంధ్ర ప్రదేశ్‌ పునర్వభజన చట్టం–2014కు విరుద్ధమని, చెల్లనేరదని, రద్దు చేయాలని రాష్ట్ర ప్రసిద్ధ విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ పి. లక్ష్మణ రెడ్డి, జస్టిస్‌ ఎ. గోపాలరావు, న్యాయవాది సి. సదాశివ రెడ్డిలతో నేను కూడా కలిసి అయిదేళ్ల క్రితమే (2015 ఏప్రిల్‌) అప్పటి ఉమ్మడి హైకోర్టులో సంయుక్తంగా పిటిషన్‌ దాఖలు చేశాం. అమరావతి రైతుల బాధలపై ముగ్గురు జర్నలిస్టులం– నేను, వీవీ రమణమూర్తి, సుప్రీం కోర్టు లాయర్‌గా కూడా ఉన్న శ్రావణ్‌ కుమార్‌ సంయుక్తంగా సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేశాం. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం (2014) ప్రకారం రాష్ట్ర రాజధానిని గుర్తించి ప్రకటించే బాధ్యత కేంద్రానిదే కానీ, విభజనానంతరం ఏర్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానిది కాదనీ, విభజిత రాష్ట్రంలో మిగిలిన తెలంగాణకు హైదరాబాద్‌ ఎలా రాజధానిగా కేంద్రం ప్రకటించిందో, ఇదీ అలాగే జరగాల్సి ఉందనీ, అందువల్ల కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్ణయం బాధ్యత కేంద్రానిదేననీ కొత్త చట్టం నిర్దేశించింది.

అలా కొత్తగా ఏర్పర్చే ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిగా నిర్ణయించిన ప్రాంతం వ్యవ సాయకంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. అక్కడ సుక్షేత్రాలుగా ఉన్న భూముల్ని వ్యవసాయేతర కార్యక్రమాలకు మరల్చడంవల్ల ఆ కార్య క్రమాలలో తలమునకలుగా ఉన్న లక్షలాదిమంది వ్యవసాయ కార్మి కులను నిరుద్యోగులుగా మార్చేందుకే తోడ్పడుతుందనీ, తద్వారా వ్యవసాయ భూముల్ని, కార్మికుల ఉపాధినీ నాశనం చేయడమే అవుతుందనీ మా సంయుక్త పిటిషన్‌లో నాటి హైకోర్టుకు విజ్ఞప్తి చేశాం. ఈ మౌలికమైన భయంకర మార్పు కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు (రియల్టర్స్‌) మాత్రమే ప్రయోజనమనీ ఆ పిటిషన్‌లో హెచ్చరించాం.
అంతేగాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఆనాడే దాఖలు చేసిన ఈ సంయుక్త పిటిషన్‌లో ఎనిమిది ప్రధానమైన ప్రతిపాదనలను ఇలా పేర్కొన్నాం. 1. రాజధాని ప్రాంతంలోని 15 లక్షల ఎకరాల సార వంతమైన భూముల్ని కాపాడాలి. 2. వ్యవసాయంపై ఆధారపడిన కార్మికుల జీవనోపాధిని రక్షించాలి. 3. ప్రజల ఆహార భద్రతకు గ్యారంటీ ఉండాలి. 4. వేలాది ఎకరాలపై వెచ్చించిన ప్రజాధనానికి భరోసా ఉండాలి. 5. పరిసరాలపై వెచ్చించిన ప్రజాధనానికి భరోసా ఉండాలి. 5. పరిసరాలకు, పర్యావరణానికి, వరద ప్రాంతాల రక్షణకు భరోసా ఉండాలి. 6. చట్టబద్ధ పాలన. 7. కృష్ణానదీ పరీవాహక ప్రాంత రక్షణగా ఉండాలి. 8. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని అనేక గ్రామాలకు, పట్టణాలకు రక్షణగా ఉండాలి. రాజధాని ప్రాంతంలో ఏడాదికి 3–4 పంటలిచ్చే సారవంతమైన బంగారు భూములు, మంచి అటవీ భూములూ ఉన్నాయి.

ఇంతకూ 2015 ఫిబ్రవరి 2 నాటికి బట్టబయలైన ‘అతి రహస్యం’ అదే అసలు రహస్యం కూడా ఏమంటే– రాజధాని నగరం పేరిట తమ 20,618.54 ఎకరాలను ఇస్తామని ఒప్పుకున్న రైతుల్లో సగంమందికి పైగానే– అంటే 15,984 మంది రైతులు రాజధాని నిర్మాణానికి తమ బంగారు పంట భూముల్ని ఇవ్వలేదన్న సంగతిని మరచిపోరాదు. ‘ల్యాండ్‌ఫూలింగ్‌’ (భూముల సమీకరణ) కింద జరిగింది. 17005.61 ఎకరాలు కాగా, తమ 17,005.61 ఎకరాలను సరెండర్‌ చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన రైతులు 15,984 మంది. తమ భూముల్ని ఇవ్వ డానికి ‘ససేమిరా’ అన్న రైతులకు చంద్రబాబు (27.2.2015) అద నపు ప్రోత్సాహకాలు కల్పిస్తానని ‘ఎర’ పెట్టినా రైతులు లొంగని ఘడి యలున్నాయి. కాగా, రాజధాని ముసుగులో బలవంతంగా అక్కరకు రాని హామీలతో ల్యాండ్‌ఫూలింగ్‌ పేరిట పొందిన భూమి 31,000 ఎకరాలు. ఏతావాతా మిగిలింది ఆర్భాటం మాత్రమే. పాలనా పద్ధ తుల్లో ఇదో వెరైటీ కాబోలు!!
 
- ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు