కట్టుకథలకు కాలం చెల్లింది

3 Nov, 2020 00:20 IST|Sakshi

రెండో మాట

మాజీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులపై ఉన్న పెండింగ్‌ కేసుల వూర్తి వివరాలను వెంటనే అందించాలి, వీటిని రోజువారీ ప్రాతిపదికన విచారించి, రెండు నెలల్లోగానే పరిష్కరించాలని సుప్రీంకోర్టు.. అన్ని రాష్ట్రాల హైకోర్టులను తాజాగా ఆదేశించింది. వీటిపై త్వరగా విచారణ చేయాలని, హైదరాబాద్‌లోని మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జీ.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు ప్రత్యేక న్యాయమూర్తినీ, ప్రిన్సిపల్‌ సీబీఐ జడ్జినీ, ప్రిన్సిపల్‌ ఏసీబీ జడ్జీలనూ నియమించా లని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, ఎనిమిదేళ్ల క్రితం ఆనాటి సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణను 27–10–2020కి అప్‌డేట్‌ చేసింది. – (29–10–2020 వార్తలు)

నిజానికి, దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా ప్రస్తావించి, వెంటనే ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న పెండింగ్‌ కేసుల వివరాలు అందించి, రాష్ట్రాల హైకోర్టులు రెండు నెలల్లోగా వీటిని పరిష్క రించాలన్న ఆదేశం చాలా ఆలస్యంగా వచ్చినా మెచ్చదగింది. అయితే అంతూ పొంతూ లేకుండా ఏళ్లూపూళ్లుగా, దశాబ్దాలుగా ఈ కేసులు నాన్పుడు బేరంగా సాగడానికి గల కారణాలను కూడా పరిశీలించి వెలికి తీయాలని మాత్రం సుప్రీంకోర్టు ఆదేశించలేకపోవడం విచార కరం. కొద్ది రోజుల క్రితమే జాతీయ స్థాయి ఏటీఆర్‌ రిపోర్టు దేశ వ్యాప్తంగా 4,400 పైచిలుకు ఎంపీలు, ఎమ్మెల్యేలపై.. హత్యలు, బెది రింపులు, మానభంగాలు, వేధింపులు వగైరా అనేక నేరాలకు సంబం ధించిన కేసులు పేరుకు పోయి ఉన్నాయని వెల్లడించి దేశప్రజల్ని తెల్లబోయేలా చేసింది. దాదాపు 74 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత మన దేశం ఇంతటి దుర్భర స్థితిలో ఉండటానికి కారణాలేమిటో, కారకు లెవరో నిర్మొహమాటంగా నిగ్గుదేల్చవలసిన ఘడియలివి. 

నిజానికి 1970ల నాటికే కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హోదాలో ఏఎన్‌ ఓహ్రా.. నవభారత రాజ్యాంగ స్ఫూర్తిని కుమ్మరి పురుగులా నిలువెల్లా తొలచివేస్తున్న మూర్తిత్రయం ఎవరంటే రాజ కీయనాయకులు.. వారు ఆధారపడిన నేరగాళ్లు, బేర గాళ్లు.. వారికి అండగా నిలిచిన పోలీసు యంత్రాంగం అని ప్రకటించారు. ప్రమోషన్ల కోసం లేదా పదవీ విరమణానంతరం పదవులకోసం ఎగబడే కొందరు మాజీ ప్రధాన న్యాయ మూర్తుల వల్ల కూడా వ్రజాస్వామ్య వ్యవస్థా చట్రానికి తెగులు పట్టి పీడిస్తోంది. ఇందులో దుర్భిణీ వేసి ఏరికోరి వెతికి తీయవలసిన వారి సంఖ్య తక్కువ కాదని ఏటీఆర్‌ తాజా నివేదిక నిరూపిస్తోంది. ఎందుకంటే మనం కాలక్షేపం చేస్తున్నది పైకి ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అయినా, అట్టడుగున పెంచుకున్న పునాది మాత్రం భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థది. దాని తాలూకు అవ లక్షణాలను మూలాల దాకా తొలగించుకోనంత కాలం ఆ లక్ష ణాలు వ్యవస్థని వెన్నాడుతూనే ఉంటాయి. వీటి ప్రభావానికి ప్రస్తుత రాజ కీయపక్షాలు, రాజకీయ నాయకులు, పాలకులు, కేంద్ర రాష్ట్రాల శాసనవేదికలు, న్యాయస్థానాలు తరచుగా లోనవుతూనే ఉంటాయి. 

ఈ పూర్వరంగంలోనే ఆంధ్రప్రదేశ్‌ నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అర్ధాంతరంగా దివంగతులైన తర్వాత రాష్ట్రంలో ఏర్ప డిన రాజకీయ శూన్యతలో ముందుకు దూసుకువచ్చి కేంద్ర కాంగ్రెస్‌ అధిష్టానవర్గానికి కంటగింపుగా మారిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు పాదయాత్ర కాస్తా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తునే కాకుండా, అప్పటికే అడుగూడిపోయిన చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును కూడా  అంధకారంలోకి నెట్టింది. రాష్ట్ర రాజకీయాల్లోకి ఒకవైపున కాంగ్రెస్‌ కుట్రల మధ్య, కాలుకాలిన పిల్లిలా చంద్రబాబు మరొకవైపు నుంచి జగన్‌మోహన్‌రెడ్డిని అడకత్తెరలో పావు చెక్కను చేసి దెబ్బతీసే ఉద్దేశంతో– జమిలిగా పన్నిన కుట్ర ఫలి తమే ఈ క్షణం దాకా జగన్‌పై మోపి, ఆయనను నిష్కారణంగా జైలుకు పంపడంలోను సీబీఐ ద్వారా అల్లించిన కేసుల కథాకమా మీషూ! జగన్‌పై మోపిన 22 కేసుల్లో బలం ఉన్న పక్షంలో, స్పెషల్‌ కోర్టు విచారణ సందర్భంలోనే జగన్‌ కంపెనీల్లోకి తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిత్వంలో కొన్ని ప్రైవేట్‌ కంపెనీలు పెట్టుబడులు తర లించాయన్న ఆరోపణ వైఎస్సార్‌ సజీవుడై ఉన్నప్పుడే దూసుకు రావ లసింది. కానీ వైఎస్సార్‌ చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశాన్ని అడ్డుకోవడానికి ‘కథ’ అల్లిన వైనం కూడా చిత్రమైన కుట్ర. చనిపోయిన ఆయన ఎలాగూ రాడు, కాబట్టి వైఎస్సార్‌ కేబినెట్‌ సమష్టి నిర్ణయాలు ఆధారంగా జగన్‌ తన ఎదు గుదల కోసం తన కంపెనీల్లోకి ‘గుత్త’గా కొన్ని కంపెనీల నుంచి అప్పనంగా రాబట్టుకున్నాడన్న వాదన బయలుదేరడానికి ఎన్నో రోజులు పట్టలేదు. 

పైగా రోశయ్య తర్వాత ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో కొనసాగిన వైఎస్సార్‌ మంత్రివర్గ సభ్యులు ముక్తకంఠంతో కాంగ్రెస్‌ అధిష్టానం, చంద్రబాబు ఆరోపణ లను ఖండించారు. వారిలో మంత్రివర్గ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు ఇత్యాది మంత్రులూ ఉన్నారు. ఆమాటకొస్తే– వైఎస్సార్‌  ముఖ్యమం త్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికార భాషా సంఘం అధ్యక్షు నిగా నేను 2005 నుంచి 2009 వరకూ సచివాలయంలో పనిచేసిన న్నాళ్లూ– ఏ రోజునా, అందరి ముఖ్యమంత్రుల కొడుకులూ, కూతుళ్లు, అల్లుళ్ల మాదిరిగా జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయానికి వచ్చినట్లుగానీ, తండ్రిని కలిసివెళ్తున్నట్లుగానీ ఒక్క ఉదాహరణ కూడా లేదు. అనేక మంది మంత్రుల, ముఖ్యమంత్రుల పిల్లలు తరచూ ‘ఆసులో గొట్టాం’లా సచివాలయానికి వస్తూపోతూ ఉండటం ఒక అలవాటుగా మనకు తెలుసు. అదలా ఉంచుదాం. జగన్‌పై చంద్ర బాబు ముఠా, వాళ్ల ప్రచార బాకాలు చేసిన మరొక విచిత్ర ఆరోపణ– ‘తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారుల్ని రూ. 35 కోట్ల మేర జగన్‌ మోసం చేశాడట.

ఇలాంటి కట్టుకథల ఆధారంగా ‘ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో నేటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై సీబీఐ మోపిన కేసుల్లో విచారణ ఇప్పటికీ కొనసాగుతోంద’ని బీబీసీ తెలుగు ప్రసార వాణి ప్రకటిస్తూ, జగన్‌పై కేసులు ఏపీలో మోపడం ఎలా ప్రారం భమైందో వివరించింది: ‘తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ ఎర్రన్నా యుడు, నాటి కాంగ్రెస్‌ నేత శంకరరావు 2010లో రాష్ట్ర హైకోర్టులో వేసిన పిటిషన్లతో ఈ కేసులు నమోదయ్యాయి. నాడు ఎంపీగా ఉన్న జగన్‌ ‘క్విడ్‌ ప్రోకో’ పద్ధతిలో కొన్ని సంస్థలకు భూములు, మైనింగ్‌ లైసెన్సులు, ఇతర అవకాశాలు కల్పించి– బదులుగా జగన్‌ సొంత సంస్థ ‘జగతి’లో పెట్టుబడులు పెట్టించుకున్నారని ఆరోపణలు నమో దయ్యాయి. ఈ పెట్టుబడుల్ని లంచాలుగా చూపుతూ ఆ డబ్బును హవాలాగా మార్చడంలో జగన్‌ కీలక పాత్ర పోషించారన్నది అభియోగమని, సీబీఐ విచారణకు పునాది అనీ బీబీసీ చెప్పింది. రుజువులు చూపలేని ఈ కూట రాజ కీయం ఆధారంగానే 2012 మేలో జగన్‌ను అరెస్టు చేయించి, 16 మాసాలు చంచల్‌గూడ జైలులో నిర్బంధింపజేయడానికి అటు కాంగ్రెస్, ఇటు చంద్రబాబు పార్టీలు ఎలా కారకులయ్యాయో బీబీసీ నివేదిక చెప్పకనే చెప్పింది. 

జగన్‌పై కేసును సీబీఐ విచారణకు హైకోర్టు అప్పగించింది. 2011 ఆగస్టు 10న కేసు నమోదైంది. 2004–2009 మధ్య కాలంలో ‘నేరం జరిగిందన్న’ అనుమానంతో ఆగస్టు 17న ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐ నమోదు చేసింది. ఈ కేసులో ముఖ్య నిందితునిగా వైఎస్‌ జగన్, విజయ సాయిరెడ్డిని ఇరికించగా, కేసులో మొత్తం నిందితులుగా పేర్కొన్న వారు 72 మంది. జగన్‌పై మోపిన కేసులకు ‘నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, లెక్కలు తారమారు చేయడం’ లాంటి పేర్లు తగిలించింది సీబీఐ. ఇలా అల్లిన డజను అభియోగాల ఆధారంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఐదు అభియోగపత్రాలు తయారీ చేసింది. అయితే 31.3.2012తో ప్రారంభించిన సీబీఐ మొదటి చార్జిషీట్‌ లగాయతు గత ఎనిమిదేళ్లుగానూ జగన్‌వల్ల ‘క్విడ్‌ప్రోకో’ మంత్రం వల్ల లాభించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఏ ఒక్క కంపెనీగానీ లేదా సంస్థగానీ సీబీఐ ప్రత్యేక కోర్టు చర్యకు గురికాలేదు, అరెస్టయిన సంస్థలు, వ్యక్తులు, ప్రతినిధులుగానీ విడుదల అయ్యారేగానీ కోర్టు చర్యకు గురికాలేదు. కాగా, ఈ మధ్య కాలంలో సీబీఐ జగన్‌పై కేసుల నిరూపణలో సాక్ష్యాలు చూపడంలో తరచుగా విఫలమవుతూ నోరెళ్లబె డుతూ ఉండటం గమనించిన ప్రత్యేక కోర్టు గౌరవ న్యాయమూర్తులు ఎప్పుడు మీ సాక్ష్యాలు, ఎక్కడ మీ సాక్ష్యాలు, ఇంకెన్నాళ్లు తీసుకుం టారు సాక్ష్యాలు చూపడానికి అంటూ పదేపదే ప్రశ్నించవలసి రావడం– సీబీఐ కేసు కాంగ్రెస్, టీడీపీల ప్రత్యక్ష ప్రేరేపిత చర్య అని చెప్పక చెబుతోంది. ఇటువంటి కుట్రలు మరెంత కాలమో సాగవు.

చంద్రబాబు నాయుడు హయాంలో వ్యవస్థల్ని, వాటిలోని ప్రధాన అధికారులను, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, కొందరు సీబీఐ స్థానిక అధికారుల్ని సాకడం ద్వారా పలు కేసులనుంచి, బడా కంపె నీలకు వందల ఎకరాల భూమిని దోచిపెట్టిన కేసుల నుంచీ ఈరోజుకీ తప్పించుకు తిరుగుతున్నవాడే. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయ వాదులుగా, జడ్జీలుగా ప్రమోట్‌ చేయించి, సుప్రీంకోర్టు దాకా పంపించి, సుప్రీంకోర్టులోనూ, రాష్ట్ర హైకోర్టులోనూ తనకు అనుకూల తీర్పులు పొందడానికి పదవిలో ఉండగానో, పదవి ఊడిన తర్వాత ప్రతిపక్ష నాయక స్థానంనుంచీ చంద్రబాబు ఎటువంటి దుష్టపాత్ర వహిస్తున్నదీ నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇందుకు మహాభారత దుష్ట పాత్రలో దుర్యోధనుడి మాటలే సాక్ష్యం– ‘నిజమేదో నాకు తెలుసు, కానీ దానివైపు నా మనస్సు మళ్లదు, అబద్ధమేదో కూడా నాకు తెలుసు, కానీ దాని నుంచీ నా మనస్సు మళ్లదు’ అన్నాడు. బాబు మనస్సూ అంతే సుమా.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా