మద్రాస్‌ హైకోర్టు కమిటీ చారిత్రక నిర్ణయం

17 Nov, 2020 00:24 IST|Sakshi

రెండో మాట

లెజిస్లేటర్లపై పెరిగిపోతున్న అవినీతి, అత్యాచార కేసుల శాశ్వత పరిష్కారానికి కేవలం స్పెషల్‌ కోర్టుల వల్ల పరిష్కారం దొరకదని తాజాగా మద్రాసు హైకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో నియమించిన ప్రత్యేక కమిటీ, ఒక ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేసింది. స్పెషల్‌ కోర్టులను ప్రభుత్వ ఉత్తర్వులతోనూ లేదా కోర్టు తాఖీదుల ద్వారానూ ఏర్పర్చరాదని, స్పెషల్‌ కోర్టులను కేవలం రాజ్యాంగ చట్టం ద్వారా మాత్రమే ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ప్రలోభాలకు అవి లోబడకుండా ఉంటాయని జస్టిస్‌ పి.ఎన్‌.ప్రకాష్, జి.జయచంద్రన్, ఎన్‌.సంతోష్‌ కుమార్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసన ప్రత్యేక సంఘం స్పష్టం చేసింది. 

‘‘ప్రధానమంత్రిగారూ! మీకూ, మా న్యాయమూర్తులకూ మధ్య ఉండవలసిన సంబంధాలు యథార్థస్థితిపై ఆధారపడిన వాస్తవిక సంబంధాలుగా ఉండాలేగానీ– పరస్పర స్నేహాలౖపై ఆధారపడిన సంబంధాలుగా ఉండకూడదు. ఎందుకంటే మనం ఏ రాజ్యాంగ చట్టబద్ధతకు లోబడి ఎప్పటికప్పుడు ఎవరూ అదుపు తప్పని సమతుల్యతను కాపాడవలసిన వ్యవస్థలో ఉన్నప్పుడు కోర్టుకీ ప్రభుత్వానికీ మధ్య ప్రత్యేకించి వేరే స్నేహ, వాత్సల్య సంబంధాలకు చోటు లేదు.’’ 

అత్యున్నత ప్రమాణాలకు ప్రసిద్ధులైన కొలదిమంది భారత ప్రధాన న్యాయమూర్తులలో ఒకరైన ఎం.ఎన్‌. వెంకటాచలయ్య (1993) విస్పష్ట ప్రకటన ఇది. రాష్ట్రపతి భవన్‌లో ఆయన పదవీస్వీకారం చేసిన సందర్భంలో హాజరైన నాటి భారత ప్రధాని పి.వి.నరసింహారావు ‘‘న్యాయస్థానం వారికీ, ప్రభుత్వానికీ మధ్య ఇచ్చిపుచ్చుకునే సన్నిహిత సంబంధం ఉండాలి, అలాంటి సంబంధాల కోసం ఎదురు చూస్తాను’’ అన్నప్పుడు ఆ మాటలోని మర్మాన్ని గ్రహించిన జస్టిస్‌ వెంకటాచలయ్య పైవిధంగా ప్రకటన చేశారు.

ఇటీవలి సంవత్సరాలలో భారత న్యాయస్థానం తీర్పులలో తీరుతెన్నుల గురించి సమీక్షిస్తున్న సందర్భంగా మద్రాసు హైకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచూ రెండు కీలకమైన ప్రశ్నలు (16–11–20) సంధించారు: (1) మళ్లీ వెంకటాచలయ్య లాంటి ప్రధాన న్యాయమూర్తి మరొకరు మనకెప్పుడొస్తారు? (2) ఇటీవలనే 92 సంవత్సరాల పండుపండిన వయస్సులో ఉన్న న్యాయవ్యవస్థ భీష్మ పితామహుడైన ఆయన ప్రస్తుత న్యాయ పరిస్థితుల్ని సర్వే చేసినపుడు ఇటీవలి కాలంలో పాలక ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పు చెప్పిన ఒక్క ఉదాహరణ కూడా లేదని గమనిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, అని పంచూ తనకు తానై ప్రశ్నించుకున్నారు! 

ఈ ప్రశ్నలు ఇలా ఎదురవుతున్న సమయంలోనే సుప్రీంకోర్టు ఆలస్యంగానైనా తాజాగా ఒక కీలకమైన ప్రశ్న లేవనెత్తింది. రాబోయే రెండు నెలలలోగా తెలంగాణ హైకోర్టు, కింది కోర్టు విచారణలో ఉన్న ఒక కేసు విచారణను ఎందుకు ఆపివేయవలసి వచ్చిందని విస్మయం ప్రకటించింది. గత సంవత్సరం జూలై 16 నాటికే కేసు విచారణ పూర్తి కావాలన్న గడువును లెక్క చేయనందుకు సుప్రీంకోర్టు ఈ విమర్శ చేయవలసి వచ్చింది. దేశంలోని పలు న్యాయస్థానాలు సకాలంలో తీర్పులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నందుకు సుప్రీం ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ ఆగ్రహం ప్రకటించింది.

ఇది ఇలా ఉండగా సుప్రీంకోర్టు త్రిసభ్య న్యాయస్థానం గౌరవ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అధ్యక్షతన ఒక కీలకమైన నిర్ణయం చేసింది. ‘‘వివిధ నేరాలకు పాల్పడినట్లు ప్రస్తుత, మాజీ పార్లమెంట్‌ సభ్యులపై ఉన్న అభియోగాల కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విచారణ జరపడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు’’ జస్టిస్‌ రమణ ప్రకటించారు (4–11–20).

విచిత్రమేమంటే నేరస్థ రాజకీయుల్ని ప్రత్యేకంగా విచారించేందుకు దేశంలో 12 ప్రత్యేక కోర్టుల్ని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను 2017లోనే సుప్రీంకోర్టు కేంద్రానికి పంపించింది. అయినా మూడేళ్లు కేంద్ర పాలకులు జాయగా గడిపేశారు! ఇలా ఏళ్లు పూళ్లుగా కేంద్ర పాలకులు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర రాష్ట్రాల లెజిస్లేటర్ల కేసుల్ని ఇంతవరకూ విచారించి పరిష్కరించకపోవడానికి కారణం ఏమిటి? జస్టిస్‌ వెంకటాచలయ్య 1993 నాటికే, కోర్టుకీ పాలకులకీ మధ్య ఉండవలసిన సన్నిహిత సంబంధాల గురించి పి.వి.నరసింహారావు తలపెట్టిన నర్మగర్భ ‘ప్రతిపాదన’లోని ఆంతర్యాన్ని పసిగట్టగలిగారు! అందువల్ల అప్పటినుంచి గత సుమారు మూడు దశాబ్దాలుగానూ, కోర్టుకీ పాలకవర్గాలకూ మధ్య ఈ ‘బ్రహ్మముడి’ ఎందుకనో తెగిపోకుండా కొనసాగుతోంది! కాబట్టే న్యాయస్థానాలపై పాలక వర్గాల ఒత్తిడి క్రమంగా పెరుగుతూ వస్తోంది! 

ఈ సందర్భంగా, ఈ అనిశ్చిత వాతావరణంలో నానాటికీ లెజిస్లేటర్లపై పెరిగిపోతున్న అనేక రకాల అవినీతి, అత్యాచార ఇత్యాది కేసుల శాశ్వత పరిష్కారానికి కేవలం స్పెషల్‌ కోర్టుల వల్ల పరిష్కారం దొరకదని తాజాగా మద్రాసు హైకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో నియమించిన ప్రత్యేక కమిటీ, ఒక విశిష్ట ప్రత్యామ్నాయ బలమైన ప్రతిపాదనతో (2–11–20) దూసుకువచ్చింది. ‘‘ప్రత్యేక కోర్టుల’’నేవి నేరాన్ని, నేరస్థులని ఎదుర్కొనేలా ఉండాలే గానీ ‘‘నేరగాణ్ణి రక్షించేవిగా’’ పని చేయకూడదని మద్రాసు హైకోర్టు ప్రత్యేక కమిటీ ప్రతిపాదించింది.

అంతేకాదు స్పెషల్‌ కోర్టులను ప్రభుత్వ ఉత్తర్వులతోనూ లేదా కోర్టు తాఖీదుల ద్వారానూ ఏర్పర్చరాదని, స్పెషల్‌ కోర్టులను కేవలం రాజ్యాంగ చట్టం ద్వారా మాత్రమే ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ప్రలోభాలకు అవి లోబడకుండా ఉంటాయని జస్టిస్‌ పి.ఎన్‌.ప్రకాష్, జి.జయచంద్రన్, ఎన్‌.సంతోష్‌ కుమార్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసన ప్రత్యేక సంఘం స్పష్టం చేసింది. అంతేకాదు, స్పెషల్‌ కోర్టులనేవి ‘‘పోక్సో’’ యాక్ట్‌ నేరాలకు పాల్పడిన ఎం.పి./ ఎం.ఎల్‌.ఎ.లకు మాత్రమే వర్తిస్తాయని ఆ కమిటీ పేర్కొంది! 

లెజిస్లేటర్ల నేరాల సంఖ్య ఏడాది ఏడాదికి పెరిగిపోతోంది. న్యాయవ్యవస్థలో సామాన్య భారతీయుడికి విశ్వాసం ఎందుకని బలపడడం లేదో జస్టిస్‌ జె.ఎస్‌.వర్మ (1998), జస్టిస్‌ బరూచా (2001), జస్టిస్‌ వి.ఎన్‌.ఖరే (2004), జస్టిస్‌ సదాశివం (2013), శివరాజ్‌ పాటిల్‌ (2003), వివిధ సందర్భాల్లో విమర్శనాత్మకంగా పేర్కొన్నారు! కింది కోర్టులలో అధికారులకు ప్రతి ఏటా రూ. 2600 కోట్ల మేర లంచాల కింద ముడుతున్నట్లు 2007 నాటికే ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ గ్లోబల్‌ కరప్షన్‌ రిపోర్టు’ వెల్లడించింది. అదే సమయంలో న్యాయస్థానాల్లోని ఉన్నత స్థాయి జడ్జీలు చాలావరకు (2007 దాకా) అవినీతికి దూరంగా ఉన్నా, ‘చిలకేటుగా’ కొంతమంది లోబడిన వారూ ఉన్నారని ఆ గ్లోబల్‌ కరప్షన్‌ రిపోర్టు వెల్లడించింది.

అదే సమయంలో తమ ప్రశ్నలకు జవాబులిచ్చిన వారిలో 77 శాతం మంది మాత్రం న్యాయవ్యవస్థలో అవినీతి ఉందని నమ్ముతున్నారని ‘‘కరప్షన్‌ రిపోర్ట్‌’’ పేర్కొంది. ఎక్కడి దాకానో ఎందుకు – ‘‘దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఏదీ సక్రమంగా లేదు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది జాగ్రత్త’’ అంటూ 2018 లోనే నాటి ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాను హెచ్చరిస్తూ నలుగురు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ చలమేశ్వర్, రంజన్‌ గొగోయ్, మదన్‌ లోకూర్, కురియన్‌ జోసెఫ్‌ తమ చరిత్రాత్మక హెచ్చరికను (12–1–2018) సంయుక్త పత్రికా గోష్ఠిలో విడుదల చేయతలచారని మరవరాదు! 

చివరికి బిహార్‌ ఎన్నికల్లో తాజా ఫలితాలను ‘‘ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం’’గా ప్రధాని మోదీ ప్రకటించుకుంటున్న సమయంలో అదే బిహార్‌లో కొత్తగా ఎం.ఎల్‌.ఎ.లుగా ఎన్నికైన వారిలో 68 శాతం మంది క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారని, అందులో 51 శాతం మంది తమపైన హత్య, అత్యాచార కేసులు న్నాయని బాహాటంగా ప్రకటించారని సాధికార ‘‘ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ’’  (ఎ.డి.ఆర్‌.) వెల్లడించింది. ఇలా తీవ్రమైన నేరాల చరిత్ర ఉండి ఎన్నికల్లో గెలుపొందిన వారు ఇప్పటివరకూ 241 మంది అని పేర్కొంది.

ఈ క్రిమినల్‌ చరిత్ర కలిగి గెలుపొందినవారు 2015లో 142 మంది (58 శాతం) ఉండగా, వీరి సంఖ్య 2020లో 168 మందికి (68 శాతం) పెరిగిందని ఆ నివేదిక వెల్లడించింది. విచిత్రమేమిటంటే మోదీ బిహార్‌లో ‘‘ప్రజాస్వామ్యం సాధించిన విజయం’’ గురించి ఊరూ వాడా యాగీ చేసుకుంటున్న క్షణంలోనే– గెలుపొందిన బి.జె.పి. అభ్యర్థుల్లో 64 శాతం, ఆర్‌.జె.డి. అభ్యర్థుల్లో 73 శాతం మంది తమ క్రిమినల్‌ నేరాల చిఠాను అధికారికంగా ప్రకటించుకోవలసి ఉంది! ‘‘ప్రజాస్వామ్యం ’’ ముసుగులో సాగుతున్న ఈ ‘కంపు చిఠాల’ ఆధారంగానే ముందు ముందు ప్రజాస్వామ్య రాజకీయాల తీరుతెన్నులు మరింతగా బహిర్గతమవుతాయి!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 

>
మరిన్ని వార్తలు