భారత్‌ – చైనాలే ఆశాదూతలు!

1 Sep, 2020 00:59 IST|Sakshi

రెండో మాట

ఆచరణ యోగ్యమైన వాస్తవికతతో చైనా పట్ల మన విధానాన్ని రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. భారత దేశ భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా పాత సంప్రదాయ ధోరణులకు అతీతంగా మనం అడుగులు వేయవలసి ఉంది. పునరుజ్జీవం పొంది ముందుకు సాగుతున్న చైనా పట్ల సంప్రదాయంగా పేరుకుపోయిన భావాలను, ఊహలను మనం అధిగమించాలి. మన దేశ భవిష్యదవకాశాలను బేరీజు వేసుకుని విమర్శనా దృష్టితో విధాన రూపకల్పన చేసుకోవాలి. అదే సందర్భంలో– గత మూడు దశాబ్దాలలో ఉభయ దేశాల సంబంధాలలో మెరుగైన అభివృద్ధిని చెడగొట్టుకోకుండా ఉండాలంటే భారత–చైనా సరిహద్దులలో శాంతి, సామరస్య వాతావరణం విధిగా ఏర్పడి తీరాలి. రెండు దేశాల మధ్య శాంతి అనివార్యం.
– భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జయశంకర్‌
సెప్టెంబర్‌ 7న విడుదల కానున్న ఇండియా వే అన్న గ్రంథంలో.

ఇటీవల భారత–చైనా సరిహద్దులలో సాగుతూ వచ్చిన సైనిక ఘర్షణలు ఇరుదేశాల్లోని 270 కోట్ల మందిని ప్రభావితం చేశాయి. ఆసియా ఖండంలోనేగాక, ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో జీవిస్తూ సుదీర్ఘ చారిత్రక, సంప్రదాయాలకు నిలయంగా ఉన్న భారత–చైనాల మధ్య సుస్థిర శాంతి ఇటు ఆసియా ఖండానికేగాక, అటు యావత్‌ ప్రపంచానికే అవశ్యమని జయశంకర్‌ నిశ్చితాభిప్రాయం. అటూ ఇటూ పరమ నిర్జన ప్రాంతంలో సైనికుల మోహరింపు వల్ల ఉభయ దేశాలలోనూ, ఇరుగు పొరుగు దేశాలలోనూ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఒక ప్రకటన సంచలనాత్మకంగా మారింది. ‘ఉభయ దేశాల మధ్య సరిహద్దుల్లో ఎలాంటి ఘర్షణా లేదు; ఎవరూ చనిపోలేదు’ అని ఆ ప్రకటన సారాంశం. ఇది మన దేశంలో చాలా ఆశ్చర్యమూ, ఆందోళనా కల్గించింది. వాస్తవాలను మభ్యపరిచి మోదీ ఈ ప్రకటన చేయడం అభ్యంతరకరమని కొన్ని ప్రతిపక్షాలు దండోరా వేయటం మనకు తెలిసిందే. బహుశా మోదీ అభిప్రాయంలో చైనా అంటే సైద్ధాంతికంగా పడకపోవచ్చుగానీ– జయశంకర్‌ వర్ణించినట్టు భారత–చైనాల మధ్య బ్రిటిష్‌ వలస పాలకులు, నయావలస సామ్రాజ్యవాద అమెరికా పాలకులు అనుసరిస్తూ వచ్చిన సామ్రాజ్య విస్తరణ విధానాల మూలంగా భారత–చైనాల దేశాల సరిహద్దులు ఏనాడూ శాశ్వతంగా గుర్తించబడలేదన్నది పచ్చి నిజం.

ఆ విషయం భారత విదేశాంగ మంత్రులందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. సరిహద్దులు శాశ్వతంగా పరిష్కారం కావాలంటే రెండు దేశాలు సంప్రదింపులకు కూర్చుని పరిష్కరించుకొనక తప్పదుగాక తప్పదు. ఈ విషయంలో కాంగ్రెస్‌ ప్రధానులు, విదేశాంగ మంత్రులు, ఆ తర్వాత బీజేపీ(ఎన్డీయే) పాలకులు చైనా నాయకులతో సంప్రదిస్తూనే వచ్చారు. కాని ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఇరు దేశాల నాయకులు, విదేశాంగ మంత్రులు సమావేశమైనా–1962 నాటి సరిహద్దు ఘర్షణలను నివారించే పేరిట, సామ్రాజ్యవాద పాలకులు ఆసియాలో తమ విస్తరణవాదానికి అనుకూలంగా భారత–చైనాల మధ్య సరిహద్దులను భూమ్మీద గుర్తించకుండా గాలిలో తేల్చిన గాలి గీతలని చరిత్ర తెలిసిన వారందరికీ తెలుసు. కాని స్వతంత్ర దేశాలుగా అనేక త్యాగాల ద్వారా తమ చారిత్రక నేపథ్యాలను రుజువు చేసుకున్న భారత్‌–చైనాలు పరస్పర ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా వివాద ప్రాంతాల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాలి. భౌగోళిక వాస్తవాలకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకోవాలంటే ముఖాముఖి ప్రత్యక్ష సంప్రదింపుల కన్నా మరో గత్యంతరం లేదు. ఎందుకంటే జయశంకర్‌ గుర్తించినట్టు, ఇన్నాళ్లూ ఘర్షణల మధ్యే, పొరపొచ్చాల మధ్యే ఇరు దేశాల సంబంధాలు సాగాయి. కొన్నాళ్లు మెరుగవుతున్నట్టూ, మరి కొన్నాళ్లు బెడిసికొడుతున్నట్టూ కనిపించినా– మొత్తం మీద కనీసం వర్తక వాణిజ్య సంబంధాలలోనూ, దౌత్యపరంగానూ ఉభయత్రా సానుకూలత చాలావరకు స్థిరపడింది. 

చైనాతో వివిధ రాష్ట్రాలలో కూడా మంచి వర్తక, వాణిజ్యాలకు సానుకూల వాతావరణం ఏర్పడి, కొనసాగుతూనే వచ్చాయి. ఆ మాటకొస్తే మోదీ ఏలుబడిలోని గుజరాత్‌ ప్రభుత్వంలో చైనీస్‌ పెద్ద కంపెనీ రూ,12,000 కోట్ల విలువగల భారీ నిర్మాణాన్ని చేపట్టి కొనసాగిస్తోందని మరిచిపోరాదు. అలాగే దేశ వ్యాపితంగానూ పెక్కు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకూ చైనా కంపెనీలతో ఎన్నో ‘పీట ముడు’లున్నాయి. అయినా తాజా సరిహద్దు ఘర్షణల ఫలితంగా, ఆంగ్లో–అమెరికన్, ఇజ్రాయిల్‌ గుత్త పెట్టుబడులకుగానూ కూపీ సంస్థలు ఇండియాపై ఒత్తిళ్లు పెంచి, సరిహద్దు ఘర్షణల్ని మరింత పెంచడానికి చైనా వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి. చైనాలో ప్రబలిన ‘కరోనా’ మహమ్మారి పేరిట ఇరు దేశాల వర్తక ప్రయోజనాల్ని దెబ్బతీసేలా భారత ప్రయోజనాలకు విరుద్ధంగా మన మీద ఒత్తిడి తెస్తున్నాయి. ఇరు దేశాల స్నేహ సంబంధాలకు గండికొట్టి ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో, ముఖ్యంగా దక్షిణాసియాలో ఇదే అదునుగా సైనిక జోక్యాన్ని తీవ్రతరం చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. అప్పుడే ఈ మేరకు ఆసియాలో తన యుద్ధ సన్నాహాలను బ్రిటన్, మలేసియా, ఫిలిప్‌పైన్స్‌ ‘చెవులు కొరికి’ తీవ్రతరం చేస్తోంది.

ఈ విషయాన్ని కూడా జయశంకర్‌ ప్రస్తావించారు. ఈ విషమ ఘడియల్లో మన భారత ప్రభుత్వం ఒక వైపున దేశ పురోగతికి భరోసా కల్పిస్తూనే, మన బలమైన పొరుగు దేశం చైనా విసిరే సవాళ్లను అందుకోగలిగేలా ఉండాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు. ఇందుకుగానూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు చైనా పేరిట మన ప్రజల పైన, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పన్నే కుట్రలకు లోనై మన వర్తక, వాణిజ్యాలను దెబ్బతీసుకోకూడదు. ఈ దృష్ట్యా భారత, చైనాలు ఒకరి ప్రయోజనాలను మరొకరు గౌరవించుకునే పద్ధతుల్లో మెలగాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు. ఈ విషయంలో రెండు లక్ష్యాలు నెరవేరాల్సి ఉంటుందని ఆయన భావన. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకించకూడదు. అలాగే అణుశక్తి సరఫరా దేశాల కూటమిలో ఒక ఎదిగిన సాంకేతిక పరిజ్ఞాన శక్తిగా ఇండియా సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకించకుండా ఉంటే బాగుంటుందన్నది ఆయన ఉద్దేశం. 
ఆయుధాలు అమ్ముకొని దేశాల మధ్య ఘర్షణలు సృష్టించి, దేశాలను, ప్రజలను అస్వతంత్రత వైపు, బానిసత్వం వైపు నెట్టే ధోరణి అమెరికన్‌ సామ్రాజ్య పాలకులది. భారతదేశ సైనిక స్థావరాలను తాము స్వేచ్ఛగా వాడుకోవాలన్నది అమెరికా లక్ష్యం. ఇలా ఏర్పడిన బంధమే ఇండో–అమెరికా సైనిక సంబంధాలని మరిచిపోరాదు.

ఆసియా ఖండం మధ్యలో, భారతదేశ వ్యూహ రీత్యా అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న భారత సైనిక స్థావరాలను వాడుకోవాలన్నది అమెరికా అధ్యక్షుడు, కజ్జాకోరైన డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యూహం. ఇందుకోసం ఆసియా భద్రతకు ముఖ్యమైన భారత, చైనా, రష్యాలు ప్రధాన సభ్య దేశాలుగా ఉన్న షాంగై మిత్ర దేశాల ఐక్య సంఘటనను బద్దలుకొట్టి ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో ఎలా తిష్ట వేయాలా అని అమెరికా చూస్తోంది. దీనివల్ల కూడా భారతదేశం కడు జాగరూకతతో మెలగవలసి ఉంటుంది. సరిహద్దుల్ని సంప్రదింపుల ద్వారా నేలపై నిక్కచ్చిగా గుర్తించకుండా ఉన్నంతకాలం ఉభయ దేశాల సంబంధాలు మెరుగుపడవు సరికదా, మెరుగైన సంబంధాలకు కూడా గండి కొట్టుకోవడమే అవుతుంది. అందుకనే మన రాటుతేలిన మన ఆశాదూతలు మన ఇరుగు పొరుగు మంచి మైత్రి కోసం ఎదురుతెన్నులు చూస్తున్న దేశాలకు తక్షణం కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ తలోదిక్కూ ప్రయాణం కట్టాలి. భారత–చైనాలను చుట్టుముట్టి దెబ్బతీయజూస్తున్న ఆంగ్లో, అమెరికన్, యూరోపియన్‌ సావ్రాజ్యవాదుల వ్యూహానికి ప్రతివ్యూహాన్ని రచించగల శక్తి భారత–చైనాలకు మాత్రమే ఉంది. ఈ రెండు దేశాలు ఒకటిగాకుండా చూడటమే సామ్రాజ్యవాదుల లక్ష్యం. ఇందుకు గిల్లికజ్జాలకు బదులు, జయశంకర్‌ అన్నట్టు ఇరు దేశాల మైత్రికి ప్రాపంచిక ప్రాధాన్యత ఉన్నందున మైత్రీ బంధం బలపడాల్సిన అవసరం ఉంది. ఇందుకుగానూ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు ‘జీ’ సంయుక్తంగా నిర్వహించిన మల్లాపురం(తమిళనాడు) సమావేశం ఆదర్శం కావాలి. దీనికోసం  ఉభయ దేశాల మధ్య ఆశాదూతలు అవసరం. మహాకవి ఆశించినట్టు, ఈ ఆశాదూతలు నాల్గు దిక్కులకు మానవకోటి సామ్రాజ్యదూతలూ, కళాయజ్ఞాశ్వాలుగా సాగి గాలులై, తరగలై, తావులై పుప్పొళ్లుగా కుంకుమలై పొగలై ముందుకు సాగిపోవాలి. పాలకులు బుద్ధిజీవులుగా ప్రవర్తించాలి. 

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు