తెలుగు పదాల ‘మల్లెతోట’లో మల్లీశ్వరి!

28 Sep, 2021 00:47 IST|Sakshi

ఇంగ్లిష్‌ మాతృభాషగా పెరిగిన ఇంగ్లండ్‌ ప్రజలు 300 ఏళ్ళపాటు ఫ్రెంచి, గ్రీక్, జర్మన్‌ వలస భాషల దాష్టీకం నుంచి తమ మాతృ భాష ఇంగ్లిష్‌ను రక్షించుకోవడానికి పడిన పాట్ల నుంచే తెలుగుభాషను కాపాడుకోవడా నికి తెలుగువాడు పాఠాలు నేర్చుకోవాలి! ప్రపంచాన్ని ఏలుతూ వచ్చిన ఇంగ్లిష్‌ వాడికి, 16–17 శతాబ్దాల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని, మాతృభాషా రక్షణకు నడుం బిగించాల్సి వచ్చిందని 3,000 సంవత్సరాల ప్రాచీన పునాదులున్న తెలుగువారు మరిచిపోరాదు! ఆదివాసీ భాషలు సహా ప్రపంచ భాషా కుటుంబంలో ప్రతి ఒక్క పదమూ ఒక్కొక్క ఆణి ముత్యమని ఐక్యరాజ్యసమితి సాధికార ప్రకటన విడుదల చేసిందని మరువరాదు.

మరోవైపునుంచి విభజించి పాలించే బుద్ధి విభక్తులతో ప్రారం భమై తెలుగు భాషనే గాక తెలుగు సమాజాన్ని వృత్తుల విభజనతో పాటు కులమతాల కుంపట్లు తెరిచి శాశ్వత బానిసత్వానికి వర్గ విభజనకు సరిపడా ‘కాంక్రీటు’ గుప్పించారు స్వార్థపరులు. ప్రకృతుల (ప్రజల)తో ఎదుగుతూ వచ్చిన భాష ‘వికృతుల’తో ఎందుకు విల విలలాడవలసి వచ్చింది? ప్రాచీన భారతం సంస్కృతం కాదు, ప్రాకృతం మాత్రమేనని మహామహా పండితులే ఎందుకు నిర్వచించ వలసివచ్చింది? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనే బుద్ధిహీనుడు బతకనేల అని కాళోజీ ఎందుకు నోరారా శపించవలసి వచ్చింది? అలాగే తెలుగు పదసంపదను మరచిపోయి తిరుగుతున్న తెలుగు వాడికి ఒక పదానికి ఎన్నో అర్థాలను చూపించి తెలుగు నుడులకు ‘గుడులు’ కట్టి మరీ కోట్లాదిగా చూపించి తెలుగుల వెన్నును కాపా డుతూ వచ్చిన తెలుగు ప్రముఖులలో శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి ఒకరు!

ఒక్కో తెలుగు పదానికి అర్థాలెన్నో, తెలుగు‘నుడి గుడి’ గ్రంథాల ద్వారా దశాబ్దన్నర కాలంలో తెలుగుభాషకు మల్లీశ్వరి కృషి చేస్తూ వచ్చిన అమూల్యమైన కృషి, ప్రాథమిక విద్యాస్థాయిలోనే భాషా బోధనా పద్ధతులు ఎలా ఉండాలో ప్రాక్టికల్‌గా నిరూపించి చూపిన విద్వక్మణి మల్లీశ్వరి ఎన్నో పురస్కారాల గ్రహీత, కవయిత్రి, ప్రసిద్ధ సమీక్షకురాలూ, నాడు తెలుగువాడైన (ముంగండ) మల్లినాథసూరి షాజహాన్‌ కొలువులో పలువురు ముస్లిం, సంస్కృతి కవుల్ని దిమ్మ తిరిగేలా ఓడించి నిలబడిన జెగజ్జెట్టీ! నేడు ఎవరి కొలువుల్ని ఆశ్ర యించకపోయినా సొంత ప్రతిభతో, తేజస్సుతో తననుతాను నిరూ పించుకుని తెలుగు మల్లెతోటను వాడిపోకుండా నవంనవంగా ఉంచుకున్న సాహితీమూర్తి మల్లీశ్వరి. అందుకే ప్రాచీన సూక్తి పుట్టింది. పరుల కోసమే నదులు ప్రవహిస్తాయి, గోవులూ పాలు పిండుతాయి. చెట్లూ ఇతరుల కోసమే పూలు పూస్తాయి. ఈ సంప్రదాయపు ప్రాకృ తిక సత్యాన్ని గుర్తించిన చిరంజీవి మల్లీశ్వరి, మనం మరచిపోతున్న తెలుగు అందచందాలతో సహస్రాధికంగా తెలుగులు చిమ్మే తెలుగు పదాలకు అనంతమైన నుడులకు నానుడులకు ప్రయోజనకరమైన గుడులు కట్టారు.

అసలు ఎందుకు, తెలుగు భాషామతల్లికి వన్నెచిన్నెలు తొడిగిన తెలుగు శతక వాంఙ్మయాన్ని అటకమీద పెట్టేసి తిరుగుతున్న మనల్ని రక్షించే నాథుడికోసం, చీకట్లో వెతుక్కుంటున్నాం. తెలుగు పదాలకు అరసున్నల బెడదను రుద్దిన సంస్కృత ప్రియులకు జవాబుగా 300 ఏళ్ళ కిందటే శ్రీనాథుడి శాసనాల్లో (13–14 శతాబ్దిల్లో) ఈనాడు మనం వాడే ‘సున్న’ అంకెనే (0) సుఖంగా వాడాడు! కనీసం తెలుగు భాషను, ప్రజలను శ్రీనాథుడి కన్నా ముందు అనేక శతాబ్దులుగా తీర్చిదిద్దించి వచ్చిన 10 శతకాలలోని సజీవ స్రవంతిని కూడా పక్కన పెట్టేసి తిరుగుతూ వచ్చాం. వేమన శతకం నుంచి ఆంధ్రనాయక శతకం దాకా తెలుగు ప్రజలను నీతులతో, హెచ్చరికలతో అప్రమత్తం చేసి ఎన్నో మంచి బుద్ధుల నుంచి మరలకుండా ఈ రోజుదాకా కట్టిపడవేస్తున్నాయి.

అలాగే వాసిరెడ్డి మల్లీశ్వరి 2016లోనూ, 2018 లోనూ తెలుగులో ఒక్కొక్క పదానికి ఎన్నేసి అర్థాలున్నాయో, ఒక్కో పదాన్ని భిన్న అర్థాలలో, విభిన్న సందర్భాలలో ఎలా ఉపయోగించ వచ్చునో ఈ రెండు గ్రంథాలలోనే పెక్కు సామెతలతో, ఆమెతలతో సంధించి వందలు, వేలాది ఉదాహరణలతో రసమయం చేసింది మల్లీశ్వరి. ‘హల్లు’తో కాకుండా ‘అచ్చు’తో పదాల ప్రారంభ ఉపసం హారాలతో వేల సంవత్సరాలు ప్రాచీన చరిత్ర గల భాషగా అజంత భాషగా ఎలా వర్థిల్లుతూ వస్తోందో నిరూపిస్తూ అందుకు దన్నుగా తెలుగు సామెతలను, వివిధ కవుల పద్యాలనూ సోదాహరణంగా ఉదహరించారు. ఆమె కృషి వెనక దాదాపు 20 ఏళ్ల సాధన ఉంది.

మల్లీశ్వరి అన్నట్టు నేడు తెలుగు ఇళ్లలో, స్కూళ్లలో, తరగతి గదుల వాతావరణంలో తెలుగుభాష వాడకం తగ్గి, ఆంగ్లభాష వాడకం పెరిగి అమ్మ–నాన్నల స్థానాన్ని, మమ్మీ–డాడీలు ఆక్రమిం చడం వల్ల మరుగున పడిపోతున్న తెలుగు పదాలను, వాటికి గల అనేకానేక అందమైన అర్థాలను నేటి తరానికి అందించి మనసుకెక్కిం చాలన్న తలంపుతో ఈ రెండు పుస్తకాలలోనూ అనితరసాధ్యమైన ప్రయత్నం జరిగింది. అంతమాత్రాన అన్యభాషాదూషణకు ఆమె ప్రయత్నించలేదు. తెలుగు భాషలో ఉన్న ఎంతో అందమైన పద సంపదను ఒంట పట్టించుకోగల తెలుగు విద్యార్థులకు ఉద్దీపనగానే మల్లీశ్వరి ప్రశంసనీయమైన ప్రయత్నం జరిగింది. ఇంగ్లిష్‌లో ‘భిన్నార్థ దీపిక’గా చెప్పుకునే ‘ధిసారస్‌’కు ఏ మాత్రం తీసిపోనివి మల్లీశ్వరి రెండు అత్యుత్తమ సంపుటాలు.

పదప్రయోగ వైచిత్రిలో అఖిల భారత స్థాయిలో ఆంగ్లభాషా పండితుడు, పరిశోధకుడు, పార్లమెంటు సభ్యుడైన శశిథరూర్‌ ‘ధిసా రస్‌’ను అనుసరించి తన పేరిటనే ‘ధరూరోసరస్‌’ అనే కొత్త ప్రయో గాలకు సాహసించాడు. అర్ధగౌరవాన్ని హాస్యాస్పదంగా మార్చే ఈ నోరుతిరగని శశిథరూర్‌ ప్రయత్నాన్ని పెంగ్విన్‌ ఇండియా ప్రచురణ కర్త మేరూ గోఖలే... పాఠకుల్ని అదరగొట్టి, చెదరగొట్టే థరూర్‌ ప్రయ త్నాన్ని, భిన్నార్థ దీపిక కాదు.. ‘నిరంకుశోపాఖ్యానం’ (టిరనోసరస్‌) అని వ్యాఖ్యానించింది! కానీ మన మల్లీశ్వరి ప్రాచుర్యంలో ఉన్న తెలుగు పదసంపద అర్ధగౌరవాన్ని ఒక ఉపాధ్యాయురాలిగా తన రెండు సంపుటాలలోనూ నిలబెట్టారు. 


ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు