న్యాయమూర్తులు... ఆదర్శాలు

30 Mar, 2021 01:49 IST|Sakshi

రెండో మాట

దేశంలో న్యాయమూర్తులు ఎందరో ఉండవచ్చు. కానీ అత్యున్నత న్యాయస్థానపు అత్యున్నత పదవి ఎవరినోగానీ వరించదు. తెలుగువాళ్లలోనైతే అంత స్థాయికి వెళ్లినవాళ్లు ఎందరో చెప్పడానికి వేళ్లు కూడా అక్కర్లేదు. రెండు చేతులు చాలు. డెబ్బై యేళ్ల స్వతంత్ర భారతంలో సర్వోన్నత న్యాయ స్థానపు ప్రధాన న్యాయమూర్తి అవుతున్న రెండవ తెలుగువాడు జస్టిస్‌ ఎన్‌.వి. రమణ మాత్రమే. అయితే పదవులు అందరూ చేపడతారు. కానీ కొందరే ఆ పదవులకు వన్నె తెస్తారు. సుప్రీం మహోన్నత పీఠంపై ముమ్మూర్తులా న్యాయదేవతను తలపించిన కొందరు న్యాయమూర్తులు చరిత్రలో భాగమైనారు. వాళ్లు నెలకొల్పిన ఆదర్శాలే అందరికీ అనుసరణీయం కావాలి.

‘‘దేశంలోని పేదలు, నిరక్షరాస్యులు తమ హక్కులను విధిగా ఆచరణలో అనుభవించ లేని దశలో, భారత ప్రజలందరికీ సమాన హక్కులను అమలు జరుపు తామని చెప్పే హామీకి అర్థం లేదు. భారతదేశం స్వాతంత్య్రం పొందిన ప్పటినుంచీ దారిద్య్ర సమస్యతోనూ, న్యాయం పొందడం కోసమూ నిరంతరం పోరు సల్పుతూనే ఉంది. అయినా, 74 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా అవే సమస్యలను ఇంకా చర్చించు కోవలసి వస్తోంది’’.
– సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ: ఢిల్లీలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కార్యాలయ ప్రారంభోత్సవ సభలో ప్రసంగం (23 మార్చ్‌ 2021)
‘‘న్యాయమూర్తుల పైన, న్యాయవ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం తగ్గిపోతోంది. దానిని పెంచేందుకు న్యాయవాదులు కృషి చేయాలి’’.
– ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఎన్‌.వి.రమణ (3 మార్చ్‌ 2013)

తెలుగువారి చరిత్రలో ఎందరో న్యాయమూర్తులు రాష్ట్ర హైకోర్టుకు సేవలందించి ఉన్నారు. కానీ తెలుగువారి నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికై సేవలందించిన విశిష్ట వ్యక్తి కోకా సుబ్బారావు కాగా, అనేక సంవత్సరాల తర్వాత ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించబోతున్న రెండవ తెలుగు న్యాయమూర్తి జస్టిస్‌ నూతల పాటి వెంకటరమణ కావడం హర్షించదగిన విషయం. ఈ సమ యంలో భారత న్యాయవ్యవస్థలో అనేక ఒడిదుడుకుల మధ్యనే సుసంప్రదాయాలను, ఎప్పటికీ ఆదర్శవంతంగా నిలిచిపోగల విశిష్ట తీర్పులను మనకు అందించిపోయిన ఆదర్శ న్యాయమూర్తులను తలచుకోకుండా ఉండలేము. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్‌ రమణే ఎనిమిదేళ్ల క్రితం ‘న్యాయమూర్తుల పైన, న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం తగ్గిపోతోం’దని  ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో పూర్వాపరాలను ఆయనతో పాటు మనం కూడా తరచి చూసుకోవలసి ఉంది.  

ముఖ్యంగా గడిచిన రెండు దశా బ్దాలలోనూ మూడు రాజ్యాంగ వ్యవస్థలకు (ప్రభుత్వం/శాసన వ్యవస్థ/న్యాయవ్యవస్థలు) నిర్దేశించిన నియమిత అధికారాలను, బాధ్యతలను నిస్సిగ్గుగా ఉల్లంఘించడం జరిగింది. అయినా ఆత్మ విమర్శ జరగనందువల్ల మూడు రాజ్యాంగ వ్యవస్థలు పరస్పరం తమతమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక శాఖలో మరొక శాఖ దూరి తలా ఒక దారిగా ప్రవర్తించినందువల్ల దేశ న్యాయ వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోయే దశ వచ్చేసింది. ఒక్కముక్కలో చెప్పా లంటే ఏ దశకు పాలకులు చేరుకున్నారంటే– తాము ఆశించిన ప్రజా వ్యతిరేక విధానాలకు ‘తాతాచార్యుల ముద్ర’ మాదిరిగా పార్ల మెంటులో బ్రూట్‌ మెజారిటీ సాయంతో కొన్నాళ్లు, ‘కరోనా’ లాంటి వ్యాధుల వ్యాప్తి పేరిట ఇంకొన్నాళ్లు, సమావేశాలను, చర్చలనే పక్కనపెట్టారు. సుప్రీం మెడలువంచి లేదా కొందరు జడ్జీలకు అనంతర పదవుల ఆశ చూపి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఒక సీబీఐ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తినే భౌతికంగా తప్పించేశారన్న అపవాదు గత కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తున్న సంగతి మరచి పోరాదు.

న్యాయవ్యవస్థలో మనం ఒక అబ్రహాం లింకన్‌నూ, ఒక మహాత్మాగాంధీనీ ఆశించడం ‘కుందేటి కొమ్ము’ను సాధించడానికి ప్రయత్నించడమే అవుతోంది. అందుకే బహుశా భారత న్యాయ మూర్తులలో అగ్రశ్రేణి విలువలకు పట్టంకట్టిన పలువురు ఉద్దండ పిండాలలో ఒకరైన సుప్రీం న్యాయమూర్తి వి.ఆర్‌. కృష్ణయ్యర్‌ తన స్వీయచరిత్ర ‘జీవిత చరమాంకం’ (ది ఈవెనింగ్‌ ఆఫ్‌ లైఫ్‌) గ్రంథంలో ఇలా రాయవలసి వచ్చింది: ‘‘నిజాయితీకి బద్ధ విరోధి అవినీతి. కానీ ఈ అవినీతి రానురానూ మన న్యాయవ్యవస్థను క్రమంగా ‘కుమ్మరి పురుగు’లా తొల్చుకుంటూ పోతోంది. మనల్ని ప్రశ్నించేవాళ్లు లేరన్న ధీమాతో ముందుకు సాగుతోంది. నేను బార్‌లో ఉన్నప్పుడు చివరికి మున్సిఫ్‌ ప్రవర్తనను సహితం అనుమానించే వాడిని. కానీ ఈ రోజున అత్యున్నత న్యాయస్థానం సహితం తప్పుడు పనులకు, నిజాయితీకి విరుద్ధమైన చర్యలకు పాల్పడుతుండటం విచారకరం. ప్రభుత్వం లేదా పాలనాధికార వర్గం తప్పుడుగా వ్యవ హరిస్తే ఆ తప్పును న్యాయవ్యవస్థ అధికారికంగా సరిదిద్దవచ్చు. శాసన వ్యవస్థే రాజ్యాంగ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆ నేరానికి కోర్టువారు శిక్షించవచ్చు. కానీ తీర్పరిగా ఉండాల్సిన న్యాయమూర్తే నేరానికి ఒడిగడితే అతడిని సరైన బాటలో పెట్టేవారుండరు.

కనుకనే అలాంటి న్యాయమూర్తులు తమ నిర్ణయానికి తిరుగులేదన్న భ్రమలో ఉండిపోతారు’’.అందుకే, బ్రిటిష్‌ కామన్వెల్తులో అత్యంత నిజాయితీపరుడైన జస్టిస్‌ మైఖేల్‌ కిర్బీ ఒక సందర్భంలో రాస్తూ– జస్టిస్‌ కృష్ణయ్యర్‌కి జైలు జీవిత సత్యాలు ఎలా ఉంటాయో తెలుసుననీ, అందుకే భారత దేశ జైళ్లలోని ఖైదీలకూ, భారత రాజ్యాంగాన్ని నమ్మేవారికీ మధ్య ఇనుప తెర అంటూ ఉండదనీ పేర్కొన్నారు. ‘సునిల్‌ బాత్రా వర్సెస్‌ ఢిల్లీ పాలక వ్యవస్థ’ కేసుకు సంబంధించిన తీర్పులో కృష్ణయ్యర్‌ ఎంత సాధికారతతో న్యాయసూత్రాలను రూపొందించారో, ఆ సూత్రాలను చివరికి బ్రిటన్‌ ప్రీవీ కౌన్సిల్, ఇతర కోర్టులలోనూ ఎలా ఆదర్శంగా అనుసరించాల్సి వచ్చిందో కిర్బీ పేర్కొన్నారు. ‘‘జస్టిస్‌ కృష్ణయ్యర్‌లా పెక్కుమంది న్యాయమూర్తులు జైలులో స్వయంగా ఒక రాత్రి గడిపి ఉండరు. నా మాదిరిగానే మహా అయితే జైళ్లు పరిశీలించి ఉండవచ్చు, జైళ్లలోని ఖైదీల పరిస్థితుల్ని గమనించి ఉండొచ్చు. కానీ ఈ పైపై క్షణికానుభవాలు ప్రభుత్వ తాఖీదుపైన అరెస్టయి జైలు జీవితం స్వయంగా అనుభవించడం లాంటి అనుభవం మరీ ముఖ్యంగా ప్రభుత్వ అన్యాయపు ఉత్తర్వుపై అరెస్టయి జైల్లో గడపటం లాంటి అనుభవం ముందు దిగదుడుపే. కృష్ణయ్యర్‌ లాంటి అనుభవం తక్కువమందికి ఉంటుంది.’’ 

ఒక న్యాయవాదిగా కృష్ణయ్యర్‌ (ఈనాటి ప్రసిద్ధ పౌరహక్కుల న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, కీ.శే. కన్నాబిరాన్‌ లాగా) ‘కోర్టు ధిక్కారం’ అన్న అభియోగంపైన రెండుసార్లు ప్రాసిక్యూషన్‌ ఎదు ర్కొన్నవారే. అలాంటి సందర్భాలలోనే ఆయన భారత లీగల్‌ వ్యవస్థలోని బలహీనతల్ని, వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారని మరచిపోరాదు. అలాంటి ఉద్దండ న్యాయమూర్తుల్లో ‘నా ముందుకు ఫలానా కేసు వద్దు’ (నాట్‌ బిఫోర్‌ మి) అంటూ ఇప్పటికీ తప్పు కుంటున్న జస్టిస్‌ లోకూర్, జస్టిస్‌ భండారీ లాంటి నిజాయితీపరులు ఉన్నారు.

పతంజలి శాస్త్రి నుంచి జె.ఎస్‌.వర్మ, బరూచా, వి.ఎన్‌.ఖారే, సదాశివమ్, జీవన్‌రెడ్డి, శివరాజ్‌ పాటిల్, రామస్వామి, పి.ఎ.చౌదరి లాంటి ప్రసిద్ధులు జన హృదయాల్లో ఆదర్శమూర్తులుగా ఉండి పోయారు. అందుకనే కబుర్లు కాదు, ఉన్నత స్థాయికి చేరుకున్న న్యాయమూర్తులు అందరికీ ఆచరణ  ముఖ్యం. కృష్ణయ్యర్‌ ఒక సూక్తిని ఉదహరించేవారు– ‘‘ప్రజా వ్యతిరేక దుష్ట చట్టాల గురించి మనలో చాలామంది మాట్లాడుకుంటుంటారు. కానీ, అలాంటి చట్టాలను ఉల్లంఘించడానికి ఎవరూ సాహసించరు. అందుకే ఫ్రెంచి మేధావి థోరే అన్నాడు: ఒక వ్యక్తిని పరమ అన్యా యంగా జైలుకు పంపించే ప్రభుత్వం ఉన్నచోట, న్యాయంగా బతికే వ్యక్తి ఉండాల్సిన స్థానం కూడా జైలే అవుతుంది సుమా!’’ రేపటి ఆదర్శమూర్తులు ఎలా ఉండాలో 2018 జనవరి 12న న్యాయవ్యవస్థ చరిత్రలో తొలిసారిగా జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆధ్వర్యంలో అయిదుగురు జడ్జీలు నిర్వహించిన చారిత్రక పత్రికా సమావేశం నిర్ణయించింది.


abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 

మరిన్ని వార్తలు