అధికార భాషకు పట్టంకట్టిన మూర్తులు

7 Dec, 2021 00:49 IST|Sakshi

దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో అధికార భాషా సంఘం ఉనికిలో ఉన్నప్పటికీ ఆ సంఘానికీ, దాని కార్యకలాపాలకూ, అన్ని స్థాయిల్లోనూ తెలుగుభాష వాడకాన్ని స్థానిక అధికారులు పెంచడానికీ అవసరమైన బడ్జెట్‌ లేదు. ఆ పరిస్థితుల్లో అధికార భాషగా తెలుగు వాడకాన్ని పెంచడానికి అవసరమైన తొలి బడ్జెట్‌ను నాటి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయించింది. ప్రత్యేక బడ్జెట్‌ ఎంత కావాలని వైఎస్సార్‌ అడగగా, సంవత్సరానికి కనీసం రూ. 2 కోట్లు అవసరమని చెప్పాము. ఆయన దానికి సమ్మతించారు. కాబట్టే ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలలోనూ సాధికారికంగా భాషా సంఘం ఆధ్వర్యంలో, ఉధృతంగా అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యం కలిగించాము. నాటి ఉన్నతాధికారుల సహకారం ఫలితంగా అనేక జిల్లాలలో అధికారుల స్థాయిలో తెలుగు వాడకం పెరిగింది. సమీప జిల్లాలను ఒకచోట కలిపి ప్రాంతీయ సదస్సులు జరిపి తెలుగు భాష వాడకాన్ని పెంచడానికి అవగాహన కల్పించాం. ఇంత కృషికీ, ఆచరణకూ దోహదపడింది... వైఎస్సార్‌–రోశయ్య చేసిన ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపులే!

‘దేశభాషలందు తెలుగులెస్స’ అనీ, అది కండగల భాష అనీ, దేశంలోని పాలకులంతా దానిని కొలవడానికి పోటాపోటీలు పడింది అందుకేననీ శ్రీకృష్ణదేవరాయలు వందల సంవత్సరాల క్రితమే ఎంతో గర్వంతో చాటి చెప్పారు. కానీ ఆచరణలో క్రమంగా పాలకుల అనాదరణవల్ల తెలుగు భాష సౌరు, సొగసూ తరిగిపోతూ వచ్చింది. చివరికి ఏ స్థాయికి మన పాలకులు దిగజారవలసి వచ్చిందంటే... అధికార భాషా సంఘం ఉనికిలో ఉన్నప్పటికీ ఆ సంఘానికీ, దాని కార్యకలాపాలకూ, అన్ని స్థాయిల్లోనూ తెలుగుభాష వాడకాన్ని స్థానిక అధికారులు పెంచడానికీ అవసరమైన బడ్జెట్‌ అంటూ లేదు. 

తెలుగు భాష వాఢకానికి వారే స్ఫూర్తి
ఆ పరిస్థితుల్లో అధికార భాషా సంఘం ఉద్యమ స్ఫూర్తితో భాష వాడకాన్ని పెంచడానికి అవసరమైన తొలి బడ్జెట్‌ను అధికారికంగా ప్రకటించింది. కీర్తిశేషులైన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, రోశయ్య నాటి ఆర్థికమంత్రిగా ఉండేవారు. అప్పటి దాకా పేరుకు అధికార భాషా సంఘం ఉన్నా ప్రయోజనం లేక పోయింది. ఈ దశలో ఆ సంఘానికి అధ్యక్షునిగా వైఎస్సార్‌ నన్ను నియమించినప్పుడు–నా పని (వ్యాసకర్త) అప్పటికి ‘చీకట్లో చిందు లాట’గా మారింది. ఎందుకంటే అంతవరకూ అధికార భాషా సంఘా నికి లేని ఒక ప్రత్యేక బడ్జెట్‌ కోసం నేను ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయవలసి వచ్చింది, అప్పుడు వైఎస్సార్, నన్ను రోశయ్యతో మాట్లాడుకుని ఏర్పాటు చేసుకోమని చెప్పారు. కానీ, రాష్ట్ర ముఖ్య మంత్రి ఒకమాట చెబితే తప్ప ఎలా కేటాయించగలనని రోశయ్య పటుపట్టారు. ఆర్థిక మంత్రి రోశయ్య ‘చిక్కడు–దొరకడ’న్న సామెత అప్పుడే నాకు గుర్తుకొచ్చింది. 

ఈలోగా అధికార భాషా సంఘం అభ్యర్థనను సుకరం చేస్తూ తెలుగు భాషా ప్రేమికులైన నాటి ఉన్నతాధికారులు డాక్టర్‌ రమా కాంతరెడ్డి, సెక్రటరీ కృష్ణారావు భాషా సంఘం చేస్తున్న కృషికి మన సారా దోహదం చేశారు. ప్రత్యేక బడ్జెట్‌ ఎంత కావాలని వైఎస్‌ అడ గగా, సంవత్సరానికి కనీసం రూ. 2 కోట్లు అవసరమని చెప్పాము.  అందుకు ఆయన మరోమాట లేకుండానే సమ్మతించారు. కాబట్టే ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలలోనూ సాధికారికంగా భాషా సంఘం ఆధ్వర్యంలో, ఉధృతంగా అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యం కలిగించాము. దీని ఫలితంగా అనేక జిల్లాలలో అధికారుల స్థాయిలో తెలుగు వాడకం పెరిగింది. 

మాండలికాలకు పట్టం కట్టిన భాషా సంఘం
ఈ సదస్సులు క్రమంగా రాష్ట్రేతర ఆంధ్రులను, అక్కడి తెలుగు భాషా భిమానుల్ని సహితం కదిలించివేశాయి. మన భక్త రామదాసు బరంపురం వాసి కావడంతో తెలుగు–ఒడిశా సంబంధాలు కూడా మరింతగా సన్నిహితం కావడానికి దోహదకారి అయింది. అందుకే మనం మనం బరంపురం అన్న రావిశాస్త్రి వ్యాఖ్య విశేష ప్రచారంలోకి వచ్చింది. భాషా సంఘం ప్రత్యేక బడ్జెట్‌ కేటా యింపులతో ప్రారంభించిన ప్రత్యేక సదస్సుల సందర్భంగా, పలు ప్రోత్సాహకాల స్వేచ్ఛా వాడకం కూడా నమోదు కావడం మరో విశేషం. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల్లోనూ ఒకసారి కాదు, రెండేసి సార్లు భాషా సంఘం తిరిగింది. సమీప జిల్లాలను ఒకచోట కలిపి ప్రాంతీయ సదస్సులు జరిపి తెలుగు భాష వాడకాన్ని పెంచడానికి అవగాహన కల్పించాం. ఒక్కమాటలో చెప్పాలంటే – ఇంత కృషికీ ఆచరణ దోహదపడింది... వైఎస్‌ రాజశేఖరరెడ్డి– రోశయ్య చేసిన ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపులేనని మరచిపోరాదు! 

ప్రముఖ భాషా సాహిత్యకారుడు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ఏనాడో (1917) అన్నట్టుగా ఆయా మండలాల్లో వాడే భాషలు ఇతరులకు తెలియనంత మాత్రాన ఆ భాష చెడ్డదనడం, స్థాయి తక్కు వదనడం తప్పు. ‘మారడం, మార్పు చెందడం భాషకు అత్యంత సహజం’! అందుకే మన కాళోజి నారాయణరావు మాతృ భాషను, మాండలిక భాషనే సమర్థించాల్సి వచ్చింది...

‘‘తెలుగు బాస ఎన్ని తీర్లు
తెలుగు యాస ఎన్ని తీర్లు
వాడుకలున్నన్ని తీర్లు
వాడుక ఏ తీరుగున్నా
తెలుగు బాస వాడుకయే
అన్ని తీర్ల వాడుకకు
పరపతి – పెత్తనమొకటే’ ... అన్నారు కాళోజీ!

ఇలా కింది స్థాయి వరకు తెలుగు అధికారులంతా, అధికార భాషగా భాష వాడకాన్ని పెంచడానికి అవసరమైన ప్రత్యేక బడ్జెట్‌ను తొలిసారిగా ఆమోదించిన ఘనత వైఎస్‌ – రోశయ్యల హయాంకే దక్కింది! చివరికి న్యాయస్థానాల్లో తీర్పులు సహితం తెలుగులోనే వచ్చేలా చేయడం ఈ ప్రత్యేక బడ్జెట్‌ వల్లనే సాధ్యమైంది. ఎందుకంటే బౌద్ధం నాగరీక ధర్మం కాబట్టే అది కాలు పెట్టిన దేశాలన్నిటా అక్కడి సంస్కృతులను నాగరీకరించి మరీ సుసంపన్నం చేయడంతోపాటు, అది వాటితో ఏకమై, తనతో ఇముడ్చుకోగలిగింది. అంతవరకూ అర్ధ నాగరిక, బర్బర, యక్షనాగుల జాతిని మహాభారతం సహితం ‘అంధక జాతి’ అని పిలవగా ఆ మాటను సవరించి ‘ఆంధ్ర జాతి’గా పరిగణించిన ఖ్యాతి ఒక్క బౌద్ధానికే దక్కిందని మరచిపోరాదు. 

కనుకనే బౌద్ధం పునర్వికాసానికి, భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన డాక్టర్‌ అంబేడ్కర్‌ చరమదశలో పూనుకున్నారు.  దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది దళితుల్ని బౌద్ధులుగా ఆయన పరివర్తింప జేశారు. ఇలా దక్షిణ భారతదేశంలో బౌద్ధ పునర్వికాసానికి తోడ్పడిన వారెందరో ఉన్నారు. అందుకే అన్నాడు మహాకవి గురజాడ.. ‘బౌద్ధాన్ని భారతదేశ సరిహద్దులు దాటించి దేశం ఆత్మహత్య చేసు కుంది’ అని! ఇప్పుడీ ఆత్మహత్యా ప్రయత్నంలో భాగమే భారతీయ భాషల సంరక్షణలో ఎదురవుతున్న సంకటం!
వర్తక వ్యాపారానికి లాభాల వేటలో ప్రపంచీకరణ పేరిట ఇంగ్లిష్‌ భాషా పెత్తనాన్ని స్థిరపరచడం కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసంఖ్యాకమైన దేశీయ భాషల సహజ పురోభివృద్ధికి కృత్రిమ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ  సందర్భం గానే ఐక్యరాజ్యసమితి విద్యా సాంస్కృతిక శాఖ నిద్ర మేల్కొని దేశీయ మాతృ భాషల సంరక్షణకు పదే పదే హెచ్చరికలు జారీ చేయవలసి వచ్చింది. ప్రపంచ భాషా పటంలో ప్రతి పదమూ ఒక ఆణిముత్య మనీ, దాని సొగసును, సోయగాన్నీ రక్షించుకోవడం మాతృభాషా ప్రేమికుల కర్తవ్యమనీ ఐరాస విద్యా సాంస్కృతిక శాఖ ఆదేశించిం దన్న సంగతిని మనం ఎన్నటికీ మరవరాదు! 

అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాల కల్పన కోసం ఇంగ్లిష్‌ భాషకు ప్రాధాన్యం కల్పించడం ఎంత అవసరమో.. ప్రాంతీయ భాషగా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేయడం అంతే అవసరం. ఈ ముందు చూపు ఏపీ ప్రభుత్వానికి ఉన్నందునే ఆంధ్ర, ఆంగ్ల భాషల మేలు కలయికగా పాఠశాల, కళాశాల స్థాయిలో భాషా మాధ్య మాన్ని పరివర్తింపచేశారని మర్చిపోరాదు.


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 

abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు