ఈ సామీప్యం వెనుక మతలబు ఏంటి?

9 Mar, 2021 00:36 IST|Sakshi

విశ్లేషణ

చైనాపై తాను పూర్తిగా ఆధారపడటం ద్వారా అంతర్జాతీయంగా ఏకాంతవాసం నుంచి బయటపడటం సాధ్యపడదని పాక్‌ అర్థం చేసుకుంటోంది. దీనివల్లే పాక్‌ స్వరంలో గణనీయ మార్పు రావడమే కాకుండా భారత్‌తో తన సంబంధాలు కూడా కాస్త మృదురూపం తీసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ఒంటరితనంలో చిక్కుకున్న పాకిస్తాన్‌ అదే సమయంలో చైనాకు మరింత దగ్గర కావడాన్ని అటు అమెరికా కానీ ఇటు భారత్‌ కానీ కోరుకోవడం లేదు. హిందూమహాసముద్రంలో, దక్షిణ చైనా సముద్రంలో, పసిఫిక్‌ ప్రాంతంలో తన ప్రాధాన్యతపై భారత్‌ వ్యూహాత్మక అంచనా, అంతర్జాతీ యంగా పాక్‌ ఒంటరి కావడం అనేవే భారత్, పాక్‌ మధ్య ఇటీవలి పరిణామాలకు దోహదపడ్డాయని చెప్పాలి.

వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల పొడవునా కాల్పుల విరమణకు కట్టుబడటం ద్వారా శాంతిని నెలకొల్పవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ భారత్, పాకిస్తాన్‌లు ఫిబ్రవరి 25న సంయుక్త ప్రకటన చేశాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు తూట్లు పడి ఎంతో కాలం కాలేదు. అయినప్పటికీ ఈ అసాధారణ పరిణామానికి దారితీసిన కారణాలను అంచనా వేయడానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకించి పుల్వామా దాడులు, ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో భారత్, పాక్‌ దేశాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా దిగజారిపోయిన నేపథ్యంలో ఈ సరికొత్త పరిణామాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.

గత కొద్ది సంవత్సరాలుగా పాకిస్తాన్‌ అంతర్జాతీయ ఏకాంతవాసాన్ని ఎదుర్కొంటూ వస్తోంది. మధ్యప్రాచ్యంలో పాకిస్తాన్‌ ప్రాధాన్యత మసకబారిపోతోంది. చారిత్రకంగా చూస్తే యూఏఈ, సౌదీ అరేబియా దేశాలతో పాకిస్తాన్‌ సన్నిహిత సంబంధాలు కలిగిఉండేది. పైగా కశ్మీర్‌ సమస్యపై ఈ రెండు దేశాలను పాక్‌ బాగా ఉపయోగించుకునేది. ఎమెన్‌తో సౌదీ గొడవలకు సంబంధించి తటస్థంగా ఉండాలని పాకిస్తాన్‌ నిర్ణయించుకోవడంతో సౌదీ– పాక్‌ బంధాలు కాస్త గడ్డకట్టుకుపోయాయి. అదే సమయంలో మధ్యప్రాచ్యంలో భారత్‌ ఆర్థిక, జనాభాపరమైన ప్రభావం ఎక్కువ కావడంతో సౌదీ అరేబియా, యూఏ ఈలతో భారత్‌ సంబంధం మెరుగుపడుతూ వచ్చింది. దీంతో సౌదీ అరేబియా, యూఏఈలు కశ్మీర్‌ సమస్యపై తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఇది పాకిస్తాన్‌ని బాగా ఇబ్బందిపెట్టింది.

అందుచేత, 2020 నవంబర్‌లో ఓఐసీ (ఆర్గనైజేషన్స్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కంట్రీస్‌) దేశాల సమితిలో కశ్మీర్‌ అంశాన్ని కీలక ఎజెండాగా పాకిస్తాన్‌ ప్రతిపాదించినప్పుడు యూఏఈ, సౌదీ రెండు దేశాలూ దాన్ని వ్యతిరేకించాయి. దీంతో కశ్మీర్‌ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని పాకిస్తాన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి సౌదీని విమర్శించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బీటలు వారిపోయాయి. పైగా తాను గతంలో పాకిస్తాన్‌కు ఇచ్చిన 3 బిలియన్‌ డాలర్ల రుణాన్ని చెల్లించేయాలని సౌదీ నిగ్గదీసింది. పైగా మధ్యప్రాచ్య రాజకీయాల్లో కీలక బిందువుగా మారుతున్న ఇజ్రాయెల్‌ను గుర్తించడానికి తిరస్కరించినందున పాకిస్తాన్‌ ఈ ప్రాంతంలో తన ప్రాముఖ్యతను కోల్పోతోంది.

ఇకపోతే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై పశ్చిమ దేశాలు ఒత్తిడి చేస్తూనే వస్తున్నాయి. అందుకే ఫిబ్రవరి 25న కూడా ఆర్థిక కార్యాచరణపై టాస్క్‌ ఫోర్స్‌ పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో ఉంచేసింది. అంటే ఉగ్రవాదులకు నిధులు ఇవ్వడాన్ని నిలిపివేయడంలో పాకిస్తాన్‌ విఫలమైతే తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని దీనర్థం. పైగా భారత్‌తో అమెరికా సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకుంది. చైనాకు వ్యతిరేకంగా భౌగోళిక రాజకీయపరంగా, ఆర్థికంగా భారత్‌ కీలకస్థానంలో ఉండటం, ఉగ్రవాదులను స్పాన్సర్‌ చేయడాన్ని అరికట్టడంలో పాకిస్తాన్‌ విఫలం చెందడం దీనికి కారణాలు. డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రారంభ సంవత్సరాల్లో ఈ ధోరణి మరింత వేగం పుంజుకుంది. దీంతో అమెరికాకు పాకిస్తాన్‌ మరింత దూరం జరగడం, చైనాపై పాక్‌ ఆధారపడటం పెరగడం మొదలైంది. ఇక దక్షిణాసియాలో కూడా పాక్‌ మిత్రదేశాలైన శ్రీలంక, నేపాల్, మాల్దీవులు పాక్‌తో సంబంధాలపై భారత్‌ ఆందోళన పట్ల మరింత జాగ్రత్తతో ఉంటున్నాయి. ఫలితంగా ఇటీవలే శ్రీలంక పర్యటనకు వచ్చిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ షెడ్యూల్‌ ప్రకారం పార్లమెంటును ఉద్దేశించి చేయవలసిన ప్రసంగాన్ని శ్రీలంక రద్దు చేసింది. అదేసమయంలో భారత్‌ను అవమానపర్చే క్యాంపెయిన్‌ను పాక్‌ పునరాలోచించుకోవాలని పాకిస్తాన్‌ను కోరుతూనే కశ్మీర్‌పై భారత్‌ విధానాన్ని మాల్దీవులు బలపర్చడం విశేషం.

మరోవైపు భూటాన్, బంగ్లాదేశ్, అప్గానిస్తాన్‌ దేశాలు కూడా పాకిస్తాన్‌పై  సదభిప్రాయం కలిగి లేవు. భారత్‌ ప్రయోజనాలు, దాని భద్రతాపరమైన సమస్యలకు ప్రాధాన్యమిస్తూ భూటాన్‌ తన విదేశీ విధానాన్ని రూపొందించుకుంది. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, ఆమెకు చెందిన అవామీ లీగ్‌ పార్టీ భారత్‌తో సంబంధాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. పైగా, అప్గానిస్తాన్‌ కూడా ఉగ్రవాదాన్ని, తాలిబన్‌లను ప్రోత్సహిస్తున్న పాక్‌ను దుయ్యబట్టడం కొనసాగిస్తూనే ఉంది. దౌత్యపరమైన ఈ వెనుకంజలతో పాకిస్తాన్‌ టర్కీ, ఇరాన్, రష్యా, చైనా దేశాలతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ కొత్త సంబంధాలు కూడా పాక్‌ని ఏకాంతం నుంచి బయటపడవేయలేదు. ఇస్లామిక్‌ ప్రపంచానికి తామే నాయకులమని భావిస్తున్న టర్కీ, ఇరాన్‌ ఈ క్రమంలో సౌదీ అరేబియా పాత్రను నిరంతరం ప్రశ్నిస్తూ వస్తున్నాయి. అందుచేత ఈ రెండుదేశాలతో పాక్‌ సన్నిహితంగా మెలి గితే అది సౌదీ, యూఏఈ దేశాలను బాగా ఇబ్బంది పెడుతుంది.

మరోవైపున పాకిస్తాన్‌తో వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకుంటున్న రష్యా.. భారత్‌కు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి పాక్‌తో మరీ అంటకాగడంపై ఆలోచిస్తోంది. ఇక  స్నేహం ప్రాతిపది కన ఏర్పడిన పాక్‌–చైనా బంధం ఇప్పుడు పాకిస్తాన్‌కు వేరేమార్గం లేకుండా తప్పనిసరి పరిస్థితిలోకి నెట్టివేసింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ ఎంత ఎక్కువగా వేరుపడిపోతే అంతే స్థాయిలో అది చైనాపై ఆధారపడటం పెరిగిపోతుంది. అప్పులిచ్చి గుప్పిట్లో పెట్టుకునే చైనా దౌత్యం గురించి పాకిస్తాన్‌కు బాగానే తెలుసు. చైనాపై ఆధారపడటం వల్ల తన భద్రతా విధానాలు ఎంతగా ప్రభావితమవుతున్నాయో పాకిస్తాన్‌ అర్థం చేసుకుంటోంది. చైనా–పాకిస్తాన్‌ ఆర్థిక కారిడార్‌లో తన పెట్టుబడుల ప్రాధాన్యతను గుర్తించిన చైనా గిల్గిత్‌ బాలిస్తాన్‌ను తన అయిదో ప్రావిన్స్‌గా మార్చాలని పాక్‌పై ఒత్తిడి చేస్తోంది.

దీంతో చైనాపై తాను పూర్తిగా ఆధారపడటం, అలా చేయడం ద్వారా అంతర్జాతీయంగా ఏకాంతవాసం నుంచి బయటపడటం సాధ్యపడదని పాక్‌ అర్థం చేసుకుంటోంది. అందుకనే తన దౌత్యపరమైన, వ్యూహాత్మక సమాన స్థాయిని వేగవంతం చేయడంపై పాక్‌ మల్ల గుల్లాలు పడుతోంది. దీనిఫలితంగానే ట్రంప్‌ పాలన మలిదశలో యూఎస్‌–తాలిబన్‌ శాంతి చర్చలు ఫలప్రదం కావడంలో పాక్‌ ముఖ్యమైన పాత్రను పోషించింది. దీనివల్ల దానికి రెండు ఫలితాలు సిద్ధిం చాయి. యూఏఈతో కోల్పోయిన స్థాయిని అది తిరిగి పెంచుకుంది. ఇక రెండోది ఏమిటంటే అప్గానిస్తాన్‌లో అంతర్గత పరిణామాల ప్రభావంతో పాశ్చాత్య దేశాలు అక్కడినుంచి త్వరగా వెనక్కు తిరగాలని భావిస్తున్నాయి. రెండోది ఏమిటంటే, తాలిబాన్‌ను బలోపేతం చేయడం ద్వారా అప్గానిస్తాన్‌లో తనపట్ల వ్యతిరేకత ప్రదర్శించని ప్రభుత్వాన్ని ఏర్పర్చాలని పాక్‌ కోరుకుంటోంది. అలాగైనా అంతర్జాతీయంగా తనకెదురవుతున్న ఒంటరితనానికి దూరం కావచ్చని పాక్‌ భావన. దీనివల్లే పాక్‌ స్వరంలో గణనీయ మార్పు రావడమే కాకుండా భారత్‌తో ఇటీవలి పరిణామాలు కూడా కాస్త మృదురూపం తీసుకుం టున్నాయి. ఈ వ్యూహాత్మక అంచనా కారణంగానే భారత్‌ కూడా తన స్వరంలో కాస్త మార్పు తీసుకొస్తోంది.

దక్షిణాసియా ప్రాంతంలో చైనా పెరుగుతున్న ప్రభావం, ఇటీవలి సరిహద్దు ఘర్షణల కారణంగా పాకిస్తాన్‌తో సంబంధాల సాధారణీకరణ కోసం భారత్‌ కూడా ప్రయత్నించాల్సి వస్తోంది. అంతిమంగా అంతర్జాతీయంగా ఒంటరితనంలో చిక్కుకున్న పాకిస్తాన్‌ అదే సమయంలో చైనాకు మరింత దగ్గర కావడాన్ని అటు అమెరికా కానీ ఇటు భారత్‌ కానీ కోరుకోవడం లేదు. హిందూమహాసముద్రంలో, దక్షిణ చైనా సముద్రంలో, పసిఫిక్‌ ప్రాంతంలో తన ప్రాధాన్యత గురించి భారత్‌ వ్యూహాత్మక అంచనా, అంతర్జాతీయంగా పాక్‌ ఒంటరి కావడం అనేవే ఈ రెండు దేశాల మధ్య ఇటీవలి పరిణామాలకు దోహదపడ్డాయని చెప్పాలి.


ఆదిత్య గౌడర శివమూర్తి
వ్యాసకర్త విదేశీ వ్యవహారాల నిపుణులు
(‘ది స్టేట్స్‌మన్‌’ సౌజన్యంతో) 

మరిన్ని వార్తలు