ఆ విమర్శలన్నీ అక్కసుతోనే!

24 Jun, 2022 13:47 IST|Sakshi

‘యు కెనాట్‌ రీచ్‌ యువర్‌ గోల్‌ ఇఫ్‌ యు కీప్‌ త్రోయింగ్‌ స్టోన్స్‌ ఆన్‌ ఎవ్రీ బార్కింగ్‌ డాగ్‌’         – విన్‌స్టన్‌ చర్చిల్‌.
ఈ కొటేషన్‌ ఏపీ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అతికినట్లు సరిపోతుంది. 2019 మేలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన విమర్శలను పట్టించుకోవడం మానేశారు. తాను చేయదలచుకున్నది చేసుకుంటూ పోతున్నారు. హామీలను పక్కాగా అమలు చేస్తున్నారు. ‘నవరత్నాలు’ దీనికి మంచి ఉదాహరణ. ప్రతి కుటుంబానికీ ఏడాదికి రెండు లక్షల రూపాయలు వివిధ పథకాల రూపంలో అందాయని ముఖ్యమంత్రి జగన్‌ చెబుతుంటారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు.

ప్రతిపక్షం మొత్తం... ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జగన్‌ పాలనపై విషం కక్కుతోంది. ఆయన పాలన ప్రారంభించిన రోజు నుంచీ అడుగడుగునా న్యాయపరమైన చిక్కులు కల్పిస్తూనే ఉంది. మూడు రాజధానుల ప్రకటన నుంచి... శాసన మండలి రద్దు వరకూ ఏదీ టీడీపీ విమర్శకు మినహాయింపు కాదు. పోలవరం ప్రాజెక్టును తన హయాంలో పూర్తిచేయక పోగా... చంద్రబాబు అండ్‌ కో నిర్మించిన డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి బాధ్యతను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై వేస్తుండడం హాస్యాస్పదం. ఉద్యోగాల అంశంలోనూ టీడీపీ, దానికి వత్తాసు పాడే పత్రికలూ అబద్ధాలను చిలవలు పలవలుగా ప్రచారం చేస్తు న్నాయి. వలంటీర్ల రూపంలో సుమారు 4 లక్షల ఉద్యో గాలను కల్పించారు. వలంటీర్ల జీతాలు తక్కువనీ, తక్కువ జీతాలుంటే వారికి పెళ్ళిళ్ళెలా అవుతాయనీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేసిన అంశం ఎవరి దృష్టీ దాటిపోలేదు.  కానీ అన్ని ఉద్యోగాల మాదిరిగానే వలంటీర్లకూ జీతాల పెంపుదల ఉంటుందని జగన్‌ రుజువుచేశారు. అలాగే 1998 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసేందుకూ జగన్‌ నడుం బిగించారు. సంబంధిత ఫైల్‌పై ఆయన సంతకం చేసి దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం చూపారు. 

పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం ఏటీఎమ్‌గా మలచుకుంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ, దాన్ని పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉంచేశారు. ఇప్పుడు డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే కారణమని నెపం మోపుతున్నారు. అంటే ఆ వాల్‌ ఎప్పుడు నిర్మించారో కూడా చంద్రబాబుకు గుర్తు లేదనుకోవాలా? ఇప్పుడు వేగంగా జరుగుతున్న పనులను చూసి, కుళ్ళుకుంటు న్నారని అనుకోవాలా? గ్రావిటీతో కాల్వలకు నీళ్ళిస్తామని చెప్పి, అభాసుపాలైన చంద్రబాబుకు ఇది గుర్తుంటుందనుకోవడం భ్రమే కాగలదు.

మూడేళ్ళ తరవాత దావోస్‌లో నిర్వహించిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశాలకు ఏపీ తరఫున ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరవ్వడం... లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు మార్గం తెరుచుకోవడం జరిగి పోయింది. ఇది బాబులో మరింత అసహనాన్ని రగిల్చింది. అందుకే దావోస్‌కు జగన్‌ విహారయాత్రలా వెడుతున్నారంటూ తన బాకా పత్రికలు, మీడియాతో ప్రచారానికి దిగారు. జగన్‌ బృందం కృషి కారణంగానే గౌతమ్‌ అదానీ, నవీన్‌ మిట్టల్, గ్రీన్‌ కో, అరబిందో లాంటి సంస్థలతో ఏపీ ప్రభుత్వానికి పెద్దపెద్ద ఒప్పందాలు కుదిరాయి. కర్బన రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు పడ్డాయి. (క్లిక్‌: విమర్శే ప్రతిపక్షం పనా?)

ఓ వ్యక్తికైనా... వ్యవస్థను నడిపే నాయకునికైనా సంయమనం అవసరం. రాష్ట్రాధినేతకు ఇది మరింత అత్యవసరం. అందుకే చీటికీ మాటికీ ప్రధాని లేదా ఉన్నత స్థానాలలో ఉన్న వారిపై విమర్శలకు జగన్‌ మొగ్గు చూపడం లేదు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సంయమనం పాటిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు చేస్తున్న విమర్శలు ఆయా రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. జగన్‌ మాత్రం ఆచితూచి మాట్లాడుతూ, స్థితప్రజ్ఞత కనబరుస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఇది ప్రతిపక్ష నాయకుడిని మరింత ఉడికిస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు. (క్లిక్‌: ఏడుపే ఏడుపనే ప్రత్యేక కథనాలు)


- అడుసుమిల్లి జయప్రకాశ్‌ 
మాజీ శాసన సభ్యుడు

మరిన్ని వార్తలు