అఫ్గాన్‌ సింహాలు తలవంచేనా!

9 Sep, 2021 00:56 IST|Sakshi

కొత్త కోణం

పంజ్‌షీర్‌... యావత్‌ ప్రపంచంలో మార్మోగుతున్న పేరు. తాలిబన్లకు సైతం చుక్కలు చూపిస్తున్న ఐదు సింహాల గడ్డ. ఆఫ్గాన్‌ నేలపై ఆధిపత్యాన్ని ససేమిరా సహించని పౌరుషానికి రూపం. ఆ లోయను కైవసం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించినా, చిట్టచివరి యోధుడి చిట్టచివరి రక్తపుబొట్టు నేలలో ఇంకేవరకూ తమను గెలవడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు పంజ్‌షీర్‌ పోరాటవీరులు. ప్రపంచం మొత్తం కరుడుగట్టిన తీవ్రవాదుల్లా భావిస్తోన్న తాలిబన్లను ఎదిరించే సత్తా వీరికెలా వచ్చింది? అంతటి ధీరత్వం, తెగింపు, పట్టుదలకు మూలాలు ఏమిటనేదే ఇప్పుడు చర్చించాల్సిన అంశం.

పరిపాలన రీత్యా అఫ్గానిస్తాన్‌లోని ఒక రాష్ట్రం... పంజ్‌షీర్‌. అమెరికా సేనలు అఫ్గాన్‌ను వీడనున్నట్టు ప్రకటించిన తర్వాత యావత్‌ అఫ్గాన్‌నూ అవలీలగా ఆక్రమించుకుంది తాలిబన్‌ సాయుధ సేన. కానీ ఒకే ఒక చిన్న ప్రాంతం మాత్రం ఈ వ్యాసం రాసేనాటికి పూర్తిగా తాలిబన్ల వశం కాలేదు. అమెరికా తయారు చేసిన ఉగ్రవాదం చివరికి అమెరికానే తరిమికొట్టింది. అమెరికా చేసిన తప్పిదం వల్ల అమెరికా వీడి వెళ్ళిన అత్యాధునిక ఆయుధ సంపత్తి, యుద్ధ విమానాలు ఇప్పుడు తాలిబన్ల చేతుల్లో ఉన్నాయి. చైనా, రష్యా, పాకిస్తాన్‌ అండదండలున్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ పంజ్‌షీర్‌లో అడుగు పెట్టలేక పోయారు. కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్‌లో చివరగా తాలిబన్లు చేసిన ప్రయత్నం–డ్రోన్ల సాయంతో బాంబుల వర్షం కురిపించడం. నిజానికి తాలిబన్ల బలం ముందు పంజ్‌షీర్‌ నిలబడుతుందా? అనేది ప్రశ్నార్థకమే. కానీ గత చరిత్రను తడిమితే, వారెప్పుడూ విదేశీ సైన్యానికి గానీ, స్వదేశీ సేనలకుగానీ లొంగిపోయింది లేదు. 

ఎంతటి ఘాతుకానికైనా తెగబడి పంజ్‌షీర్‌ని వశపర్చుకోజూసినా అది తాలిబన్ల తరంకాలేదు. దీంతో పాకిస్తాన్‌ సాయంతో యువ కిరణం మసూద్‌ని మట్టుబెట్టే ప్రయత్నం చేశారు. అఫ్గాన్‌ మాజీ ఉపా ధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ఇంటిపై బాంబుల వర్షం కురిపించారు. ఇతర నేతల నివాసాలను కూడా బాంబులతో పేల్చి వేశారు. పంజ్‌షీర్‌ గవర్నర్‌ కార్యాలయంపై జెండా ఎగురవేసి, తాము గెలిచామంటూ సంబరాలు చేసుకున్నారు తాలిబన్లు. మొన్నటివరకూ అఫ్గాన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్‌– ‘ఏ దేశమైనా, ఏ ప్రభుత్వమైనా చట్టబద్ధ పాలనను గౌరవించాలి. కానీ హింసను కాదు. పాకిస్తాన్, తాలిబన్లు కలిసి అఫ్గానిస్తాన్‌ను కబళించడానికి చేస్తున్న ప్రయత్నం ఫలించదు. హింస ముందు అఫ్గాన్‌ ప్రజలు మోకరిల్లరు’ అంటూ సాహసోపేతమైన ప్రకటన చేశారు. అమ్రుల్లా సలేహ్‌ పంజ్‌షీర్‌ నేలపై పుట్టిన వాడు. ఆ ప్రాంతం నుంచి తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. 80వ దశకంలో సోవియట్‌ సేనలతో, 90వ దశకంలో తాలిబన్ల పాలన కాలంలో పంజ్‌షీర్‌ తరఫున పోరాడిన అహ్మద్‌ షా మసూద్‌ కొడుకు అహ్మద్‌ మసూద్‌ ప్రజానాయకుడు అయిన అమ్రుల్లాకు అండగా నిల బడ్డాడు. అమ్రుల్లా వ్యూహంతో, మసూద్‌ నాయకత్వంలో పంజ్‌షీర్‌ పోరాడుతోంది. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనేది ప్రశ్నే కాదు. పంజ్‌షీర్ల వారసుడు ఒక్కడున్నా ఈ యుద్ధం ముగియదన్నది సత్యం. 

అఫ్గానిస్తాన్‌ బహు జాతుల సమ్మేళనం. అనేక గిరిజన తెగల సమాహారం. చాలాకాలం ఈ తెగలు వేటికవే స్వతంత్రంగా బతి కాయి. మెజారిటీగా అందరూ ముస్లింలే అయినప్పటికీ–జీవన విధానం, ఆచార సంప్రదాయాలు, ఇతర విలువల రీత్యా ఎవరికి వారుగానే ఉన్నారు. వీరిలో పష్తూన్, తజిక్స్, హజారాస్, ఉజ్బెక్, బలూచ్, అయిముఖ్, క్విజల్, బాశ్, టర్క్‌మన్, క్యూజక్, పార్శివాన్, సయ్యద్, కిర్గిజ్, అరబ్‌ లాంటి ఎన్నో తెగలున్నాయి. ఇందులో పష్తూన్, తజిక్స్, హజారాస్‌ ప్రధానమైనవి. ప్రస్తుత అఫ్గాన్‌ జనాభా దాదాపు 3 కోట్ల 80 లక్షలు. ఇందులో 42 శాతం పష్తూన్లే. వీరినే పఠాన్‌లు అని కూడా అంటారు. తజక్‌ జనాభా 27 శాతం. హజారాలు 9 శాతం, ఉజ్బెక్‌లు 4 శాతం, అయిమక్‌లు 4 శాతం, టర్క్‌మన్‌లు 3 శాతం, బలూచ్‌లు 2 శాతం ఉన్నారు. పష్తూన్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వీరు సంచార జీవనం గడుపుతుంటారు. ఆధు నిక పద్ధతులు అలవాటు కాలేదు. తాలిబన్ల సాయుధ బలగంలో వీరిదే అగ్రభాగం. నాయకత్వ స్థానంలోనూ అధిక సంఖ్యలో ఉన్నారు. 

జనాభా రీత్యా రెండవ స్థానంలో ఉన్న తజిక్‌ తెగ ఆధునిక సమాజంగా వృద్ధి చెందింది. మూడవ స్థానంలో ఉన్న హజారా తెగ వ్యవసాయం, పశుపోషణ, గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తోంది. వెయ్యేండ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన చంఘిజ్‌ఖాన్‌ వారసులమని వీరు చెప్పుకుంటారు. ఈ మూడు తెగల ప్రభావం ఆఫ్గాన్‌పై ఉంటుందనేది వాస్తవం. ఈ ఆధిపత్య తెగ పశ్తూన్లకూ, మిగిలిన తెగలకూ మధ్య నిరంతర ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ వైరానికి దశాబ్దాల చరిత్ర ఉంది. మొదటిసారిగా 1975లో ఆనాటి ప్రధానమంత్రి దావూద్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా పంజ్‌షీర్‌ లోయలో తిరుగుబాటు జరిగింది. దావూద్‌ పష్తూన్‌ తెగకు చెందిన నాయకుడు.

తజక్‌ తెగకు చెందిన తాహిర్‌ బదాక్షి నాయకత్వంలో జరిగిన ఈ తిరుగుబాటును వామపక్ష తిరుగుబాటుగా చెపుతారు. అదేవిధంగా ముస్లిముల్లో షియా వర్గానికి చెందిన హజారా నాయకత్వంలో షల్లెహ–ఏ–జిహాద్‌ పేరుతో 1960ల్లోనే ఒక విప్లవ సంస్థ నిర్మాణం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ రోజు పంజ్‌షీర్‌లో ప్రధా నంగా తజక్, హజారా తెగలు... ప్రధానంగా పష్తూన్ల నాయకత్వంలో ఉన్న తాలిబన్లతో ఘర్షణలో ఉన్నారు. అమెరికా సైన్యం అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తరువాత, అఫ్గాన్‌ జాతీయ ప్రభుత్వాన్ని నడిపిం చడంలో పంజ్‌షీర్‌ నాయకత్వం ప్రధాన పాత్ర పోషించింది. పంజ్‌షీర్‌ తెగలు తాలిబన్లను ఎదిరించి నిలవడానికి, చారిత్రకంగా వస్తున్న జాతుల మధ్య వైరుధ్యాలే ప్రధాన కారణం. 

పంజ్‌షీర్‌ శత్రు దుర్భేధ్యమైనది. ఇది కాబూల్‌కు 150 కిలోమీటర్ల దూరంలో హిందూకుష్‌ పర్వతాలను ఆనుకొని ఉన్న ఒక లోయ. ఈ లోయలోకి ప్రవేశించాలంటే ఉన్నది ఒకే ఒక చిన్న మార్గం. ఆ ఏకైక సన్నని తోవగుండానే ఎవరైనా లోనికి పోవాల్సి ఉంటుంది. అది కూడా పంజ్‌షీర్‌ నదిని దాటుకొని వెళ్లాలి. పంజ్‌షీర్‌ ప్రజలది ప్రత్యేకమైన జీవన విధానం. యుద్ధ విద్య వారి జీవితంలో భాగం. సహజసిద్ధంగా వారసత్వంగా లభించిన ధీరత్వం వీరికి పెట్టని కిరీటం. వేల ఏళ్ళుగా స్వతంత్రంగా జీవనం సాగించిన పంజ్‌షీర్‌ ప్రాంతం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించింది. దానికి కారణం ఈ లోయను పచ్చల మణిహారమని చెపుతారు. అత్యంత విలువైన ఖనిజాలు, పచ్చలు(190 క్యారెట్లు కలిగిన ఎమరాల్డ్‌) ఇక్కడ లభ్యమవడంతో ఈ ప్రాంతం ఆర్థికంగా ఎదిగింది. మధ్యయుగాల కాలంలోనే వెండి గనులు విస్తారంగా ఉండేవి. క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలోనే ఈ ప్రాంతానికి చెందిన ఐదుగురు నాయకులు, స్వయంగా అన్నదమ్ములు అక్కడి నదిపైన ఆనకట్టను నిర్మించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. తరతరాలుగా ప్రజలను వరదల నుంచి రక్షించడమే కాకుండా, వ్యవసాయాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. ఆ ఐదుగురు సోదరులనే ఇక్కడి ప్రజలు ఐదు సింహాలుగా, తమ కుల దైవాలుగా కొలుచుకుంటారు. అందుకే ఈ ప్రాంతానికి పంజ్‌షేర్‌ అనే పేరొచ్చింది. పంజ్‌షేర్‌ కాస్తా వాడుకలో పంజ్‌షీర్‌గా ప్రాచుర్యం పొందింది. 

ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించడం వల్ల పంజ్‌షీర్‌ ప్రజ లకు స్థిరమైన జీవన విధానం అలవాటయ్యింది. దీంతో పట్టణాల నిర్మాణం వైపు మొగ్గుచూపారు. దీనికి భిన్నమైన జీవన విధానం పష్తూన్లది. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పటికీ వీరు సంచార జీవనమే సాగిస్తున్నారు. ఇస్లాంలో ఉండే విషయాలను మరింత కఠినంగా, మూఢంగా నమ్ముతారు; ఆచరిస్తారు; ప్రచారం చేస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇతర సమాజంతో, సంప్రదాయాలతో పరస్పర సంబంధాలు లేకపోవడం వలన వెయ్యేళ్ళ కిందటి సంప్ర దాయాలను మక్కీకి మక్కీ అమలు చేస్తున్న పరిస్థితి. తాము మాత్రమే నిజమైన ముస్లింలుగా వారు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే వైరుధ్యం ఇతర తెగలతో ఘర్షణలకు దారితీస్తోంది. ఆధునిక పద్ధ తుల్లో ముందుకు వెళుతోన్న తజిక్, హజారా తెగలకు పష్తూన్‌ నాయకత్వంలోని తాలిబన్లు సహజ శత్రువులుగా కనిపిస్తున్నారు. ఒకరకంగా సాంప్రదాయక ఛాందసత్వానికీ, ఆధునిక జీవన విధానానికీ మధ్య జరుగుతున్న పోరాటంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. బలవంతమైన మెజారిటీ వర్గం అణచివేతకు వ్యతిరేకంగా పంజ్‌షీర్‌లు తరతరా లుగా సాగిస్తోన్న ఈ పోరాటం... గెరిల్లా యుద్ధ తరహాలో ఉన్న ప్రజా స్వామ్యయుతమైన పోరాటం!

- మల్లెపల్లి లక్ష్మయ్య 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు

మరిన్ని వార్తలు