Agnipath Scheme: స్వార్థపర శక్తులతో జాగ్రత్త!

25 Jun, 2022 12:41 IST|Sakshi

ఒక్క క్షణం సహనం, కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే... ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది 
– స్వామి వివేకా నంద 

దేశంలో రోజు రోజుకూ మారుతున్న పరిణామాల కారణంగా అమాయకులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు స్వార్థపరులు ఆడుతున్న క్రీడలో పలువురు అనవసరంగా పావులుగా మారుతున్నారు. అగ్నిపథ్‌ పథకంపై నిరసనల్లో పాల్గొని కేసుల పాలైన నిరుద్యోగ యువత ఉదంతం ఇందుకు తాజా ఉదాహరణ. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణకు ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ‘అగ్నిపథ్‌’ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే వాస్తవాలూ, పూర్తి వివరాలూ తెలుసు కోకుండానే స్వార్థ రాజకీయ నాయకులూ, కోచింగ్‌ సెంటర్ల యజమానులూ కుట్రపూరితంగా అమాయక నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి హింసకు పాల్పడేలా చేస్తున్నారు. వీరి మాటలు విన్న యువత రెచ్చి పోయి కేసుల్లో ఇరుక్కుంటూ తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు.

ఈ అగ్నిపథ్‌ కింద... 18 నుంచి 23 ఏళ్ల యువకులు నాలుగేళ్లపాటు నెలకు 30 నుంచి 40 వేల జీతంతో దేశ సేవ చేసిన తర్వాత... వారికి రూ. 11.71 లక్షల సేవా నిధి అందు తుంది. సైన్యంలో పొందిన క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం యువతకు లభిస్తుంది. కానీ ఈ వాస్తవాల గురించి తెలుసుకుని పూర్తి అవగాహన పెంపొందించుకునే అవకాశాన్ని స్వార్థపర శక్తులు యువతకు ఇవ్వకుండా వారిని భయాందోళనకు గురిచేశారు. వారి మాటలను నమ్మి విధ్వంసానికి పాల్పడి  కేసుల్లో ఇరుక్కున్న యువకుల భవిష్యత్తు మాటేంటి? 

అగ్నిపథ్‌నే కాదు అంతకుముందూ స్వార్థ రాజకీయ శక్తులు మోదీ తలపెట్టిన సంస్కరణలను వ్యతిరేకించాయి. రైతులకు మేలుచేసే నూతన వ్యవసాయ చట్టాలు తెస్తే రైతులను రెచ్చగొట్టి వాటిని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు. నోట్ల రద్దును పదేపదే విమర్శించేవారు మోదీ నిర్ణయం తర్వాత తీవ్రవాద చర్యలు ఎందుకు తగ్గుముఖం పట్టాయన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. మోదీ ప్రభుత్వం డిజిటల్‌ మనీ విధానాన్ని ప్రవేశపెట్టిన కొత్తలో మార్కెట్‌కు వెళ్ళి కిలో ఆలుగడ్డలు కొనడానికి డిజిటల్‌ మనీ కావాలా అని ఎద్దేవా చేసిన మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం లాంటి వారికీ గంగిరెద్దుల వారు కూడా ఫోన్‌ పే, గూగుల్‌ పేల ద్వారా భిక్షం స్వీకరించటం చెంపపెట్టులాంటిది కాదా? గతంలో కూడా ఇలాంటి విమర్శలకు భయపడి అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు నిలిపివేసి ఉంటే పలు దేశాలలాగా మన దేశం కూడా ఆర్థికమాంద్య పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చేది.
 
మోదీ ప్రభుత్వ  8 ఏళ్ల పరిపాలన చూసి కూడా... ఇంకా స్వార్థపరుల మాటలు వింటూ సహాయ నిరాకరణ, ఆందోళనలు చేస్తే మన చేతితో మన కంటిని మనమే పొడుచుకున్న వారమవుతాం. గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసిన మనం ఎవరి పరిపాలన బాగుంది, ఎవరికి మద్దతుగా నిలబడాలి అని తులనాత్మకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. 


- శ్యామ్‌ సుందర్‌ వరయోగి 
బీజేపీ నాయకుడు

మరిన్ని వార్తలు