ప్రతీకారం తీర్చుకున్న అమెరికా

4 Aug, 2022 13:07 IST|Sakshi
కాబూల్‌లోని అల్‌ జవాహిరీ హతమైన భవనం

అల్‌ఖైదా అగ్రనేత అల్‌ జవాహిరీని అమెరికా వేటాడి, వెంటాడి ప్రాణాలు తీసిన వార్త కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది. గురికి బారెడు దూరంలో ఉన్న ఆస్తులకు, మనుషులకు ఏమాత్రం హాని కలిగించకుండా కేవలం లక్ష్యాన్ని మాత్రమే చేధించగల ఆధునిక క్షిపణి సాయంతో, అఫ్గానిస్తాన్‌లో తలదాచుకున్న ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఇరవై ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్‌ 11 తేదీన (9/11) అప్పటి అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ కారణంగా జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 2,997 మంది అమెరికన్‌ కుటుంబాల బాధకు, ఆవేదనకు జవాహిరీ మరణం ఓ ముగింపు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.  

9/11గా ప్రసిద్ధమైన ఆనాటి విధ్వంసానికి ప్రతీకారంగా, అమెరికా పదేళ్ల తర్వాత,  2011లో బిన్‌ లాడెన్‌ను వధించి పగ తీర్చుకుంది. అప్పట్లో లాడెన్‌కు కుడి భుజంగా వ్యవహరించిన జవాహిరీని కూడా వదిలిపెట్టలేదు. మరో పదేళ్ల తర్వాత ఇప్పుడు అల్‌ జవాహిరీని చంపి, తమది పాము పగ అని అమెరికా యావత్‌  ప్రపంచానికీ మరోమారు చాటి చెప్పింది. ఈ నేపథ్యంలో గతంలో ఏం జరిగిందో చూద్దాం.    

‘మతం కోసం ఎలాంటి మారణహోమానికి అయినా సిద్ధం’ అనే సిద్ధాంతం అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ది. ‘ప్రపంచం మీద పెత్తనం కోసం ఎంతటి దురాగతానికయినా సంసిద్ధం’ అనే తత్వం అమెరికాది. ‘పాముకు పాలుపోసి పెంచుతాను, కానీ ఆ పాము తనను తప్ప ఎవరిని కాటేసినా ఫరవాలేదు అనే థియరీ’ అమెరికాది. ‘కోరల్లో దాచుకున్న విషం కక్కేటప్పుడు స్వపర భేదాల ప్రసక్తి పనికి రాదనే భావజాలం’ ఒసామాది.

ఒకానొక కాలంలో అమెరికా తన అవసరాల కోసం పెంచి పోషించిన ఒసామా బిన్‌ లాడెన్‌ అనే ఈ విషనాగు, ఇరవై ఏళ్ళ క్రితం అమెరికాపైనే ఎదురుతిరిగి, పాలు పోసి పెంచిన చేతినే కాటేసింది. సోవియట్‌ యూనియన్‌ అంతర్ధానం తరువాత ఏర్పడ్డ ఏకధృవ ప్రపంచానికి... లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని అనేక అకృత్యాలకు పాల్పడుతున్న అమెరికా అహంభావాన్ని... బిన్‌ లాడెన్‌ తనదైన  శైలిలో దెబ్బ తీశాడు. అప్పుడు కానీ ‘పాము – పాలు’ కథ లోని అంతరార్థం అమెరికాకు అవగతం కాలేదు. తన దాకా వస్తేగాని తత్వం బోధపడదన్నట్టుగా... అల్‌ఖైదా తీవ్ర వాదులు 2001, సెప్టెంబర్‌ 11న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ జంట టవర్లను విమానాలతో ఢీ కొట్టించి కనీ వినీ ఎరగని భయోత్పాతాన్ని సృష్టించిన ఘటన తర్వాత గానీ ఉగ్రవాదం వల్ల పొంచి వున్న ముప్పు ఎలా ఉంటుందన్నది అమెరికాకు అర్థం కాలేదు.

ఆనాటి పరాభవం అమెరికాలో పట్టుదలను పెంచింది. ఆ దురాగతానికి రూపశిల్పి అయిన ఒసామా బిన్‌ లాడెన్‌ అంతం చూడడానికి దశాబ్ద కాలంగా అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు. చిట్టచివరికి, పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పాకిస్తాన్‌ భూభాగంలో ఆ దేశ పాలకులకే తెలియకుండా తలదాచుకుంటున్న ఒసామా బిన్‌ లాడెన్‌ను, జల్లెడ పట్టి గాలించి పట్టుకుని మట్టు పెట్టేదాకా మాజీ అగ్ర రాజ్యాధినేత బరాక్‌ హుస్సేన్‌ ఒబామాకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఒసామా మరణించిన విషయాన్ని స్వయంగా అమెరికన్‌ అధ్యక్షుడే ప్రకటించిన అంశాన్ని గమనిస్తే ఈ విషయానికి ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో విశదమవుతుంది. లాడెన్‌ మరణ వార్తను ధృవ పరచుకోవడానికి వీలుగా అమెరికా వ్యూహకర్తలు పకడ్బందీగా అమలు చేసిన హైటెక్‌ పద్ధతులు టీవీల్లో చూసినవారికి జేమ్స్‌ బాండ్‌ సినిమాలు జ్ఞప్తికి వచ్చాయి. వైట్‌ హౌస్‌లో కూర్చుని పథకం అమలవుతున్న తీరు తెన్నులను ఎప్పటి కప్పుడు ఉపగ్రహ సాయంతో గమనిస్తున్న ప్రెసిడెంట్‌ ఒబామా హావభావాలను బట్టి అన్ని దేశాలలోని టీవీ వీక్ష కులూ లాడెన్‌ మృతి పట్ల ఆ దేశానికి వున్న పట్టుదలను అర్థం చేసుకోగలిగారు. (క్లిక్‌: జవహరీ మృతిపై తాలిబన్‌ల సంచలన ప్రకటన)

ఒసామా బిన్‌ లాడెన్‌ పూర్వీకులు ఎమెన్‌లో కడు నిరుపేదలు. అతడి తండ్రి మహమ్మద్‌ బిన్‌ లాడెన్, ఎమెన్‌ నుంచి ఉదర పోషణార్థం సౌదీ అరేబియాకు వలస వెళ్లి నిర్మాణ రంగంలో కాలుపెట్టి కోట్లకు పడగలెత్తాడు. గల్ఫ్‌ యుద్ధం సహాయక చర్యల్లో భాగంగా... అమెరికా మిలిటరీ స్థావరం ఏర్పాటుకు సౌదీ ప్రభుత్వం తన భూభాగంలో అనుమతించడాన్ని ఒసామా విమర్శించాడు. దీంతో కోపగించిన సౌదీ ప్రభుత్వం అతడి పౌరసత్వాన్నీ, పాస్‌పోర్ట్‌నూ రద్దు చేసింది. అప్పటికే లాడెన్‌ కుటుంబం కూడా ఒసామాను తమ నుంచి వెలి వేసింది. ఆ తర్వాత ప్రపంచంలోనే భయంకర ఉగ్రవాదిగా తయారయ్యి అమెరికా చేతిలో హతుడయ్యాడు. ఒసామా తర్వాత అల్‌ఖైదా పగ్గాలు చేపట్టిన అల్‌ జవాహిరీ కూడా లాడెన్‌ తరహాలోనే మరణించడం కాకతాళీయం.


- భండారు శ్రీనివాసరావు 
సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు