భారతీయుల డీఎన్‌ఏ ఒక్కటే!

7 Jul, 2021 01:25 IST|Sakshi

‘భారతదేశంలో నివసించే హిందూ–ముస్లింల డీఎన్‌ఏ ఒకటేనని, పూజావిధానం ప్రాతిపదికన మనుషులను వేరుగా చూడలేమ’ని ఆరెస్సెస్‌ సర్‌ సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అన్న మాటలు సంచలనం కలిగించాయి. ఆరెస్సెస్‌ ప్రవచించే జాతీయవాదాన్ని హిందూ మతోన్మాదంగా చిత్రీకరించి, సనాతన భారతీయ విలువల్ని తూర్పారబట్టే మానసిక భావజాలంతో మనుగడ సాగిస్తున్న భారతీయ మేధావులను ఆయన ప్రకటన సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి ఉంటుంది. మనిషి శారీరక మానసిక ఆరోగ్యాలను చక్కబెట్టడానికి మన మహర్షులు అందించిన యోగాను, ప్రాణాయామ  ప్రక్రియను ఒక మత ఆచారంగా తేల్చి కొన్ని వర్గాల ప్రజలకు దాన్ని దూరం చేశారు. ఈ నేపథ్యంలో మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.

హిందూ సమాజంలోని కుల పైత్యాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తూ హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉండే ప్రజలందరి డీఎన్‌ఏ ఒకటేనని, వీరందరూ అనుసరించే సంస్కృతి ఒకటేనని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తేల్చి చెప్పారు. ఈ దేశ దురదృష్టమేమో కానీ ఆయన మాటలను చాలామంది పాలకులు, మేధావులు చెవికి ఎక్కించుకోలేదు. ’భారతీయులందరూ ఒక జాతి కాదు. ఈ దేశంలో నివసించే ప్రజలందరూ అనేక దేశాల నుంచి వచ్చినవారు. ఇక్కడ జాతీయులు ఎవరూ లేరు’ అనే కొత్త వాదాన్ని బ్రిటిష్‌ పాలకులు ఈ దేశ విద్యావిధానంలో ప్రవేశపెట్టారు.  ఈ వాదం స్వాతంత్య్రోద్యమ నాయకుల్లో గందరగోళాన్ని కలిగించింది. ఈ వాదాన్ని బలంగా నమ్మిన ప్రజలు దేశం నుంచి విడిపోయారు. బ్రిటిష్‌ వారు నాటిన విషబీజాల ప్రభావం భారతీయ జనత మెదళ్ల నుండి  ఇంకా తొలగిపోలేదనే సత్యాన్ని  గుర్తు చేయడం కోసమే మోహన్‌ భాగవత్‌ ఈ మాటలు అన్నారేమో అని అర్థం చేసుకోవచ్చు. ఆయన మాటల్లో చారిత్రక వాస్తవం ఉంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్‌లో జీవించే చాలామంది ముస్లింలు ఇస్లామిక్‌ పరిపాలనలో మతం మార్చుకున్న ‘సనాతన భారతీయులే’ అనేది చారిత్రక వాస్తవం. ఈ చారిత్రక సత్యాన్ని భారతీయ యువతకు బోధించి ఉంటే హిందూ ముస్లింల మధ్య ఇంత అగాథం ఏర్పడి ఉండేది కాదు. ఈ దేశంలో మతం పేరుతో జిహాదీ ఉగ్రవాదం చలామణి అయ్యేది కాదు.

ఇక మతం పేరుతో మూక దాడులకు పాల్పడే వారు హిందువులకు శత్రువులని చెప్పడం ద్వారా మోహన్‌ భాగవత్‌ సనాతన భారతీయ ఆలోచనా ధోరణి ఏమిటో భారతీయుల ముందు ఉంచారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ఆలోచన విధానాన్ని ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ దేశ ప్రజలు మత పరంగా కాకుండా సనాతన భారతీయ జీవన విధానంతో కలిసిమెలిసి ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పిన మాటలు జాతి మొత్తానికి శిరోధార్యం. ఇక ఇస్లాం  ప్రమాదంలో పడిపోతుంది అనే భ్రమలో ఈ దేశ ముస్లింలు ఉండవలసిన అవసరం లేదని, కుహనా లౌకిక వాదాన్ని నెత్తిన పెట్టుకున్న రాజ కీయ నాయకుల మాటలను నమ్మొద్దని ఆయన ముస్లిం లను కోరడం వెనుక దేశ విశాల ప్రయోజనం దాగి ఉందని అర్థం చేసుకోవాలి.

ఉల్లి బాలరంగయ్య,
ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధి 

మరిన్ని వార్తలు