Allu Ramalingaiah: హాస్య దళానికి కులపతి అల్లు రామలింగయ్య

1 Oct, 2022 08:46 IST|Sakshi

నేడు ‘పద్మశ్రీ’ అల్లు రామలింగయ్య శతజయంతి

తెలుగు సినిమా చరిత్రలో భావి తరాల వారిని ప్రభావితం చేయగలిగిన నటీనటులు వేళ్ళమీద లెక్క పెడితే అందులో తప్పనిసరిగా నిలిచే పేరు అల్లు రామలింగయ్య. హాస్యంలోంచి విలనీ, విలనీ లోంచి హాస్యం సాధించిన విశిష్ట నటుడు. 1953లో తొలిచిత్రం పుట్టిల్లులో పోషించిన శాస్త్రులు, వద్దంటే డబ్బులో టీచరు, దొంగరాముడులో హాస్టలు వార్డెను పాత్రల్ని పునాదులుగా చేసుకుని భాగ్యరేఖ, మాయాబజార్‌ చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 2004 నాటికి 1,000కి పైగా చిత్రాల్లో విలక్షణ భూమికల్ని పోషించారు.

‘పుట్టిల్లు’, ‘మాయాబజార్‌’లలోని శాస్త్రులు పాత్ర ఆకట్టు కుంది. అందుకే ఆ తర్వాత అనేక చిత్రాల్లో శాస్త్రి పాత్ర ఆయన్నే వరిచింది. ఒక్కో చిత్రంలో ‘శాస్త్రి’  పాత్ర ఒక్కోలా ఉండడమే అల్లు సాధించిన పరిపూర్ణత. ఆ పాత్రకు తాను నిజ జీవితంలో చూసిన సూరి భొట్ల నారాయణమూర్తి స్ఫూర్తి అనీ, అయితే ఆయా చిత్రాల్లో పాత్రౌచిత్యాన్ని బట్టి రసాల కూర్పు చేసుకునే వాడిననీ ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అలాగే హాస్య పాత్రలు పోషించాల్సి వచ్చినప్పుడల్లా మునిమాణిక్యం నర సింహరావు, భమిడిపాటి కామేశ్వరరావు వంటి వారి రచనలు చదివి స్ఫూర్తి చెందేవాడిననీ, ఆ ఇద్దరూ తన అభిమాన రచయితలనీ అల్లు పేర్కొన్నారు.

ఎప్పుడో దొంగ రాముడు షూటింగ్‌ సమయంలో అల్లు అప్రయత్నంగా డైలాగ్‌ మరిచి పోవడం వలన వెలువడిన ’ఆమ్యామ్యా’ని, బుద్ధిమంతుడు, బాలరాజు కథ, అందాల రాముడు చిత్రాల్లో చెప్పగా చెప్పగా ‘ఆమ్యామ్యా’ కాస్తా తెలుగు నాట లంచానికి పర్యాయపదంగా స్థిరపడిపోయి, దినపత్రికల్లో పతాక శీర్షిక అయ్యింది. ముళ్ళపూడి వెంకట రమణని ఓ జర్నలిస్ట్‌ ‘ఆమ్యామ్యా’  సృష్టికర్త మీరే కదా?! అని ప్రశ్నస్తే ‘ఆమ్యామ్యా సృష్టికర్త అల్లు రామలింగయ్య గారు, ఆమ్యామ్యా మీద పేటెంట్‌ హక్కులన్నీ వారివే’ అని ధృవీకరించారు.

మూగమనసులు సినిమా చేసేనాటికి వెయ్యి రూపాయలు పారితోషికం కాస్తా రెండువేల ఐదొందలు అయ్యింది. అల్లు 2003 నాటికి గానీ అత్యధిక పారితోషికం లక్ష రూపాయలు అందుకోలేదు. పాలకొల్లులో నాటకాలాడటం, స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని జైలు శిక్షలను అభవించడం, ప్రజా నాట్యమండలితో అనుబంధం వంటి అనేక దశలు రామలింగయ్య జీవితంలో ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు.

అల్లు జననీ జనకులు అల్లు వెంకయ్య, సత్తెమ్మ. మొత్తం ఏడుగురు సంతానం. క్షీరా రామలింగేశ్వరుడి పేరు ఆయనకు పెట్టారు. ఆ రోజుల్లో అధికారులు 40 ఏళ్ళని బర్త్‌ సర్టిఫికెట్‌ తీసుకువస్తే ప్రవేశ పరీక్ష రాయక్కర్లేదని ఆర్‌ఎంపీ సర్టిఫికెట్‌ ఇస్తామని చెబితే... ‘లేదు నాకు 39 ఏళ్ళే, నేను పరీక్ష రాస్తా’నని చెప్పి పరీక్ష రాసి ఉత్తీర్ణుడై హోమియోపతి డాక్టరుగా అల్లు సాధించిన కీర్తి ఇంతా అంతా కాదు.

అల్లు నుండి వైద్యసేవలు అందుకున్నవారిలో నందమూరి బసవతారకంతో పాటు నూతన నటీనటుల వరకూ ఉండేవారంటే అతిశయోక్తి కాదు. రాజ మండ్రిలో బోడా వెంకటరత్నం, చింతవారి జానకి రామయ్య తదితర ప్రముఖులతో స్థాపించబడిన హోమియో కళాశాల ఆర్థిక అస్థిర పరిస్థితుల్లో ఉంటే అల్లు రామలింగయ్య కృషితో ఆంధ్ర దేశంలో పేరెన్నిక గన్న కళాశాలగా ఎదిగింది.

ప్రతి కార్యక్రమానికీ అర్ధాంగి అల్లు కనక రత్నం, పెద్ద కుమార్తె అల్లు నవ భారతీదేవి తప్పని సరిగా వచ్చేవారు, జాతీ యోద్యమంలో నూలు వడకడంలో జిల్లాలోనే మొదటి బహు మతి పొందిన కారణంగా కనకరత్నంని కోరి మరీ పెళ్ళా డారు రామలింగయ్య. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక కలిగిన సంతానం కావడంతో తమ కుమార్తెకు నవభారతి అని పేరు పెట్టుకున్నారంటే ఆయన దేశభక్తి ఏమిటో అర్థమవుతుంది.

అల్లు అరవింద్‌ అగ్ర నిర్మాతగా అవతరించాక ‘నాన్నగారూ కొంచెం మీరు విశ్రాంతి తీసుకోవచ్చు కదా! ఇంకా నటించడం ఎందుకండి, సంవత్సరంలో మీరెంత సంపాదిస్తారో అంతా మీకు ఒక్కసారిగా నేనిచ్చేస్తాను’ అంటే... ‘నటించడంలోనే నా తృప్తి, సరదా, సంతోషం అన్నీ ఉన్నాయి, కాబట్టి ఓపిక నశించే వరకూ నటిస్తా. ఊపిరి ఉండే వరకూ నటిస్తా. మరణించాక కూడా నటిస్తా అన్నారు అల్లు రామలింగయ్య. ‘మరణించాక నటిస్తారా? అదెలాగ నాన్నగారూ?’ అన్నారు అరవింద్‌. ‘నేను పోయాక నన్ను పాడెమీద పడుకో బెట్టాక నువ్వా దృశ్యాలన్నిటినీ కెమెరాతో షూట్‌ చేయిస్తావని నాకు తెలుసు, అంటే నేను పోయాక కూడా నటిస్తున్నాననే కదా!’ అన్నారు రామలింగయ్య.

ఇంత చెప్పీ అల్లు రామలింగయ్య బాల్యం నుండే అస్పృశ్యత, అంటరానితనంపై పోరాడారని చెప్పకపోతే తప్పే అవుతుంది. ‘కుక్కను జూచి గురుతర భక్తితో భైరవుండని ప్రేమ బరగుచుండి/ పాముని జూచి సుబ్బారాయుడని మ్రొక్కి పాలు పోసి పెంతురు భక్తి గల్గి/గద్దను జూచి విష్ణు వాహనం బనుచు కడు ముదముతో వినుతి జేసి/కోతి హనుమంతుడనుచు కూర్మి మీర తాకెదరు గాదె మమ్మేల తాకరయ్యా?! జంతువుల కన్నా అధముడా సాటి నరుడు’ అనే పద్యంతో ధ్వజమెత్తిన అల్లు రామలింగయ్య జీవిత పర్యంతమూ ఈ సిద్ధాంతానికే కట్టుబడిన మహర్షి!

– చిల్లగట్టు శ్రీకాంత్‌ కుమార్‌, రచయిత 

మరిన్ని వార్తలు