Alluri Sitarama Raju: అచంచల దేశభక్తునికి జాతి నీరాజనాలు

4 Jul, 2022 12:37 IST|Sakshi

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను జూలై 4వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభించారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో భాగంగా ఈ దేశభక్తుడి జయంత్యుత్సవాలను ఏడాదిపాటు నిర్వహించాలని సంకల్పించడం తెలుగు ప్రజల ఆకాం క్షను గౌరవించడమే! మన్నెం వీరుని పోరుగడ్డను అల్లూరి సీతా రామరాజు జిల్లాగా ప్రకటించి ఆ మహనీయుడికి నివాళులర్పించి, మన్నెం వాసుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఈ తరుణంలో ఈ విప్లవ జ్యోతి పురిటిగడ్డలో 30 అడుగుల భారీ కాంస్య విగ్రహం నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం ముదావహం.

బ్రిటిష్‌ వారిపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రకి గ్రామంలో జన్మించిన సీతా రామరాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి సమీపంలోని మోగల్లు గ్రామం. చిన్నప్పటి నుంచీ ఆయనకు దైవభక్తీ, దేశభక్తీ మెండుగా ఉండేవి. విశాఖ, గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో దోపిడీకి గురవుతున్న ఆదివాసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద యుద్ధం చేశాడు. శత్రువుల కదలికలను పసిగట్టేందుకు పటిష్ఠమైన గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేయటం, శత్రువుల ఆయుధ సంపత్తిని కొల్లగొట్టడం, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేయడం వంటి యుద్ధవ్యూహాలు... బ్రిటీష్‌ పాలకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. 

తాను చేయదలుచుకున్న దాడి గురించి ముందుగానే మిరపకాయ టపా ద్వారా శత్రువుకు సమాచారం పంపించే వాడు సీతారామరాజు. ఆ టపాలో చెప్పినట్టు సరిగ్గా అదే రోజు, అదే సమయానికి దాడి చేసి లక్ష్యాన్ని నెరవేర్చుకునేవాడు. బ్రిటిష్‌ సైన్యాన్ని సమర్థంగా ఎదిరించి పోరాడా లంటే అల్లూరి విప్లవ సైన్యానికి తుపాకులు సమకూర్చు కోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించాడు. అందుకు తొలిగా మన్యంలోని చింతపల్లి పోలీసు స్టేషన్‌ను ఎంచుకున్నాడు. 1922 ఆగస్టు 19వ తేదీన అల్లూరి సాయుధ విప్లవంలో మహోజ్వల ఘట్టం చోటు చేసుకున్నది. కత్తులు, బల్లేలు, సాంప్రదాయ విల్లంబులు ధరించిన దాదాపు 300 మంది అనుచరులు వెంటరాగా అల్లూరి చింతపల్లి పోలీసు స్టేషన్లో అడుగుపెట్టాడు. అక్కడి పోలీసులు నిశ్చేష్టులై చూస్తుండి పోయారు.

ఆయుధ సంపత్తినంతటినీ స్వాధీనం చేసుకొని వాటి వివరాలన్నింటినీ స్టేషన్‌ డైరీలో నమోదు చేసి అల్లూరి స్వయంగా సంతకం చేశారు. తరువాత కృష్ణదేవిపేట పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాడు. మరుసటి రోజు రాజవొమ్మంగి పోలీసు స్టేషన్‌పైనా దండెత్తాడు. ఈ విధంగా వరుసగా 3 రోజుల్లో 3 పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధ సంపత్తిని దోచుకోవటం బ్రిటిష్‌ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. మరోవైపు ఈ సమాచారం దేశమంతా వ్యాప్తిచెంది దేశ భక్తుల రక్తం ఉప్పొంగేలా చేసింది.

1922 నుంచి యుద్ధసన్నాహాలలో పూర్తిగా నిమగ్నమై గంటందొర, మల్లుదొర వంటి యోధులతో దళాలను ఏర్పాటు చేసి 200 మందితో విప్లవ సైన్యాన్ని రామరాజు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యుద్ధ సన్నాహాలను ఆలస్యంగా గ్రహించిన బ్రిటిష్‌ ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్‌ రూథర్‌ఫర్డ్‌ను రంగంలోకి దింపింది. ఆయన పంపిన 700 మంది సాయుధ పోలీసులు పలు ప్రాంతాలను జల్లెడ పట్టసాగారు. 1922 సెప్టెంబర్‌ 3వ తేదీన నర్సీపట్నానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంజేరి కొండవాలుల్లో ఘాట్‌ రోడ్డుపై ప్రయాణిస్తున్న బ్రిటిష్‌ పోలీసులపై దాడిచేసి తరిమి వేసింది అల్లూరి సైన్యం. మరుసటి ఏడాది సైన్యాధికారి స్కాట్‌ కవర్ట్‌ నేతృత్వంలోని బ్రిటిష్‌ సైన్యాన్ని ఓడించాడు. కవర్ట్‌లాంటి వారు ఈ యుద్ధంలో మరణించారు. 

అల్లూరిని నిలువరించేందుకు విప్లవ సైన్యాన్ని బలహీనపరిచే కుయుక్తులకు బ్రిటిష్‌ సైన్యం తెరతీసింది. విప్లవ కారులను, వారికి సహాయపడే వారిని అణ చివేసేందుకు, సహాయ నిరాకరణ చేసే వారిని శిక్షించేందుకు విశాఖలో ప్రత్యేక ట్రిబ్యు నల్‌ ఏర్పాటు చేశారు. విప్లవకారులకు సహకరించారనే మిషతో ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో అమాయక గిరిజనులను తీసుకెళ్లి... ట్రిబ్యునల్‌లో క్రూరమైన శిక్షలు విధించడం నిత్యకృత్యమైంది. తన కారణంగా ప్రజలు నరకయాతన పడటానికి ఇష్టపడని రాజు చివరికి లొంగిపోవాలనుకున్నాడు. ఈ దశలో మే 6వ తేదీన మంప గ్రామంలో జమేదారు కుంచుమీనన్‌ తన సాయుధ బలగంతో వెళ్లి అల్లూరిని నిర్బంధించాడు. 1924 మే నెల 7వ తేదీన సీతారామరాజును బ్రిటిష్‌వాళ్లు కయ్యూరులో కాల్చి చంపారు. విప్లవ జ్యోతి ఆరిపోయింది. సీతారామరాజు శౌర్యపరాక్రమాలు, త్యాగనిరతి భారతజాతికి ఆదర్శనీయం. (చదవండి: వైరాగ్యం నుంచి విప్లవం వైపు...)

- పెన్మెత్స శ్రీహరిరాజు 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 
(జూలై 4న అల్లూరి సీతారామరాజు జయంతి)

మరిన్ని వార్తలు