అమరావతి రైతుల్ని మోసం చేసింది బాబే!

13 Aug, 2020 00:45 IST|Sakshi

రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణకు అక్రమ మార్గాలలో అడ్డుపడుతున్న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు.. తాజాగా అమరావతి అంశంపై పెద్దఎత్తున తన మీడియా ద్వారా ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. అమరావతి రైతులను వ్యవసాయానికి దూరం చేసి వారితో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయించాలనుకోవడంతోనే సమస్యలు వచ్చిపడ్డాయి. నిజానికి, అమరావతి రైతులు దీక్ష చేయాల్సింది చంద్రబాబు ఇంటి ఎదుట. శాపనార్థాలు పెట్టాల్సివస్తే.. తమను మభ్యపెట్టి మోసం చేసిన చంద్రబాబునే వారు టార్గెట్‌ చేయాలి. ఎందుకంటే, అమరావతి రైతాంగానికి నమ్మకద్రోహం చేసింది ముమ్మాటికి చంద్రబాబునాయుడే. ఆయన స్వార్థం, ధనదాహం కారణంగానే అమరావతి రైతులు తమ విలువైన వ్యవసాయ భూముల్ని కోల్పోయారు. వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియనివారికి రియల్‌ ఎస్టేట్‌ రుచి మప్పాలని చూశారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి చంద్రబాబు రాజధాని కట్టకుండా కాలయాపన చేసినందునే అక్కడ తాత్కాలిక నిర్మాణాలు మినహా చెప్పుకోదగ్గ శాశ్వత కట్టడం ఒక్కటీ ఏర్పాటు కాలేదు. చంద్రబాబు అమరావతి రైతాంగాన్నేకాదు.. రాష్ట్ర ప్రజలందర్నీ రాజధాని పేరుతో మభ్యపెట్టారు. మోసం చేశారు. అందుకు తగిన ఫలితం ఎన్నికలలో అనుభవించారు. అమరావతి రైతులు తన మీద తిరుగుబాటు చేస్తారనే! తనను నిలదీసి ప్రశ్నించే రోజు వస్తుందనే భయంతోనే హైదరాబాద్‌లో కూర్చొని.. రాజకీయ స్టీరింగ్‌ తిప్పుతూ మీడియాలో మాత్రమే చంద్రబాబు కనిపిస్తున్నారు.

డొల్ల వాదన
చంద్రబాబుకు తెలిసిన అనేకానేక వక్ర విద్యల్లో.. మీడియా ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లడం ఒకటి. ఈ మధ్య సోషల్‌ మీడియా, అదేవిధంగా అనుకూల మీడియా ద్వారా గతంలోని వార్తల్ని, ప్రత్యేకించి ప్రతిపక్షనేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాజధానిపై అసెంబ్లీలో మాట్లాడిన మాటలను పదేపదే చూపుతూ ఆయనేదో మాట మార్చారన్నట్లుగా వక్రీకరిస్తున్నారు. 2014లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిని విశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఒక ‘గుడ్‌ ఫెయిత్‌’తో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వ అటవీ భూములు పుష్కలంగా ఉన్న దొనకొండ ప్రాంతం లేదా నూజివీడు ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు.

ప్రజలను, ప్రతిపక్షాలను తప్పుదోవ పట్టిస్తూ.. చంద్రబాబు గన్నవరం, నూజివీడు, దొనకొండ.. ఈ 3 ప్రాంతాల్లో ఏదో ఒకచోట రాజధాని రాబోతున్నదన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికలో.. 3 పంటలు పండే అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయడం మంచిది కాదని స్పష్టం చేశారు. కానీ, శివరామకృష్ణన్‌ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వకముందే సొంత మనుషులతో ఓ కమిటీ వేసుకొన్నారు. పైగా, ఎటువంటి వెరపులేకుండా శివరామకృష్ణన్‌ కమిటీ.. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయమని సూచించిందని, ఆన్‌లైన్‌ ద్వారా 4 వేలమంది అభిప్రాయాలు కోరితే, అందులో మెజారిటీ ప్రజలు అమరావతికి అనుకూలంగా ఓటు వేశారంటూ పచ్చిగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించిన తర్వాత శివరామకృష్ణన్‌ ఆ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయడం ఆత్మహత్యాసదృశం అంటూ ‘హిందూ’లో ఓ వ్యాసం రాశారు.

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ అన్నది బూటకం
ఇక, ‘అమరావతి నిర్మాణం’కు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని.. ఇదొక సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని, సొంతంగా సమకూరే ఆదాయంతోనే.. ప్రపంచ రాజధానులను తలదన్నే రీతిలో అమరావతిని కట్టవచ్చునని చంద్రబాబు చేస్తున్న వాదనలో పసలేదు. సొంత నిధుల నుంచి రూపాయి కూడా రాజధానికి అవసరం లేకపోతే.. కేంద్ర ప్రభుత్వం రాజధాని కోసం ఇచ్చిన రూ. 2,500 కోట్లు సరిపోవని, ఇంకా నిధులు ఇవ్వాలని పదేపదే కేంద్రం చుట్టూ తిరగాల్సిన అవసరం, ప్రధాని నరేంద్ర మోదీని దూషించాల్సిన అగత్యం ఆనాడు ఎందుకు ఏర్పడింది? ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరంలేని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టుపై ఐదేళ్లలో రూ. 10 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? అది చాలదన్నట్లు రాజధాని నిర్మాణానికి నిధులు సమీకరణకోసం హడ్కో, ఆసియన్‌ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్‌ మొదలైన ఆర్థిక సంస్థలను అప్పులిమ్మని ఎందుకు అర్థించినట్లు?!
 
అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిందని అబద్ధం
చంద్రబాబు, తెలుగుదేశం నేతలు తాజాగా చేస్తున్న శుష్క ప్రచారానికి పరాకాష్ఠ.. తమ ఐదేళ్లపాలనలో అభివృద్ధి వికేం ద్రీకరణ చేశామనడం. పునర్వ్యవస్థీకరణ బిల్లుననుసరించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని వెనుకబడిన 7 జిల్లాలకు కేటాయించిన రూ. 350 కోట్లు కూడా ఆ జిల్లాల అభివృద్ధికై ఖర్చుపెట్టలేదు. పైగా, చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరుకు కేంద్రం ఇచ్చిన రూ. 50 కోట్లల్లో కేవలం రూ. 2 కోట్లు ఖర్చు పెట్టి.. మిగతా మొత్తాన్ని దారి మళ్లించారు. రాష్ట్రంలో కరువే భయపడి పారిపోయేటట్లు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని మెజారిటీ మండలాలు కరువుకోరల్లో చిక్కి సతమతం అయ్యాయి. ఈ తప్పిదాలు, వైఫల్యాలు, పాపాలు గమనించడం వల్లనే ప్రజలు చంద్రబాబును ఎన్నికలలో శిక్షించారు. అమరావతి ప్రాంతం ఉన్న రెండు నియోజకవర్గాలు  మంగళగిరి, తాడికొండ రెండింటిలోనూ తెలుగుదేశం పార్టీకి ప్రజలు తగినవిధంగా గుణపాఠం చెప్పారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ తరహాలో తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున తమ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన విషయాన్ని  ఆ రెండు నియోజకవర్గాలలో ఎవరిని కదిపినా కథలుకథలుగా చెబుతారు.

అవసరం లేకపోయినా హైదరాబాద్‌ను వీడి అమరావతికి మకాం మార్చిన చంద్రబాబు నేడు ప్రధాన ప్రతిపక్షనేతగా సొంత రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం  ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌ నుండి కదలడం లేదు. అమరావతికి వస్తే ఏదో ఒక రోజు రైతులు తన మీద తిరగబడతారన్న భయం ఆయనను వెంటాడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు 100 మంది నరేంద్ర మోదీలొచ్చినా, 1,000 మంది కేసీఆర్‌లొచ్చినా భయపడనని బీరాలు పలికిన చంద్రబాబు నేడు ప్రధాని నరేంద్రమోదీని ప్రసన్నం చేసుకోవడానికి ఏవిధంగా సాగిలపడుతున్నారో అందరూ చూస్తున్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబునాయుడు అనేక విధాలా తాపత్రయ పడుతున్నారు. కొన్ని వ్యవస్థలలో ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తుల సహాయసహకారాలను స్వీకరించి.. రాజకీయంగా మళ్లీ ఉచ్ఛదశలోకి రావాలన్న తాపత్రయంతో చంద్రబాబు అనేక రాజకీయ విన్యాసాలు సాగిస్తున్నారు. అభివృద్ధి వికేం ద్రీకరణకు అడ్డుపడుతున్నారు. అయితే, ప్రజల తిరస్కరణకు గురైన చంద్రబాబును అమరావతి రైతులే ప్రజాకోర్టులో నిలబెట్టే సమయం ఎంతో దూరంలో లేదు.


వ్యాసకర్త
మాజీ మంత్రి,  సీ రామచందయ్య
ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా