బలహీనతను బలంగా వినిపించే కవిత్వం

9 Oct, 2020 08:27 IST|Sakshi

కవికీ కవిత్వానికీ ఏవో ఉన్నత లక్ష్యాలు ఉండాలన్నదానికి భిన్నంగా తన అస్తిత్వపు వేదననే కవిత్వంలోకి తెస్తున్నారు 77 ఏళ్ల అమెరికన్‌ కవయిత్రి లూవీస్‌ గ్లోక్‌. వ్యక్తి అస్తిత్వాన్ని సార్వజనీనం చేస్తున్నందుకుగానూ ఈ సంవత్సరపు నోబెల్‌ పురస్కారం ఆమెను వరించింది. 
-లూవీస్‌ గ్లోక్‌

కవి అనే వాడు దేనినైనా ఎదుర్కొనే ధైర్యవంతుడు కావాలా? దేనికైనా రొమ్ము ఎదురొడ్డి నిలిచే సాహసి కావాలా? ఏం, కవి భయస్తుడు కాకూడదా? కవి బలహీనుడు కాకూడదా? ఆకాశం  కిందిది ఏదైనా కవిత్వానికి అర్హమైనదే అయినప్పుడు, భయ బలహీనతలు మాత్రం కవితా వస్తువులు కావా? ఈ సంవత్సరపు నోబెల్‌ పురస్కారం వరించిన అమెరికన్‌ కవయిత్రి లూవీస్‌ గ్లో్లక్‌ కవిత్వమంతా ఇలాంటి వ్యక్తిగత కలవరింతలే, పశ్చాత్తాపపు తలపోతలే. అయితే వ్యక్తి అస్తిత్వాన్ని సార్వజనీనం చేస్తున్నందుకుగానూ ఆమెకు ఈ సర్వోన్నత గౌరవం దక్కింది. సంప్రదాయంగా డిసెంబర్‌ 10న ఈ పురస్కారాన్ని స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో స్వీకరించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా అదే రోజు తన ఇంటిలోనే దీన్ని అందుకుంటారు.

ఆత్మకథాత్మక కవయిత్రి
ఆమె తల్లిదండ్రులు హంగెరీ నుంచి అమెరికాకు బతుకుదెరువు కోసం వచ్చిన యూదులు. 1943లో ఆమె పుట్టకముందే ఒక అక్క చనిపోయింది. తన కంటే ముందు పుట్టిన ఒక ప్రాణి మరణించిన వాస్తవం రక్తంలో ఇంకించుకుని పెరిగింది. దీనికితోడు కౌమారంలో ఎక్కువ బరువు పెరుగుతున్నానేమో అనే అసాధారణ భయం వెంటాడింది (అనరెక్సియా నెర్వోసా). సహజంగానే ఇది చదువుకు ఆటంకం కలిగించింది. ఏడేళ్ళ పాటు వైద్యం తీసుకున్నాక గానీ సాధారణం కాలేకపోయింది. ‘‘జీవితంలో ఒక దశలో నేను చచ్చిపోతున్నాను అని అర్థమైంది. కానీ అంతకంటే స్పష్టంగా, అంతకంటే బలంగా నేను చావాలని అనుకోవడం లేదు అని కూడా అనిపించింది’’ అంటారామె.

ఈ జబ్బు కారణంగానే ఎలా ఆలోచించాలో నేర్చుకున్నానంటారు. రచన కూడా ఒక జబ్బు లాంటిదే. కాకపోతే మన వేదనని ఇతరులకు పంపిణీ చేయడం ద్వారా స్వస్థత పొందుతాం. ప్రపంచం మాత్రం ఇలా చేయదా? మరి కవికి మాత్రం ఎందుకు మినహాయింపు? అందుకే గ్లో్లక్‌ ఎనిమిదో ఏట నుంచే కవిత్వాన్ని తన శోకానికి విరుగుడుగా భావించింది. ఆత్మకథాత్మకంగా రాస్తూ, తీవ్రమైన ఉద్వేగాలను పలి కిస్తూ ఆధునిక జీవితాన్ని చిత్రించింది. పాతికేళ్ల వయసులో 1968లో తన తొలి కవితా సంపుటి ఫస్ట్‌బర్న్‌ వెలువరిం చింది. దీనికి సానుకూల స్పందన  వచ్చినప్పటికీ , అనంతరం సుదీర్ఘమైన రైటర్స్‌ బ్లాక్‌ వెంటాడింది. కవిత్వం రాయడం ద్వారా తన వేదన నుంచి బయటపడ్డట్టుగానే,  కళాశాలలో చేరి కవిత్వాన్ని బోధించడం ద్వారా రైటర్స్‌ బ్లాక్‌ నుంచి బయటపడింది.
(చదవండి: అమెరికా కవయిత్రికి నోబెల్‌)

తిరిగి తిరిగి నిలబెట్టుకోవడం
1975లో వచ్చిన తన రెండో కవితా సంపుటి ద హౌజ్‌ ఆన్‌ మార్‌‡్షలాండ్స్‌ ద్వారా తనదైన ప్రత్యేకమైన గొంతును సాధించింది. ఇక 1980లో వచ్చిన డిసెండెంట్‌ ఫిగర్‌ ఆమెను విస్మరించలేని కవయిత్రిగా నిలబెట్టింది. ఇల్లు తగలబడి తన సర్వస్వం కోల్పోయినప్పుడు రాసిన కవిత్వం ద ట్రయంప్‌ ఆఫ్‌ ఎకిలీస్‌ (1985). ఈ సంపుటంలోని మాక్‌ ఆరెంజ్‌ కవిత స్త్రీవాద గీతమై నిలిచింది. అయినా తనను స్త్రీవాదిగా, యూదు కవిగా, ప్రకృతిగా కవిగా లేబుల్స్‌ వేసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. వాటన్నింటికి అతీతమైనదేదో మనిషి అస్తిత్వం అని ఆమె నమ్మకం. 

తన మరణపు వాస్తవాన్ని గుర్తించడం వల్లే ఎకిలీస్‌ మరింత మనిషి అయినట్టుగా, ఆమె కూడా జీవితపు క్షణభంగురతను ఈ కాలంలో గుర్తిం చింది. తండ్రి మరణించిన దుఃఖంలోంచి పుట్టిన కవిత్వం అరారత్‌(1990). 1992లో వచ్చిన వైల్డ్‌ ఐరిస్, తరువాయి సంపుటం మీడోలాండ్స్‌(1996), వీటా నోవా(1999), ద సెవెన్‌ ఏజెస్‌(2001) అన్నీ తన జీవిత వైఫల్య సాఫల్య క్షణాల పట్టుపురుగులే. వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడం, ఉద్యోగాలు కోల్పోవడం, తిరస్కారాలు పొందడం, ఓటములు ఎదుర్కోవడం, నిలుపుకోలేని బంధాల్లో చిక్కుకోవడం, తనను తాను తిరిగి తిరిగి నిలబెట్టుకోవడమే ఈ కవిత్వం నిండా.
(చదవండి: నోబెల్‌ ఉమెన్‌)

నిశ్శబ్దపు ఉనికి
మార్పు కోసం తపన పడుతూ, మళ్లీ అదే మార్పు ఎదురైనప్పుడు విలవిల్లాడుతూ అచ్చం సగటు మనిషిలాగే ఆమె కవిత్వం ఉంటుంది. గ్రీకు పురాణాలన్నా, మొత్తంగా ధార్మిక గాథలన్నా ప్రత్యేకమైన ఇష్టం. కాగితం మీద కలం కదపడంలోనే ఏదో తెలియని ఆనందం ఉందనే 77 ఏళ్ల గ్లోక్‌ అవిరామంగా రాస్తూనే ఉన్నారు. అవెర్నో(2006), ఎ విలేజ్‌ లైఫ్‌(2009), ఫెయిత్‌ఫుల్‌ అండ్‌ విర్చువస్‌ నైట్‌(2014)– కవితా సంపుటాలను వరుసగా తెస్తూనేవున్నా దీర్ఘ కాలావధులు తాను ఏమిరాయకుండా ఉండిపోతానని చెబుతారు. విస్తృతంగా రాస్తున్నప్పుడు పునరుక్తి దోషం అంటుకోవచ్చు, తాజాదనం కోల్పోవచ్చు. రోజూ పొద్దున లేచేసరికి అదే మనిషిగా ఉండటంలోని సానుకూలతను గుర్తిస్తూనే, నాది నేనులాగే కవిత్వంలో వినిపించడం ఒక శాపంగానే భావిస్తానంటారు. 

అందుకే ప్రతీ సంపుటికి గొంతు మార్చి ఆశ్చర్యపరుస్తుంటారు. కవిత్వంలో ఆమె తోటలోని పువ్వులకు కూడా ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది. ఆవి వివేకంతో భాషిస్తాయి, సందర్భోచితంగా కవయిత్రి శోకంతో గొంతు కూడా కలుపుతాయి. ప్రపంచపు సంగీ తాన్ని, దైవిక నిశ్శబ్దాన్ని కూడా ఆమె కవితలు వినిపిస్తాయి. పెద్ద పాఠకవర్గానికి చేరడంలో ఆమెకు ఉత్సాహం లేదు. కవిత్వం నోటి నుంచి చెవికి జరిగే సున్నితమైన మార్పిడి అని నమ్ముతారు. కానీ, కవిత్వం స్టేజీ మీద చదవడానికి కూడా ఇష్టపడదు. నోరు, చెవి అనేవి నిజార్థంలో కాకుండా ఒక మనసులో పుట్టిన భావాన్ని స్వీకరించేం దుకు సిద్ధంగా ఉన్న ఇంకో మనసుగా చూస్తారు. వినబడినప్పుడే ఉనికిలో ఉన్నట్టు కాకుండా, నిశ్శబ్దంలో కూడా అస్తిత్వంలో ఉండాలంటారు.                
– పి.శివకుమార్‌ 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు