Krishnapatnam Medicine: ఎంత ఆనందమయ్యా ఈ నిర్ణయం!

3 Jun, 2021 13:19 IST|Sakshi

కరోనాకు మా పతంజలి మందు తయారు చేసిందని రామ్‌దేవ్‌ బాబా అట్టహాసంగా కొరోనిల్‌ మాత్రలను కేంద్ర ఆరోగ్యమంత్రి చేతుల మీదుగా విడుదల  చేశాడు. ఎంత పని చేస్తుందో తెలియని మందు కరోనాను నిల్‌ ఎట్లా చేస్తుందని కోర్టుకెక్కితే అల్లోపతి మీద, ఆధునిక డాక్టర్ల మీద అడ్డగోలు కామెంట్లు చేశాడు. ఈ దుర్మార్గ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని వెయ్యి కోట్ల జరిమానా కట్టమని ఆందోళన చేస్తున్నారు డాక్టర్లు. కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా వందల మంది డాక్టర్లు చనిపోతుంటే వాళ్ళనే కాపాడుకోలేని దద్దమ్మ అల్లోపతి అదో హంతకపతి అన్నాడు రామ్‌దేవ్‌. ఉత్తర భారతాన పెద్ద దుమారం రేగుతున్నా ఉలుకూ పలుకూ లేని కొన్ని తెలుగు మాధ్యమాలు... పెరటి మొక్కల్ని, సాధారణ మూలికల్ని మందుగా నూరి, కరోనాకు చెక్‌ పెట్టే అవకాశం ఉందని కృష్ణపట్నంలో ఆనందయ్య చెబుతుంటే మాత్రం ఏవేవో ప్రచారాలు, ఫిర్యాదులు, నానా రభస. ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థలన్నీ ఏదో ఓ నిర్ణయం తీసుకో వాల్సిన ఒత్తిడి. వేలమంది మందు కోసం బారులు కట్టి ఎదురు చూస్తుండగా బలవంతంగా ఆపి వేయాల్సిన పరిస్థితి.

ఒక నిర్ణయం కోసం ఆయుష్‌ డైరెక్టర్‌ రాములు కృష్ణపట్నం వెళ్ళి మందులో మూలికలు, పరిమాణం, తయారీ విధానం తెలుసుకుని, రోగుల నుండి అభిప్రాయాలు తీసుకుని, ఆయుర్వేద పరిశోధన కేంద్ర సంస్థలో మూలికల శాస్త్రీయ విశ్లేషణ జరిగి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వడం చకచకా జరిగింది. కోర్టు తీర్పులకు ముందే తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్ష జరిపి ఏ మందులు అనుమతి ఇవ్వాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టం చేస్తూ, ఆనందయ్య చెప్పిన పి.ఎల్‌.ఎఫ్‌. అనే మూడు మందులకు అనుమతి ఇచ్చారు. ఆయుష్‌ రాములు మాట్లాడుతూ దీన్ని ఆయుర్వేదంగా గుర్తించడం లేదు, నాటుమందుగానే పరిగణించాలన్నారు.


సన్నాయినొక్కు మెరుగైన సమాజాలు నిన్న చనిపోయిన కోటయ్య హెడ్మాస్టర్‌ను ఎన్నోసార్లు చంపేశారు. ఇప్పుడు కూడా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది కనుక ఎంత ఆనందమయ్యా ఈ నిర్ణయం అని చాలామంది అనుకుంటు న్నారు. ప్రభుత్వం ప్రజల్ని భ్రమల్లో ముంచడం కోసం, తమ వైఫ ల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం అనుమతి ఇచ్చిందని అనేవాళ్లూ ఉన్నారు. చికిత్స ఇంత చవకగా దొరికితే ఎట్లా? రెండు రాళ్ళు వేద్దామని కొందరు ఏవేవో విషయాలు ముందుకు తెస్తారు. ఆయుర్వేద వాత, కఫ, పిత్త సిద్ధాంతం, శుద్ధీకరణకు ముందే దేశవాళి మూలవాసు లది మూలికా వైద్యం. గ్రంథస్తం కాకున్నా కంఠస్తంగా, అనువం శికంగా కొనసాగుతున్నది. కరోనాకు అడ్డుకట్ట వేసిన చైనా ఆధునిక వైద్యంతో పాటు మూలికా వైద్యానికి కూడా పెద్దపీట వేసింది. 

హోమియోలోనూ మెటీరియా మెడికాకు మూలికలే సృజన. మూలికల నుండి చురుకైన మందును అల్లోపతికి ముందే సంగ్రహిం చడం మొదలుపెట్టారు. చెట్ల ఆల్కలాయిడ్స్‌ను ఇప్పటికీ సంగ్రహి స్తూనే ఉన్నారు. ఇన్ని తెలిసి మూలికా వైద్యాన్ని ఆయుర్వేదం కంటే, అల్లోపతి కంటే తక్కువ చేయడం హేతుబద్ధత ఎట్లవుతుంది? అన్ని శాస్త్రాల కంటే ముందు ఈ నాటువైద్యమే మేటి వైద్యమై మనుషుల్ని, జంతువుల్ని అనేక రోగాల నుండి కాపాడుకున్నది. 


కరోనా కష్టకాలంలో గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన ఆనందయ్య మందు తప్పకుండా అన్ని కరోనా కేసులకు పని చేస్తుందని చెప్పలేకపోయినా, ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చిన ఇమ్యూనిటీ బూస్టర్‌ల కంటే బాగా పని చేస్తుందేమో. ఇప్పటికీ కామెర్లకు ఇచ్చే మూలికా వైద్యం, గాయాలు మాన్పడానికి ఇచ్చే పూత మందు అద్భుతంగా పనిచేస్తాయి. శరీర ప్రకృతిలో రోగ వికృతిని సృష్టిలో భాగమైన ఆకులు, అలములు సరి చేసినంత ప్రభావశీలంగా ఇతర పదార్థాలు చేయవని మనకు అర్థమ వ్వాలి. ఒక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, దేశవాళీ వైద్యానికి ఆధునిక పరిశోధన తోడై గొప్ప ఫలితాలు సాధించాలి. చండీగడ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో బెటాడిన్‌ బదులుగా వేపరసం వాడి అద్భుత ఫలితాలు రాబట్టినారు.

లక్షల సంవత్సరాల మనిషి నాగరిక క్రమంలో తినే పంట చెట్లు, శరీర ధర్మాన్ని వ్యాధిని ఎదుర్కోవడానికి సిద్ధం చేసే మందుచెట్లను గుర్తించడంతో ఆధునికయుగం సారవంతం అయింది. నడమంత్రపు పెట్టుబడి శాస్త్రాలు తిమ్మిని బమ్మి చేయాలని చూసినా, ప్రతి దేశంలో తమకు అందుబాటులోని మూలికా వైద్యాన్ని ఆధునీకరించడం, వందల ఆనందయ్యలకు ప్రభుత్వాలే ప్రోత్సాహాన్నివ్వడం ఇప్పుడు అవసరం. హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం దాక, చెట్లలో, పుట్లలో, నదీజలాల్లో, దూసర క్షేత్రాల్లో సంజీవనీ పర్వతాలు అడుగడుగునా ఉంటాయి. అందుకే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ఆనందమయ్యా! పక్క రాష్ట్రాలకైనా తన మందు సరఫరా చేస్తానంటున్నాడు ఆనందయ్య. తెలంగాణలోనూ కృష్ణపట్నం మందుతో కుదుట పడినవాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. నిన్నటి జగన్‌ నిర్ణయం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకం కావాలి.

- డా. చెరుకు సుధాకర్‌ 
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు. 9848472329

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు