సమ్మే పరిష్కార మార్గమా? ఆలోచించండి!

25 Jan, 2022 13:12 IST|Sakshi

మొత్తం మీద ఏపీలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య యుద్ధం మొదలైనట్లే తోస్తున్నది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని, ఉద్యోగ సంఘాలను విమర్శించలేం లేదా సమర్ధించలేం. తమ నిస్సహాయతను ప్రభుత్వం ఉద్యోగ సంఘాల వారికి తెలియజేసింది. ఉద్యోగ సంఘాలవారు తమకు అన్యాయం జరిగిందని అంటున్నారు. గతంలో మనం ఇలాంటి యుద్ధాలను ఎన్నో చూశాము. రేపు వాళ్ళు వాళ్ళు ఒకటైపోతారు. ఇవాళ తిట్టిన నోళ్లే రేపు జై కొడతాయి. ఇదేం కొత్త కాదు. మెరుగైన జీతాల కోసం ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చెయ్యవచ్చు. సమ్మె చేసి తమ ఆందోళనా తెలియచేయవచ్చు. కానీ ఇటువంటి సమయాల్లో ప్రభుత్వ సారథులు కఠినంగా వ్యవహరిస్తే... కోర్టులు కూడా వారికే అండగా నిలిచిన ఉదాహరణలు చరిత్రలో కనిపిస్తున్నాయి.

తమిళనాడు ఉద్యోగులు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగారు. జయలలిత ఆగ్రహించి లక్షా డెబ్భైవేల మంది ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించారు. దీంతో ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం సమ్మె అనేది ఉద్యోగుల హక్కు కాదని, ఉద్యోగులను డిస్మిస్‌ చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, అయితే మానవీయ కోణంలో చూసి... డిస్మిస్‌ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని జయలలితకు సూచించింది. ఇక్కడ తమిళనాడు పభుత్వానికి కోర్ట్‌ సూచించిందే తప్ప దాని నిర్ణయాన్ని తప్పు పట్టి ఆదేశించలేదు. కోర్టు తీర్పుతో చేసేది లేక డిస్‌మిస్‌ అయిన ఉద్యోగులు అందరూ ప్రభుత్వానికి మళ్ళీ సమ్మె జోలికి వెళ్లబోమని లిఖిత పూర్వకంగా ఎవరికి వారు హామీ పత్రాలు ఇవ్వడంతో తిరిగి ఉద్యోగంలోకి తీసుకొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లినప్పుడూ వారికి చుక్కెదురైంది. సుమారు యాభైవేలమంది ఆర్టీసీ కార్మికులు రెండు నెలలపాటు సమ్మె చేసినపుడు కేసీఆర్‌ చాలా దృఢంగా వ్యవహరించారు. ప్రైవేట్‌ ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. బస్సు సర్వీ సులు ఆగకుండా చూశారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చెయ్యాలని కూడా ఒకదశలో కేసీఆర్‌ ప్రకటించినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కూడా పాల్గొన్న ఘట్టాలను గుర్తుంచుకుని... అంత తీవ్రచర్యకు పూనుకోలేదు. అలాగని మెత్తబడలేదు. ఆర్టీసీ కార్మికులు హైకోర్టుకు వెళ్లారు. సమ్మె సమస్య, డిమాండ్ల సమస్య లేబర్‌ కమిషనర్‌ చూసుకోవాలి తప్ప హైకోర్టు ఏమీ చెయ్యలేదని, లేబర్‌ కోర్టుకు వెళ్లండని హైకోర్టు స్పష్టం చెయ్యడంతో కార్మికులు డీలాపడి పోయి సమ్మె విరమించారు. ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పట్ల కనికరం చూపి... వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడమే కాకుండా సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లించింది.  

ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ఉదారస్వభావం కలిగిన వ్యక్తి. కరోనా కష్టకాలంలో పేదలు ఆత్మహత్యలకు పాల్పడకుండా వారికి ఆర్థికసాయాలు అందించి ఆదుకున్న సంగతి తెలుసు. ఆర్థికంగా రాష్ట్రం బాగా దెబ్బతిని ఉంది. ఇలాంటి పరి స్థితుల్లో తాము సమ్మెబాట పట్టడం సబబేనా అని ఉద్యోగులు ఆలోచించుకోవాలి. (చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌కు అన్యాయం...ప్రైవేటులో భాగస్వామ్యం!)

ప్రభుత్వం కూడా ఉద్యోగుల న్యాయమైన కోరికలను తప్పకుండా పరిశీలిస్తామని, ఆర్థిక వెసులుబాటు కలిగినపుడు వారికి ప్రయోజనాలు అందిస్తామని చెప్పి ఉద్యోగులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో ఒక భాగం. కరోనా మహమ్మారి వంటి కీలక సమయాల్లో సమ్మెకు దిగితే ప్రజల్లో ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా వారు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. (చదవండి: వారూ, వీరూ ఎదుర్కొనే పీడన ఒక్కటే!)

- ఇలపావులూరి మురళీ మోహనరావు 
సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు

మరిన్ని వార్తలు