Andhra Pradesh: శుభకరమైన పాలన

12 Aug, 2021 19:19 IST|Sakshi

జాన్‌ రాల్‌స్టన్‌ సౌల్‌ అన్న సామాజిక శాస్త్ర నిపుణుడు తన ‘ద కొలాప్స్‌ ఆఫ్‌ గ్లోబలిజం’ పుస్తకంలో ఉదాత్త నాయకులు భగవత్‌ సంకల్పంగా, ప్రకృతి నియమాను సారంగా ఆవిర్భవిస్తారని పేర్కొంటాడు. నాడు ఆరోగ్యం, ఆహారం, ఆవాసం, ఆచారం, అభ్యాసం, ఆర్జనం, ఆదర్శ దాంపత్యం, ఆదాయం అనే అష్టలక్ష్మిలకు తోడు ఆనంద మనే నవరత్నములను తొడిగిన గృహస్థాశ్రమ ధర్మాన్ని శ్రీరాముడు మానవ జాతికి అందించాడు. ప్రపంచ వ్యాప్తంగా నాగరికత వికాస క్రమానికి ఇది దోహదపడిందని పాశ్చాత్య శాస్త్రవేత్తలు సైతం దీన్ని ఆమోదిస్తున్నారు. వివేకానందుడు, గాంధీ మహాత్ముడి నుండి నేటి పాలకుల వరకు రామరాజ్యం ఒక సుందర స్వప్నం. ఆ దారిలోనే కుటుంబ సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది.

ఆకలికి మత విలువలు తెలియవంటాడు వివేకానందుడు. నాడు కలకత్తా ప్లేగు సమయంలో వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి వేలాదిమందిని కాపాడాడు. ఆ ధీరుని స్ఫూర్తితో గాంధీ మహాత్ముడు వాలంటరీ వ్యవస్థతో సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వ హించాడు. నేడు అదే స్ఫూర్తితో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ వాలంటరీ వ్యవస్థ లక్షలాది మంది కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. ఆరోగ్య పరిరక్షణ రామరాజ్యంలో మౌలిక ధర్మం. అయోధ్యా రాజ్యంలో పెద్దలెవరూ తమ పిల్లలకు అంత్యక్రియలు జరిపిన దాఖలాలు లేవు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ లక్ష్య మిది. దానిని మరింత ముందుకు తీసుకొనిపోయి, ప్రపంచంలోని ఆరోగ్య రంగా నికి ఒక దిక్శూచిగా ఆంధ్రప్రదేశ్‌ యంత్రాంగం పనిచేయడం వాస్తవం. 

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, కరోనా సంరక్షణ, ఆక్సిజన్‌ సరఫరాల లాంటి అత్యున్నత వైద్య ప్రమాణాలను పాటించిన ప్రభుత్వం ఇది. ప్రభుత్వ వైద్యా లయాలను దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వమిది. ఖరీదైన వైద్యసేవలు కూడా ఈ మహమ్మారి సమయంలో ప్రజలకు ఉచితంగా అందుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఇంగ్లండ్, యూరప్‌ సమాజాలు, అమెరికా లాంటి ధనిక దేశాలు ఆరోగ్య సంస్కరణలు లేకుండా కకావిక లమయ్యాయి. బ్రిటన్‌ మాజీ ప్రధాని టోని బ్లేయర్‌ లాంటి గొప్ప నాయకుడు కూడా ఆరోగ్య సంస్కరణలో అనుకున్నంత సాధించలేకపోయానని తన జీవితచరిత్రలో అంతర్మథనం పొందాడు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అయోధ్య రాజ్యంలాగా తండ్రి చేపట్టిన ఆరోగ్య సంస్కరణలకు నిజరూపాన్ని ఇవ్వడం నేడు సత్య ప్రామాణికం.  

సగటు మనిషి జీవన ప్రమాణాలకు కారణమైన ఆరోగ్యం, ఆహారం,   ఆవాసాలను సుస్థిరం చేస్తూనే, అభ్యాసంలో భాగంగా విద్యను సంతృప్తిగా భోదించాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం రామరాజ్యంలో భాగమే. సాంకేతిక విప్లవంతో కుగ్రామమైన ఈ ధరణిలో నాడు–నేడు పేరుతో పదిహేను వేల పాఠశాలలను సంస్కరించడం చరిత్ర మరువదగని అంశం. నాటి గురుకులాల వలె జగనన్న గోరుముద్దలతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. 

ముందుచూపు రాజ్య ధర్మంలోని విశిష్టత. అధికార యంత్రాంగాన్ని సమాయత్తపరచి అల్పమైన విషయాలను కూడా వదలకుండా అత్యంత లాభం చేకూర్చేవాడే నిజమైన పాలకుడని శ్రీరాముడు ఉపదేశించాడు. అధర్మ వేషంలో ధర్మ పన్నాగాలు పన్నేవారి పట్ల అప్రమత్తతతో వుండాలనీ, జనులకు నిజం తెలియాలనీ భరతునికి రాముడు ఉపదేశిస్తాడు. ప్రజలకు సత్యాన్ని విడమరచి చెప్పేందుకు ధార్మిక సంస్థలను ప్రభు త్వానికి చేరువ చెయ్యాలి. నాడు రాజకీయాలకు అతీతంగా సమాజ సేవను మత సారంగా తెలియ జెప్పిన వివేకానందుడు మనకు ఆదర్శం కావాలి. ప్రభుత్వాన్ని బూచిగా చూపించి ప్రజలలో గందరగోళం సృష్టించడం అనైతికం. అతలాకుతలమవుతున్న మానవ జాతిలో ఆంధ్రజాతి సమున్నతంగా జీవించాలంటే జనే జనే, గృహే గృహే, గ్రామే గ్రామే, పురే పురే అంటూ ఆబాలగోపాల హృదయం సామాజిక చైతన్యంతో తొణికిసలాడాలి. మన రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి ప్రతి ఇంట గుడి గంటలు మ్రోగాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సంఘీభావం తెలపాలి.


- ఎస్‌. వెంకట శర్మ 

వ్యాసకర్త ముఖ్య సమన్వయ అధికారి,
ధార్మిక సంస్థలు, తిరుమల తిరుపతి దేవస్థానములు
 

మరిన్ని వార్తలు