దళితులను పారిశ్రామికవేత్తలుగా...

26 Feb, 2022 12:23 IST|Sakshi

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని బలంగా ఆకాంక్షించిన విషయం విదితమే. అందులో భాగంగా 2005లో రూపొందించిన పారిశ్రామిక విధానంలో తన ఆకాంక్షలకు అంకురార్పణ చేశారు. పరిశ్రమలు నెలకొల్పాలనుకునే వారికోసం ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ) అభివృద్ధి పరచిన పారిశ్రామిక వాడలలోని ప్లాట్లను ఎస్సీ, ఎస్టీలకు దామాషా ప్రకారం కేటాయించాలని నిర్ణయించారు.

రిజర్వేషన్లతో పాటు గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు సబ్సిడీ ప్రకటించారు. గరిష్టంగా 50 లక్షల మేర పెట్టుబడి రాయితీతో పాటు, విద్యుత్, వడ్డీరాయితీలు, స్టాంప్‌ డ్యూటీ, రీయింబర్స్‌మెంట్, ఏపీఎస్‌ఎఫ్‌లలో అడ్వాన్స్‌ సబ్సిడీ సౌకర్యాన్ని కల్పించారు. ఫలితంగా వందల సంఖ్యలో దళితులు వినూత్న పథకాలతో పరిశ్రమల స్ధాపనకు ముందు కొచ్చారు. 2012 వరకు ఈ వర్గాలు నగదు మొత్తం చెల్లించి ప్లాట్లు పొందే పద్ధతి అమలయింది. (చదవండి: బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి కాదా?)

2012లో నాటి ప్రభుత్వం యిచ్చిన 102 జీఓలో ప్లాటు ధర మొత్తంలో 25 శాతం చెల్లించి, రెండు సంవత్సరాలు మారటోరియం సదుపాయం పొంది, 10 సంవత్సరాలలో 8 కిస్తీలలో చెల్లించాలని నిర్దేశించారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ మార్గదర్శకాలు రూపొందించడంలో అలసత్వం, 16.6 శాతం వడ్డీ విధించడం, లీజు కాలం కేవలం 10 సంవత్సరాలు కావడం వల్ల బ్యాంకుల నుండి ఎదురయ్యే ఇబ్బందులు, అధిక వడ్డీ వంటి సమస్యలు లబ్ధిదారులకు ఎదురయ్యాయి.

ఈ అంశాన్ని ప్రస్తుత పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కారికాల వలవన్, మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం, అధికారుల ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తక్షణం ఈ వర్గాలకు మేలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో జీఓఎమ్ఎ‌స్‌ నం. 7ను 2022 ఫిబ్రవరి 5న  విడుదల చేశారు. ఈ జీఓ ప్రకారం 2008 నుండి 2020 మార్చి 31 వరకు పారిశ్రామికవాడ లలో ప్లాట్లు పొందిన వారందరూ ఎటువంటి అదనపు వడ్డీలు, అపరాధ రుసుములు చెల్లించే అవసరం లేకుండా పాత ధర ప్రకారమే ప్లాటును సొంతం చేసుకోవచ్చు. నగదు చెల్లించే విధానంలోనూ ఉదారతను చాటింది ప్రభుత్వం. (చదవండి: సమానత్వం దిశగా ముందడుగు)

ప్లాటు యజమాని ఏపీఐఐసీకి చెల్లించాల్సిన నగదును 3 పద్ధతుల ద్వారా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. 90 రోజుల లోపు చెల్లించే వారికి ఎలాంటి వడ్డీ ఉండదు. 91వ రోజు నుండి 180 రోజులు (6 నెలల లోపు) చెల్లించే వారికి 4 శాతం నామ మాత్రపు వడ్డీని ప్రకటించారు. 181వ రోజు నుండి 2 సంవత్సరాల లోపు చెల్లించే వారికి 8 శాతం వడ్డీని ప్రకటించారు. అయితే పరిశ్రమలు స్థాపించాలని ముందుకు వచ్చిన దళిత పారి శ్రామికవేత్తలు బ్యాంకు రుణం పొందడంలో విఫలమైతే ప్రభుత్వమే హామీ ఉండి రుణాలు ఇప్పిస్తే ఈ వర్గాలకు మరింత మేలు జరుగుతుంది.

- వి. భక్తవత్సలం 
డీఐపీసీ సభ్యులు, ఒంగోలు

మరిన్ని వార్తలు