‘సోషల్‌ ల్యాబ్‌’ పని మొదలైంది

16 Apr, 2022 12:38 IST|Sakshi

ప్రభుత్వ వ్యతిరేక ఓటు– అంటూ ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో ఏమాత్రం పొసగని అంశాన్ని పనిమాల చర్చకు తెచ్చారు. మరో రెండున్నర ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉండగా, అప్పుడే వీళ్ళు– ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అంటున్నారు! వైసీపీ ప్రభుత్వం కుదురుకుంటున్న దశలో ‘కరోనా’ వచ్చిపడింది. అయినా కొత్త రాష్ట్రం పునర్నిర్మాణం కోసం అవసరమైన పరిపాలనా సంస్కరణలను అమలు చేస్తున్నారు. మరో పక్క రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచుకోవడానికి ఉన్న మార్గాలను వెతుక్కుంటున్న ప్రాథమిక దశ ఇది. 

ఇంతలోనే– ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అని అజ్ఞానంతోనో అర్ధ జ్ఞానంతోనో ఎవరైనా అన్నప్పటికీ... అది అభ్యంతరకరమని ‘మీడియా’ విశ్లేషకులకు, పార్టీల అధికార ప్రతినిధులకు అనిపించకపోవడం బాధ్యతా రాహిత్యం అవుతుంది. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అనగానే, ప్రధాన ‘మీడియా’తో పాటుగా సామాజిక మాధ్యమాల్లో దానిపై ‘చర్చ’తో డజన్ల కొద్దీ– ‘యూట్యూబ్‌’ వీడియోలు వెలువడ్డాయి. వాస్తవాల వైపు జనం చూడకుండా, వారి కళ్ళ మీద ఇలా– ‘గరం మసాలా తెరలు’ కడుతున్న ఈ మొత్తం యంత్రాంగం పట్ల మనకు కనుక అప్రమత్తత లేకపోతే, మున్ముందు తీవ్రమైన నష్టం జరుగుతుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో 2022 నాటికి– ‘ప్రభుత్వ వ్యతిరేకత’ అనేది ఎంత పేలవమైన వాదన అవుతుందో చూద్దాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండున్నర ఏళ్ల పరిణామాల్లో మూడు ప్రధానమైన అంశాలను ఇందుకోసం ఇక్కడ పరిశీలిద్దాం.

‘కోవిడ్‌’ విషయంగా ప్రభుత్వ చర్యలు బహిరంగమే కనుక, దాన్ని ఒదిలిపెడితే, మిగతా రెండింటిలో మొదటి పరిపాలనా చర్య– ‘గ్రామ సచివాలయాలు’. వీటిని ఇప్పటికే పలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నమూనాగా పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఇక చివరిది– 13 కొత్త జిల్లాల ఏర్పాటు. ఇందులోకి మళ్ళీ– నేరుగా నగదు బదిలీ జరిగే 33 సంక్షేమ పథకాలూ, ‘రైతు భరోసా కేంద్రాల’ ఏర్పాటూ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణా, 50కి పైగా వెనుకబడిన కులాల అభివృద్ధి కార్పోరేషన్ల ఏర్పాటూ, విద్యా–వైద్య రంగాల్లో సంస్కరణల వంటివీ కలపడం లేదు. గడచిన రెండున్నర ఏళ్లలో ‘కోవిడ్‌’ కల్లోల కాలం, ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ ఆందోళన పోను... మిగిలిన పని గంటల్లో ఈ ప్రభుత్వం పూర్తి చేసిన పనులివి! 

అయితే, ఇందులో– ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ ఒడిసి పట్టుకోవడం అనే సాహసం గురించి ఇప్పుడు వీళ్ళు చర్చకు తెస్తున్నారు. ఒక వార్డు స్థాయిలో కొత్తగా ప్రభుత్వ లబ్ధిదారుగా మారిన యువ సమాజంలోని వ్యక్తి– ‘స్టేట్‌ స్టేక్‌ హోల్డర్‌’గా ఆమె లేదా అతడు మున్ముందు అలవర్చుకోవలసిన– ‘సివిక్‌ సెన్స్‌’ను మొగ్గలోనే తుంచే ప్రయత్నం ఇది! నిజానికి ఇక్కడ జరగాల్సింది, ప్రతిపక్షాలు ప్రభుత్వ సేవల్లో లోపాలను గుర్తించి వాటిని సరిచేసే దిశలో ఒత్తిడి తేవడం. కానీ, అందుకు భిన్నంగా– సమయం సందర్భం లేకుండా ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అనడం అంటే, ప్రజల్ని– 24x7 ఓటర్లుగా చూడడం తప్పు కాదు అని వీరంతా వత్తాసు పలుకుతున్నట్టుగా ఉంది! (క్లిక్‌: ‘ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ’తో కొత్త వెలుగు!)

ఒకప్పుడు ఉమ్మడి ఏపీ రాజకీయాలపై మధ్యతరగతి బుద్ధిజీవులు విలువైన విమర్శలు చేసేవారు. ఇప్పుడు వారు నోరు మెదపటంలేదు. ఆశ్చర్యం– ప్రభుత్వ పాఠశాలల్లో బలహీన వర్గాలకు– ‘ఇంగ్లిష్‌ మీడియం’ చదువుల ప్రతిపాదన సమయంలో ఇది మరింతగా స్పష్టమయింది. గడచిన ఏడు దశాబ్దాలలో మనం ఎటూ ఏరు దాటి– ‘ఎన్నారై’లు అయ్యాం కనుక, ఇక ఇప్పుడు ప్రభుత్వ సేవలు వినియోగించుకునే వర్గాలు ఎటూ కింది కులాలే అయినప్పుడు ఇప్పుడవి మనం పట్టించుకునే అంశాలు కాదు అనేది వీరి మౌనానికి కారణమైతే; ఇకముందు ఎన్నిక కావలసిన ప్రభుత్వాలు, వాటి విధాన నిర్ణయాలు కూడా వర్ధమాన వర్గాల చేతిలోనే ఉండడం, అందుకు దోహదం చేసే నాయకత్వం చేతిలోనే ప్రభుత్వ పగ్గాలు ఉండడం సరైనది అవుతుంది. (క్లిక్‌: అందరూ బాగుపడాలి కదా!)

‘వలంటీర్లు’ సచివాలయాల సిబ్బందిగా... అరవై శాతం పైగా బలహీన వర్గాల యువత ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగంలో క్షేత్ర స్థాయిలో భాగమయ్యారు. ప్రభుత్వం నుంచి దిగువకు వచ్చే ‘ప్రయోజనం’ పై స్థాయిలో ఎన్ని దశల్లో ఆపడానికి అవకాశాలు ఉన్నదీ, ఆ అవరోధాన్ని దాటించి చిట్టచివర ఉన్న లబ్ధిదారుకు దాన్ని తాము చేర్చడం ఎంత కష్టమో ఇప్పుడు వారికి తెలుసు. అలా ఒక ఆసక్తికరమైన సాంఘిక ప్రయోగానికి ఇప్పుడు సచివాలయాలు వేదిక అయ్యాయి. ‘ఫంక్షనల్‌ పాలిటిక్స్‌’తో పవర్‌ పాలిటిక్స్‌’ తలపడినప్పుడు, సేవల బట్వాడాలో జరిగే జాప్యం గురించి మన సామాజిక దొంతర్లలోని చిట్టచివరి జాతుల యువతకు సాకల్యంగా స్పష్టం కావడం అనేది ఎంతమాత్రం చిన్న విషయం కాదు! (క్లిక్‌: అందరికీ అభివృద్ధి ఫలాలు)

- జాన్‌ సన్‌ చోరగుడి    
అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత  

మరిన్ని వార్తలు