గోప్యత పాటిస్తే సాయానికి చేటు

13 May, 2021 00:49 IST|Sakshi

విశ్లేషణ

భారత్‌లో కనీవినీ ఎరుగని విధ్వంసానికి కారణమవుతున్న కొత్త రకం కరోనా వైరస్‌ వెనక ఉన్న అసలు వాస్తవాన్ని అంచనా వేస్తున్నదానికంటే మిన్నగా అది ప్రమాద హేతువుగా మారిపోయింది. సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కోవడంలో భారత్‌కు సాయపడటం తక్కిన ప్రపంచానికి సొంత ప్రయోజనాల రీత్యా అయినా సరే అత్యవసరంగా మారింది. వ్యాక్సిన్‌ నిల్వల నుంచి ఆక్సిజన్‌ వరకు భారత్‌కు ప్రతి అంశంలోనూ సాయపడుతున్న విదేశాలు భారత్‌లో కరోనా కేసులు, మరణాల గురించిన వాస్తవ సమాచారాన్ని అందించాలని కోరుకుంటున్నాయి. తన సొంత ప్రజలకు, తక్కిన ప్రపంచానికి కరోనా గురించిన వాస్తవాన్ని కనుగొని తెలుపవలసిన కర్తవ్యంలో భారత ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికీ వెనుకబడి ఉండటం పరమ విషాదకరం.

మీరు ఇంకా బి.1.617 అనే పేరు విని ఉండనట్లయతే త్వరలోనే మీకు దానిగురించి తెలిసే అవకాశాలున్నాయి. భారతదేశంలో సెకండ్‌ వేవ్‌ విజృంభణకు పాక్షికంగానైనా సరే కారణమైన నిర్దిష్ట కోవిడ్‌–19 వైరస్‌ రకం ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పుడు ఈ బి.1.617 రకం వైరస్‌ని ఆసక్తికరం నుంచి కలవరపడాల్సిన వైరస్‌ రకంగా పేర్కొంది. ఇంగ్లండ్‌ ప్రజారోగ్య శాఖ అధికారులు దీన్ని ఇప్పటికే ప్రమాదకరమైన వైరస్‌ రకంగా పేర్కొన్నారు. అంటే ఒక వైరస్‌ రకాన్ని నిర్ధారించేటప్పుడు అది ఎంత వేగంగా రూపం మార్చుకుంటోంది, ఎంతమందిని అది బలి తీసుకుంటుంది, తన లక్షణాలను బయటపడకుండా అది దాచేస్తుందా, లేక వ్యాక్సిన్‌ని నిష్ప్రయోజనకరమైనదిగా మార్చేస్తుందా వంటి పలు అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. 

అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో రోజుకు 4 వేలమంది కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతుండగా రోజుకు 4 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇటీవలి కొద్ది రోజుల్లోనే కోవిడ్‌ మరణాల సంఖ్య 25 వేలకు చేరువకాగా, 20 లక్షల నుంచి 50 లక్షల మంది వరకు దీని బారినపడ్డారు. సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కోవడంలో భారత్‌కు సాయపడటం తక్కిన ప్రపంచానికి సొంత ప్రయోజనాల రీత్యా అయినా సరే అత్యవసరంగా మారిందని బ్రౌన్‌ యూని వర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కి చెందిన ఆశిష్‌ ఝా పేర్కొన్నారు. రోగకారకమైన కణంలో అనేక మార్పులు జరుగుతుండగా, వీటిలో రెండు మార్పులు మాత్రం భయాందోళనలు కలిగిస్తున్నాయి. మానవ కణాల్లోకి చొరబడుతున్న ముళ్ల ఆకారంలోని ప్రొటీన్‌ (శ్వాసను బంధించే రకం) వీటిలో ఒకటి. బిఎన్‌టి162బి2 (అధికారికంగా ఫైజర్‌–బయోటెక్‌ అని పిలుస్తున్న) వ్యాక్సిన్‌తో వృద్ధి చెందే యాంటీబాడీస్‌ ద్వారా ఈ బి.1.617 రకం స్పైక్‌ ప్రొటీన్‌ని పాక్షికంగా నిరోధించవచ్చునని కొత్త అధ్యయనం కనుగొంది. భారత్‌లో ఫైజర్‌–బయోటెక్‌ టీకాలు వాడనప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధాన రక్షణ శ్రేణిగా ఈ వ్యాక్సిన్‌ని వాడుతున్నారు. 

భారత్‌ సైతం తన వంతుగా కృషి చేయవలసింది ఎంతో ఉంది. ఆసుపత్రుల పడకలు, ఆక్సిజెన్, యాంటీవైరల్స్‌ వంటి సౌకర్యాలను పౌరులకు అందించడంలో భారత్‌ ఎంతో ఘర్షణ పడుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం జెనోమ్‌ నిర్ధారణపై నిఘాను తీవ్రతరం చేయాల్సి ఉంది. ఇది తనకే కాకుండా యావత్‌ ప్రపంచానికి కూడా అవసరం.  వైరస్‌ దాడి తీవ్రత స్థాయికి అనుగుణంగానే ఆర్థికవ్యవస్థను తెరవడం, వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నచోట లాక్‌ డౌన్‌ పెట్టడం దేశంలో అమలవుతోంది. వైరస్‌ రకాలతో పోరాడటంలో వ్యాక్సిన్లు ఏమేరకు సమర్థంగా ఉంటున్నాయన్నది ఇప్పుడు సరికొత్త ఆందోళనలను రేకెత్తిస్తోంది. బ్రిటన్‌లోని బి.1.1.7, దక్షిణాఫ్రికాలోని బి.1.351, బ్రెజిల్‌ లోని పి.1, కాలిఫోర్నియాలోని బి.1.429, బి.1.232 వంటి పలు వైరస్‌ రకాలపై పరిశోధకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే టీకాలు అసలు వైరస్‌ని దాని మారిన రకాలను రెండింటినీ తటస్థం చేస్తున్నాయని బ్లూమ్‌బెర్గ్‌ ఇంటెలిజెన్స్‌ ఔషధ విశ్లేషకులు సామ్‌ ఫజెలి ఇటీవలే పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ శాస్త్రజ్ఞులు ఇన్ఫెక్షన్ల విషయంలో సాధించిన మూలమలుపు గురించిన వార్తలు కానీ, వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు ఈ కొత్త వైరస్‌ రకాన్ని తట్టుకుని నిలుస్తున్నట్లు వెలువడుతున్న వార్తలు కానీ చూస్తే, స్వల్ప లక్షణాలు ఉండటం, అసలు లక్షణాలే లేకపోవడం, ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేకపోవడం కొనసాగుతున్నంత కాలం కొత్త వైరస్‌పట్ల మనం కలవరపడవలసిందేమీ లేదని సామ్‌ ఫజెలి వివరిస్తున్నారు.

న్యూఢిల్లీలోని మధుమేహ చికిత్సా కేంద్రంలోని 123 మంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య బృందంపై చిన్న స్థాయిలో చేసిన అధ్యయనం ప్రకారం, వ్యాక్సిన్‌ వేయించుకున్న 113 మంది ఉద్యోగుల్లో (వీరిలో 107 మందికి రెండో టీకా అవసరం) 18 మంది కోవిడ్‌–19 వైరస్‌ బారినపడ్డారని, వీరిలో ఒకే ఒక వ్యక్తి మాత్రం ఆసుపత్రి పాలయ్యారని తేలింది. ఆసుపత్రిలో చేరిన ఆ ఒక్క వ్యక్తి కూడా తర్వాత కోలుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఈ బృందం బి.1.617 వైరస్‌ రకం బారిన పడిందా అనేది తెలీదు. భారత్‌లో కరోనా కల్లోలం మళ్లీ మొదలు కావడానికి ఇదీ ఒక కారణం కావచ్చు. ప్రజలు ఆసుపత్రుల్లో ఒక పడక సంపాదించుకోవడానికి, ఆక్సిజన్‌ సిలిండర్‌ పొందడానికి నానా యాతన పడుతున్నారు. లేక ఒక్కటంటే ఒక్క వ్యాక్సిన్‌ వేయిం చుకోవడానికి ఆత్రుత చెందుతున్నారు. శ్మశానాలు నిండిపోయాయి. భీతిల్లుతున్న గ్రామీణులు మృతదేహాలను నదుల్లో వదిలేస్తున్నారు. 1918లో స్పానిష్‌ ఫ్లూ దాడిచేసినప్పుడు తమ పూర్వీకులు అవలంబించిన పంథాలోనే వీరు నడుస్తున్నారని ఆర్థిక చరిత్రకారుడు చిన్మయ్‌ తుంబే ‘ది ఏజ్‌ ఆఫ్‌ పాండమిక్స్‌’ అనే తన పుస్తకంలో పేర్కొన్నారు. 140 కోట్లమంది జనాభా ఉన్న దేశంలో కరోనా వైరస్‌ను యథేచ్ఛగా వ్యాప్తి చెందడానికి అనుమతించడం అంటే నైతికంగా అది అతి పెద్ద పరాజయం అవుతుంది. అదే సమయంలో అది ఎంతో ప్రమాదకరమైంది కూడా. సెకండ్‌ వేవ్‌ భారత్‌లో ఎంత సుదీర్ఘకాలం కొనసాగితే అంత కాలంపాటు కొత్త వైరస్‌ రకం వ్యాక్సిన్‌ రక్షణ నుంచి తప్పించుకుని అధిక మరణాలకు కారణమవుతూనే ఉంటుంది.

మానవజాతిలో ఆరింట ఒక వంతు జనాభాను కలిగి ఉన్న భారత్‌ విషమ సమస్యను విస్మరించినట్లయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అది కలిగించే ప్రభావం అంతా ఇంతా కాదు.  గ్లోబల్‌ కార్పొరేషన్ల కోసం అతిపెద్ద సాఫ్ట్‌ వేర్‌ ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్న సిలికాన్‌ వ్యాలీ మేనేజర్లను అడిగి చూడండి. భారత్‌లో వారి సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీరింగ్‌ టీమ్‌లు కలవరపడుతున్నాయి. లేదా గత వారం లండన్‌లో జీ–7 దేశాల సమావేశాన్ని తీసుకోండి. ఈ సమావేశానికి అతిథులుగా ఆహ్వానితులైన ఇద్దరు భారత ప్రభుత్వం అధికారులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ వెంటనే ఏకాంతవాసంలోకి వెళ్లిపోయారు. భారత్‌లో ప్రస్తుత విషమ పరిస్థితి నియంత్రణలోకి రానంతవరకు ప్రపంచం తన కార్యక్రమాలను సజావుగా నిర్వహించలేదని ఈ ఘటన సూచిస్తోంది.

భారత్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్‌ దేశాల పౌరులపై థాయిలాండ్‌ పర్యాటక నిషేధం ప్రకటించింది. ఇక ఆస్ట్రేలియా అయితే తన సొంత పౌరులను కూడా భారత్‌నుంచి రావడానికి అనుమతించేది లేదని ప్రకటించడంతో తీవ్ర వివాదం చెలరేగింది. గత నెల మొదట్లో న్యూఢిల్లీ నుంచి హాంకాంగ్‌కు వచ్చిన విమాన ప్రయాణికుల్లో 51 మందిలో 43 శాతంమంది పాజిటివ్‌గా తేలడంతో వీరిని ఆ దేశ నిబంధనల ప్రకారం హోటల్‌లో 14 రోజుల క్వారంటైన్‌లో పెట్టారు. ఇటీవలే దుబాయ్‌ నుంచి హాంకాంగ్‌ వచ్చిన 29 ఏళ్ల భారతీయ ఇంజనీరు కరోనాకు పాజిటివ్‌కి సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చాడని అక్కడి అధికారులు ఆరోపించారు. అతడి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశమున్న 1200 మందిని కూడా క్వారంటైన్‌లో పెట్టారు.

వ్యాక్సిన్‌ నిల్వల నుంచి ఆక్సిజన్‌ వరకు భారత్‌కు ప్రతి అంశంలోనూ సాయపడుతున్న విదేశాలు భారత్‌లో కరోనా కేసులు, మరణాల గురించిన వాస్తవ సమాచారాన్ని అందించాలని కోరుకుంటున్నాయి. కొత్త రకం వైరస్‌లపై మరింత అధికంగా జన్యు పరీక్షలు నిర్వహించాలని వీరు కోరుతున్నారు. అయితే దేశంలో నిర్వహించిన 2 కోట్లకు పైగా కరోనా కేసుల శాంపిల్స్‌లో 11 వేలు మాత్రమే స్థానిక ల్యాబ్‌లలో నిర్వహించారంటే కరోనా పరీక్షలకు వీటినెంత దూరంగా పెట్టారో అర్థమవుతుంది. ప్రధాని మోదీ పాలనాయంత్రాంగం దేశం లోని ఆరోగ్య వ్యవస్థను అడ్డుకోవడానికి వీలైన మార్గాలన్నింటినీ అనుసరించి ఉండవచ్చు. కానీ తన సొంత ప్రజలకు, తక్కిన ప్రపంచానికి కరోనా గురించిన వాస్తవాన్ని కనుగొని తెలుపవలసిన కర్తవ్యంలో ఇప్పటికీ వెనుకబడి ఉండటం పరమ విషాదకరం.

వ్యాసకర్త: ఆండీ ముఖర్జీ
ఒపీనియన్‌ కాలమిస్ట్‌

(ఎన్‌డీటీవీ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు